భారతీయ జనతా పార్టీ ఎన్నికల గుర్తుగా కమలాన్ని ఉపసంహరించాలంటూ అలహాబాద్ హైకోర్టులో దాఖలైన ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) విచారణకు వచ్చింది. దీనిపై ఎన్నికల సంఘం (ఈసీ) తన స్పందన తెలియచేయాలని ఆదేశిస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గోవింద్ మాథూర్, జస్టిస్ పియూష్ అగర్వాల్ తో కూడిన ధర్మాసనం ఈ కేసు తదుపరి విచరణను వచ్చే నెల 12వ తేదీకి వాయిదా వేసింది. కమలాన్ని ఎన్నికల గుర్తుగా తొలగించాలని గోరఖపూర్ కు చెందిన కాళీ శంకర్ ఈ వ్యాజ్యం వేశారు. ప్రజాప్రాతినిధ్యం చట్టం, ఎన్నికల గుర్తులు (రిజర్వేషన్లు, కేటాయింపు) చట్టం 1968 ప్రకారం గుర్తుల కేటాయింపు కేవలం ఎన్నికల వరకు మాత్రమేనని, వాటిని రాజకీయ పార్టీలు లోగోలుగా వాడుకోరాదని పిల్ లో ప్రస్తావించారు.అందుకు భిన్నంగా వ్యవహరించడం దుర్వినియోగమే అవుతుందని పేర్కొన్నారు.
‘కమలం’ జాతీయ పుష్పమని, పలు ప్రభుత్వ వెబ్‌సైట్లలో అది కనిపిస్తుంటుందని, దీనిని కేటాయించడం వల్ల ఆ పార్టీకి అనుచిత ప్రయోజనం కలుగుతోందని, కనుక దానిని ఎన్నికల గుర్తుగా కొనసాగించవద్దని శంకర్ ఈసీకి గతంలో విన్నవించారు. దానిని ఈసీ గతేడాది ఏప్రిల్ 4న తిరస్కరించడంతో హైకోర్టును ఆశ్రయించారు.
దీనిపై తమ స్పందనను తెలిపేందుకు కొంత గడువు కావాలన్న ఈసీ కోరక మేరకు తదుపరి విచారణను వచ్చే నెలకు వాయిదా వేశారు. ఇతర రాజకీయ పార్టీలనూ తాజా పిటిషన్‌లో ప్రతివాదులుగా చేర్చాలని కాళీ శంకర్ తరఫు న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించింది.