Tuesday, January 21, 2025

పాకిస్తాన్ పై భారత్ సంచలన విజయం

  • ఆసియా కప్ క్రికెట్ పోటీలలో భారత్ ముందంజ
  • ఆల్ రౌండర్ హార్దిక్ ప్రతిభ తెచ్చిన గెలుపు
  • భువనేశ్వర్ కుమార్, జడేజా, కొహ్లీ రాణించారు

దాయాది పాకిస్తాన్ పైన టీమ్ ఇండియా ప్రతీకారం తీర్చుకున్నది. మునుపటి ఓటమిని పూర్వపక్షం చేస్తూ దుబైలో ఆదివారంనాడు పాకిస్తాన్ పైన సంచలనాత్మక విజయం సాధించి ఆసియా క్రికెట్ చాంపియన్ షిప్ పోటీలో ఒక అడుగు ముందుకు వేసింది. ఆల్ రౌండర్ హర్దిక్ విజయానికి ప్రధాన కారకుడు. బ్యాటింగ్ లో మెరుపులు మెరిపించడంతో పాటు మూడు వికెట్లు సాధించాడు. రవీంద్ర జడేజాతో కలసి బ్యాటింగ్ లో ఇంకా రెండు బంతులు మిగిలి ఉన్నాయనగా అద్భుతంగా ఆడి లక్ష్యాన్ని ఛేదించాడు. నాలుగు వికెట్లకు 89 పరుగుల స్కోరు ఉన్నప్పుడు హార్దిక్, జడేజా జంట క్రీజ్ లో కుదురుకున్నారు. ఆ దశలో పాకిస్తాన్ దే పైచేయిగా ఉంది. కానీ ఇద్దరు భారత ఆల్ రౌండర్లూ వికెట్టు నిలబెట్టుకుంటూ క్రమంగా స్కోరు సాధిస్తూ పాకిస్తాన్ మొత్తాన్ని అధిగమించారు. ఈ సారి వికెట్ కీపర్ గా రిషభ్ పంత్ ను వదిలివేసి అతని స్థానంలో దినేష్ కార్తీక్ ను తీసుకోవడం విశేషం.

వందో టీ 20 మ్యాచ్ ఆడుతున్న కోహ్లీ  విరాడ్రూపం ప్రదర్శించకపోయినా బాగానే ఆడారు. నసీం షా విసిరిన రెండో బంతికి అడ్డగోలుగా ఆడి స్లిప్స్ లో ఉన్న ఫాకర్ జమాన్ కు క్యాచ్ ఇవ్వవలసిన వాడే. జమాన్ కష్టమైన క్యాచ్ ను పట్టుకోలేకపోయాడు. 35 పరుగులు చేసిన విరాట్ కొహ్లీ బంతిని ఎట్లా ఆడాలో నిర్ణయించుకోలేక వికెట్టు కోల్పోయాడు. జట్టు నాయకుడు రోహిత్ శర్మ మానసిక స్థితి స్థిరంగా లేనట్టు కనిపించింది. పరుగులు చేయలేక మదనపడుతున్న రోహిత్ ఫోర్లు కొట్టి ముందుకు దూసుకుపోవాలన్న ప్రయత్నం చేసి క్యాచ్ ఇచ్చిపెవెలియన్ కు తిరిగి వచ్చాడు. రోహిత్ తో ఇన్నింగ్స్ ప్రారంభించిన కెఎల్ రాహుల్ సున్నా పరుగులకు వెనకకు తిరిగాడు. గడ్డుపరిస్థితిలో ఉన్న జట్టు ను ఆదుకోవలసిన సూర్యకుమార్ పెద్ద షాట్ కొట్టడానికి ప్రయత్నించి నసీమ్ బౌలింగ్ లో అవుటైపోయాడు.

టాస్ గెలిచిన రాహుల్ పాకిస్తాన్ ను ముందు బ్యాట్ చేయవలసిందిగా కోరాడు. భారత పేస్ బౌలర్లు బాగా రాణించారు. పాక్ జట్టు నాయకుడు బాబర్ ఆజంను భువనేశ్వర్ కుమార్ పెవెలియన్ కు పంపించాడు. అనంతరం జమాన్ చిన్న పొరబాటు చేసి వికెట్టు కోల్పోయాడు. ఇఫ్టికార్ అహ్మద్ ను వికెట్ కీపర్ దినేష్ కార్తీక్ అవుట్ చేశాడు. అప్పుడే హార్దిక్  కి తొలి వికెట్టు లభించింది. బాబర్ తో కలసి ఇన్నింగ్స్ ను ప్రారంభించిన మహమ్మద్ రిజ్వాన్ కష్టపడి 42 బంతులలో 43 పరుగులు సాధించాడు. ఖుర్షీద్ షా షార్ట్ బాల్ ను కట్ చేస్తూ దొరికిపోయాడు. అప్పుడు పాకిస్తాన్ అయిదు వికెట్ల నష్టానికి 97 పరుగుల వద్ద నిలిచింది.

ఆ స్థాయిలో భువనేశ్వర్ విజృంభించాడు. షాదాబ్ ఖాన్, ఆసిఫ్ అలీ లను భువనేశ్వర్ కుమార్ బౌల్ చేశాడు. చివరి ఆటగాడు షానవాజ్ దహానీ రెండు భారీ సిక్సర్లు కొట్టి పాకిస్తాన్ క్రీడాకారులకూ, అభిమానులకూ సంతోషం కలిగించాడు. ఇండియా బౌలింగ్ నింపాదిగా సాగడంతో పెనాల్టీ చెల్లించుకోవలసి వచ్చింది. పాకిస్తాన్ కనుక ఆ దశలో విజృంభించి ఉంటే భారత్ పని కుదేలయ్యేది. పాకిస్తాన్ బౌలర్లు కూడా భారత్ బౌలర్లలాగే చాలా నెమ్మదిగా బౌల్ చేశారు.

స్కోర్లు: 

పాకిస్తాన్ 147 పరుగులు (19.5 ఓవర్లు)

ఇండియా  148 అయిదు వికెట్లకు (19.4 ఓవర్లు)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles