పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో శుక్రవారంనాడు కశ్మీర్ విషయం ప్రస్తావించినందుకు భారత శాశ్వత ప్రతినిధి స్నేహాదుబే సముచితమైన, దీటైన సమాధానం ఇచ్చారు. కశ్మీర్ లో మానవహక్కుల హననం జరుగుతున్నదనీ, కశ్మీర్ ప్రజలు గౌరవించే వేర్పాటువాద నాయకుడు సయ్యద్ అలీ గిలానీ చనిపోయినప్పుడు సవ్యంగా అంత్యక్రియలు జరగలేదనీ ఇమ్రాన్ ఖాన్ ముందే రికార్డు చేసిన ప్రసంగంలో విమర్శించారు. గిలానీకి పద్ధతి ప్రకారం అంత్యక్రియలు నిర్వహించవలసిందిగా ఇండియాకు చెప్పాలని ఆయన కోరారు. నిరుడు 370 వ అధికరణను రద్దు చేయడాన్ని ప్రశ్నించారు. పాకిస్తాన్ ఎప్పుడూ శాంతినే కోరుకుంటున్నదనీ, దానికి అనువైన చర్యలు తీసుకోవలసిన బాధ్యత భారత్ దేననీ ఆయన వ్యాఖ్యానించారు.
ఇందుకు సమాధానం చెప్పే హక్కును వినియోగించుకుంటా స్నేహ దుబే, పాకిస్తాన్ నాయకులకు ఐక్యరాజ్య సమితి వేదికలను దుర్వినియోగం చేయడం, భారత్ కు వ్యతిరేకంగా కట్టుకథలు చెప్పడం, విషప్రచారం చేయడం అలవాటేనని అన్నారు. జమ్మూ-కశ్మీర్, లధాఖ్ కేంద్రపాలిత ప్రాంతాలూ, పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న ప్రాంతాలు కూడా భారత్ లో విడదీయలేని అంతర్భాగాలేనని ఆమె పునరుద్ఘాటించారు. ఇండియా అంతరంగిక విషయాలను ఐక్యరాజ్య సమితి వేదికలపైన ప్రస్తావించడం పాకిస్తాన్ కు కొత్త కాదనీ, ఇండియా బహుళత్వంలో విశ్వాసం కలిగిన ప్రజాస్వామ్య దేశమనీ, మైనారిటీలు గణనీయంగా ఉన్నదేశమనీ, మైనారిటీలకు చెందిన వారు దేశంలోని అత్యున్నత పదవులను అలంకరించారనీ స్నేహ చెప్పారు. పాకిస్తాన్ లో నెలకొన్న భయంకరమైన పరిస్థితుల నుంచి ప్రపంచం దృష్టిని మరల్చడానికి ఇమ్రాన్ తంటాలు పడుతున్నారనీ, పాకిస్తాన్ లో ఉగ్రవాదులకు అతిథి మర్యాదలు జరుగుతున్నాయనీ,వారికి ఆయుధాలు, శిక్షణ కూడా లభిస్తోందనీ, ఉగ్రవాదానికి పాకిస్తాన్ అడ్డా అన్న విషయం ప్రపంచం అంతటికీ తెలుసుననీ స్నేహ విమర్శించారు. ఒక వైపు ఉగ్రవాదాన్ని పెంచిపోషిస్తున్న పాకిస్తాన్ లో సాధారణ ప్రజలు కనీసావసరాలు లేక విలవిలలాడుతున్నారనీ, అక్కడ మైనారిటీల పని మరీ అధ్వానంగా ఉన్నదనీ ఆమె దుయ్యపట్టారు. పాకిస్తాన్ తోనూ, ఇతర పొరుగుదేశాలతోనూ సత్సంబంధాలను ఇండియా ఆకాంక్షిస్తున్నదనీ, అందుకు తగిన వాతావరణాన్ని సృష్టించవలసిన బాధ్యత పాకిస్తాన్ దేననీ, ముందు ఉగ్రవాదులు సీమాంతర దాడులకు తన భూభాగాన్ని వినియోగించుకోకుండా అరికట్టాలని అన్నారు.