భారత క్రికెట్ జట్టు వరుసగా రెండో టీ20 మ్యాచ్ ను న్యూజిలాండ్ పైన గెలిచి మూడు మ్యాచ్ ల సీరీస్ ను 2-0 ఆధిక్యంతో హస్తగతం చేసుకున్నది. రాంచీలో శుక్రవారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్ లో మొదట న్యూజిలాండ్ బ్యాటింగ్ చేసింది. ఆరు వికెట్ల నష్టానికి 153 పరుగులు సాధించింది. గెలవాలంటే 154 పరుగులు చేయవలసి ఉన్న భారత జట్టు ఓపెనర్లు రాహుల్, రోహిత్ లు బాగా ఆడారు. రాహుల్ 65, రోహిత్ 55 పరుగులు సాధించి అవుటైనారు. మూడో బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్ ఒకే ఒక రన్ తీసి అవుటైనాడు. యాదవ్ ఇంత పేలవంగా ఎప్పుడూ వికెట్టు కోల్పోలేదు. రిషభ్ పంత్ ధాటిగా ఆడి విజయానికి అవసరమైన పరుగులు మొదటి మ్యాచ్ జరిగిన జైపూర్ లో చేసిన విధంగానే రాంచీలోనూ చేశాడు. ఇండియా జట్టు 17.2 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు ఇద్దరూ కలిసే 117 పరుగులు తీశారు. రాహుల్ తన 16వ టీ 20 అర్ధశతకం 40 బంతులలో సాధించగా 49 బంతుల్లో 65 స్కోరు దాకా ఎదిగి అవుటైనాడు.
టీ20 మ్యాచ్ లలో విరాట్ కోహ్లీ కంటే ఎక్కువ పరుగులు సాధించిన న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గుప్ టిల్ 31 పరుగులు చేసిన తర్వాత దీపక్ చహర్ బౌలింగ్ లో వికెట్టు కోల్పోయాడు. భారత స్పిన్ ద్వయం ఆక్సర్ పటేల్ (1-26), అశ్విన్ (1-19)లు న్యూజిలాండ్ బ్యాటర్లను కట్టడి చేశారు. హైదరాబాదీ బౌలర్ మహమ్మద్ సిరాజ్ ప్రాక్టీసింగ్ లో గాయం కావడంతో మైదానంలో దిగలేదు. అతని బదులు హర్షల్ పాటేల్ అరంగేట్రం చేశాడు. వస్తూనే రెండు వికెట్లు (డరైల్ మిచెల్, గ్లెన్ ఫిలిప్స్) తీసుకున్నాడు. గప్ టిల్ 15 బంతుల్లో 31 పరుగులు చేయగా, మిచెల్ 28 బంతుల్లో 31 పరుగులు సాధించారు.