- ఆస్ట్రేలియా విజయాల అడ్డా బ్రిస్బేన్ గబ్బా
- రహానేసేను ఊరిస్తున్న పలు రికార్డులు
భారత్- ఆస్ట్రేలియాజట్ల నాలుగుమ్యాచ్ ల టెస్ట్ సిరీస్ పతాకస్థాయికి చేరింది. సిరీస్ లోని మొదటి మూడుటెస్టులు ముగిసేసమయానికి రెండుజట్లూ 1-1తో సమఉజ్జీలుగా నిలవడంతో సిరీస్ విజేతను నిర్ణయించడంలో ఆఖరిటెస్ట్ కీలకంగా మారింది. కంగారూ కంచుకోట బ్రిస్బేన్ గబ్బా వేదికగా మరికొద్దిగంటల్లో ప్రారంభమయ్యే ఈ మ్యాచ్ ను డ్రాగా ముగించినా బోర్డర్ – గవాస్కర్ ట్రోఫీని భారత్ నిలుపుకోగలుగుతుంది.
గాయాల ఊబిలో రహానేసేన:
ప్రపంచ మాజీ నంబర్ వన్ భారత ప్రధాన జట్టులోని సగం మంది ఆటగాళ్లు గాయాలబారిన పడటం టీమ్ మేనేజ్ మెంట్ కు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది. సీనియర్ ఫాస్ట్ బౌలర్లు ఇశాంత్ శర్మ, మహ్మద్ షమీ, భువనేశ్వర్ కుమార్, జస్ ప్రీత్ బుమ్రా, ఉమేశ్ యాదవ్, ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా, యువఆటగాడు కెఎల్ రాహుల్ గాయాలతో జట్టుకు అందుబాటులో లేకుండా పోయారు. దీంతో ఆఖరి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టు కోసం పూర్తిఫిట్ నెస్ కలిగిన 11 మంది ఆటగాళ్ళను ఎంపిక చేయడంతో పాటు బ్యాటింగ్, బౌలింగ్ నడుమ సమతూకం సాధించడం చీఫ్ కోచ్ రవిశాస్త్రి, కెప్టెన్ రహానేలకు కత్తిమీద సాములా మారింది.
ఇదీ చదవండి: బ్రిస్బేన్ లో భారత క్రికెటర్ల అష్టకష్టాలు
కుల్దీప్, శార్దూల్ లకు ఛాన్స్:
పేస్- బౌన్స్త్ తో కూడిన బ్రిస్బేన్ పిచ్ పైన జరిగే ఆఖరి టెస్టులో పాల్గొనే భారత తుదిజట్టులో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్, ఫాస్ట్ బౌలర్ శార్దూల్ ఠాకూర్ లను చేర్చుకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు వికెట్ కీపర్ బ్యాట్స్ మన్ రిషభ్ పంత్ ను స్పెషలిస్ట్ బ్యాట్స్ మన్ గాను, నంబర్ వన్ వికెట్ కీపర్ వృద్దిమాన్ సాహాను కీపర్ హోదాలోను తుదిజట్టులోకి తీసుకోవాలని టీమ్ మేనేజ్ మెంట్ యోచిస్తోంది.
ఇదీ చదవండి: అటు కరోనా… ఇటు క్రికెట్ హైరానా!
30వ విజయానికి భారత్ తహతహ:
ప్రస్తుత సిరీస్ లోని సిడ్నీ టెస్టు వరకూ భారత్- ఆస్ట్ర్రేలియాజట్లు మొత్తం 101 టెస్టుల్లో తలపడితే భారత్ 29 విజయాలు మాత్రమే సాధించగలిగింది. 43 పరాజయాలు, 28 డ్రా ఫలితాలు ఉన్నాయి. బ్రిస్బేన్ టెస్ట్ నెగ్గడం ద్వారా తన విజయాల సంఖ్యను 30కి పెంచుకోవాలన్నపట్టుదలతో భారత్ ఉంది. అయితే గణాంకాలు, గత రికార్డులు, క్రికెట్ పండితుల అంచనాల ప్రకారం అదేమంత తేలికగా కనిపించడంలేదు. 1988 నుంచి బ్రిస్బేన్ గబ్బా వేదికగా ఆడిన టెస్టుల్లో ఓటమి అంటే ఏమిటో తెలియని కంగారూజట్టు ఫాస్ట్ బౌలింగ్ ఎటాక్ తో భారత్ ను చిత్తు చేయగలనన్న ధీమాతో ఉంది.
కంగారూ కంచుకోట:
బ్రిస్బేన్ గబ్బా వేదికగా గత శతాబ్దకాలంగా జరిగిన టెస్టుమ్యాచ్ ల్లో ఆస్ట్ర్రేలియాను ఖంగుతినిపించిన మూడుజట్లలో భారత్ సైతం ఉంది. గబ్బా వేదికగా సౌతాఫ్రికా మూడుసార్లు టెస్ట్ విజయాలు నమోదు చేస్తే ఇంగ్లండ్, భారతజట్లకు ఒక్కో గెలుపు చొప్పున ఉన్నాయి. గురువారం నుంచి ఐదురోజులపాటు జరిగే ఆఖరిటెస్టులో రహానే నాయకత్వంలోని భారతజట్టు విజయం సాధించినా లేక మ్యాచ్ ను డ్రాగా ముగించినా అదిసరికొత్త చరిత్రే అవుతుంది.
ఇదీ చదవండి: నేలవిడిచి సాములో భారత్ సరికొత్త రికార్డు