• మూణ్ణాళ్ల ముచ్చటగా న్యూజిలాండ్ టాప్ ర్యాంక్
• మూడోర్యాంక్ కు పడిపోయిన ఆస్ట్రేలియా
విరాట్ కొహ్లీ నాయకత్వంలో చేజారిన భారత నంబర్ వన్ ర్యాంక్ ను… అజింక్యా రహానే కెప్టెన్సీలోని భారతజట్టు తిరిగి కైవసం చేసుకొంది. ఆస్ట్ర్రేలియాతో ముగిసిన నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ ను 2-1తో నెగ్గడం ద్వారా భారత్ తిరిగి మరోసారి టాప్ ర్యాంక్ లో నిలిచింది.
ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా భారత్ ఇప్పటి వరకూ ఆడిన ఐదు సిరీస్ ల్లో 9 విజయాలు, 3 పరాజయాలు, ఒకే ఒక్క డ్రాతో మొత్తం 430 పాయింట్లతో నంబర్ వన్ జట్టుగా నిలిచింది.
Also Read : ఆస్ట్రేలియా గడ్డపై భారత్ అద్భుత విజయం
రెండోర్యాంక్ లో కివీస్
నిన్నటి వరకూ నంబర్ వన్ ర్యాంకర్ గా ఉన్న న్యూజిలాండ్ 5సిరీస్ ల్లో 7 విజయాలు, 4 పరాజయాలతో మొత్తం 420 పాయింట్లతో రెండోర్యాంక్ లో కొనసాగుతోంది. కంగారూజట్టు మాత్రం 4 సిరీస్ ల్లో 8 విజయాలు, 4 పరాజయాలు, 2 డ్రాలతో సహా మొత్తం 332 పాయింట్లు సాధించి…మూడోర్యాంక్ కు పడిపోయింది. ఇంగ్లండ్ నాలుగు, సౌతాఫ్రికా 5, పాకిస్థాన్ 6, శ్రీలంక 7, వెస్టిండీస్ 8, బంగ్లాదేశ్ 9 ర్యాంకుల్లో కొనసాగుతున్నాయి.
ఐసీసీ జనవరి 19న ప్రకటించిన టెస్ట్ తాజా ర్యాంకింగ్స్ తో భారత్ మరోసారి ప్రపంచ నంబర్ వన్ టెస్టుజట్టుగా నిలువగలిగింది.గతంలో మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కొహ్లీల నాయకత్వంలో ప్రపంచ నంబర్ వన్ ర్యాంక్ ను సాధించిన భారతజట్టు…2021 సీజన్లో మాత్రం అజింక్యా రహానే కెప్టెన్సీలో టాప్ ర్యాంక్ కైవసం చేసుకోడం విశేషం.
Also Read : గెలుపంటే ఇదేరా!
4 టెస్టుల మొనగాళ్లు ఇద్దరే
2020-21 సిరీస్ కోసం ఆస్ట్ర్రేలియా పర్యటను 22 మంది సభ్యులతో వెళ్లిన భారత జట్టు తరపున నాలుగుమ్యాచ్ ల టెస్టు సిరీస్ లో మొత్తం 20 మంది ఆటగాళ్లు పాల్గొన్నారు. వీరిలో మహ్మద్ షమీ, ఉమేశ్ యాదవ్, బుమ్రా, అశ్విన్, హనుమ విహారి, రాహుల్ , జడేజా గాయాలపాలయ్యారు. అయితే…సిరీస్ లోని మొత్తం నాలుగు టెస్టులు ఆడిన ఘనతను మాత్రం కెప్టెన్ అజింక్యా రహానే, వన్ డౌన్ ఆటగాడు చతేశ్వర్ పూజారా మాత్రమే దక్కించుకొన్నారు.
యువఆటగాళ్లకు టెస్ట్ క్యాప్ లు
యువక్రికెటర్లు శుబ్ మన్ గిల్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్,నటరాజన్ , నవదీప్ సైనీ ఆసీస్ తో సిరీస్ ద్వారా టెస్ట్ క్యాప్ లు అందుకోగలిగారు.