* 3-2తో సిరీస్ నెగ్గిన భారత్
* భారత్ 224, ఇంగ్లండ్ 188
ఇంగ్లండ్ తో ఐదుమ్యాచ్ ల టీ-20 సిరీస్ కు ఆతిథ్య భారత్ అద్దిరిపోయే ముగింపునిచ్చింది. సిరీస్ విజేతను నిర్ణయించే ఆఖరిమ్యాచ్ లో టాప్ ర్యాంక్ ఇంగ్లండ్ ను 36 పరుగుల తేడాతో చిత్తు చేసి 3-2తో విజేతగా నిలిచింది.
అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన హైస్కోరింగ్ ఆఖరిసమరంలో విరాట్ కొహ్లీ నాయకత్వంలోని భారతజట్టు రికార్డుల మోత మోగించింది. రికార్డుస్థాయిలో గత తొమ్మిది టీ-20 సిరీస్ ల్లో అజేయంగా నిలవడం ద్వారా ఎనిమిదో సిరీస్ సొంతం చేసుకొంది.
ఓపెనర్ గా విరాట్, తుదిజట్టులో నటరాజన్
సిరీస్ కే నిర్ణయాత్మకంగా మారిన ఈ ఆఖరిపోరాటంలో భారత్ వ్యూహం చక్కగా ఫలించింది. విరాట్ కొహ్లీ ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగటం, యార్కర్ల కింగ్ నటరాజన్ కు తుదిజట్టులో చోటు కల్పించడం, ఫెయిల్యూర్ హీరో రాహుల్ ను పక్కన పెట్టడం ఆశించిన ఫలితాన్ని ఇచ్చింది. వరుసగా రెండోసారి టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత ఇన్నింగ్స్ ను కెప్టెన్ కొహ్లీ- వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ ప్రారంభించారు. మొదటి వికెట్ కు 9 ఓవర్లలో94 పరుగుల మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు.
Also Read : టీ-20 సిరీస్ లో నేడే టైటిల్ ఫైట్
డాషింగ్ ఓపెనర్ రోహిత్ శర్మ భారీషాట్లతో ఇంగ్లండ్ పేస్ ఎటాక్ ను కకావికలు చేశాడు. గ్రౌండ్ నలుమూలలకూ బౌండ్రీలు,సిక్సర్ల షాట్లు కొట్టి ప్రత్యర్థి బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ కొట్టాడు. రోహిత్ కేవలం 34 బాల్స్ లోనే 4 బౌండ్రీలు, 6 సిక్సర్లతో 64 పరుగుల స్కోరుకు అవుటయ్యాడు. రోహిత్ స్థానంలో వచ్చిన సూర్యకుమార్ యాదవ్ సైతం.. అదే జోరు కొనసాగించడంతో భారత స్కోరుబోర్డు శరవేగంతో పరుగెత్తింది. సూర్యకుమార్ 17 బాల్స్ లో 32 పరుగులు, పాండ్యా 17 బాల్స్ లో 39 పరుగులు సాధించారు.
Also Read : సమఉజ్జీల సమరంలో ఆఖరాట
కొహ్లీ రికార్డు హాఫ్ సెంచరీ
భారత్ తరపున 2018 తర్వాత టీ-20 క్రికెట్లో తొలిసారిగా ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన విరాట్ 52 బాల్స్ లో 7 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 80 పరుగుల నాటౌట్ స్కోరు సాధించాడు. భారత టీ-20 ఓపెనర్ గా కొహ్లీకి ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం. భారత టాపార్డర్ ధూమ్ ధామ్ బ్యాటింగ్ తో 20 ఓవర్లలో 2 వికెట్లకు 224 పరుగుల భారీస్కోరు నమోదు చేయగలిగింది. ఇంగ్లండ్ ప్రత్యర్థిగా భారత్ కు ఇదే అత్యధిక స్కోరు కావడం మరో రికార్డు.
భువీ, శార్దూల్ షో
225 పరుగుల భారీలక్ష్యంతో చేజింగ్ కు దిగిన ప్రపంచ నంబర్ వన్ టీమ్ ఇంగ్లండ్..తొలిఓవర్ రెండో బంతికే డాషింగ్ ఓపెనర్ జేసన్ రాయ్ వికెట్ నష్టపోయింది. భారత ఓపెనింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ ఓ సూపర్ స్వింగర్ తో రాయ్ ను డకౌట్ చేయడం ద్వారా తనజట్టుకు చక్కటి ఆరంభాన్ని ఇచ్చాడు. అయితే…మరో ఓపెనర్ బట్లర్ తో కలసి వన్ డౌన్ డేవిడ్ మలాన్ రెండో వికెట్ కు 130 పరుగుల రికార్డు భాగస్వామ్యంతో గెలుపు ఆశలు చిగురింప చేశాడు.
Also Read : భారత వన్డేజట్టులో సూర్య, నటరాజన్
బట్లర్ 34 బాల్స్ లో 2బౌండ్రీలు, 4 సిక్సర్లతో 52 పరుగుల స్కోరుకు భువీ బౌలింగ్ లోనే అవుట్ కావడంతో ఇంగ్లండ్ పతనం ప్రారంభమయ్యింది.
మలాన్ కు శార్దూల్ పోటు
టీ-20ల్లోప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ఆటగాడు డేవిడ్ మలాన్ 46 బాల్స్ లో 9 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 68 పరుగుల స్కోరు తో ప్రమాదకరంగా పరిణమించిన తరుణంలో…శార్దూల్ ఠాకూర్ పడగొట్టాడు. ప్రస్తుత సిరీస్ లో మలాన్ కు ఇదే అత్యధిక వ్యక్తిగత స్కోరు కావడం విశేషం.
ఇంగ్లండ్ మిడిలార్డర్ పేకమేడలా కూలిపోడంతో భారత్ 36 పరుగుల భారీవిజయం తో సిరీస్ విజేతగా నిలిచింది. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 3 వికెట్లు, భువనేశ్వర్ కుమార్ 2 వికెట్లు, పాండ్యా, నటరాజన్ చెరో వికెట్ పడగొట్టారు.
Also Read : నాలుగో టీ-20లో సూర్యప్రతాపం
ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ కొహ్లీ
మొత్తం ఐదుమ్యాచ్ ల ఈ సిరీస్ లో మూడు హాఫ్ సెంచరీలతో సహా అత్యధిక పరుగులు సాధించిన భారత కెప్టెన్ విరాట్ కొహ్లీకి ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డు దక్కింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా స్వింగ్ బౌలర్ భువనేశ్వర్ కుమార్ అవార్డు అందుకొన్నాడు.
కొహ్లీ కెప్టెన్ గా భారత్ గత తొమ్మిది టీ-20 సిరీస్ ల్లో అజేయంగా నిలవడంతో పాటు…ఎనిమిదోసారి సిరీస్ విజేతగా నిలిచింది. ఐదుమ్యాచ్ ల సిరీస్ కు తెరపడడంతో…ఈనెల 23 నుంచి పూణే వేదికగా తీన్మార్ వన్డే సిరీస్ కు తెరలేవనుంది.