- 145 పరుగులకే కుప్పకూలిన కొహ్లీ సేన
- భారత్ కు 33 పరుగుల ఆధిక్యం
భారత్ – ఇంగ్లండ్ జట్ల మూడోటెస్టు వేదిక అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం స్పిన్ బౌలర్ల పాలిట స్వర్గం, బ్యాట్స్ మన్ పాలిట నరకంగా మారింది. డే-నైట్ గా జరుగుతున్న ఈ టెస్టు తొలిరోజుఆట లంచ్ విరామానికే ఇంగ్లండ్ 112 పరుగులకే కుప్పకూలితే రెండోరోజుఆట తేనీటి విరామసమయానికే ఆతిథ్య భారత్ 145 పరుగులకే పేక మేడలా కూలింది. దీంతో మొదటి రెండు రోజులకే టెస్టు రసపట్టుగా మారింది.
రూట్ స్పిన్ జాదూ:
Also Read: దేశవాళీ క్రికెట్లో సరికొత్త రికార్డు
కేవలం ఒకేఒక్క స్పెషలిస్ట్ స్పిన్నర్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ను కెప్టెన్ కమ్ పార్ట్ టైమ్ బౌలర్ జో రూట్ ఆదుకొన్నాడు. భారత్ ఇన్నింగ్స్ 53.2 ఓవర్లలోనే ముగియటంలో ఆఫ్ స్పిన్నర్ గా రూట్ ప్రధానపాత్ర వహించాడు. ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన భారత్ కేవలం 46 పరుగుల తేడాతో చివరి ఏడు వికెట్లు నష్టపోయింది. ఓపెనర్ రోహిత్ శర్మ 96 బాల్స్ లో 11 బౌండరీలతో 66 పరుగులు సాధించడం ద్వారా టాప్ స్కోరర్ గా నిలిచాడు. శుభ్ మన్ గిల్ 11, పూజారా 0, కెప్టెన్ కొహ్లీ 27, రహానే 7, పంత్ 1, అశ్విన్ 17, ఇశాంత్ 10 పరుగులు సాధించగా అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ డకౌట్ అయ్యారు.
ఇంగ్లండ్ బౌలర్లలో రూట్ 6.3 ఓవర్లలో 8 పరుగులిచ్చి 5 వికెట్లు, స్పెషలిస్ట్ స్పిన్నర్ జాక్ లీచ్ 20 ఓవర్లలో 54 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టారు. వంద టెస్టుల మొనగాడు, ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ బౌలర్ గా ఓ టెస్టు ఇన్నింగ్స్ లో 5 వికెట్లు పడగొట్టడం ఇదే మొదటిసారి. మొదటి రెండురోజుల ఆటలోనే రెండుజట్లూ తమ మొదటి ఇన్నింగ్స్ లో కుప్పకూలడం చూస్తే అహ్మదాబాద్ స్టేడియం పిచ్ పైన విమర్శలు వెల్లువెత్తడం ఖాయమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఐసీసీ సైతం ఆతిథ్య గుజరాత్ క్రికెట్ సంఘాన్ని తప్పుపట్టడమే కాదు చెత్త పిచ్ అంటూ హెచ్చరించే అవకాశం సైతం ఉంది.
Also Read: సర్దార్ పటేల్ పోయే…నరేంద్ర మోడీ వచ్చే!