Saturday, December 21, 2024

రాజ్యాంగ ఆదేశిక సూత్రాలు గాలిలో పోతూంటే నరహంతలు ధరాధిపతులై చరిత్రమున ప్రసిద్ధికెక్కిరి

అయిదేళ్ల ఆధిపత్యపు లైసెన్సులను ఓటర్లు సారా చిత్తులో, మతం మత్తులో, ధనం గమ్మత్తులో, ఫేక్ న్యూస్ విజృంభించే వాట్సప్ గ్రూపుల విపత్తులో పడిపోయి ఓట్ల రూపంలో సమర్పించుకుంటున్నదశ ఇది.

నరజాతి చరిత్ర సమస్తం పరస్పర హరణోద్యోగం:

రణరక్త ప్రవాహసిక్తంబీభత్సరస ప్రధానం.

నరహంతలు ధరాధిపతు లైచరిత్రమున ప్రసిద్ధికెక్కిరి

దేశం కోసం భాష కోసం, ప్రాంతం కోసం, దేనికైనా మనం కోట్టుకొవచ్చు.

Also read: మనకు మనము సమర్పించు గణతంత్ర రాజ్యాంగం

మన రాజ్యాంగానికి శ్రీశ్రీ మాట ఒకటి అతికిస్తాం. ఇండియా దటీజ్ భారత్ అని మన తొలి అధికరణం సంవిధాన రచన ఆరంభమవుతుంది. ఆర్టికిల్ 1 సంఘం పేరు ప్రాదేశిక పరిధి: (1) ఇండియా అంటే భారత్ రాష్ట్రాల సంఘమై ఉంటుంది.  (2) రాష్ట్రాలు వాటి ప్రాదేశిక పరిధులను తొలి షెడ్యూలులో వివరిస్తారు. (3) ఈ ఇండియా పరిధిలో ఉండేవేవంటే (ఎ) అయారాష్ట్రాల పరిధి, (బి) తొలి షెడ్యూల్ లో పేర్కొన్న కేంద్ర పాలిత ప్రాంతాల పరిధి, (సి) భవిష్యత్తులో స్వాధీనంచేసుకోబోయే ప్రాంతాలు ఏవైనా ఉంటే అవి.

తొలి షెడ్యులులో పార్ట్ ఎ, బి, సి, డి అనే నాలుగు వర్గాల రాష్ట్రాలను వాటి పరిధులను పేర్కొన్నారు. (ఎ) భాగంలో బ్రిటిష్ ఇండియాలోని తొమ్మిది ప్రొవిన్స్ లు, (బి) లో స్వతంత్ర రాజ్యాలు, (సి)లో  కేంద్రపాలనలో ఉన్న అయిదు రాష్ట్రాలు, (డి) అండమాన్ నికోబార దీవులు. ఏడో రాజ్యాంగ సవరణ (1956 ద్వారా పార్ట్ (ఎ) (బి) ల మధ్య తేడాను తొలగించారు. తరువాత రాష్ట్రాలను భాషా ప్రాతిపదికన పునర్నర్మించారు.

ఒకే భాష మాట్లాడే వారంతా ఒకే రాష్ట్రంలో ఉండాలన్న మాట వెనుక హేతుబద్ధత ఏదీ లేదనే విమర్శలకు గురైన విధానం ఇది. అయిదారు రాష్ట్రాలలో హిందీ మాట్లాడతారు. వాటన్నిటిని కలపడం భావ్యమా? తెలుగు మాట్లాడే రాష్ట్రాలు రెండు ఉంటే తప్పేమిటి అనే వాదం కూడా తెలంగాణ ఏర్పాటు కారణాల్లో ఒకటి. 1950లో లేని అనేక కొత్త రాష్ట్రాలు వచ్చాయి. తెలంగాణ 2014లో ఏర్పడిన కొత్త రాష్ట్రం. కాని జమ్ము కాశ్మీర్ అనే రాష్ట్రాన్ని 2019లో రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విడగొట్టారు.

Also read: 3 రాజ్యాంగ పీఠిక, పాట కాదు ఒక పాఠం, ఒక ప్రతిజ్ఞ

పిశాచగణ సమవాకారం:

నరజాతి చరిత్ర సమస్తం

దరిద్రులను కాల్చుకు తినడం

బలవంతులు దుర్బల జాతిని

బానిసలను కావించారు:

శ్రీశ్రీ చెప్పిన మరోమాట ఇది. పేరు కోసం కోట్లాటలు.

భారత్ అని ఇండియాను పిలవాలంటూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం 2016లో దాఖలైంది. మన రాజ్యాంగంలో మన దేశానికి భారత్ అనీ ఇండియా అనీ రెండు పేర్లున్నాయి. భారత స్వాతంత్ర్యపోరాటంలో మంత్ర వాక్యం – భారత్ మాతాకీ జై. అందులోంచి భారత్ అన్న పేరును స్వీకరించారు.  ప్రతి భారతీయుడికి ఈ రెండు పేర్లలో ఒక పేరును ఎంచుకునే హక్కు ఉందని ఆనాటి ప్రధాన న్యాయమూర్తి టి ఎస్ ఠాకూర్ అంటూ ఈ పిటిషన్ ను కొట్టి వేసారు. ఈ దేశాన్ని ఏమని పిలవాలో నిర్ణయించే నిరంకుశాధికారం సుప్రీంకోర్టుకు లేదని ఆయన అన్నారు.  మతం మత్తు, ఫేక్ న్యూస్ తో కొత్త రోగాలు ఇవి అంటాడు శ్రీశ్రీ పేరే వేరేదయినా.

జెంఘిజ్‌ఖాన్‌, తామర్లేనూ,నాదిర్షా, ఘజ్నీ, ఘోరీ,

సికిందరో ఎవడైతేనేం?ఒక్కొక్కడూ మహాహాంతకుడు

మతం మత్తు, ధనం గమ్మత్తు, ఫేక్ న్యూస్

1950 నుంచి వచ్చే గణతంత్రం 74వ నుంచి 75 కు వెళుతున్నదశ. గణతంత్రం ఉందా లేదా అన్నట్టు ఊగిసలాడుతున్న తరుణంలో మన భారతం స్వాతంత్ర్య అమృతోత్సవ సంవత్సరంలోకి దాటి పోయిన సందర్భం ఇది. మాయమాటలకు, పనికిరాని ఉచిత కానుకల వాగ్దానాలకు లొంగిపోయి అయిదేళ్ల ఆధిపత్యపు లైసెన్సులను ఓటర్లు సారా చిత్తులో, మతం మత్తులో, ధనం గమ్మత్తులో, ఫేక్ న్యూస్ విజృంభించే వాట్సప్ గ్రూపుల విపత్తులో పడిపోయి ఓట్ల రూపంలో సమర్పించుకుంటున్నదశ ఇది.  74 ఏళ్లు గణతంత్రఫలాలను చవిచూచిన జాతి, దాదాపు ఆ మహాత్యాగాలను, విషమపోరాట విషయాల్ని మరిచిపోయింది.

రాజ్యాంగం అమలులోకి వచ్చిన మొదటి మూడు దశాబ్దాలు వివిధ రాజకీయ పార్టీలలో సేవా దృక్పథం కలవారు, రాజకీయాలను పూర్తికాలపు వృత్తిగా స్వీకరించిన వారు పోటీ చేసి ప్రజాప్రతినిధులుగా ఎన్నికయ్యేవారు. కానీ ఆర్థిక సంస్కరణల తర్వాత రాజకీయాలు కార్పొరేటీకరణ చెంది, ప్రధాన రాజకీయ పార్టీలలో కార్పొరేట్‌ ప్రతినిధులు వ్యాపారవేత్తలు, ప్రజా ప్రతినిధులుగా పోటీ చేస్తున్నారు. లోకసభకు రూ. 100 కోట్లు, శాసనసభకు రూ.25 కోట్లకు పైగా ఖర్చు చేసేవారు మాత్రమే పోటీ చేయాలని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. గెలుపొందిన వారు వ్యాపారం చేసుకుంటూ తమ పదవిని వ్యాపార ప్రయోజనాలకు వినియోగించుకుంటున్నారు. దీని వలన నిజాయితీపరులు, సామాజికవేత్తలు, వామపక్ష ప్రజా దృక్పథం కలిగిన వారు ఎన్నికలలో పోటీ చేయలేకపోతున్నారు. రాజ్యాంగమే సర్వోన్నతం భారతదేశంలో రాజ్యాంగమే సర్వోన్నతమైనది. అన్ని వ్యవస్థలు, సంస్థలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా పని చేయాలి. డాక్టర్‌ బి.ఆర్‌.అంబేద్కర్‌ 1949 నవంబర్‌ 26న కింది విధంగా పేర్కొన్నారు. ‘ఒక రాజ్యాంగం ఎంత మంచిదైనా, గొప్పదైనా కావచ్చు, కాని దానిని అమలు చేసేవాళ్లు చెడ్డవాళ్లయితే అది పనిచేయదు’ అని చెప్పారు.కె.యస్.లక్ష్మణరావు, శాసనమండలి సభ్యులు.

పంద్రా ఆగస్టు నాడు జెండా ఎగరేయడానికి తీరిక చేసుకునే వారికన్న, జెండా ఎగరేసి నమస్తే పెట్టని వాడెవడో చూసి తీరిగ్గా తన్నేవారు ఎక్కువై, రకరకాల దేశభక్తులు చెలరేగుతున్న అమృత ఘడియలు ఇవి.

Also read: సంవిధానం పీఠిక చదివితే నేరమా ఓ విధానమా?

భారత రాజ్యాంగం చెక్కు చెదరకుండా ఉన్నట్టే ఉంది గాని, ఆదేశిక సూత్రాలు గాలిలో తేలిపోతున్నాయి. సుపరిపాలన సుడిగాలిలో కొట్టుకుపోతున్నది. పార్లమెంట్ నేల నుంచి సౌత్ బ్లాక్ నార్త్ బ్లాక్ దాటి రాష్ట్రపతి భవనం గేటుకు కొట్టుకుని, ఇటు కిందికి కన్యాకుమారి దాకా సంవిధాన నీతి పవనాలు వీచడం లేదు. పెగసస్ గందరగోళంలో పడి ప్రతిపక్షం గడబిడలో ఉంటే బిల్లులు మాత్రం లోకసభ చిల్లుల్లోంచి బయటపడి చట్టాలవుతున్నాయి. 

రణరంగం కానిచోటు భూస్థలమంతా వెదికిన దొరకదు గతమంతా తడిసె రక్తమున,కాకుంటే కన్నీళ్ళతో చల్లారిన సంసారాలూ మరణించిన జన సందోహం అసహాయుల హహాకారం చరిత్రలో నిరూపించినవి  ఈ నేరగాళ్ల గురించే శ్రీశ్రీ ఇదే రాస్తున్నాడనిపిస్తుంది కదూ.

నేరగాళ్లు నిండిన చట్ట సభల గొంగట్లో

నేరగాళ్లు నిండిన చట్ట సభల గొంగట్లో సమన్యాయ విలువలకోసం మనం వెతుక్కుంటున్నాం.  భాప్రన్యా (సిజెఐ) అంటే భారత ప్రధాన న్యాయమూర్తి మీద లైంగిక వేధింపుల ఫిర్యాదు చేసిన మహిళపైన, ఆమె బంధువుల పైన పెగసస్ నిఘా పెట్టి కోర్టు ధిక్కారం కాకుండా న్యాయవ్యవస్థ పరువును జాగ్రత్తగా కాపాడుకున్నాం. దుశ్శాసన సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం కాదు. సర్వోన్నత ధర్మాసన వాకిట్లో న్యాయానికి మానహాని.  తరువాత న్యాయం రాజ్యసభలో ప్రవేశించింది.  సభాధ్యక్షుడి కంట కన్నీరై ప్రవహించింది. కోట్లరూపాయలు చెల్లించి మరీ నిఘా సమాచారాన్ని కొన్నవారికి ఎన్నివేల కోట్ల రూపాయల ప్రయోజనాలో అనడిగితే రాజద్రోహమేనంటారా?

ప్రయివసీ అనేది ప్రాథమిక హక్కుల సమాహారం అని నవన్యాయమూర్తిత్వ ధర్మాసనం తీర్పు. పౌరహక్కులలో సరికొత్త చారిత్రాత్మక విప్లవం అని సంతోషించారేగాని, అంతటి ప్రయివసీని జాతీయ స్థాయిలో ఒక విదేశీ కార్పొరేట్ శక్తి టోకున బలి చేస్తే,  రాష్ట్ర ప్రభుత్వాలను పడగొట్టడమే మా రాజకీయం అని చాటుకుంటూ ఉంటే ప్రయివసీ నాశనం అయిందని సంతాప సభలైనా పెట్టారా?  

బ్రిటిష్ జడ్జి మన మహాత్మాగాంధీ మీద రాజద్రోహం కేసులో శిక్ష వేయవలసి వస్తున్నందుకు బాధ పడ్డారట. వేలాది మంది భారతీయుల మీద మన సొంత భారతీయ ప్రభుత్వం 98 శాతం నకిలీ రాజద్రోహం కేసులు పెట్టినందుకు సిగ్గుపడే అర్హతైనా ఉందా?  బ్రిటిష్ వాడు కూడా అచ్చెరువందే విధంగా ఆనాటి అరాచకపు దుర్మార్గ చట్టాలను నిస్సిగ్గుగా వాడుకుంటున్నామే.

పాపం ఎ.డి.ఆర్. (అసోసియేషన్ ఫర్ డెమాక్రాటిక్ రిఫార్మ్స్)వారు లెక్కలు వేయడానికి తప్ప లక్షల మంది అభ్యర్థుల ప్రమాణ పత్రాల వల్ల ఏం ప్రయోజనం. ఓటర్లకు అభ్యర్థుల గురించి తెలుసుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పిన తరువాత ప్రతి నేరగాడూ, సారీ… ఎన్నికల్లో పోటీ చేసే ప్రతి అభ్యర్థీ తన నేరాల చిట్టాలు, స్థిరచరాస్తులు నోట్ల కట్టల కొట్టాలు, చదువుకొన్న (కొనని) పట్టాల వివరాలతో ఇచ్చిన ప్రమాణ పత్రాలు అట్లా పడి ఉన్నాయి. ఓటర్లకూ పట్టవు, రాజకీయ పార్టీలకూ పట్టవు.

అహో మన మహాభారతం. 539 మంది లోకసభసభ్యులు ఎన్నికైతే వారిలో 233 మంది నేరాలకేసుల్లో తిరిగే వారే. ఎపి అసెంబ్లీకి 174 మంది ఎన్నికైతే అందులో 151 మందిమీద నేరకేసులున్నాయి. తెలంగాణ అసెంబ్లీలో 119 మంది ఎన్నికైతే వారిలో 73 మందిది రక్తచరిత్రే.  ఏ నేరం చేయని వాడైతే ఎన్నికలో గెలిచే అవకాశాలు 4.7 శాతమేనట. అదే నేరచరిత్రగలఅభ్యర్థికి మాత్రం ఎన్నికల్లో గెలిచే అవకాశాలు 15.5 శాతమట. ఇదీ మన ఓటర్ల రీతి, నీతి. ఎవరు సిగ్గు పడాలి? ఎక్కడ సిగ్గు పడాలి? ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, నేరగాళ్లకు టికెట్ ఇవ్వని పార్టీయే లేదు మన దేశంలో. ఆర్టికిల్ 14 కింద అంతా సమానమే అంటే ఇదేనేమో.

