Sunday, December 22, 2024

కోవాగ్జిన్, ఆస్ట్రాజనీకాలకు అనుమతి మంజూరు

ఆదివారం ఖరారు అనుమతి మంజూరు

భారత్ బయోటెక్ కు ఖండాంతర కీర్తిప్రతిష్ఠలు

పుణె సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు కూడా ఖ్యాతి

ఆక్సఫర్డ్ పరిశోధన సంస్థకూ పరిగణన

‘కంగ్రాట్యులేషన్స్ ఇండియా’ అంటూ ప్రధాని ట్వీట్

హైదరాబాద్ : ఆక్స్ ఫర్డ్ ఆస్ట్రాజనీకా, భారత్ బయోటెక్ కోవాగ్జిన్  కు ఆదివారంనాడు అనుమతి లభించింది. డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా తాజా సమాచారాన్ని సమీక్షించి ఈ రెండు టీకా మందులనూ వినియోగానికి అనుమతించాలని నిర్ణయించింది. ‘‘సీడీఎస్ సీఓ (సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్) సీరమ్, భారత్ బయోటెక్ లో టీకామందు తయారు చేయాలన్న సిఫార్సును ఆమోదిస్తున్నది,’’ అని సీడీఎస్ సీఓ  ప్రకటించింది. టీకా మందుకోసం నిరీక్షణ ఇంతటితో ముగిసింది. ఇక టీకా మందు ఉత్పత్తి, రవాణా, ఇంజన్షన్ లు చేయడమే తరువాయి. ఆక్స్ ఫర్డ –ఆస్ట్రోజనికా ను పుణె లోని సీరం ఇన్ స్టిట్యూట్ ఉత్పత్తి చేస్తుంది. కోవాగ్జిన్ ని హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ తయారు చేస్తుంది. రెండు కంపెనీలు ఇండియాలోనే ఉంటడం భారత్ కు గర్వకారణం.

ఆక్స్ ఫర్డ – ఆస్ట్రో జనీకా, భారత్ బయోటెక్ టీకా మందులను డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అంతిమంగా ఆమోదించింది. ‘కంగ్రాట్యులేషన్స్ ఇండియా’’ అంటూ ప్రధాని నరేంద్రమోదీ ట్టీట్ చేశారు. 

స్థానిక కంపెనీ భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాగ్జిన్ టీకాను అత్యవసర వినయోగానికి షరతులతో కూడిన అనుమతి లభించింది. దీంతో ఫార్మాహబ్ గా పేరుప్రఖ్యాతులు గడించిన హైదరాబాద్ నగరం పేరు ప్రపంచ వేదికపైన మరోమారు మారుమోగుతోంది. దీంతో పాటు పుణె లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ కు కూడా ప్రపంచ ప్రఖ్యాతి లభించింది.  సొంత టీకా ఉపయోగించాలని పట్టుదలగా ఉన్న భారత ప్రభుత్వానికి తొలి టీకా అందించిన ఘనత హైదరాబాద్ కూ, భారత్ బయోటెక్ కూ, పుణె లోని సీరమ్ ఇన్ స్టిట్యూట్ కూ  లభించింది. కొవిషీల్డ్ పేరుతో ఆక్స్ ఫర్డ్ తయారు చేసిన టీకాకు సంవత్సరాదినాడు జనవరి 1న ప్రాథమిక అనుమతి లభించగా, మరుసటి రోజే, రెండో తేదీన భారత్ బయోటెక్ తయారు చేసిన కోవాక్జిన్ కి డ్రగ్ కంట్రోలర్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ (డీసీఎస్ సీఓ), విషయ నిపుణుల కమిటీ (ఎస్ ఈ సీ) సిఫార్సు చేశాయి. ఆదివారం నాడు డీసీఐజీ సమీక్ష చేసిన మీదట ఈ టీకాకు అనుమతి లభించింది. భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్), నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ (ఎన్ ఐవీ) సంయుక్త సహకారంతో కోవాగ్జిన్ ను భారత్ బయోటెక్ సంస్థ అభివృద్ది చేసింది. ఈ మేరకు ఆరు మాసాల కిందట జూన్ 29వ తేదీన ఒక ప్రకటన వెలువడింది.

Also read: ప్రజలందరికీ ఉచితంగా కరోనా టీకా

25,800 మంది వలంటీర్లపై ప్రయోగం

హైదరాబాద్ కు చెందిన ఔషధ దగ్గజ సంస్థ భారత బయోటెక్ అభివృద్ధి చేసిన కోవాగ్జిన్ కు సంబంధించి సంస్థ పంపిన అదనపు సమాచారాన్ని నిపుణుల కమిటీ శనివారంనాడు జరిపిన సమీక్షలో ఆమోదం తెలియజేసి డీసీజీఐకి సిఫార్సు చేసింది. 25,800 మంది వలంటీర్లతో ప్రయోగపరీక్ష మూడో దశ నిర్వహించాలని నిర్ణయించగా, ఇప్పటి వరకూ 23 వేల మందికి ప్రయోగాత్మకంగా టీకా మందు వేశారు. ఇంతవరకూ సాగిన ప్రయోగాల ఫలితాలను సమీక్షించే ఈ టీకా భద్రమైనదేనని ప్రవీణులు నిర్ణయించారు.

తెలంగాణకు పది రోజుల్లో

అనుమతి మంజూరు చేసిన ఇరవై నాలుగు గంటలలో టీకా మందు ఇవ్వడం ప్రారంభించవచ్చు. తెలంగాణ రాష్ట్రంలోని వైద్య సిబ్బందికి వారం, పదిరోజుల్లోనే టీకా వేసే అవకాశాలు ఉన్నాయని అభిజ్ఞవర్గాలు చెబుతున్నాయి. ఈ నెల రెండో వారంలో రాష్ట్రంలో ఈ టీకా మందు పంపిణీ జరుగుతుందని అంటున్నారు. ఆదివారం అనుమతి లభిస్తే సోమవారంనుంచి పంపిణీ ప్రారంభం అవుతుందని ఉన్నతాధికారులు చెబుతున్నారు.

కొందరికే ఉచితం

కోవిద్-19 పైన జరిగిన పోరాటంలో ప్రథమ శ్రేణిలో నిలిచి పోరాటం చేసిన కోటి మంది వైద్య సిబ్బందికీ, రెండు కోట్ల మంది పేరా మెడికల్ సిబ్బందికీ, పోలీసులకూ, మునిసిపాలిటీ వర్కర్లకూ, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నవారికీ ఉచితంగా, ప్రథమంగా టీకా మందు వేస్తారు. వీరి సంఖ్య మూడు కోట్ల వరకూ ఉండవచ్చునని కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్థన్ శనివారంనాడు ప్రకటించారు. 50 ఏళ్ళు పైబడినవారికి మొదటి ప్రాధాన్యం ఉంటుందనీ, ఇటవంటి వారు దేశంలో 27 కోట్లమంది ఉంటారనీ, వీరికి జులైలోగా టీకా మందు ఎట్లా అందించాలన్నదానిపైన కసరత్తు జరుగుతోందని మంత్రి తెలియజేశారు. టీకా మందుపై వచ్చే వదంతులను నమ్మవద్దనీ, ప్రజల ఆరోగ్యం విషయంలో కేంద్రప్రభుత్వానిదే జవాబుదారీ అనీ మంత్రి హామీ ఇచ్చారు. టీకా ప్రయోగాల సమయంలో భద్రత, సామర్థ్యం, రోగనిరోదక శక్తి పెంపొందించే అవకాశం వంటి అనేక అంశాలను దృష్టిలో పెట్టుకున్నమని కేంద్ర మంత్రి తెలియజేశారు. ఈ విషయాల్లో రాజీ ప్రసక్తి లేదని చెప్పారు. టీకా ఎట్లా వేయాలనే అంశంలో శిక్షణ ఇవ్వడానికి రెండు వేలమంది మాస్టర్ ట్రయినర్లను తయారు చేసినట్టు కేంద్ర ఆరోగ్య మంత్రి తెలియజేశారు.

డ్రైరన్ జయప్రదం

దేశంలోని అన్ని రాష్ట్రాలలోనూ, కేంద్ర పాలిక ప్రాంతాలలోనూ శనివారంనాడు జయప్రదంగా డ్రైరన్ జరిగింది. 125 జిల్లాలలో 286 సైట్లలో డమ్మీ వ్యాక్సినేషన్ కార్యక్రమం నిర్వహించారు. సంక్రాంతి కానుకగా టీకా మందు అందజేస్తామని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. టీకా మందు పంపిణీలో దక్షిణాదికి ప్రాధాన్యం ఇవ్వాలని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ అన్నారు. వాక్సిన్ రవాణాలో, పంపిణీలో ఎదురయ్యే ఇబ్బందులు ఏమిటో గుర్తించడానికి డ్రైరన్ నిర్వహించారు. తమిళనాడులోవాక్సిన్ వచ్చిన తర్వాత దాని పంపిణీకి 45,200 కేంద్రాలను రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది. 2.5 కోట్ల టీకాను నిల్వ చేసేందుకు 2,800 కోల్డ్ స్టోరేజీలూ, 51 మొబైల్ కోల్డ్ స్టోరేజీలూ ఏర్పాటు చేసింది. రాజస్థాన్ లో ఏడు జిల్లాలలో 19 కేంద్రాలలో డ్రైరన్ నిర్వహించారు.

Also read: స్వదేశీ టీకాతోనే కరోనా కట్టడి-మోదీ

తెలంగాణలో రెండు జిల్లాలు

కోవిద్ టీకా మందు పంపిణీకి ముందస్తు సన్నాహాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో రెండుజిల్లాల పరిధిలో ఆరు కేంద్రాలలో డ్రైరన్ నిర్వహించారు. హైదరాబాద్ జిల్లాలో గాంధీ దవాఖానా, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, తిలక్ నగర్ పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, సోమాజిగూడాలోని యశోదా ప్రైవేటు ఆస్పత్రిలో డ్రైరన్ నిర్వహించారు. మహబూబ్ నగర్ జిల్లాలో మూసాపేట మండలంలోని జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నేహాషైన్ ఆస్పత్రిలో ఈ కార్యక్రమం జరిగింది.  ప్రతి కేంద్రంలో ముందే ఎంపిక చేసిన 25 మంది వైద్య సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.  తిలక్ నగర్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో డ్రైరన్ ను గవర్నర్ తమిళిసై స్వయంగా చూసి సంతృప్తిని వెలిబుచ్చారు. హైదరాబాద్ జిల్లా కలెక్టర్ స్వేతామహంతి, ఆరోగ్య శాఖ సంచాలకుడు శ్రీనివాసరావు, ఇతర అధికారులూ పాల్గొన్నారు. నాంపల్లి ఏరియా ఆస్పత్రిలోజరిగిన కార్యక్రమాన్ని ప్రంపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ ఓ) ప్రతినిధులూ, తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ పాల్గొన్నారు. గాంధీ దవాఖాన లో జరిగిన కార్యక్రమంలో వద్యవిద్య సంచాలకుడు డాక్టర్ రమేష్ రెడ్డి, తదితరులూ పర్యవేక్షించారు.

కోవాగ్జిన్ తయారీ

కోవాగ్జిన్ ఉత్పత్తిని భారత్ బయోటెక్ ఇప్పటికే ప్రారంభించింది. కోటి డోసుల సిద్ధంగా ఉన్నాయి. తుది అనుమత మంజూరు కాగానే ఈ డోసులను రవాణా చేస్తారు. ఈ కంపెనీకి ఏటా 30 కోట్ల డోసులు ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది. అవసరమైతే అదనపు ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంపొందించుకునేందుకు కంపెనీ సిద్ధంగా ఉంది.  ఈ టీకా మందును ఇంజెక్షన్ ద్వారా ఇస్తారు. రెండు డోసులు వేయించుకోవడం తప్పనిసరి. కొత్తరకం కరోనా వైరస్ ను కూడా కోవాగ్జిన్ జయప్రదంగా నిలువరించగలదని నిపుణులు అంటున్నారు. కోవాగ్జిన్ ను హైదరాబాద్ సమీపంలోని జీనోమ్ వ్యాలీలో భారత్ బయోటెక్ కు చెందిన యూనిట్లలోని బీఎస్ఎల్ (బయో సేఫ్టీ లెవల్)-3 యంత్రంలో తయారు చేస్తారు. ఇటువంటి అత్యంత భద్రమైన తయారీ యూనిట్ భారత్ బయోటెక్ లో మాత్రమే ఉంది. చైనా, అమెరికా లోని కొన్ని కంపెనీలు బీఎస్ఎల-3 తయారీ యూనిట్లను నిర్మించుకుంటున్నాయి.

Also read: భారత్ లో విజృంభిస్తున్న కరోనా స్ట్రెయిన్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles