- సిక్సర్ తో ద్విశతకం బాదిన రూట్
- చెన్నై టెస్టుపై ఇంగ్లండ్ పట్టు
చెన్నై టెస్టు రెండోరోజు ఆటలో సైతం ఇంగ్లండ్ కెప్టెన్ జో రూట్ ఆధిపత్యం కొనసాగింది. తొలిరోజు ఆటలో అజేయ సెంచరీతో మెరిసిన రూట్…రెండోరోజుఆటలో సైతం అదే జోరు కొనసాగించాడు. డబుల్ సెంచరీతో ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన ఒకే ఒక్కడిగా నిలిచాడు.
ఇంగ్లండ్ 8 వికెట్లకు 555 పరుగుల భారీస్కోరు సాధించడం ద్వారా రెండోరోజుఆటను విజయవంతంగా ముగించింది.
ఒకే ఒక్కడు జో రూట్…
144 సంవత్సరాల టెస్టు చరిత్రలో …వందవ టెస్టు మ్యాచ్ ఆడుతూ డబుల్ సెంచరీ సాధించిన తొలి, ఒకే ఒక్క ఆటగాడిగా 30 సంవత్సరాల జో రూట్ చరిత్ర సృష్టించాడు.
Also Read : చెన్నైటెస్టు తొలిరోజున ఇంగ్లండ్ షో
తన కెరియర్ లోనే కళ్లు చెదిరే ఫామ్ లో ఉన్న రూట్…చెపాక్ వికెట్ పై భారత స్పిన్ త్రయాన్ని ఓ ఆట ఆడుకొన్నాడు. స్వీప్ షాట్లు, లాఫ్టెడ్ షాట్లతో చెలరేగిపోయాడు.
అంతకు ముందు ఓవర్ నైట్ స్కోరుతో రెండోరోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ కు కెప్టెన్ రూట్- ఆల్ రౌండర్ స్టోక్స్ కలసి నాలుగో వికెట్ కు మరో కీలక భాగస్వామ్యం అందించారు.
స్టోక్స్ మెరుపు బ్యాటింగ్…
సమకాలీన ప్రపంచ క్రికెట్ అత్యుత్తమ ఆల్ రౌండర్లలో అగ్రగణ్యుడిగా పేరుపొందిన బెన్ స్టోక్స్ సైతం తన బ్యాటుకు పూర్తిస్థాయిలో పని చెప్పాడు. రూట్ తో కలసి భారత బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. భారీషాట్లతో పరుగుల మోత మోగించాడు. ఈ ఇద్దరూ సాధించిన 124 పరుగుల భాగస్వామ్యం లో స్టోక్స్ సాధించినవే 82 పరుగులు ఉన్నాయి.
Also Read : శత టెస్టులో శతకవీరులు
స్టోక్స్ కేవలం 118 బాల్స్ లోనే 3 సిక్సర్లు, 10 బౌండ్రీలతో 82 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. మరోవైపు రూట్ మాత్రం బాధ్యతాయుతంగా ఆడుతూ తనజట్టు స్కోరు 500కు చేర్చడంలో ప్రధానపాత్ర వహించాడు. రూట్ మొత్తం 9 గంటలపాటు క్రీజునే అంటిపెట్టుకొని ఆడి 377 బాల్స్ ఎదుర్కొని 19 బౌండ్రీలు, ఓ సిక్సర్ తో 218 పరుగులతో డబుల్ సెంచరీ సాధించాడు. సిక్సర్ తో ద్విశతకం బాదిన తొలి ఇంగ్లండ్ క్రికెటర్ గా రికార్డుల్లో చేరాడు.
మూడుటెస్టుల్లో రెండో డబుల్ సెంచరీ…
జో రూట్ కు గత మూడుటెస్టుల్లో ఇది రెండో ద్విశతకం కావడం విశేషం. అంతేకాదు భారతగడ్డపైన అత్యధిక వ్యక్తిగత స్కోరు సాధించిన ఇంగ్లీష్ క్రికెటర్ గా నిలిచాడు. ప్రస్తుత చెన్నై టెస్టుతో 100 మ్యాచ్ లు పూర్తి చేసుకొన్నరూట్ కెరియర్ లో ఇది ఐదో డబుల్ సెంచరీగా నమోదయ్యింది. స్టోక్స్, రూట్ వికెట్లను లెప్టామ్ స్పిన్నర్ నదీమ్ పడగొట్టాడు.
Also Read : జంట రికార్డులకు ఇశాంత్ గురి
ఇంగ్లండ్ మిడిలార్డర్ ఆటగాళ్లలో బట్లర్ 30, పోపీ 34, ఆర్చర్ 0 పరుగులకు అవుటయ్యారు. లోయర్ ఆర్డర్ ఆటగాళ్లు బెస్ 28, లీచ్ 6 పరుగుల నాటౌట్ స్కోర్లతో క్రీజులో ఉన్నారు.
భారత బౌలర్లలో ఇశాంత్ , బుమ్రా, అశ్విన్, నదీమ్ తలో రెండు వికెట్లు పడగొట్టారు. ఇంగ్లండ్ జట్టు మూడోరోజు ఆటలో సైతం బ్యాటింగ్ కొనసాగించి…600 స్కోరుతో డిక్లేర్ చేస్తుందో….లేక…భారత బౌలర్లే చేలరేగి ఇంగ్లండ్ టెయిల్ ఎండర్లను పడగొడతారో వేచి చూడాల్సిందే.
Also Read : భారత గడ్డపై అతిపెద్ద టెస్ట్ సమరం