చిల్లర దొంగతనం చేసిన వారి కేసులను సత్వరం విచారణ చేయనవసరం లేదట. పాతికేళ్ల పడుచును మొగుడు మోసం చేస్తే విడాకుల కేసు వినడానికి ముఫ్పయ్ ఏళ్లు వాయిదా వేస్తే దేశానికి ఏమీ నష్టం లేదుట. ఆమె రెండో పెళ్లి సంగతి దేశానికేం పట్టింది.  కాని 43 శాతం ప్రజాప్రతినిధులమీద ఉన్న తీవ్రనేరాలను త్వరగా విచారణ జరపకపోతే మనదేశ రాజ్యాంగ సంవిధాన సుపరిపాలనా వ్యవస్థ కుప్పగూలిపోతుందిట. కనుక సత్వర విచారణా హక్కు నేరగాళ్లయిన చట్టసభ్యులకు మాత్రమే ముందు ఇస్తాం. అరవై ఏళ్లు దాటిన వాడికి ముందు కరోనా టీకా వేసినట్టు, లాక్ డవున్ మినహాయింపు సారా బ్రాందీషాపులు తెరవడంతో మొదలయినట్టు, ముందు ప్రజాప్రతినిధులపై ప్రత్యేక కోర్టులు రోజువారీ కేసులు విని వారికి ఆర్టికిల్ 21 కింద సత్వర న్యాయం హక్కును అందేట్టు చూస్తారు. ఇతర కోట్లాది నేరస్తులకు సత్వర నిర్ధారణ హక్కుకు తొందరెందుకండీ?

నిజంగా సుప్రీంకోర్టు కనుసన్నలలో, హైకోర్టు ధర్మపర్యవేక్షణలో ప్రత్యేక కోర్టులన్నీ శరవేగంగా పనిచేసి,  న్యాయమూర్తులను ప్రభుత్వం వారు బదిలీ చేయకుండా కాపలా కాస్తుండగా, తమ మీద తమ కేసులను తామే ఉపసంహరించుకోకుండా హైకోర్టు కొరడా పట్టుకుని చూస్తుండగా, లోకసభలో 233 మందితోపాటు అనేకానేక శాసనసభల్లో వేలాదిమంది ప్రజాప్రతినిదుల్లోని సగం మంది నేరగాళ్లే అని రుజువైపోయి జైళ్లకు వెళ్లిపోతే ఈ దేశం ఏమయిపోతుంది? చట్టసభలన్నీ ఖాళీ అయిపోవూ. జైళ్లలో శీతాకాల సమావేశాలు జరుపుతారా? నేరం రుజువైతే జీవిత కాలం నిషేధం విధించాలని అధికార పార్టీ నాయకుడొకాయన పిల్ లో కోరుతున్నాడు. అదే జరిగితే రాజకీయ పార్టీల గతేమిటి. కొత్త నేరగాళ్లు తొందరగా దొరుకుతారా? లేకపోతే ఎవరు పోటీచేస్తారు? కొంపదీసి మేమేనేరమూ చేయలేదనే ప్రమాణ పత్రాలే వస్తాయా? అప్పుడు ఎడిఆర్ బతుకు ఎడారేనా? నేరగాళ్లకే ఓట్లేసే అలవాటున్న ఓటర్లంతా ఏమై పోవాలి? ఓ అమృత వత్సర స్వతంత్ర భారతదేశమా చెప్పు-అచ్చమైన జనంతో స్వచ్ఛమైన భారతం ఎప్పుడొస్తుందో!

Also read: అంబేడ్కర్ రాజ్యాంగ నిర్మాతా? రచయితా?

(ఇప్పటికింతేే)

మాడభూషి శ్రీధర్ 31.1.2024

Prof M Sridhar Acharyulu
Prof M Sridhar Acharyulu
ప్రొఫెసర్ మాడభూషి శ్రీధర్ ఆచార్యులు హైదరాబాద్ లోని మహేంద్ర విశ్వవిద్యాయలంలో డీన్, న్యాయశాస్త్ర ఆచార్యులు. అంతకు పూర్వం కేంద్ర సమాచార కమిషనర్ గా పని చేశారు. ఇంగ్లీష్ లో, తెలుగులో బహుగ్రంథ రచయిత.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles