ఫైనల్లో చోటు కోసం ఇంగ్లండ్ తాడోపేడో
ఇప్పటికే టెస్ట్ చాంపియన్ షిప్ ఫైనల్స్ చేరిన కివీస్
సాంప్రదాయ టెస్ట్ క్రికెట్ జవసత్వాలు కూడగట్టుకోటం కోసం అంతర్జాతీయ క్రికెట్ మండలి ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఐసీసీ టెస్ట్ చాంపియన్ షిప్ లీగ్ ఆఖరి రౌండ్ పోటీలు ఆసక్తికరంగా మారాయి. అంతర్జాతీయ క్రికెట్లో టెస్టు హోదా పొందిన జట్లన్నీ తలపడుతున్నఈ రౌండ్ రాబిన్ లీగ్ కమ్ నాకౌట్ టోర్నీ టైటిల్ సమరానికి న్యూజిలాండ్ ఇప్పటికే అర్హత సాధించగా రెండో బెర్త్ కోసం భారత్, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్ జట్ల మధ్య మూడుస్తంభాలాట మొదలయ్యింది. టెస్ట్ క్రికెట్ మూడో ర్యాంకర్ ఆస్ట్ర్రేలియా అనూహ్యంగా తన సౌతాఫ్రికా పర్యటన రద్దు చేసుకోడంతో న్యూజిలాండ్ సునాయాసంగా ఫైనల్స్ చేరుకోగలిగింది.
భారత్, ఇంగ్లండ్ ఢీ అంటే ఢీ:
టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్లో చోటు కోసం భారత్, ఇంగ్లండ్ జట్లు ఢీ అంటే ఢీ అంటున్నాయి. భారతగడ్డపై ఫిబ్రవరి 5 నుంచి జరుగనున్ననాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ నిర్ణయాత్మకంగా మారింది. భారతజట్టు ఫైనల్స్ బెర్త్ ఖాయం చేసుకోవాలంటే ఇంగ్లండ్ పై కనీసం 2-1 తేడాతోనైనా నెగ్గితీరాల్సి ఉంది. విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారత జట్టు ఒకవేళ 4-0 లేదా 3-0తో లేదా 3-1తో నెగ్గినా ఫైనల్స్ చేరగలుగుతుంది. సిరీస్ 2-2తో డ్రాగా ముగిస్తే మాత్రం కొహ్లీ సేన ఫైనల్స్ చేరడం అనుమానమే. టెస్టు చాంపియన్ షిప్ లీగ్ లో భారతజట్టు 71.7 శాతం పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతుంటే న్యూజిలాండ్ 70 శాతం పాయింట్లతో ఫైనల్స్ లో బెర్త్ ఖాయం చేసుకోగలిగింది. 69.2 శాతం పాయింట్లతో ఆస్ట్ర్రేలియా మూడోస్థానంలో కొనసాగుతోంది.
ఇదీ చదవండి: సఫారీ-కంగారూ సిరీస్ కు కరోనా దెబ్బ
ఇంగ్లండ్ ఫైనల్స్ చేరాలంటే…?
భారత్ పై ఇంగ్లండ్ రెండుమ్యాచ్ లు నెగ్గితే మూడోస్థానంలో కొనసాగుతున్న ఆస్ట్ర్రేలియా ఫైనల్స్ చేరుకోగలుగుతుంది. ఒకవేళ ఇంగ్లండ్ జట్టు ఫైనల్స్ చేరాలంటే భారత్ పై మూడు టెస్టులు నెగ్గితీరాల్సి ఉంది. 3-1 లేదా 3-0తో ప్రస్తుత టెస్టు సిరీస్ నెగ్గినా చాలు. ప్రపంచటెస్టు సిరీస్ చాంపియన్ షిప్ టైటిల్ సమరం జూన్ 21 నుంచి క్రికెట్ మక్కా లార్డ్స్ వేదికగా జరుగనుంది.
ఇదీ చదవండి:టెస్ట్ చాంపియన్షిప్ ఫైనల్లో న్యూజిలాండ్