సిరాజ్, షమీ
- ఇంగ్లండ్ పై 2014 తర్వాత తొలి విజయం
- 151 పరుగుల తేడాతో విజయభేరి మోగించిన ఇండియా
- హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ 4 వికెట్లతో అడ్భుత ప్రదర్శన
భారత క్రికెట్ జట్టు లార్డ్స్ లో ఇంగ్లండ్ జట్టుకు దిగ్భ్రాంతి కలిగించింది. రెండవ టెస్టును అత్యంత లాఘవంగా గెలుచుకున్నది. మహమ్మద్ షమీ, జస్ప్రీత్ బూమ్రాల బహుముఖ ప్రతిభాప్రదర్శన కారణంగా సోమవారం ఈ విజయదుంధుభి మోగించడం సాధ్యమైంది. ఎర్రబంతితో ఆడే క్రికెట్ మ్యాచ్ లో లార్డ్స్ మైదానంలో ఏడేళ్ళ తర్వాత ప్రప్రథమంగా భారతజట్టు ఇంగ్లండ్ పైన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. 151 పరుగులు ఆధిక్యంతో ఆతిథ్య జట్టును భారత్ ఓడించింది. లార్డ్స్ మైదానంలో భారత్ గెలిచిన మూడో టెస్ట్ మ్యాచ్ ఇది. 2014లో ధోనీ నాయకత్వంలో భారత జట్టు ప్రపంచ కప్ గెలుచుకున్న తర్వాత ఇది మొదటి విజయం. లార్డ్స్ లో భారతజట్టు గెలుపొందడం ఇది ముచ్చటగా మూడో సారి.
రెండు జట్ల ఆటగాళ్ళ మధ్య మాటల యుద్ధం రోజంతా సాగుతూనే ఉంది. ఆట ముగియడానికి ఇంకా అరగంట వ్యవధి ఉన్నదనగా మహమ్మద్ సిరాజ్ జిమ్మీ యాండర్సన్ ను బౌల్ చేసి విజయపతాకను ఎగురవేశాడు. అందుకు ప్రతీకగా ఒక వికెట్ ను ఊడబెరికాడు. భారత జట్టు తన రెండో ఇన్నింగ్స్ ను ఎనిమిది వికెట్ల నష్టానికి 298 పరుగుల స్కోర్ దగ్గర డిక్లేర్ చేసింది. అరవై ఓవర్లలో 272 పరుగులు సాధించగలిగితే విజయలక్ష్మి ఇంగ్లండ్ ను వరించేది. కానీ ఇండియా ఫాస్ట్ బౌలర్ల దాటికి ఇంగ్లండ్ బ్యాట్స్ మన్ తట్టుకొని నిలువలేకపోయారు. హైదరాబాద్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ నాలుగు వికెట్లు తీసుకొని బాగా రాణించాడు. తర్వాత స్థానంలో మూడు వికెట్లు తీసుకున్న బూమ్రా నిలిచాడు. భారత రెండో ఇన్నింగ్స్ లో 52 అద్భుతమైన పరుగులు సాధించిన మహమ్మద్ షమీ ఒక వికెట్ పడగొట్టాడు. ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ రెండు వికెట్లు పడగొట్టాడు. షమీ, బూమ్రాలు ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లకు ఎదరొడ్డి నిలిచి బ్యాటింగ్ లో రాణించడంతో మ్యాచ్ తిరుగులేని మలుపు తిరిగింది. రండో ఇన్నింగ్స్ లో భారత ఫాస్ట్ బౌలర్లు బాగా విజయాలు సాధించారు. ఇంగ్లండ్ ఫాస్ట్ బౌలర్లు విఫలమైన చొటనే బారత ఫాస్ట్ బౌలర్లు విజయం సాధించడంతో మ్యాచ్ భారత్ వశం అయింది.