- మూడు దశల్లో ఉద్రిక్తతలు తగ్గించేందుకు నిర్ణయం
- ఉపసంహరణతో భారత్ కే నష్టమంటున్న నిపుణులు
ఆరు నెలలుగా భారత్ చైనా సరిహద్దుల్లో కొనసాగుతున్న ఉద్రిక్తతలు చల్లారే సూచనలు కనిపిస్తున్నాయి. ఇరు దేశాలు తమ సైన్యాలను ఉపసంహరించుకోవాడానికి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. తూర్పు లద్దాక్ లోని వివాదస్పద ప్రాంతాల నుంచి ఇరుపక్షాల బలగాలను ఉపసంహరించి ఏప్రిల్ కు ముందు అవి ఎక్కడ ఉన్నాయో అక్కడికి చేరుకోవాలనే అంశాలపైన ప్రాథమికంగా ఒప్పందానికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నెల ఆరో తేదీన జరిగిన 8వ విడత కోర్ కమాండర్ చర్చల్లో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఆర్మీ ఉన్నతాధికారులు తెలిపారు. వారం రోజుల్లో మూడు దశల్లో బలగాల ఉపసంహరణను అమలు చేయనున్నారు.
తొలి దశ :
పాంగాంగ్ సరస్సు వద్ద చర్చలు జరిపిన తరువాత ఒక్కరోజు వ్యవధిలో ట్యాంకులతో సహా సాయుధ వాహనాలను వాస్తవాధీన రేఖకు దూరంగా తరలించాలి.
రెండోదశ :
పాంగాంగ్ సరస్సు ఉత్తర భాగంలో సైనికుల సంఖ్యను క్రమంగా తగ్గిస్తారు. రోజు 30 శాతం బలగాలను మూడు రోజుల పాటు ఉపసంహరించనున్నారు. భారత్ వైపు దళాలు ధ్యాన్ చంద్ థాపా పోస్టు వద్ద పహరా కాస్తుంటే, చైనా బలగాలు ఫింగర్ 8 వద్ద పహరా కాస్తాయి.
మూడో దశ:
చుషూల్, రజాంగ్ లా వద్ద ఇరు పక్షాలు ఆక్రమించిన శిఖరాలు, ప్రాంతాలను ఖాళీ చేసి వెనక్కి వెళ్లాల్సి ఉంది.
ఒప్పందం అమలును పరిశీలించేందుకు ఇరు దేశాలకు చెందిన దళాలతో కూడిన సంయుక్త వ్యవస్థను ఏర్పాటు చేస్తారు. దీంతో పాటు డ్రోన్లను వినియోగించి ఒప్పంద పకడ్బందీగా అమలయ్యేందుకు పరిశీలిస్తారు.
బలగాల ఉపసంహరణ భారత్ కే నష్టం
సరిహద్దుల్లో చైనా ఎటువంటి దుస్సాహసానికి పాల్పడినా ఎదుర్కోడానికి భారత సైన్యం సర్వసన్నద్ధంగా ఉంది. చైనా కంటే పర్వత శిఖరాలపై పోరాటంలో భారత సైన్యం మెరుగ్గా ఉండటం, వాస్తవాధీన రేఖ వెంబడి పాంగాంగ్ ఉత్తర, దక్షిణ తీరంలో కీలక ప్రాంతాలపై ఆర్మీ తన పట్టు బిగించింది.
చైనాతో అప్రమత్తంగా ఉండాలని నిపుణుల సూచన :
గతంలో చైనా సైన్యం వెనక్కు మళ్లినట్లు నటించి భారత సైన్యాన్ని దొంగ దెబ్బ తీసింది. గల్వాన్ లోయ వద్ద చైనా సైన్యం దాడికి పాల్పడటంతో 20 మంది జవాన్లు అమరులయ్యారు. దీనిని దృష్టిలో ఉంచుకుని భారత్ చాల అప్రమత్తంగా వ్యవహరించాలని రక్షణ రంగ నిపుణులు హెచ్చరిస్తున్నారు. బలగాల ఉపసంహరణపై చైనా కుయుక్తులు పన్నితే భారత్ కు తీరని నష్టం జరుగుతుందని రక్షణ రంగ నిపుణులు అంచనావేస్తున్నారు. భారత్ తో పోల్చితే చైనాకు వాస్తవాధీన రేఖను చేరుకోవాలంటే విస్తృత మౌలిక సదుపాయాలు ఉన్నాయి.