- కంగారూగడ్డపై భారత్ అపురూప విజయం
ఎనిమిది దశాబ్దాల భారత టెస్ట్ క్రికెట్ చరిత్రలో విదేశీగడ్డపై పలు అరుదైన విజయాలు సాధించినా…బ్రిస్బేన్ గబ్బా వేదికగా ఆస్ట్ర్రేలియాతో జరిగిన ఆఖరిటెస్టులో సాధించిన 3 వికెట్ల సూపర్ చేజింగ్ విజయం ..అరుదైన, అసాధారణ విజయంగా అభిమానుల స్మృతిపథంలో నిలిచిపోతుంది.
కరోనా వైరస్ నేపథ్యంలో గత ఐదుమాసాలుగా క్వారెంటెయిన్ లో గడుపుతూ…ముందుగా ఐపీఎల్…ఆ తర్వాత ఆస్ట్ర్రేలియా పర్యటనలో భాగంగా టీ-20, వన్డే, టెస్టు సిరీస్ ల్లో పాల్గొన్న భారత క్రికెటర్లు ప్రతికూల పరిస్థితులను అధిగమించి తమ ప్రతిభను, విజయకాంక్షను చాటుకొన్నారు.
Also Read : ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం
ఆస్ట్ర్రేలియాతో నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ తొలిటెస్టు…రెండోఇన్నింగ్స్ లో కేవలం 36 పరుగులకే కుప్పకూలిన భారతజట్టు పాతాళానికి పడిపోయింది. విరాట్ కొహ్లీ లేని భారత టెస్టుజట్టు పనైపోయిందని అందరూ అనుకొన్నారు. అయితే…మెల్బోర్న్ వేదికగా జరిగిన బాక్సింగ్ డే టెస్టులో…మరాఠా యోధుడు అజింక్యా రహానే నాయకత్వంలో బరిలోకి దిగిన భారత్ 8 వికెట్ల సంచలన విజయంతో 1-1తో సమఉజ్జీగా నిలిచింది.
సిడ్నీ డ్రాతో కొత్త ఊపిరి
సిడ్నీ వేదికగా జరిగిన మూడోటెస్టును హనుమ విహారీ- అశ్విన్ ల పోరాటపటిమతో మ్యాచ్ ను డ్రాగా ముగించడం ద్వారా భారతజట్టు సిరీస్ ఆశలను సజీవంగా నిలుపుకొంది. అయితే… బుమ్రా,అశ్విన్ లాంటి ప్రధాన బౌలర్లు, మిడిలార్డర్ ఆటగాడు హనుమ విహారీ సైతం గాయాలతో జట్టుకు దూరం కావడంతో…ఆఖరిటెస్టుకు తుదిజట్టు ఎంపికే ప్రధానసమస్యగా మారింది. టెస్ట్ క్రికెట్ అనుభవం ఏమాత్రం లేని శార్దూల్ ఠాకూర్ నటరాజన్,వాషింగ్టన్ సుందర్ లాంటి యువఆటగాళ్లను తుదిజట్టులో తీసుకోడం ద్వారా భారత టీమ్ మేనేజ్ మెంట్ గొప్ప సాహసమే చేసింది.
కీలకటాస్ ఓడినా…కంగారూలను తొలిఇన్నింగ్స్ లో 369 పరుగుల స్కోరుకే పరిమితం చేయగలిగింది. అంతేకాదు…336 పరుగుల తొలిఇన్నింగ్స్ స్కోరుతో దీటైనసమాధానం చెప్పింది. వాషింగ్టన్ సుందర్- శార్దూల్ ఠాకూర్ సూపర్ హాఫ్ సెంచరీలతో పాటు…7వ వికెట్ కు రికార్డు భాగస్వామ్యంతో మ్యాచ్ ను మలుపు తిప్పారు.
Also Read : గబ్బాలో ఆఖరిరోజున భారత్ కు దెబ్బే!
సిరాజ్ చమక్కు
ఆస్ట్ర్రేలియాను రెండో ఇన్నింగ్స్ లో 294 పరుగుల స్కోరుకే కట్టడి చేయడంలో హైదరాబాదీ పేసర్ సిరాజ్, ముంబై స్వింగ్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ ప్రధానపాత్ర వహించారు. సిరాజ్ 5 వికెట్లు, శార్దూల్ 4 వికెట్లు సాధించారు. ఇక…ఆఖరిరోజు ఆటలో 329 పరుగులు చేయాల్సిన భారత్..యువఆటగాళ్లు శుభ్ మన్ గిల్, రిషభ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ల దూకుడుతో అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. గబ్బాటెస్టులో అనూహ్య విజయం సాధించింది. ఇది కలయా!….నిజమా…! అని అభిమానులు అబ్బురపడేలా చేసింది. గెలుపంటే ఇదేరా! అనుకొంటూ మురిసిపోయేలా చేసింది.