గాంధీయే మార్గం-39
(గతవారం తరువాయి)
1914 నుంచి 1918 మొత్తం ప్రపంచం తొలి యుద్ధంలో తల మునకలైంది… ఎన్నో విధాలుగా ప్రపంచ ప్రజలు నష్టపోయారు. బ్రిటీషు ప్రభుత్వానికి రక్షణ ఖర్చులు పెరిగి తొలిసారి మనదేశంలో ఆదాయపు పన్ను విధించింది. దీనికి తోడు 1918 నుంచి తీవ్రమైన కరువు, తర్వాత ఇన్ ఫ్లుయంజా మహమ్మారి మన దేశం మీద విరుచుకు పడ్డాయి. ఈ వ్యాధితో ఎంతమంది మరణించారో లెక్కలేదు. ఒక 1921లోనే కోటి 20 లక్షలు పైగా జనం కనుమూశారని లెక్కలు చెబుతున్నాయి. 1911 సంవత్సరం జనాభా లెక్కలతో పోలిస్తే 1921 సంవత్సరానికి మన దేశ జనాభా తగ్గింది – ఈ కారణంగానే! మామూలుగా తగ్గకూడదు. దక్షిణాఫ్రికాలో విజయం సాధించి, దేశాటనతో ప్రజల ఆకాంక్షలు గుర్తించి, చంపారన్, అహమ్మదాబాద్ జౌళి కార్మికులు, ఖేడా రైతుల కడగళ్ళ విషయాల్లో తరుణోపాయం చూపిన గాంధీజీ తక్షణ నాయకుడయ్యాడు! 1919 నుంచి భారత స్వాతంత్ర్యోద్యమంలో ‘గాంధీశకం’గా పరిగణిస్తాం.
Also read: భారత రాజకీయరంగంలో గాంధీజీ ప్రవేశం!
గొప్ప కమ్యూనికేటర్ గాంధీజీ
అంతవరకు ఒక నాయకుడి వెంట నడవటం, ఒక నాయకుడి పిలుపుకు స్పందించడం మన దేశంలో ఆ స్థాయిలో జరుగలేదు. ఈ సువిశాల దేశంలో నదులు, పర్వతాలు, లోయలు, ఎడారులు ఒకరకమైన అవరోధాలు కాగా; భాషలు, సంస్కృతి, అలవాట్లు, అవగాహనా స్థాయి వైవిధ్యాలు ఇంకో రకమైన ప్రతిబంధకాలు! వీటిని తొలిసారి విజయవంతంగా తన ఆకారం, ఆహార్యం, ఆహారం, ప్రవర్తన, పలుకు తీరు, ఆలోచనా తీరుతో అధిగమించిన గొప్ప కమ్యూనికేటర్ గాంధీజీ! అందులో భాగంగానే రాయలసీమ ప్రాంతంలో రైలు ప్రయాణం చేస్తూ చాలీచాలని గుడ్డలతో శ్రమిస్తున్న రైతుల పట్ల సహానుభూతితో, ఖద్దరు ఉద్యమానికి తోడ్పాటుగా దేశంలోని పురుషుల మాదిరి కొల్లాయి కట్టుకొన్నారు. 1921 సెప్టెంబరు 21న మధురైలో గాంధీజీ కొల్లాయి తొలిసారి కట్టి నేత కార్మికుల సమావేశంలో ప్రసంగించారు.
Also read: గాంధీజీ రాక ముందు దేశరాజకీయరంగం
డయ్యర్ మారణకాండ
1919లో కారణం చెప్పకుండా రాజకీయాల్లో చురుకుగా ఉండేవారిని నిర్బంధించగల రౌలత్ చట్టాన్ని పంజాబ్ లో విధించారు. దీనికి వ్యతిరేకంగా ‘శాసనోల్లంఘనం’ పిలుపునిచ్చారు గాంధీజీ. పని చేసే ప్రతివారూ సమ్మె చేసేలా 1919 ఏప్రిల్ 6న హర్తాళ్ దేశవ్యాప్తంగా జరిగింది. ఈ విధానానికి బ్రిటీషు ప్రభుత్వం నివ్వెరపోయి నాయకులను చెరసాల పాలు చేసింది. అమృత్ సర్ లో శాంతియుతంగా నడిచి వెళ్తూంటే పోలీసులు కాల్పులు జరిపారు. దీనికి హింసతో ప్రతి స్పందించిన ప్రజలు రైల్వే ఆఫీసులు, తపాలా కార్యాలయాలు, బ్యాంకుల మీద దాడి చేశారు. దీనితో ఆగ్రహించిన జనరల్ డయ్యర్ ఏప్రిల్ 13న జలియన్ వాలాబాగ్ లో వికృత చర్యకు దిగాడు. సుమారు 400 నుంచి 1500 దాకా పొట్టనపెట్టుకున్నాడు.
Also read: గాంధీజీతో ప్రభావితమైన భారతీయ శాస్త్రవేత్తలు
విదేశీ వస్తు బహిష్కరణ
రౌలత్ చట్టానికి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమ ప్రభావం నగరాలకూ, పట్టణాలకూ వ్యాపించిందని గుర్తించిన గాంధీజీ మొత్తం దేశాన్ని చైతన్యవంతం చేయాలని తలంచారు. హిందూ ముస్లిం ఐక్యతతో జాతీయ భావనకు నాంది పలకాలని 1920 కలకత్తా కాంగ్రెస్ సదస్సులో గాంధీజీ కొత్త ఉద్యమ ప్రణాళికకు శ్రీకారం చుట్టారు. అదే సహాయ నిరాకరణోద్యమం! ప్రభుత్వపు బిరుదులు, పట్టాలు తిరస్కరించడం, ప్రభుత్వ సర్వీసులను భారతీయులు బహిష్కరించడం విదేశీ విద్యను, విదేశీ వస్తువులను విడిచిపెట్టడం, ప్రభుత్వపు అణచివేత కార్యక్రమాలకు ప్రతిగా అహింసాత్మకంగా శాసనోల్లంఘనం చేయడం – ఇదీ విధానం! ఇదీ భారత దేశపు దృశ్యం!
Also read: గాంధీజీ టెక్నాలజీకి వ్యతిరేకం కాదు!
(తరువాయి వచ్చే వారం)
డా నాగసూరి వేణుగోపాల్, ఆకాశవాణి పూర్వ సంచాలకులు,
మొబైల్-9440732392