- మాస్క్ ధరించకుంటే విమానం దించేయండి
- విమానాశ్రయాలకు డీజీసీఏ ఆదేశాలు
దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతుండటంతో పౌర విమానయాన శాఖ కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. కరోనా నిబంధనలు పాటించని ప్రయాణికులను విమానాల నుంచి దించేయాలని విమానయాన సంస్థలకు డీజీసీఏ ఆదేశాలు జారీచేసింది.విమానాశ్రయాల్లో మాస్క్ లు లేకుండా కన్పించేవారిపై తక్షణం జరిమానాలు విధించాలని సూచించింది.
విమానాశ్రయాల్లో కొవిడ్ నిబంధనలు పాటించడంలేదని డీజీసీఏ జరిపిన సర్వేలో తేలింది. ఎయిర్ పోర్టులోకి ప్రవేశించాక ప్రతి ఒక్కరూ కొవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించేలా చర్యలు తీసుకోవాలని విమానాశ్రయ నిర్వాహకులు చూసుకోవాలని తెలిపింది. ముక్కు, నోటిని కవర్ చేసేలా మాస్క్ లు ధరించడం, కచ్చితంగా సామాజిక దూరం పాటించడం, శానిటైజర్ వినియోగించాల చూడాలని సూచనలు చేసింది. దీనిపై ఎయిర్ పోర్టులు మరింత నిఘా పెట్టాలని తెలిపింది. నిబంధనలు పాటించని వారిపై పోలీసుల సహాయంతో చట్టప్రకారం కేసులు నమోదు చేయాలని డీజీసీఏ దేశంలోని ఎయిర్ పోర్ట్ నిర్వాహకులుకు ఆదేశాలు జారీ చేసింది.
Also Read: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్
నిబంధనలు పాటించకపోతే కఠిన చర్యలు:
కొవిడ్ మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విమానాశ్రయాలకు డీజీసీఏ మరోసారి మార్గదర్శకాలు జారీచేసింది. కొవిడ్ నిబంధనలు అమలు చేయడంలో అశ్రద్ధ చూపొద్దని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించినట్లు తెలిస్తే ఎలాంటి చర్యలు తీసుకోవడానికైనా వెనుకాడేది లేదని డీజీసీఏ తెలిపారు. కొవిడ్ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని పదే పదే హెచ్చరించినా మాస్క్ లు పెట్టుకోకపోతే విమానం నుంచి దించేయాలని ఈ నెల 13న డీజీసీఏ ఎయిర్ లైన్ సంస్థలను ఆదేశించింది. అయినా మాస్క్ ధరించకుండా కొవిడ్ నిబంధనలను ఉల్లఘించినందుకు గాను మార్చి మూడో వారంలో 15 మంది ప్రయాణికులను విమానాల నుంచి దించేసినట్లు డీజీసీఏ అధికారులు తెలిపారు.
Also Read: చేజేతులా తెచ్చుకున్న ముప్పు