- డిప్యూటీ స్పీకర్, దేశాధ్యక్షుడి సహకారంతో బయటపడిన ఇమ్రాన్
- షరీఫ్, భుట్టో కుటుంబాల నేతృత్వంలోని ప్రతిపక్షాల సమైక్య పోరాటం
సరిగ్గా మూడు దశాబ్దాల కిందట 1992లో పాకిస్తాన్ కు ఏకైక ప్రపంచ క్రికెట్ కప్ ను సాధించి పెట్టిన మేటి కెప్టెన్ ఇమ్రాన్ ఖాన్ రాజకీయరంగంలో కూడా ఎత్తులు పైఎత్తులు వేసి ప్రత్యర్థులను చిత్తు చేశాడు. తనపైన ఉన్న అవిశ్వాస తీర్మానం చెల్లనేరదంటూ డిప్యూటీ స్పీకర్ ఖాసి సూరి చేత చెప్పించి ఆ ప్రమాదం నుంచి బయటపడ్డాడు. ఆ తర్వాత దేశాధ్యక్షుణ్ణి ఒప్పించి నేషనల్ అసెంబ్లీని (పార్లమెంట్ ని)రద్దు చేయించాడు. మూడు మాసాలలోగా ఎన్నికలకు రంగం సిద్ధం చేశాడు. ఆపద్ధర్మ ప్రధానిగా తానే ఉంటున్నాడు. ఖంగు తిన్న ప్రతిపక్షం సుప్రీంకోర్టు తలుపులు తట్టింది.
ఈ రోజు ఉదయం అసెంబ్లీ సమావేశానికి ఇమ్రాన్ డుమ్మా కొట్టాడు. శనివారం తన అభిమానులకు వీధులలోకి రావలసిందంటూ ఇచ్చిన పిలుపును పురస్కరించుకొని వీధులను నింపిన అభిమానులతో మాట్లాడారు. దేశ ప్రజలను ఉద్దేశించి క్లుప్తంగా ప్రసంగించారు. ‘పాకిస్తాన్ వెలుపల జరిగిన కుట్రలో భాగంగా నన్ను గద్దె దించాలని దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నిస్తున్నాయి. వారికి అండదండగా అమెరికా ఉంది. మీకు ఇష్టమైన ప్రభుత్వాన్ని మీరు ఎన్నుకునే విధంగా ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించాం,’అని ప్రజలకు చెప్పాడు. అంతకు ముందు భారత్ ను బేషరతుగా సమర్థిస్తున్న ఒకానొక అగ్రరాజ్యం తనను వ్యతిరేకిస్తున్నదంటూ ఆరోపించారు. ప్రపంచ వ్యవహారాలలో చైనా,రష్యాలను కాదని యూరప్ నీ, అమెరికానూ బలపరచడం లేదనే దుగ్థతో తనను గద్దె దింపాలని ప్రయత్నాలూ, కుట్రలూ జరుగుతున్నాయని ఆరోపించారు.
నిజానికి, 342 మంది సభ్యులున్నజాతీయ అసెంబ్లీలో ఇమ్రాన్ ఖాన్ నాయకత్వంలోని తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ పార్టీకి మెజారిటీ పోయింది. ఇమ్రాన్ ఖాన్ ని బలపరచిన ఒక పక్షంతో పాటు స్వపక్షానికి చెందిన డజను మంది ఎంపీలు తిరుగుబాటు చేశారు. ప్రతిపక్షాలతో చేతులు కలిపారు. రెండు వంశాల అధినాయకులు నడుపుతున్న రెండు ప్రతిపక్ష పార్టీలు – నవాజ్ షరీఫ్ తమ్ముడూ, కుమార్తె మరియం నడుపుతున్న పాకిస్తాన్ ముస్లిం లీగ్ –ఎన్ ఒకటి, భుట్టో మనుమడు,బేనజీర్ కుమారుడు బిలావల్ భుట్టో జర్దారీ నడుపుతున్న పాకిస్తాన్ పీపుల్స్ పార్టీలు ప్రబల శత్రువులు. ఒకరంటే ఒకరికి పడదు. అటువంటిది రెండు పార్టీలనూ పూర్వపక్షం చేసి ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి రావడంతో రెండు ప్రతిపక్షాలూ ఇమ్రాన్ కు వ్యతిరేకంగా చేతులు కలిపాయి. రేపు ఎన్నికలలో ఏమి జరుగుతుందో తెలియదు. పంజాబ్ లో ముస్లిం లీగ్ కు ఆధిక్యం ఉండగా, కరాచీ, ఇతర ప్రాంతాలలో పీపుల్స్ పార్టీకి బలం ఉంది. ఇమ్రాన్ ఖాన్ కి దేశవ్యాప్తంగా మద్దతుదారులు ఉన్నారు. అతడు జనాకర్షణ కలిగిన నాయకుడు.
డిప్యూటీ స్పీకర్ రాజ్యాంగ విరుద్ధంగా అవిశ్వాస తీర్మానాన్ని తిరస్కరించారంటూ రెండు ప్రతిపక్ష నాయకులు బైఠాయింపు చేశారు. తమ లాయర్లను సుప్రీంకోర్టుకు పంపించారు. ‘‘ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘించింది. అవిశ్వాస తీర్మానంపైన ఓటింగ్ పెట్టలేదు. సమైక్య ప్రతిపక్షం పార్లమెంటును విడిచి వెళ్ళదు,’ అంటూ బిలావల్ భుట్టో జర్దారీ ప్రకటించారు.