- రెండో రోజు ఆటలో 15 వికెట్ల పతనం
- పిచ్ కాదు…బీచ్ అంటున్న ఇంగ్లండ్ మాజీ కెప్టెన్
భారత్- ఇంగ్లండ్ జట్ల నాలుగు మ్యాచ్ ల సిరీస్ కే కీలకంగా మారిన చెన్నై రెండోటెస్ట్ మ్యాచ్ మూడున్నర లేదా నాలుగురోజుల్లోనే ముగియటం ఖాయంగా కనిపిస్తోంది. గతవారం ముగిసిన తొలిటెస్టు కోసం ఎర్రమట్టితో తయారు చేసిన పిచ్ ను ఉపయోగించారు. ఆ వికెట్ పైన ఇంగ్లండ్ 227 పరుగుల భారీతేడాతో
ఆతిథ్య భారత్ ను చిత్తు చేసింది. తొలిఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ 557 పరుగుల భారీస్కోరు సాధిస్తే..నాలుగో ఇన్నింగ్స్ లో భారత్ 192 పరుగులు మాత్రమే చేయగలిగింది. తొలిటెస్టుకు ఉపయోగించిన వికెట్ ఆఖరిరోజున మాత్రమే బౌలర్లపాలిట స్వర్గంగా మారింది.
Also Read : అశ్విన్ స్పిన్ జాదూలో ఇంగ్లండ్ గల్లంతు
నల్లమట్టి పిచ్ పైన రెండోటెస్టు
అయితే…తొలిటెస్టు వికెట్ కు భిన్నంగా రెండోటెస్టు కోసం నల్లరేగడి మట్టితో తయారు చేసిన పిచ్ ను సిద్ధం చేశారు. కీలక టాస్ ను భారత్ నెగ్గి బ్యాటింగ్ ఎంచుకొని..తొలిరోజుఆటలో 6 వికెట్లకు 300 పరుగుల స్కోరు సాధించింది. రెండోరోజుఆటలో మాత్రం భారత్ చివరి నాలుగు వికెట్లు కోల్పోయింది. ఇంగ్లండ్ ఇన్నింగ్స్ సైతం 59.5 ఓవర్లలో 134 పరుగులకే కుప్పకూలింది. కేవలం ఒక్కరోజు ఆటలో రెండుజట్లు కలసి 15 వికెట్లు కోల్పోవడాన్ని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ఆస్ట్రేలియా స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ తప్పుపడుతున్నారు.
పిచ్ కాదు… బీచ్
ఐదురోజుల టెస్టు కోసం సిద్ధం చేసిన పిచ్…రెండోరోజు నుంచే స్పిన్ బౌలర్లపాలిట స్వర్గంగా మారటం దారుణమనీ, ఇది టెస్టుమ్యాచ్ కు తగిన వికెట్ కానేకాదనీ, పిచ్ అనేకంటే..బీచ్ అనటం సబబుగా ఉంటుందంటూ మైకేల్ వాన్ విమర్శించాడు. కంగారూ స్పిన్ గ్రేట్ షేన్ వార్న్ సైతం..చెన్నై వికెట్ టెస్టుమ్యాచ్ కు తగినదికాదంటూ అసంతృప్తి వ్యక్తం చేశాడు.
Also Read : వినుము వినుము విరాట్ డకౌట్ల గాథ!
ఇంగ్లండ్ మరో మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ మాత్రం…టాస్ భలే గెలిచావంటూ భారత కెప్టెన్ విరాట్ కొహ్లీపై వ్యంగ్యాస్త్రం విసిరాడు. అయితే…తొలిటెస్టులో ఇంగ్లండ్ కెప్టెన్ రూట్… టాస్ నెగ్గిన కారణంగానే భారత్ 227 పరుగుల పరాజయం పొందిన వాస్తవాన్ని పీటర్సన్ మరచిపోయాడు.
మూడోరోజున మరింత క్లిష్టం
చెన్నైటెస్టు రెండోరోజుఆటలో 15 వికెట్లు కూలితే…మూడోరోజు ఆటలో మరిన్ని వికెట్లు కూలినా ఆశ్చర్యం లేదు. భారత్ రెండో ఇన్నింగ్స్ లో ఓపెనర్ శుభ్ మన్ గిల్ వికెట్ నష్టానికి 54 పరుగుల స్కోరు సాధించింది. తొలిఇన్నింగ్స్ 195 పరుగులతో కలుపుకొని భారత్ మొత్తం 245 పరుగుల ఆధిక్యంతో ఉంది. తొలి ఇన్నింగ్స్ సెంచరీ హీరో రోహిత్ శర్మ 25 పరుగులు, వన్ డౌన్ పూజారా 7 పరుగుల స్కోరుతో క్రీజులో ఉన్నారు.
Also Read : భారీశతకాల మొనగాడు రోహిత్
భారత్ మరో వంద పరుగులు స్కోరుకు జోడించగలిగితే..ఇంగ్లండ్ కు భారీఓటమి తప్పదు. అశ్విన్, అక్షర్, కుల్దీప్ లతో కూడిన భారత స్పిన్ ముప్పేటదాడిని ఇంగ్లండ్ తట్టుకొని నిలబడటం అసాధ్యమే మరి.
Also Read : చెపాక్ లో రోహిత్ షో