Sunday, December 22, 2024

హైదరాబాద్ ఓడీఐలో న్యూజిలాండ్ పై ఇండియా సంచలన విజయం

  • శుభమన్ గిల్ ద్విశతకం, ఈ ఘనకార్యం సాధించిన అయిదో భారతీయుడు
  • న్యూజిలాండ్ వీరోచిత పోరాటం, గెలుపు గుమ్మం దాకా వచ్చిన వైనం

హైదరాబాద్ లో బుధవారం జరిగిన మొదటి ఒన్డే మ్యాచ్ లో న్యూజిలాండ్ పైన ఇండియా 12 పరుగుల తేడాతో గెలిచింది. ఈ గెలుపునకు ప్రధాన కారణం శుభమన్ గిల్ సాధించిన ద్విశతకం. భారత క్రీడాకారులలో ఒన్ డేలలో డబుల్ సెంచరీ చేసిన అయిదవ క్రీడాకారుడుగా రికార్డు తన పేరు మీద నమోదు చేసుకున్నాడు.

అంతకు ముందు ఈ ఘనకార్యాన్ని సాధించిన భారత బ్యాట్స్ మన్: సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహవాగ్, రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్. ఒన్ డే మ్యాచులలో డబుల్ సెంచరీ సాధించిన అతి పిన్నవయస్కుడు 23 ఏళ్ళ శుభమన్ గిల్.

న్యూజిలాండ్ బౌలర్లపైన పూర్తి స్థాయిలో ఆధిపత్యం సాధించిన గిల్ తోట్రుపాటు లేకుండా పద్దతి ప్రకారం ఆడాడు. ఓపెనింగ్ బ్యాట్స్ మన్ గా కెప్టెన్ రోహిత్ శర్మతో కలసి 50 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. రోహిత్ వెళ్ళిపోయిన తర్వాత సైతం గిల్ తన ఆటను కొనసాగించాడు. అటువైపు విరాట్ కోహ్లీ, ఇషాన్ కిషన్ లు వికెట్లు కోల్పోయి పెవెలియన్ కు తిరిగి వెళ్ళినా గిల్ తన మానాన తాను షాట్లు కొడుతూ స్కోరు పెంచుకుంటూ వెళ్ళాడు. అదే సమయంలో అత్యంత వేగంగా ఓడీఐలలో వేయి పరుగులు సాధించిన బ్యాట్స్ మన్ గా  కొహ్లీ, శిఖర్  ధవన్ ల రికార్డులను అధిగమించి సరికొత్త రికార్డు నెలకొల్పాడు. కుడిచేతి వాటం బ్యాట్స్ మన్ అయిన గిల్ వంద పరుగులు సాధించిన తర్వాత మరింత ఆత్మవిశ్వాసంతో, తెగింపుతో షాట్లు కొడుతూ పరుగులు వేగం పెంచాడు. 122 బంతులలో 150 పరుగులు సాధించాడు. క్రమంగా విజృంభించి ఆడుతూ భారత్ పరుగుల మొత్తాన్ని 300లు దాటించాడు.

ఇన్నింగ్స్ లో మరి రెండు ఓవర్లు మాత్రమే ఉన్నాయనగా లాకీ ఫెర్గ్యూసన్ బౌలింగ్ లో వరుసగా మూడు సిక్స్ లు లేపాడు. నాగపూర్ లో సచిన్ టెండూల్కర్ చేసిన 186 పరుగుల స్కోరు దాటుకొని 149 బంతులలో 208 పరుగులు సాధించి న్యూజిలాండ్  పైన ఒక భారతీయుడు ఇంత స్కోరు చేయడం ఇదే ప్రథమం అనే మరో రికార్డు నెలకొల్పాడు. గిల్ స్కోరు  తర్వాత కెప్టెన్ రోహిత్ శర్మ 38 బంతులకు 34 పరుగులు మాత్రమే అతి పెద్ద స్కోరు.

దీంతో ఓపెనర్ గా రోహిత్ శర్మతోపాటు ఎవరు రంగంలో దిగాలనే చర్చకు గిల్ ద్విశతకంతో ఫుల్ స్టాప్ పెట్టాడు.

విజయం సాధించాలంటే 350 పరుగులు సాధించాలనే లక్ష్యాన్ని సాధించేందుకు న్యూజిలాండ్ జట్టు అద్భుతంగా ఆడింది. ఒకానొక దశలో ఆరు వికెట్లకు 131 పరుగులు చేసి అధ్వానావస్థలో ఉండిన న్యూజిలాండ్ మైకేల్ బ్రేస్ వెల్ విజృంభభించి ఆడటంతో కోలుకోవడమే కాదు దాదాపు గెలుపు గుమ్మం దాకా వచ్చి భారత క్రికెటర్లను కంగారు పెట్టారు. బ్రేస్ వెల్ ధాటిగా ఆడి సెంచరీ సాధించి తన జట్టును రంగంలో పరుగులు తీయించాడు. తోటి ఎడమ చేతి వాటం బ్యాట్స్ మన్ మిచెల్ శాంటర్ తో కలిసి 102 బంతులలో 162 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. శాంటర్ 45 బంతులలో 57 పరుగులు చేసి బాగా రాణించాడు. చివరి ఓవర్ లో మరి అయిదు బంతులలో 13 పరుగులు చేయవలసి ఉన్న సమయంలో ఎల్ బిడబ్ల్యూ ఇచ్చి బ్రేస్ వెల్ అవుటు కావడంతో విజయం ఇండియాను వరించింది. అతడు అవుట్ కాకుండా ఉంటే బహుశా న్యూజిలాండ్ ఘనవిజయం సాధించి ఉండేది. చివరికి ఇండియా 50 ఓవర్లలో 349 పరుగులు చేయగా, న్యూజిలాండ్ 49.2 ఓవర్లలో 337 పరుగులుచేసి అన్ని వికెట్లూ కోల్పోయింది.

ఈ విజయంతో మూడు ఒన్ డే ఇంటర్నేషనల్ మ్యాచ్ ల సీరిస్ లో 1-0 ఆధిక్యంలో భారత్ నిలిచింది. టీ20 కెప్టెన్ హార్దిక్ పాండ్యా అవుటు కావడం వివాదంగానే మిగిలిపోయింది. శాంటర్ విసిరిన బంతి పాండ్యాను అయోమయంలో పడవేసింది. బంతిని పాండ్యా అందుకోలేకపోయాడు. బంతి స్టంప్స్ మీదుగా వెళ్ళినట్టు కనిపించింది కానీ వికెట్ కీపర్ బెయిల్స్ ను తొలగించాడు.  వికెట్ కీపర్ గ్లౌవ్స్ స్టంప్స్ కు తగిలినట్టు కనిపించినప్పటికీ అంపైర్ పాండ్యా అవుటైనట్టు నిర్ణయించాడు. పాండ్యా కోపగించి వెళ్ళిపోయాడు. రీప్లేస్ లో కొన్నికోణాల నుంచి చూస్తే బంతి స్టంప్స్ కు తగిలినట్టే లేదు. భారత కెప్టెన్ టాస్ గెలిచి తెలివిగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles