మహాభారతం – ఆదిపర్వం-4
ఏడౌక్షౌహిణులెన్న పాండవ బలం; బేకాదశా క్షౌహిణుల్
రూఢిం కౌరవ సైన్య; మీ యుభయమున్ రోషాహతాన్యోన్యమై
యీడం బోవక వీకమై పొడువగా నేపారు ఘోరాజి న
ల్లాడెన్ ధాత్రి శమంత పంచకమునం దష్టాదశాహంబులన్
నన్నయ భట్టారకుడు
భారతాన్ని కొందరు కావ్యంగా, కొందరు ధర్మశాస్త్రంగా, కొందరు నీతిశాస్త్రంగా, ఇంకొందరు ఇతిహాసంగా, మరికొందరు పురాణ సముచ్చయంగా భావిస్తారు. నేటి పద్యం కేవలం ఐతిహాసిక, చారిత్రక కోణాలనే బింబిస్తుంది.
Also read: మహాభారతం: ఆదిపర్వం: ఉదంకోపాఖ్యానం-3
కురుక్షేత్ర మహాసంగ్రామం శమంత పంచకమనే ప్రదేశంలో పద్ధెనిమిది దినాలు జరిగిందనీ, దీనిలో పాండవబలం ఏడు అక్షౌహిణులైతే, కౌరవబలం పదకొండు అక్షౌహిణులనీ మహాభారతం పేర్కొంటున్నది. ఈ యుద్ధం జరిగి కనీసం మూడు వేల ఏండ్ల నుండి ఐదు వేల ఏండ్లయి వుండవచ్చు. ఏడు అక్షౌహిణులైనగా రథ, గజ, అశ్వ, కాల్బణాలను కలిపి, 15,30,900 మంది సైనికులు. పదకొండు అక్షౌహిణులైనగా 24,05,700 మంది సైనికులు. వెరసి, కురుక్షేత్ర యుద్ధంలో 39,36,600 మంది సైనికులు. చారిత్రక దృష్టితో ఆలోచించినప్పుడు ఇంత పెద్ద సైన్యసమూహాన్ని కలిగి వుండడం వేల యేండ్ల క్రిందటి పరిస్థితుల్లో అసాధ్యమని చెప్పవచ్చు. ఈ ప్రశ్నను ప్రక్కన పడితే, నిరంతర యుద్ధచరిత్ర భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగమని తెలిపే ఆధారాలనేకం. మహాభారతంలో, భగవద్గీతలో యుద్ధమెంత వినాశకారియో తెలిపే పలు పంక్తులున్నప్పటికీ, యుద్ధం వినాశహేతువనీ, దాన్ని మానవాళి తప్పనిసరిగా విసర్జించాలనీ బోధించే సాహిత్యం భారతీయ సనాతన యుగంలో అత్యంత స్వల్పం.
విక్టర్ ఇమాన్యుయల్ కాంట్ ప్రసిద్ధుడైన జర్మన్ తత్వవేత్త. యుద్ధం మానవజీవితంలో అత్యంత ఆవశ్యకమనీ, అది సమాజ చరిత్రను, మానవ జీవితాన్ని పరిశుద్ధం చేస్తుందనీ ఆయన విశ్వాసం. భారతీయ తత్వవేత్తలు సైతం తరతరాలుగా ఇదే సిద్ధాంతం నమ్మినట్లుగా చరిత్ర తెలుపుతుంది. భారత చరిత్రలో మొట్టమొదటి సారి యుద్ధాన్ని నిర్ద్వందంగా ఖండించిన వాడు గౌతమబుద్ధుడు. ఆయన బోధనలచే ఆకర్షితుడై యుద్ధ సంప్రదాయాన్ని సంపూర్ణంగా త్యజించిన మొట్టమొదటి చక్రవర్తి అశోకుడు. “ది గ్రేటెస్ట్ సన్ ఆఫ్ ఇండియా” అని ప్రముఖ చరిత్రకారుడు, మేధావి, హెచ్ జి వెల్స్ “సంక్షిప్త ప్రపంచ చరిత్ర” అనే తన గ్రంధంలో అశోకుణ్ణి సంబోధిస్తాడు. బౌద్ధధర్మం క్షీణించిన తర్వాత భారతదేశంలో యుద్ధ గుంజన్మృదంగాల ఘోష పునః విజృంభించింది.
కొరవడిన జాతీయతా భావం
చిన్నచిన్న రాజ్యాలుగా శతాబ్దాల తరబడి ఛిన్నాభిన్నమైన భారతదేశంలో జాతీయభావం కొరవడి విదేశీయుల దండయాత్రలకు దారి తీసింది. మౌర్యుల కాలంలో, గుప్తుల కాలంలో తప్ప, ఏనాడూ, హైందవదేశం రాజకీయంగా కలిసిమెలిసి లేక పోవడం భరతఖండం యొక్క ప్రధాన రాజకీయ బలహీనత. యుధ్ధాలు మూడు విధాలని కౌటిల్యుని అర్థశాస్త్రం పేర్కొంటున్నది. ఒకటి ధర్మం కోసం చేసే యుద్ధం. రెండు ధనసంపత్తిని శత్రువు నుండి రాబట్టడానికి చేసే యుద్ధం. మూడవది కక్ష సాధింపుకై చేసే యుద్ధం. కౌటిల్యుడు అన్ని యుద్ధాలకు ఆమోదం తెలిపినా, ధర్మవేత్తల ఆమోదం మాత్రం, ధర్మయుద్ధాలకే. వాస్తవంగా తరతరాల మన చరిత్రలో ధర్మయుద్ధాల సంఖ్య బహు స్వల్పం. కక్ష తీర్చుకోవడానికో, అర్థికంగా లబ్ధి గడించడానికో జరిగిన యుద్ధాలే ఎక్కువ.
Also read: మహాభారతము – ఆది పర్వము – ఉదంకుని నాగస్తుతి
వేదయుగంలో ప్రతి పురుషుడు యుద్ధ నైపుణ్యాన్ని కలిగి వుండాలనీ, అవసరమైతే ఏ పోరాటానికైనా సిద్ధం కావాలనే నియమం వుండేది. రానురాను ఆ నియమం సడలిపోయి, పలువర్గాలకు ఆ నియమం నుండి వెసులుబాటు లభించింది. మహాభారత యుగం నుండి, భారతసైన్యంలో నాలుగు విభాగాలు. గజ, అశ్వ, రథ, కాల్బణాలు. రానురాను రథ విభాగం పరిత్యజించబడింది. ఈ సైన్య విభాగాలతో బాటు, వేగులు, సరిహద్దు భద్రతాబలాలు, దూతలు, యుద్ధం జరుగుతున్న సమయంలో సైన్యాలకు వండి పెట్టే వంటవాళ్ళు, క్షతగాత్రులకు సేవలందించే వైద్య సిబ్బంది, నర్సింగ్ సిబ్బంది, రోడ్లు వేసేవారు, ఆయుధాలు రిపేర్ చేసేవారు సైతం సైన్యంలో భాగమై ఒకచోటి నుండి మరొక్క చోటికి పోయేవారు.
గజబలగానిది అగ్రస్థానం
మహాభారత యుగం తర్వాతి కాలంలోనూ గజ విభాగం యుద్ధ విభాగాల్లో ప్రధాన పాత్ర పోషించినట్లుగా బౌద్ధసాహిత్యం తెలుపుతున్నది. మగధ చక్రవర్తి బింబిసారుని వద్ద అఖండమైన గజ విభాగం ఉండేదని కూడా ఈ సాహిత్యం తెలియజేస్తున్నది. ఈ గజేంద్రాలు సైన్యం యొక్క అగ్రభాగాన నిలబడేవి. ఆధునిక యుద్దవ్యుహంలో టాంకులు ఎట్టివో, ప్రాచీన కాలంలో గజబలగాలు కూడా అటువంటివే. అవి శత్రుసమూహంలోకి దూకి వారిని చెల్లాచెదురు చేసేవి. ఈ గజాలను యుద్ధనిమిత్తమే గాక నదులు, వంకలు, దాటడానికి కూడా వాడేవారు. ఒక్కొక్క ఏనుగను ముగ్గురు సైనికులు అధిష్టించేవారు. ఒకరు బాణాలు వేయడానికి, ఒకరు జావలిన్ విసరడానికి, మరొకరు బల్లాలు, కత్తులు గురి చూసి ప్రయోగించడానికి. రానురాను గజబలం యొక్క ప్రాధాన్యత అంతరించింది. ఇందుకు మొదటి కారణం గజాలకు అగ్ని అంటే ఉన్న భయం. రెండవది గుఱ్ఱాల వలే ఏనుగులు వేగంగా పరుగెత్తలేక పోవడం. భారతదేశంపై నిరంతర దండయాత్రలు చేసిన తురుష్కులు గుఱ్ఱాలపై ఆధారపడే వారు. రెండవది వారు అగ్గిని చూపి ఏనుగలను భయపెట్టడం నేర్చుకున్నారు. భారత సైన్యాలను తురుష్కులు ఓడించడానికి గల కారణాల్లో ఇవి ప్రధానమైనవి.
మధ్యయుగాల్లో అందరికన్నా పెద్ద సైన్యం విజయనగర ప్రభువుల వద్ద వుండేది. దానిలో ఏడు లక్షల నలభై వేలమంది సైనికులు వుండేవారు. వీరు గాక దాదాపు రెండు లక్షల యాభై వేలమంది సైనికులను యుద్ధసమయంలో ఎంపిక చేసేవారు. మహమ్మదీయుల అరబ్బు గుఱ్ఱాలకు దీటుగా ఉండడానికి గోవా పాలించే పోర్చుగల్ దేశం నుండి విజయనగర ప్రభువులు అశ్వాలను కొనుగోలు చేసేవారు.
సంఖ్యాబలం కంటే వేగం, వ్యూహం ముఖ్యం
ప్రపంచచరిత్రలో యుద్ధకళను ఆధునాతనం గావించి, యుద్ధస్వరూపాన్ని మార్పు చేసినవాడు నెపోలియన్. సైనికుల సంఖ్యాబలం కన్న వేగము,వ్యూహాము, యుద్దానికి అవసరమని నిరూపించిన వాడు. కృష్ణరాయల అనంతరం 1565 లో విజయనగర సైన్యానికి, సంయుక్త బహుమనీ సైన్యానికీ జరిగిన పోరాటంలో గెలుపు బహుమనీ సైన్యాన్నే వరించింది. బహుమనీ సైన్యసంఖ్య 6,50,000. విజయనగర సైన్యసంఖ్య పదిలక్షలు. కేవలం. సమయోచిత యుద్ధ వ్యూహము, అళియ రామరాయల మితిమీరిన ఆత్మవిశ్వాసము, రెండు కలిసి బహుమనీ సైన్యాన్ని గెలిపించినాయి.
Also read: మహాభారతం – ఆదిపర్వము : ఉదంకోపాఖ్యానము
చిన్నచిన్న సైన్యాలతో గెరిల్లా యుద్ధాలు చేసి మొగలాయీ సామ్రాజ్యాన్ని ముప్పుతిప్పలు పెట్టిన మరాఠా వీరుడు ఛత్రపతి శివాజీ. ఈయన కనుసన్నలలో మరాఠా సైనికశక్తి అపారంగా ఎదిగి, హైందవ జాతీయతకు గట్టి పునాదులు వేసింది. దేశం నలుమూలలా వందలాది మంది పాలనాధీశుల క్రింద చెల్లాచెదురుగా పడి వున్న అపారమైన భారతీయ సైనిక శక్తిని ఏకత్రాటి కింద తీసుకొని వచ్చిన ఘనత “ఈస్ట్ ఇండియా కంపెనీ”కి దక్కుతుంది. ఇట్లా దేశపాలనతో బాటు సైనిక వ్యవస్థను సైతం ఒకే వ్యవస్థ క్రిందికి తీసుకొని వచ్చే ప్రక్రియ 19 వ శతాబ్దం చివర మొదలై దాదాపు వంద సంవత్సరాలు కొనసాగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ నుండి ఆంగ్ల ప్రభుత్వం సైన్యం బాధ్యత స్వీకరించింది.
గూర్ఖా రెజిమెంట్ మొదలుకొని, అస్సామ్ రైఫిల్స్, సిక్క్, రాజపుట్, మరాఠా, మద్రాస్ రెజిమెంట్, పూనా రైఫిల్స్ వంటి బలగాలన్నీ ఆధునిక యుధ్ధ ప్రావీణ్యత గడించడమే గాక ఆఫ్ఘన్ యుద్ధంలో, మొదటి, రెండవ, ప్రపంచ యుద్ధాల్లో, దేశదేశాల్లో పనిచేసి అనుభవం పొందినాయి. వివిధ యుద్ధాల్లో మరణించి అమరులైన ఈ సైనికుల సమాధులు, ఆఫ్రికా, ఐరోపాల్లో పలుచోట్ల వున్నాయి. ఆయా దేశాలకు వెళ్ళిన భారతీయ నాయకులు ఇట్టి అమర సైనికుల సమాధులకు అంజలి ఘటించడం ఆనవాయితీ.
నిహతులైన యోధుల ఆనవాళ్ళు గల్లంతు
మహాభారత కాలం నుండి మొదటి ప్రపంచ యుద్ధం దాకా, వివిధ యుద్ధాల్లో మరణించిన యోధుల ఆనవాళ్ళే లేవు. మొదటి ప్రపంచయుద్ధంలో వివిధ దేశాల్లో పోరాడి నిహతులైన యోధుల స్మృతి చిహ్నంగా, మొట్టమొదటి సారి భారతీయ చరిత్రలో క్రొత్తఢిల్లీలో ఇండియా గేట్ నిర్మింపబడింది. దాదాపు శతాబ్దం నాటిదిది. ఈ కట్టడం కుడ్యాలపై అమరులైన పన్నెండు వేల మంది భారత జవాన్ల పేర్లు చెక్కబడి వున్నాయి.
స్వాతంత్యం సిద్ధించిన పిమ్మట ఇదే సైన్యం మనకు వారసత్వంగా వచ్చింది. 1962 చైనాతో జరిగిన యుద్ధంలో భారత్ పొందిన పరాభవం తర్వాత, రక్షణదళాన్ని ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోనే ప్రయత్నాలు జరిగినవి. కృష్ణమీనన్ స్థానంలో రక్షణ మంత్రిగా నియమింపబడిన మరాఠా రాజకీయవేత్త వైబి చవాన్ ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన తొలివ్యక్తి. ఆయన అనంతరం, సర్దార్ స్వరణ్ సింగ్, జగ్ జీవన్ రామ్ హయాంలలో ఈ ప్రక్రియ అవిచ్ఛిన్నంగా సాగింది. సరిగ్గా యాభై ఏండ్ల క్రిందట జరిగిన భారత పాకిస్థాన్ యుద్ధం స్వేచ్ఛా భారత చరిత్రలోనే అత్యంత కీలకమైనది. 1947 లో మతం ప్రాతిపదికగా భారతదేశం రెండు ముక్కలుగా చీలిపోయింది. ఒకవైపు పశ్చిమ పాకిస్తాన్, రెండోవైపు తూర్పు పాకిస్థాన్ ప్రపంచపటంలో చోటు చేసుకున్నవి. ఈ రెండు పాకిస్థాన్ ఖండాలకు నడుమ వేరువేరుగా భాషలు, సంస్కృతి, నెపంతో పరస్పర భేదాలు అంకురించడానికి అట్టే కాలం పట్టలేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారతదేశం అలీన విధానాన్ని అవలంబించింది. పాకిస్థాన్ అమెరికా యొక్క నేటో కూటమిలో భాగమై వారినుండి అర్థిక, ఆయుధ సంపత్తిని బహుముఖంగా గడింపసాగింది. తూర్పు, పడమటి పాకిస్థాన్ల నడుమ రానురాను భేదాలు తీవ్రతరమైనవి. పశ్చిమ పాకిస్థాన్ కన్న తూర్పు పాకిస్తాన్ జనాభా పరంగా, వ్యవసాయం, పరిశ్రమలు, విద్య, ఆరోగ్య పరంగా సైతం అధికంగా అభివృద్ది చెంది వుంది. 1969-70 ప్రాంతాల్లో స్వయం ప్రతిపత్తి కోసం తూర్పు పాకిస్థాన్ లో అనేక ప్రజోద్యమాలు జరిగినవి. దరిమిలా పశ్చిమ పాకిస్థాన్ సైన్యం తూర్పు పాకిస్తాన్లో విపరీతమైన అణచివేత కార్యక్రమాలు మొదలు చేసింది. దాదాపు ముప్ఫై లక్షల మంది సాధారణ పౌరులను ఊచకోత కోసింది. మాడు లక్షల మంది స్త్రీలు, బాలికలు, రజాకార్లనబడే పాక్ మతోన్మాదుల చేతుల్లో మానభంగం చేయబడినారు.
Also read: మహాభారతంలో శునకాల ప్రసక్తి
అమెరికా, ఇంగ్లండ్, టర్కీ, చైనా, శ్రీలంక వంటి అనేక దేశాలు పాకిస్థాన్ ను సమర్థించినా భారత ప్రభుత్వం మాత్రం గుండె దిటువుతో ప్రవర్తించింది. తూర్పుపాకిస్తాన్ పౌరపోరాటానికి మద్దతు ప్రకటించింది. ఒక సంవత్సరం పాటు ప్రపంచంలోని పలుదేశాలతో దౌత్య రాజకీయాలు నడిపింది. తూర్పు పాకిస్థాన్ పౌరులు ఏర్పాటు చేసుకున్న “ముక్తి వాహిని” అనబడే లక్షలాది బంగ్లా సాయుధదళాలకు శిక్షణ నిచ్చింది. సోవియట్ రష్యాతో దౌత్యరాజకీయాలు నడిపి, ఇరవై ఐదు సంవత్సరాల “మైత్రి ఒప్పందం” చేసుకుంది. ఆ ఒప్పందం ప్రకారం ఉభయదేశాలు, యుద్ధసమయంలో ఒకరికొకరు సాయం రావలసివుంది.
మోషే దయాన్ వ్యూహం
1967లో ఇజ్రాయిల్ అరబ్ దేశాల నడుమ జరిగిన యుద్ధంలో అరబ్ దేశాల విమాన స్థావరాలపై ఇజ్రాయెల్ దాడి చేసి వాటిని ధ్వంసం చేసింది. అప్పటి ఇజ్రాయెల్ రక్షణమంత్రి మోషేదయాన్ వ్యూహమది. అదే వ్యూహాన్ని పాకిస్తాన్ తమ స్థావరాలపై ప్రయోగించవచ్చునని గ్రహించిన భారత ప్రభుత్వం ఎవరికీ తెలియకుండా ప్రత్యామ్నాయ వాయు స్థావరాలు ఏర్పాటు చేసుకున్నది. అయూబ్ ఖాన్ ను కూలద్రోసి పాక్ సైన్యాద్యక్షుడు యాహ్యాఖాన్ దేశం పరిపాలన పగ్గాలు చేబట్టిన రోజులవి.
1971 డిసెంబర్ మూడవతేదీ రాత్రి ఆపరేషన్ ఛెంగిజ్ ఖాన్ పేరట పాకిస్థాన్ భారతీయ వాయు స్థావరాలపై మెరుపుదాడి చేసింది. అప్పటికే ప్రత్యామ్నాయ రహస్య వాయుస్థావరాలు ఏర్పాటు చేసుకొని వుండడం చేత భారతీయ వాయుసేనకు ఎట్టి నష్టమూ కలుగలేదు. ఈ దాడి జరిగిన సమయంలో ప్రధాని ఇందిరాగాంధి కలకత్తాలో ఒక సమావేశంలో వున్నారు. ఇందిరాగాంధీ ఢిల్లీకి తిరిగి వస్తున్న సమయంలో భారత గగనంతలంలో పాక్ విమానాలు సంచరిస్తున్నాయి. ఢిల్లీకి మరలి వచ్చిన తక్షణమే ఆమె రక్షణమంత్రి జగ్జీవన్ రామ్, సర్వసైన్యాధ్యక్షుడు మానిక్ షా, తదితర సైన్యాధిపతులతో సమావేశమైనారు. తదనంతరం ప్రధాని ఇందిరాగాంధి స్వయంగా దేశం తరుఫున యుద్ధం ప్రకటించారు. ప్రతీకారచర్యగా భారత వాయుసైన్యం పాక్ గగనతలంలో ప్రవేశించి మెరుపుదాడిలో వారి వాయు స్థావరాలన్నీ ధ్వంసం చేసింది. ఆకాశవాణిలో దేశప్రధాని ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. యుద్ధంలో పాకిస్థాన్ కు సాయం చేయాలనుకున్న చైనా భయపడి వెనక్కు తగ్గింది. అమెరికా అతి పెద్ద నావికా దళాన్ని (సెవెంత్ ఫ్లీట్) పంపినా, అమెరికాతో బాటు తాము కూడా యుద్ధంలో దిగవలసి వస్తుందని వెనువెంటనే సోవియట్ రష్యా బెదిరించడంతో, అమెరికా దేశం భీతిచెంది తన నావికాదళాన్ని వెనక్కు మరలించుకుంది.
యుద్ధం మొదలైన పదిదినాలకే భారతదేశం యుద్ధంలో పూర్తి ఆధిక్యత సాధించింది. డిసెంబర్ 16వ తేదీ తూర్పు పాకిస్థాన్ లోని ముఖ్యనగరమైన ఢాకా భారత సైన్యం యొక్క అధీనంలోకి వచ్చింది. పాకిస్తాన్ తూర్పు డివిజన్ కమాండర్ జనరల్ నియాజీ భారత సైన్యాలకు లొంగిపోయినట్లు అంగీకార పత్రంపై సంతకం చేయడంతో 13 దినాల మహాయుద్ధం ముగిసింది. దాదాపు 93000 మంది పాక్ సైనికులు భారత సైన్యానికి లొంగిపోయినారు.
Also read: మహాభారత శోభ
తూర్పు పాకిస్థాన్ స్థానంలో బంగ్లాదేశ్ అవతరించింది. ఈ యుద్ధంతో పాకిస్థాన్ ఆర్థికంగా, భౌగోళికంగా, సైన్యపరంగా, శాశ్వతంగా నష్టపోయింది. రెండు మతాలు, రెండు దేశాలు అనే సిధ్ధాంతం నిజం కాదని చరిత్ర ఋజువు చేసింది. ఆయుధ పరంగా, సైన్యపరంగా, అంతర్జాతీయ మద్దతు పరంగా, పాకిస్తాన్ బలంగా వున్నప్పటికీ, ధర్మసంకల్పంతో, పటిష్టమైన వ్యూహాబలంతో ఆ దేశాన్ని మట్టి కరిపించిన అపూర్వమైన వీరగాథ యిది.
చారిత్రక ధర్మయుద్ధం
వేల ఏండ్ల క్రిందటి కురుక్షేత్ర సంగ్రామం ధర్మయుద్ధమైతే, యాభై ఏండ్ల క్రిందట మన కళ్ళ ముందరే జరిగిన ఈ భారత పాక్ సంగ్రామం సైతం అంతే చరిత్రాత్మికమైన ధర్మయుద్ధం. ఉత్కంఠభరితంగా సాగిన ఈ యుద్ధం జయప్రదంగా సమాప్తం కావటంతో యావత్ దేశం ప్రధానమంత్రి ఇందిరాగాంధీని ప్రశంసలతో ముంచెత్తింది. జనసంఘ్ నేత అతల్ బిహారీ వాజపేయీ ఆమెను “భారతజాతి దుర్గామాత”గా పేర్కొన్నాడు. ఇందిరాగాంధీ, శ్యామ్ మానెక్ షా, అప్పటి రక్షణమంత్రి బాబు జగ్ జీవన్ రామ్ తో బాటు దేశ దిగ్విజయానికి కారకులైన సహస్రాది యోధానుయోధులైన సైనికులనేకులు నేడు మన మధ్య లేరు. కానీ ఆ యోధులందరినీ, తరతరాల పాటుగా మన దేశజనులతో బాటు బంగ్లాదేశ్ ప్రజలు కూడా కూడా కృతజ్ఞతా పూర్వకంగా స్మరిస్తారు.
Also read: మహాభారతం అవతారిక
భారత, పాకిస్థాన్ దేశ సైన్యాలు 13 దినాల పాటు “రోషాహతా న్యోన్యమై” పోరాడిన ఈ యుధ్ధం ఆసియా ఖండాన్ని చారిత్రకంగా, భౌగోళికంగా మార్చింది. బంగ్లాదేశ్ అనే క్రొత్తదేశం ప్రపంచపటంపై అవతరించడానికి కారణభూతమైంది. ప్రతి యుద్ధం దేశ ఆర్థిక వ్యవస్థపై విపరీతమైన భారం మోపుతుంది. ఇదారు సంవత్సరాలు ఇట్టి భారాన్ని మౌనంగా భరించినా, భారత దేశం కోలుకొని ప్రగతి సాధించింది. దెబ్బతిని పోయిన బంగ్లాదేశ్ సైతం త్వరలోనే కోలుకున్నది. 1971 తో పోలిస్తే యాభై యేండ్ల కాలంలో యూభై అంతలు బంగ్లాదేశ్ జాతీయ ఆదాయం పెరిగింది. సగటు బంగ్లా పౌరుల ఆదాయం ఇరవై ఐదు అంతలు పెరిగింది. ఒక్క పాకిస్తాన్ మాత్రమే ఆర్థిక మాంద్యంలో కూరుకొని పోయి మరి లేవలేక పోయింది.
దేశంకోసం పోరాడుతూ నేలకొరిగిన జంతువులు
ఈ రోజు భారతదేశానికి పాకిస్తాన్ ప్రత్యర్థి కానేరదు. చైనాయే భారత్ కు పెనుసవాలు నేడు. భారతదేశాన్ని ఈశాన్య రాష్ట్రాలతో కలిపే “చికెన్ నెక్” చైనాతో జరిగే యద్ధంలో కీలకపాత్ర పోషింపగలదు. ఈ రెండు దేశాలతో త్వరితగతిని సరిహద్దు తగాదాలు పరిష్కరించుకోవడం మన తక్షణ కర్తవ్యం. యుద్ధాల్లో అమరులైన సైనికులతో బాటు జంతువులు కూడా యుద్ధాల్లో పాల్గొని వీరస్వర్గం అలంకరించిన సంఘటనలనేకం. ఒకప్పుడు గజాలు, గుఱ్ఱాలు. నేడు గుఱ్ఱాలు, కుక్కలు. ఈ మూగజీవాలకు జ్ఞాపకచిహ్నాలు నిర్మించుకొన్న దేశాలు కూడా వున్నాయి. కలకత్తాలో అశ్వారూఢుడైన సుభాస్ బోస్ కాంశ్యవిగ్రహం చూపరులను ఉత్తేజపరుస్తుంది. అదేవిధంగా, నాగపూర్లో, పుణెలో గల ఝాన్సీ రాణి విగ్రహం కూడా. ముందరి కాళ్లు పైకెత్తి పైకి దూకే అశ్వంపై స్వారీ చేస్తూ, వీపున బాలకునితో, చేత ఖడ్గంతో, కోపోద్రిక్త నయనాలతో గల ఆ దేవి సజీవ శిల్పాన్ని చూసిన వారికి ఉద్వేగంతో కూడిన గగుర్పాటు కలుగక తప్పదు. లక్ష్మీబాయితో బాటు ఆమె అధిరోహించిన సైంధవానికి సైతం చరిత్రలో శాశ్వతస్థానం దక్కింది.
1972 లో న్యూఢిల్లీలోని ఇండియా గేట్ వద్ద 1971 యుద్ధంలో అశువులు బాసిన వీరుల సంస్మరణార్థం “అమర జ్యోతి” వెలిగించబడింది. అప్పటినుండీ ఆ జ్యోతి అక్కడే ఇంతకాక వెలిగింది. ఈ యుద్ధం జరిగినప్పుడు నేను విద్యార్థిని. నా తరాన్ని ఉత్తేజపరచిన జాతీయ సంఘటనల్లో ఈ యుద్ధం ప్రధాన ఘట్టం.
2021 డిసెంబర్ 16 ఈ ఘటనకు స్వర్ణోత్సవ దినం. ఈ దినాన్ని అధికారంలో గలవారు పేలవంగా జరపడం దురదృష్టం. ఇండియా గేట్ వద్ద గల యాభై ఏండ్లనాటి “అమర జ్యోతిని” అక్కడ నుండి తొలగించడం సైతం దురదృష్టకరం. కాకపోతే, పలు వార్తాపత్రికలు, టీవీలు, యూ ట్యూబ్ ఛానెళ్ళు, చరిత్రాత్మకమైన నాటి యుద్ధాన్ని ప్రస్తుత తరానికి జ్ఞాపకం చేసి తమవంతు కర్తవ్యాన్నీ నెరవేర్చినవి.
వందేమాతరమ్
Also read: ఎవరి కోసం?
నివర్తి మోహన్ కుమార్