Wednesday, January 22, 2025

చైనాతో వేగడం ఎలా?

చైనా, భారత్ రెండూ సరిహద్దు దేశాలు. ఆధునిక కాలంలో, కొంచెం అటుఇటుగా ఒకేసారి కొత్త ఆర్ధిక ప్రయాణాన్ని మొదలు పెట్టిన రాజ్యాలు. ఈ పరుగులో నైతిక ఆలోచనా విధానం కలిగిన భారత్ వెనుకబడింది. ఆర్ధిక, లౌకిక ప్రయోజనాలు, సామ్రాజ్య విస్తరణ కాంక్ష కలిగిన చైనా అభివృద్ధి చెందిన దేశంగా స్థిరపడింది. మనం ఇంకా అభివృద్ధి చెందుతున్న దేశాల జాబితాలోనే ఉన్నాం.

దురాక్రమణలూ, దోపిడీలూ

అనాది నుంచి భారతదేశ చరిత్రను గమనిస్తే, ఇతర దేశస్థులు మనల్ని దురాక్రమించారు. జ్ఞాన భాండాగారాలైన వేదాలను ఎత్తికెళ్లిపోయారు. దేవాలయాలలో ఉన్న అనంత సంపదను కొట్టుకెళ్లారు. ఖనిజసంపదను దోచేశారు. సాంస్కృతికంగానూ దాడి చేశారు. ఇన్ని కోల్పోయినా, ఇప్పటికే విలువల పునాదులపైనే భారత్ నడుస్తోంది. స్వాతంత్య్రం అనంతరం దేశాన్ని పునఃనిర్మించుకోవాల్సిన అవసరం వచ్చింది. జవహర్ లాల్ నెహ్రూ మొదలు నేటి నరేంద్రమోదీ వరకూ ప్రతి ప్రధానమంత్రి తనదైన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. ప్రపంచదేశాలతో సుహృద్భావ బంధాలను నెలకొల్పే యత్నాలు చేశారు.

దాడి చేయడానికి చైనా సిద్ధం

అదను చూసి దాడిచేయడానికి సిద్ధంగా ఉన్న చైనా 1962లో మనతో యుద్ధానికి దిగింది. ఊహించని ఈ సంఘటనతో మనం చాలా నష్టపోయాం. ఈ యుద్ధం తర్వాత ద్వైపాక్షిక సంబంధాలను తిరిగి నిర్మించుకోడానికి చాలా కష్టపడాల్సి వచ్చింది.1962లో జరిగిన యుద్ధానికి ముందు 1954లో మన ప్రధాని నెహ్రూ చైనాలో పర్యటించారు. మళ్ళీ 34ఏళ్ళ తర్వాత రాజీవ్ గాంధీ 1988లో ప్రధాని హోదాలో చైనాలో పర్యటించడం జరిగింది. అంతకు పదేళ్ళ ముందు విదేశాంగమంత్రి హోదాలో అటల్ బిహారీ వాజపేయి చైనా సందర్శించారు. రెండు దేశాల మధ్య ఉన్న బంధాల శూన్యతకు ఇది ఉదాహరణ. ద్వైపాక్షిక బంధాలు అంటుంచగా, సరిహద్దు వివాదాల పరిష్కారానికి తొలి ముందడుగు పడింది. “జాయింట్ బార్డర్ కమిషన్”ను నియమించాలని ఇరు దేశాధినేతలు అంగీకారానికి వచ్చారు. ఇది చారిత్రాత్మకమైన పర్యటనగా నమోదైంది.

Also Read : రైతు ఉద్యమంలో దేశద్రోహులు

రాజీవ్ రాజనీతి

అంతర్జాతీయ విధానాల రూపకల్పనలో తొలి అడుగులు సరిహద్దు దేశాలతోనే మొదలు పెట్టాలన్న రాజనీతి సూత్రాన్ని రాజీవ్ పాటించారు. ఇటువంటి కీలకమైన సలహాలను అందించినవారిలో పీవీ నరసింహారావు ప్రధానుడు. డెంగ్ చైనా అధినేతగా ఉన్నప్పుడు ఈ విశేషం జరిగింది. చైనా -భారత్ బంధాలు బలపడతాయని ఆశించారు. ఇంతవరకూ తప్పులు రెండు వైపుల జరిగాయని, ఇద్దరం సరిదిద్దుకొని ముందుకు సాగుదామని డెంగ్ రాజీవ్ గాంధీతో చేతులు కలిపారు.

పీవీ కీలక ఒప్పందం

అవేమీ పెద్దగా కార్యరూపం దాల్చలేదు. విధివశాత్తు 1991లో రాజీవ్ మరణించారు.రాజీవ్ మరణించిన తర్వాత ప్రధాని పదవిని చేపట్టిన పీవీ నరసింహారావు కీలకమైన చర్యలు చేపట్టారు. దాదాపు మూడు దశాబ్దాలపాటు (1993-2020) రెండు దేశాల సరిహద్దుల్లో ఎటువంటి యుద్ధ వాతావరణం ఏర్పడలేదు. దానికి ప్రధానమైన కారణం పీవీ నరసింహారావు. ఆయన ప్రధానిగా ఉన్నప్పుడు 1993లో ” మెయిన్టెనెన్స్ అఫ్ పీస్ అండ్ ట్రాంక్విల్విటీ” ఒడంబడిక చేసుకున్నారు. చైనా -భారత్ బంధాలు గట్టిపడటానికి, శాంతి విరాజిల్లడానికి పీవీ విదేశాంగవిధానం ప్రధానమైన పాత్ర పోషించింది.

ఛైనాను విశ్వసించలేం

చైనాతో శాంతి ఒప్పందం చేసుకున్నప్పటికీ, ఆ దేశాన్ని ఆయన పూర్తిగా విశ్వసించలేదు.సమాంతరంగా అమెరికాతో బంధాలను దృఢపరచారు. నేడు చైనా -భారత్ వివాదాల నేపథ్యంలో, అమెరికా భారత్ వైపు నిలబడడానికి దోహదపడిన అంశాలలో ఇది కూడా ఒకటి. తర్వాత వచ్చిన పాలకులు ప్రగతి వేగాన్ని పెంచడంలో ఆశించినంత ఫలితాలు రాబట్టలేకపోయారు. భారత్ స్వయంసమృద్ధి గొప్పగా సాధించలేకపోయింది. మన దేశ అవసరాల దృష్ట్యా చైనాతో వాణిజ్య బంధాలు ఏర్పరచుకోవాల్సి వచ్చింది.

Also Read : యోగ్యులను వరించిన పద్మపురస్కారాలు

ఉత్పాదకరంగంలో చైనా ముందంజ

మాన్యుఫాక్చరింగ్, సాఫ్ట్ వేర్ మొదలైన రంగాల్లో చైనాపై ఆధారపడాల్సి వచ్చింది.వీటిని అదనుగా తీసుకున్న చైనా మన ద్వారా ఆర్ధికంగా ఎంతో లాభాలు గడించింది. మన ప్రయాణంలో వృద్ధి చోటుచేసుకున్నప్పటికీ, చైనా కంటే మనం ఎంతో వెనకబడిపోయాం. చైనా చాలా శక్తివంతమైన దేశంగా అవతరించింది. త్వరలో అమెరికాను మించిపోతుందని ఆర్ధికరంగ నిపుణులు అంచనా వేస్తున్నారు. సామ్రాజ్య కాంక్ష కూడా బాగా పెరిగిపోయింది. భారత్,అమెరికా దగ్గరైపోయాయనే అనుమానాలు పెరిగిపోయాయి.

యుద్ధవాతావరణం

ఈ నేపథ్యంలో, గత సంవత్సరం నుంచి సరిహద్దుల్లో కలకలం సృష్టిస్తోంది. యుద్ధ వాతావరణాన్ని కల్పిస్తోంది. చర్చల ద్వారా పరిష్కరించుకుందామని చెబుతూనే… దొంగదెబ్బలు తీస్తోంది. ఈ పరిణామాలు ఎటు వెళ్తాయో? అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.ఇప్పటికే మనం అనేక వాణిజ్య ఒప్పందాలను రద్దు చేసుకున్నాం. యుద్ధం ఎప్పుడు వచ్చినా తలపడటానికి సిద్ధమవుతున్నాం. యుద్ధం సంభవించడం ఆశావాహమైన అంశం కానే కాదు. నిజంగా యుద్ధం వస్తే మనమే ఎక్కువ నష్టపోతామన్నది చేదు నిజం.

Also Read : మెట్టు దిగిన ప్రభుత్వం, బెట్టువీడని రైతన్నలు

పంచశీల

రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరుచుకోవడమే వివేకమైన విధానం. మన ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూనే వుంది. అందులో భాగంగా, నేడు 8అంశాలను చైనా దృష్టికి తీసుకెళ్లింది. భారతదేశ విదేశాంగ విధానాలలో ముఖ్యమైనది “పంచశీల.’’ 29 మే 1954 వ తేదీన పంచశీల సూత్రాన్ని రూపొందించాం. ఇది ప్రధానంగా చైనాతో సంధి కుదుర్చుకునే సందర్భం. (1) రాజ్యాల ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వం (2)దురాక్రమణకు పాల్పడకపోవడం (3) అంతరంగిక వ్యవహారాల్లో జోక్యం చేసుకోకపోవడం (4) సమానత్వం ఉమ్మడి ప్రయోజనాలు (5) శాంతియుత సహజీవనం. అంతర్జాతీయ సంబంధాల్లో ఇవి గొప్ప సూత్రాలు. తదనంతర పరిణామాల్లో అవి ఆచరణలో నిలబడలేదు. ఈ ఒప్పందాలను చైనా అతి తక్కువకాలంలోనే అతిక్రమించింది.1962లోనే మనతో యుద్ధానికి దిగింది.

తీరు మారలేదు

ఇప్పటికీ అదే తీరులో సాగుతోంది.రెండు దేశాల మధ్య సంబంధాలను కాపాడుకోడానికి భారత విదేశాంగ మంత్రి జైశంకర్ ఎనిమిది సూత్రాలనూ, మూడు అంశాలను చైనా ముందు ఉంచారు. (1) సరిహద్దు నిర్వహణపై అన్ని ఒప్పందలకు కట్టుబడి ఉండడం (2) వాస్తవాధీన రేఖను గౌరవించడం (3) శాంతిని కొనసాగించడం (4) భిన్న ధ్రువ ఆసియా చాలా అవసరమని గుర్తించడం (5) ఏకపక్ష ధోరణిని అవలంబించక పోవడం (6) ఎవరి లక్ష్యాలు వారికి ఉంటాయనే స్పృహ కలిగిఉండడం (7) విభేదాలను సమర్ధరీతిలో కట్టడి చేయడం (8) రెండు నాగరిక దేశాలు దూరదృష్టి కలిగి ఉండడం. అంశాలు:(1) పరస్పర గౌరవం (2) పరస్పర సున్నితత్వం (3) పరస్పర ప్రయోజనాలు. ఇవన్నీ మనం చైనా ముందు తాజాగా ఉంచిన అంశాలు.

Also Read : మహారాష్ట్ర, కర్ణాటక మధ్య సరిహద్దు స్పర్థ

ఇవేమీ కొత్త అంశాలు కావు

నిజం చెప్పాలంటే, ఇవేమీ కొత్త అంశాలు కావు. పంచశీల సూత్రల్లో దాదాపుగా ఉన్నవే. సామ్రాజ్య కాంక్షతో, ధన, మద బలంతో రగిలిపోతున్న చైనా ఈ నీతి సూత్రాలను ఏ మేరకు పట్టించుకుంటుందో అనుమానమే.మనం స్వయంగా బలం పెంచుకోవడం ప్రధానమైన అంశం. బంధాలు పూర్తిగా చెడిపోకుండా చూసుకోవడం మరో ముఖ్యమైన అంశం. చైనా మనల్ని మోసం చేయడం జవహర్ లాల్ నెహ్రూ సమయం నుంచే వుంది. వారి దుర్బుద్ధిని, స్వార్ధపూరిత అవకాశవాదాన్ని అంచనా వేయడంలో నెహ్రూ కూడా వైఫల్యం చెందారు.

ఆర్థికంగా చైనా ముందంజ

1978 వరకూ ఆర్ధికంగా భారత్ – చైనా సమానమైన స్థాయిలోనే వున్నాయి. తర్వాత గతిలో, మన ఆర్ధిక విధానాల వల్ల మనం ఈ రేసులో వెనకబడిపోయాం. రెండు దేశాల మధ్య సంబంధాలను మెరుగుపరచడానికి ప్రయత్నించినవారిలో ముగ్గురుని ముఖ్యంగా చెప్పుకోవాలి. అప్పటి విదేశాంగ మంత్రిగా వాజపేయి,  ప్రధానమంత్రులుగా రాజీవ్ గాంధీ, పీవీ నరసింహారావు ప్రధానమైన నేతలు. బంధాలు మెరుగుపడాలని, శాంతిస్థాపన జరగాలని కోరుకుందాం.

Also Read : నందమూరి తారక రామారావు – ఒక చరిత్ర

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles