దిల్లీ: ఆఫ్ఘానిస్థాన్ లోని కందహార్ నగరం శివార్లలో తాలిబాన్ కూ, ప్రభుత్వ దళాలకూ మధ్య పోరాటం జరుగుతున్న దృష్ట్యా అక్కడి ఇండియన్ కాన్సులేట్ లోని 50 మంది దౌత్య సిబ్బందినీ ఎయిర్ ఫోర్స్ విమానాలలో దిల్లీకి తీసుకొని వచ్చారు. శనివారం సాయంత్రం దిల్లీ చేరుకున్న ఎయిర్ ఫోర్స్ ప్రత్యేక విమానాలు పాకిస్తాన్ గగన తలం పై నుంచి కాక వేరే మార్గంలో వచ్చాయి. కందహార్ లో మారుతున్న పరిస్థితులను భారత ప్రభుత్వం చాలా జాగ్రత్తగా గమనిస్తున్నదనీ, భారతీయుల ప్రాణాలు ముఖ్యం కనుక వారిని దిల్లీకి రవాణా చేశామనీ, కందహార్ లో ఇండియన్ కాన్సులేట్ కొనసాగుతుందనీ ప్రభుత్వ ప్రతినిధి తెలియజేశారు.
‘‘ఇది కేవలం తాత్కాలిక ఏర్పాటు మాత్రమే. స్థానిక ఉద్యోగులు కౌన్సిలేట్ వ్యవహారాలు నడిపిస్తారు. పరిస్థితులు మెరుగుపడగానే దౌత్యసిబ్బంది తిరిగి అక్కడికి వెడతారు,’’ అని విదేశీవ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చీ అన్నారు. కందహార్ లో కౌన్సులేట్ ను మూసివేసే ప్రతిపాదన ఏదీ లేదని కాబూల్ లోని భారత దౌత్య కార్యాలయం మంగళవారంనాడు ప్రకటించింది. తన సేనలు ఉపసంహరించుకోవాలనే సంకల్పంతో అమెరికా అనాసక్తిగా ఉన్న కారణంగా కడచిన కొద్ది వారాలుగా ఉగ్రవాదుల దాడులు అధికమైనాయి. ఇరాన్, చైనాతో ఆఫ్ఘానిస్థాన్ సరిహద్దు ప్రాంతాలను ఆక్రమించుకున్నట్టు తాలిబాన్ ప్రకటించింది. ఆఫ్ఘానిస్థాన్ లో శాంతి, పునరావాస కార్యక్రమాలలో ఇండియా తోడ్పడుతోంది. అక్కడి పరిస్థితుల గురించి దిల్లీలో ప్రభుత్వ ప్రతినిధులకు తెలియజేసేందుకు భారత్ లో ఆఫ్ఘాన్ రాయబారి ఫరీద్ మముండ్జయ్ భారత విదేశాంగ కార్యదర్శి హర్షవర్థన్ స్రింగ్లాను కలుసుకొని వాస్తవపరిస్థితిని వివరించారు. ఆఫ్ఘానిస్తాన్ లో నివసిస్తున్న భారతీయులనూ, పర్యాటనకు వెళ్ళినవారినీ బహుజాగ్రత్తగా మెలగవలసిందిగా భారత ప్రభుత్వం సలహా చెప్పింది.
ప్రస్తుతానికి కాబూల్ లోని భారత రాయబార కార్యాలయం, బాల్ఖ్ రాష్ట్రంలోని మహరే షరీఫ్ నగరంల్ కాన్సులేట్ పనిచేసున్నాయి. జలాలాబాద్, హెరాట్ నగరాలలోని కాన్సులేట్లను ప్రభుత్వం ఈ సంవత్సరం ఏప్రిల్ లో మూసివేసింది.
చైనా కూడా తన పౌరులను ఆఫ్ఘానిస్థాన్ నుంచి వాపసు తెప్పించుకున్నది. 210 మంది చైనీయులతో ఒక విమానం శనివారంనాడు కాబూల్ నుంచి యూహాన్ కు వెళ్ళింది. ఇది ఇలా ఉండగా ఆఫ్ఘాన్ ప్రభుత్వం తన సేనలను సరిహద్దు ప్రాంతాలకు తరలిస్తున్నది. వారు తాలిబాన్ తో తలబడతారో, నిలబడి పోరాడతారో లేదో చూడాలని విదేశీ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.
ఈ కందహార్ విమానాశ్రయానికే 1999లో పాకిస్తాన్ కు చెందిన ఉగ్రవాద ఖైదీలను తీసుకొని నాటి విదేశాంగమంత్రి జస్వంత్ సింహ్ వెళ్ళి ఖైదీలను అప్పగించి తాలిబాన్ లు దారి మళ్ళించిన ఇండియన్ ఎయిర్ లైన్స్ విమానాన్ని ప్రయాణికులనీ సురక్షితంగా విడిపించుకొని వచ్చారు.