Sunday, December 22, 2024

భారత్-బ్రిటన్ మధ్య గాఢమైన మైత్రి

బ్రిటన్ – భారత్ మధ్య బంధాలు మరింత శక్తివంతంగా మారనున్నాయని తాజా పరిణామాలు చెబుతున్నాయి. బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్, భారత ప్రధాని నరేంద్రమోదీ మధ్య జరిగిన తాజా భేటీ ఫలవంతంగా ముగిసింది. వర్చువల్ విధానంలో రెండు దేశాల అగ్రనేతలు సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య సుమారు 10,230 కోట్ల రూపాయలకు వాణిజ్యం, పెట్టుబడులు చేరనున్నాయి. తొలిగా దశాబ్దకాలం లక్ష్యంతో ముందుకు సాగనున్నారు. ఆరోగ్యం, వాతావరణ మార్పులు, వాణిజ్యం, విద్య, శాస్త్ర -సాంకేతిక, రక్షణ రంగాల్లో కలిసి బలోపేతం కావాలని సంకల్పం చేసుకున్నారు. విధివిధానాల రూపకల్పన చేపట్టాల్సివుంది.

Also read: బుధజన బాంధవుడు బూదరాజు

సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి

బ్రిటన్ కు “సమగ్ర వ్యూహాత్మక భాగస్వామి హోదా” ఇవ్వాలని భారత్ నిర్ణయం తీసుకుంది. ఈ దిశగా అధికారికంగా ప్రకటన కూడా విడుదల చేసింది. ఇది వ్యూహాత్మకమైన అడుగే. యూరోపియన్ దేశాల్లో ఈ హోదాను పొందిన మొట్టమొదటి దేశం బ్రిటన్ కావడం గమనార్హం. ఈ అంశంలో బ్రిటన్ ఎంతో సంతోషించింది. రాబోయే దశాబ్ద కాలంలో ద్వైపాక్షిక వాణిజ్య సంబంధాలు మెరుగుపడే దిశగా ఒప్పందాలు కుదుర్చుకోడానికి మార్గాలు మరింత సుగమమయ్యాయనే భావనలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఉన్నారు. భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమే కాక, అతిపెద్ద వ్యాపార క్షేత్రం కూడా. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ ప్రథమ శ్రేణిలో ఉండడం బ్రిటన్ కు మన దేశం విషయంలో మరో ఆకర్షణీయమైన అంశం. బ్రిటన్ లో పెట్టుబడులు పెట్టే దేశాల్లో భారత్  ద్వితీయి స్థానంలో ఉంది. భారత్ కు వాణిజ్య భాగస్వామ్యంలో, మారిషస్, సింగపూర్ తర్వాత మూడవ ర్యాంక్ లో ఉన్న దేశం బ్రిటన్ కావడం విశేషం.

Also read: ఆత్మీయునికి అశ్రునివాళి

వాణిజ్య సంబంధాలు పెంపొందించే ఒప్పందాలు

రెండు దేశాల మధ్య  వాణిజ్య సంబంధాలు మెరుగుపడడం కోసం ఎన్నో ఒప్పందాలను గతంలో కుదుర్చుకున్నారు. 2005లోనే రెండు దేశాలు ఒక కమిటీని ఏర్పాటుచేశాయి. దాని పేరు జెట్కో (జాయింట్ ఎకనామిక్ అండ్ ట్రేడింగ్ కమిటీ). 2010-2016 మధ్యకాలంలో డేవిడ్ కేమెరన్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో, రెండు దేశాల మధ్య బంధాలు ఎంతో బలోపేతమయ్యాయి. 2013లో 100మందితో అతిపెద్ద వాణిజ్య ప్రతినిధి బృందాన్ని భారత్ కోసం రూపొందించారు. గతంతో పోల్చుకుంటే, 2010-2015 మధ్యకాలంలో రెండు దేశాల వాణిజ్యం రెట్టింపు ప్రగతిని సాధించింది. సైన్స్ – టెక్నాలజీ,ఆర్ధికం, వాణిజ్యం, పెట్టుబడులు, రక్షణ-భద్రత మొదలైన రంగాల్లో రెండు దేశాల మధ్య సంబంధాలు పెరగడానికి చాలా అవకాశాలు ఉన్నాయని బ్రిటన్ ఆనాడే గుర్తించింది.

Also read: అనివార్యమైన లాక్ డౌన్

విద్యారంగంలో విశేష సంబంధాలు

విద్యారంగంలో బ్రిటన్ తో మనకున్న అనుబంధం కూడా గణనీయమైంది. బ్రిటన్ వెళ్లి చదువుకొనే భారతీయ విద్యార్థుల సంఖ్య 2004-2009 మధ్య రెట్టింపు అయ్యింది. బ్రిటన్ లో విద్యాభ్యాసం కోసం వెళ్లేవారిలో భారత్ తొలి 10దేశాల్లో ఒకటి.2010లో జరిగిన యూకె -ఇండియా సమిట్ లో రెండు దేశాలు విద్య, పరిశోధన అంశాల్లో ఒడంబడికను కుదుర్చుకున్నాయి. రెండు దేశాల ప్రయోజనాల కోసం ఉపయోగపడే రంగాల్లో విద్య కీలకమైన అంశమని బ్రిటన్ అప్పటి ప్రధాని కామెరన్ వ్యాఖ్యానించారు. ఉద్యోగనియమాకాల్లోనూ రెండు దేశాల మధ్య ఆరోగ్యకరమైన అభివృద్ధిని సాధించాం. అక్కడ పనిచేస్తున్న మనవాళ్ళ సంఖ్య, మనవాళ్ళు నియమించుకున్న బ్రిటన్ ఉద్యోగుల కంటే ఐదారురెట్లు ఎక్కువే ఉంది. ఇది కూడా ఉభయతారకమే. ముఖ్యంగా మనకు లాభదాయకం.

Also read: పాలకపక్షాలకే మళ్ళీ పల్లకీ

ఇమిగ్రేషన్ లో కఠిన వైఖరి

2010లో థెరేసా మే బ్రిటన్ హోమ్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఇమిగ్రేషన్ లో కఠిన నిబంధనలను అమలుచేశారు.దీని ప్రభావం వల్ల 2012 నుంచి కొంతకాలం పాటు,మిగిలిన దేశాలతోపాటు,భారత విద్యార్థులు కూడా ఇబ్బందులు పడ్డారు. దీని వల్ల బ్రిటన్ కు వెళ్లే విద్యార్థుల సంఖ్య బాగా తగ్గిపోయింది. ఈ అంశంలో బ్రిటన్ పై అన్ని దేశాల నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. 2015లో నిబంధనలను సడలించడంతో మళ్ళీ బ్రిటన్ లో చదువుకోడానికి విద్యార్థులకు వెసులుబాటు కలిగింది. భారతదేశం నుంచి మెరికల్లాంటి ప్రతిభావంతమైన విద్యార్థులు బ్రిటన్ లో చదువుకోడానికి రావాలని బోరిస్ జాన్సన్ 2017లో టైమ్స్ అఫ్ ఇండియా కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు.

Also read: పత్రికాలోకాని వేగుచుక్క కాశీనాథుని నాగేశ్వరరావు పంతులు

విద్యార్థులకు పరిమితి లేదు

భారతదేశం నుంచి వచ్చే అచ్చమైన విద్యార్థుల సంఖ్యకు ఎటువంటి పరిమతులు లేవని, ఎందరైనా రావచ్చని బోరిస్ 2017లోనే స్వాగతించారు. కామన్ వెల్త్, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్, ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ మొదలైన వాటిల్లో ఇండియా, బ్రిటన్ రెండూ సభ్యదేశాలు కూడా. కెమికల్, వ్యవసాయ రంగాల్లోనూ భారత్ తో కలిసి సాగడానికి బ్రిటన్ ఎప్పటి నుంచో ఆసక్తి చూపిస్తోంది. రెండు దేశాలు రక్షణ రంగంలో సహకరించుకొనే దిశగా అడుగులను ముమ్మరం చేశాయి. యుద్ధ విమానాలు, కీలకమైన రక్షణ వ్యవస్థలను సంయుక్తంగా అభివృద్ధి చేయడంపై అంగీకారానికి వచ్చాయి. భారత్ ఉత్పత్తి చేస్తున్న తేజస్ ఎంకె 2 విమానానికి సంబంధించి సహకారం అందించుకోడానికి రెండు దేశాల అధినేతలు అంగీకారానికి వచ్చారు.

Also read: భారత్ – రష్యా సంబంధాలలో మలుపు

రక్షణ ఒప్పందాలు

నౌకలకు వినియోగించే వ్యవస్థలు, సంక్లిష్టమైన ఆయుధాల అభివృద్ధిలోనూ దృష్టి పెట్టనున్నారని తెలుస్తోంది. హిందూ మహా సముద్రంలో జరిగే కదలికలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకొనే దిశగా, రెండు దేశాలు ఒప్పందాన్ని కుదుర్చుకున్నాయి. ఈ అంశంలో, భారత విదేశాంగ మంత్రి జై శంకర్ -బ్రిటన్ హోంమంత్రి ప్రీతి పటేల్ ఒప్పందాలపై సంతకాలు చేసుకున్నారు. కరోనా భారత్ ను కుదిపేస్తోంది.దీన్ని ఎదుర్కోడానికి బ్రిటన్ సహకారం కూడా మనకు చాలా అవసరం. వ్యాక్సిన్లు, మందులు, ముడిసరుకులు, వైద్య పరికరాలు, ఉత్పత్తులు మొదలైనవి బ్రిటన్ నుంచి తెప్పించుకోడానికి మంచి మార్గం ఏర్పడిందని భావించవచ్చు.

Also read: బహుముఖ ప్రజ్ఞాశాలి కాళ్ళకూరి

బ్రిటన్ పరపతి పెద్దది

బ్రిటన్ లో అక్రమంగా నివాసం ఉంటున్న భారతీయులకు ఉద్వాసన పలికే దిశగానూ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి ఆర్ధిక నేరగాళ్ళను భారత్ కు అప్పగించే విషయంలోనూ చర్చ జరిగినట్లు వార్తలు వస్తున్నాయి. ఏటా 3000మంది భారతీయ వృత్తి నిపుణులకు బ్రిటన్ లో అవకాశాలు కల్పించాలని భారత ప్రధాని కోరినట్లు సమాచారం. బ్రిటన్ లో మన దేశానికి సంబంధించిన కంపెనీలు ఎన్నో ఉన్నాయి. భారతదేశంలోనూ బ్రిటన్ కంపెనీలు ఉన్నాయి. రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు మరింతగా పెరగాలని రెండు దేశాలు ఆకాంక్షిస్తున్నాయి. బ్రిటన్ చిన్న దేశమైనా, ప్రపంచంలో బాగా పరపతి వున్న దేశం. అటు చైనాతో, ఇటు ఆమెరికాతోనూ మంచి సంబంధాలు ఉన్నాయి.

Also read: సకల సద్గుణ సంపన్నుడు హనుమ

గతం తవ్వుకోవడం అనవసరం

బ్రిటన్ లో మనవాళ్ళు చాలామంది నివసిస్తున్నారు. రెండు దేశాల ప్రగతిలో ఐటీ రంగం కూడా చాలా కీలకమైంది. బ్రిటన్ – ఇండియా గత చరిత్రను తవ్వుకుంటే? చాలా విషయాలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతానికి అది అప్రస్తుతం. సర్వేపల్లి రాధాకృష్ణ మొదలు మన దేశ పెద్దలు ఎందరో బ్రిటన్ లో పర్యటించారు. ఆ దేశపు రాణి మొదలు ప్రధానమంత్రుల వరకూ ఎందరో మన దేశానికి అతిధులుగా వచ్చారు. ఎన్నో ఏళ్ళ నుంచి రెండు దేశాల మధ్య సంబంధాలు ఆరోగ్యదాయకంగానే సాగుతున్నాయి. నేటి భేటీతో, బ్రిటన్ -భారత్ బంధాలు మరింత బలోపేతమవుతాయని ఆశిద్దాం.

Also read: సంచార జీవితానికి ఆస్కార్ పురస్కారం

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles