Thursday, November 7, 2024

పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ కు ఎసరు

  • అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు
  • విదేశీ సొమ్ము అండతో కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ వాదన
  • 31న చర్చ చేపట్టనున్నట్టు సభాపతి వెల్లడి

పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై ప్రతిపక్షాలు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టాయి. ఆయనను పదవి నుంచి ఎలాగైనా దింపాలనే చర్యలు వేగవంతమవుతున్నాయి. ప్రతిపక్షాలతో పాటు, కొందరు స్వపక్షీయులు కూడా ఇమ్రాన్ ను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారనే  ప్రచారం జరుగుతోంది. ఇదంతా విదేశీయుల కుట్ర,అని ఆయన వ్యాఖ్యానం చేస్తున్నారు.

Also read: తెలుగు తేజాన్నిచాటిన త్రిబుల్ ఆర్

ఇమ్రాన్ కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలూ, సైన్యం అడుగులు

పైకి మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నా ఇమ్రాన్ లో పదవి పోతుందనే భయం అలుముకుందనే మాటలు వినపడుతున్నాయి. ఆ దేశ సైన్యం కూడా ఆయనను పదవి నుంచి దించాలని చూస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. పాకిస్థాన్ లో మొత్తం సభ్యుల సంఖ్య 342. అధికారాన్ని కాపాడుకోవాలంటే 172 మంది సభ్యుల మద్దతు అవసరం. ఇమ్రాన్ ఖాన్ సారథ్యంలోని ‘పాకిస్థాన్ తెహ్రీక్ ఏ ఇన్సాఫ్’ (పీటీఐ)కి సొంతంగా 155 మంది సభ్యుల బలం మాత్రమే ఉంది. కొన్ని ఇతర రాజకీయ పార్టీల సభ్యుల మద్దతును కూడగట్టుకొని 2018లో ఇమ్రాన్ ఖాన్ అధికారంలోకి వచ్చారు. అభ్యుదయంతో కూడిన ‘నయా పాకిస్థాన్’ ను నిర్మిస్తానని ప్రజలకు మాట ఇచ్చి అధికారంలోకి వచ్చారు. ఆచరణలో అంతా శూన్యమే కనిపిస్తోంది. ఆర్ధిక సంక్షోభం ఆకాశాన్ని అంటింది. ద్రవ్యోల్బణం బాగా పెరిగిపోయింది. కరోనా దుష్ప్రభావంతో అన్ని రంగాలు మరింత కుదేలైపోయాయి. ప్రబలిన నిరుద్యోగం, పెరుగుతున్న ధరలు, ప్రగతిశూన్యత  మొదలైనవాటితో ఇమ్రాన్ ప్రభుత్వం ఘోరంగా వైఫల్యం చెందినట్లు ప్రజలు భావనలోకి వచ్చారు. దానికి తోడు విపక్షాల విమర్శలతో ప్రభుత్వ ప్రతిష్ఠ మసకబారడం ప్రారంభమైంది. పాక్ సైన్యంలో చీలిక తెచ్చే దిశగా సోషల్ మీడియా ద్వారా పెద్ద ఎత్తున ప్రయత్నం చేశారని వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో, ప్రధాని ఇమ్రాన్ పట్ల సైన్యం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీటన్నిటి నేపథ్యంలో, ప్రతిపక్ష నేత షెహబాబ్ షరీఫ్ అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు. ఓటింగ్ ప్రక్రియ కూడా మొదలైంది.ఓటింగ్ లో అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా 161మంది సభ్యులు ఓటేశారు. దీనిపై ఈ నెల 31 వ తేదీన చర్చ చేపట్టనున్నట్లు డిప్యూటీ స్పీకర్ వెల్లడించారు.

Also read: ఆదిత్యనాథ్ యోగిమహరాజ్ దిగ్విజయం

సొంతపార్టీవారే సెగపెట్టారు

ఇమ్రాన్ సొంత పార్టీకి చెందిన 24 మంది ఎంపీలు సైతం అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా మద్దతు ప్రకటించినట్లు తెలుస్తోంది. ఇక ఇమ్రాన్ ఖాన్ గద్దె దిగడం తప్పదని ప్రతిపక్షాలు ప్రచారం మొదలు పెట్టాయి. తమ ప్రభుత్వ మనుగడకు అవసరమైన మద్దతు తమకు ఉందని ఇమ్రాన్ ప్రభుత్వం అతివిశ్వాసంతో ఉంది. ఇదంతా ఇలా ఉండగా, దేశంలోని సంకీర్ణ ప్రభుత్వాన్ని దించేందుకు కుట్ర జరుగుతోందని, దాని వెనకాల విదేశీ శక్తుల హస్తం ఉందంటూ ఇస్లామాబాద్ లో ఇమ్రాన్ మద్దతుదారులు భారీ ర్యాలీ నిర్వహించారు.ఈ ర్యాలీలో ఇమ్రాన్ చేసిన వ్యాఖ్యలను ప్రతిపక్షాలు కొట్టిపారేశాయి. ప్రధానపదవి పోవడం తప్పదని భావించిన ఇమ్రాన్ ఇటువంటి కొత్తపాటను ఎంచుకున్నారంటూ విపక్షనేతలు మండిపడుతున్నారు. “విదేశం నుంచి అందుతున్న డబ్బుతోనే పాక్ లో ప్రభుత్వాన్ని మార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ డబ్బు అందుకున్న నాయకులు విదేశీ ఖాతాలకు బదిలీ చేసుకుంటున్నారు. నా ప్రభుత్వం కొనసాగినా, పడిపోయినా… అలాంటి దేశద్రోహులను వదిలిపెట్టను” ఇవీ… పాకిస్థాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ నుంచి తాజాగా వచ్చిన మాటలు.అమెరికా, చైనా, రష్యా.. ఇలా ప్రతిదేశంతో అక్రమ సంబంధాలు పెట్టుకొని, ఆర్ధిక,స్వార్ధ ప్రయోజనాలతో  పాకిస్థాన్ మునిగిపోతోంది. అక్కడ దాదాపు ప్రతి నాయకుడికీ ఇటువంటి చేదు అనుభావాలే ఎదురయ్యాయి. భారతదేశం వంటి శాంతికాముక దేశానికి అశాంతిని కలిగించాలని, అలజడులు సృష్టించాలని, భూభాగాలను, సంపదను అక్రమంగా ఆక్రమించుకోవాలని దురాలోచనలు చేస్తుంటే… ఇలాంటి దుష్ట పరిణామాలే ఎదురవుతాయి.పాక్ విదేశాంగ విధానంలో, నడకలో,నడతలో మంచిమార్పు రానంత కాలం ఆ దేశాధినేతలకు తిప్పలు తప్పవు. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఉంటాడా? ఊడతాడా? మరికొన్ని రోజుల్లోనే తేలిపోతుంది.

Also read: విశాఖ ఉక్కు కర్మాగారం దక్కేనా?

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles