* సత్తా చాటిన బౌలర్లు, కెప్టెన్ విరాట్
* 1-1తో సమఉజ్జీలుగా భారత్, ఇంగ్లండ్
టీ-20ల్లో రెండు ప్రపంచ అత్యుత్తమ జట్లు ఇంగ్లండ్, భారత్ మధ్య జరుగుతున్న ఐదుమ్యాచ్ ల సమరం నీకొకటి నాకొటి అన్నట్లుగా సాగుతోంది. అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియం వేదికగా ముగిసిన కీలక రెండో టీ-20 మ్యాచ్ లో భారత్ దెబ్బతిన్న బెబ్బులిలా పోరాడి టాప్ ర్యాంకర్ ఇంగ్లండ్ ను 7 వికెట్లతో కంగుతినిపించడం ద్వారా తొలి ఓటమికి బదులు తీర్చుకొంది.
భళా… బౌలర్లు
తొలి టీ-20లో దారుణంగా విఫలమైన భారత బౌలర్లు రెండో మ్యాచ్ లో మాత్రం పూర్తిస్థాయిలో రాణించారు. పేస్ త్రయం భువనేశ్వర్ కుమార్, శార్దూల్ ఠాకూర్, హార్థిక్ పాండ్యా, స్పిన్ ద్వయం చహాల్, సుందర్ అంచనాలకు మించి రాణించారు. పవర్ ఫుల్ బ్యాటింగ్ లైనప్ కలిగిన ఇంగ్లండ్ ను 20 ఓవర్లలో 164 పరుగుల స్కోరుకే కట్టడి చేయగలిగారు.
Also Read : భారత్ కు నేడే అసలు పరీక్ష
వికెట్ లో ఆశించిన పేస్ లేకపోడాన్ని భారత పేస్ త్రయం చక్కగా సొమ్ము చేసుకోగలిగారు. బౌలింగ్ లో వైవిద్యాన్ని ప్రదర్శించారు. వేగం తగ్గించి మరీ స్లో బాల్స్ తో ఇంగ్లండ్ స్ట్ర్రోక్ మేకర్లను మట్టికరిపించారు.
ఓపెనర్ బట్లర్ డకౌట్ కాగా…మరో ఓపెనర్ రాయ్ 46 పరుగులకే చహాల్ బౌలింగ్ లో చిక్కాడు. స్టార్ ఆటగాడు, వన్ డౌన్ ప్లేయర్ మలాన్ 24, బెయిర్ స్టో 20, కెప్టెన్ మోర్గాన్ 28, ఆల్ రౌండర్ స్టోక్స్ 24 పరుగులు చేశారు. ఇంగ్లండ్ 20 ఓవర్లలో 6 వికెట్లకు 164 పరుగులు మాత్రమే చేయగలిగింది. భారత బౌలర్లలో ఠాకూర్ 2, చహాల్, సుందర్ చెరో రెండు వికెట్లు, భువనేశ్వర్ 1వికెట్ పడగొట్టారు.
Also Read : టీ-20ల్లో చహాల్ సరికొత్త రికార్డు
ఇషాన్ అరంగేట్రం అదుర్స్
అంతకుముందు టాస్ నెగ్గిన భారతజట్టు రెండుమార్పులతో బరిలోకి దిగింది. ఓపెనర్ శిఖర్ ధావన్, స్పిన్ ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ ల స్థానంలో ముంబై జోడీ.. ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ లను తుదిజట్టులోకి తీసుకొంది.
165 పరుగుల టార్గెట్ తో చేజింగ్ కు దిగిన భారత్ తొలి ఓవర్లోనే ఓపెనర్ రాహుల్ వికెట్ నష్టపోయింది. అయితే…యువఓపెనర్, ఐపీఎల్ స్టార్ ఇషాన్ కిషన్, కెప్టెన్ విరాట్ కొహ్లీ…రెండో వికెట్ కు 93 పరుగుల భాగస్వామ్యంతో విజయానికి మార్గం సుగమం చేశారు.
తన కెరియర్ లో తొలి అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్న ఇషాన్ తాను ఎదుర్కొన్న తొలిబంతి నుంచే ఇంగ్లండ్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. దూకుడుగా ఆడుతూ బౌండ్రీలు,సిక్సర్ల మోత మోగించాడు.కేవలం 32 బాల్స్ లోనే 5 బౌండ్రీలు, 4 సిక్సర్లతో 56 పరుగులకు అవుటయ్యాడు. అరంగేట్రం మ్యాచ్ లోనే ఇషాన్ అర్థశతకం బాదడం విశేషం.
గాడిలో పడిన విరాట్
మరోవైపు…వరుసవైఫల్యాలతో అయోమయంలో ఉన్న విరాట్ కొహ్లీ…తనదైన శైలిలో ఆడి…49 బాల్స్ లో 5 బౌండ్రీలు, 3 సిక్సర్లతో 73 పరుగుల నాటౌట్ స్కోరు తో నిలిచాడు. ఈ క్రమంలో విరాట్ టీ-20ల్లో 26వ హాఫ్ సెంచరీ సాధించడంతో పాటు…3వేల పరుగుల మైలురాయిని చేరిన తొలి క్రికెటర్ గా సరికొత్త రికార్డు నెలకొల్పాడు.
Also Read : డకౌట్ల ఊబిలో విరాట్ కొహ్లీ
మరో యువఆటగాడు రిషభ్ పంత్ 13 బాల్స్ లో 2 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 26 పరుగులు సాధించి అవుటయ్యాడు. చివరకూ భారత్ 17.5ఓవర్లలో 3 వికెట్లు మాత్రమే నష్టపోయి 7 వికెట్ల విజయంతో విజేతగా నిలిచింది. భారత్ విజయంలో ప్రధానపాత్ర వహించిన ఇషాన్ కిషన్ కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. సిరీస్ లోని మూడో టీ-20 సమరం మంగళవారం రాత్రి 7 గంటలకు ప్రారంభమవుతుంది.
Also Read : విరాట్ డక్… భారత్ ఫట్