Monday, December 30, 2024

కీలక అంశాలపై ఐజేయూ కార్యవర్గం సుదీర్ఘ చర్చ

  • మథురలో ముగిసిన సమావేశాలు
  • పాత్రికేయులపై దాడులు, హత్యలపై ఖండన
  • కశ్మీర్ లో అశాంతిపైన ఆందోళన
  • ప్రెస్ కౌన్సిల్ ను నీరు గార్చడంపై నిరసన
  • ఎన్నికల నిర్వహణకు రిటర్నింగ్ అధికారిగా మాజిద్

దేశంలో మీడియా సంస్థల, జర్నలిస్టుల స్థితిగతులు, భావ ప్రకటన స్వేచ్ఛను హరించే కుట్రలు, పాత్రికేయులపై దాడులు, హత్యలు తదితర అంశాలపై రెండు రోజుల పాటు ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం లోని మథుర నగరంలో జరిగిన ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో కీలకమైన చర్చ జరిగింది. ఈ సందర్భంగా ప్రవేశపెట్టిన పలు తీర్మానాలను సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఐజేయూ కార్యవర్గం, వివిధ రాష్ట్రాల జర్నలిస్టుల సంఘాల ప్రధాన బాధ్యులు, పాల్గొన్న ఈ సమావేశం మంగళవారం సాయంత్రం ముగిసింది.

మే 10 న జర్నలిస్టుల  జాతీయ నిరసనదినం

జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం మే 10 న “జాతీయస్థాయి నిరసనదినం” పాటించాలని ఐ.జే.యు. జాతీయ కార్యవర్గ సమావేశం పిలుపు ఇచ్చింది. ఉత్తరప్రదేశ్   రాష్ట్రం మథుర నగరంలోని గోవర్ధన్ ప్యాలస్ సమావేశమందిరంలో జరిగిన రెండురోజుల  జాతీయ కార్యవర్గ సమావేశాలు మంగళవారం సాయంత్రం  ముగిశాయి. సమావేశాలకు ఐ.జే.యు. అధ్యక్షుడు కె.శ్రీనివాసరెడ్డి అధ్యక్షత వహించారు. దేశంలో వర్కింగ్ జర్నలిస్టులు ఎదుర్కుంటున్న వృత్తిపరమైన  సమస్యలపై , ప్రభుత్వాల విధానాలపై సమావేశం లోతుగా చర్చించింది.

జర్నలిస్టుల హక్కులను కాలరాయడంలో , జర్నలిస్టులకు ఎన్నోఏళ్ళుగా  అమల్లో ఉన్న సదుపాయాలను రద్దు చేయడంలో కేంద్రప్రభుత్వం  ముందంజ వేస్తుండగా , పలురాష్ట్రాల  ప్రభుత్వాలు కూడా అదేబాటలో పయనిస్తున్నాయని సమావేశంలో  మాట్లాడిన  వివిధ రాష్ట్రాల ప్రతినిధులు వెల్లడించారు. వర్కింగ్ జర్నలిస్టుల సమస్యల పరిష్కారాన్ని  కోరుతూ ఒక  జాతీయస్థాయి ఉద్యమాన్ని చేపట్టాలని  కార్యవర్గసమావేశం నిర్ణయించింది.

మే 10 వ తేదీన అన్ని రాష్ట్రాల రాజధాని నగరాల్లో జర్నలిస్టుల నిరసనదినం  పాటించాలని , సమస్యలపై దృష్టి సారించే విధంగా ప్రభుత్వాలపై ఒత్తిడి తేవాలని  ఐ.జే.యు.  పిలుపు ఇచ్చింది. వివిధరూపాలలో నిరసన వ్యక్తం చేయడంతో పాటు కేంద్రమంత్రులకు ,ఎంపీలకు వినతిపత్రాలు అందచేయాలని అనుబంధ సంఘాలకు పిలుపు ఇచ్చింది. దేశంలో మీడియా రంగంలో ఉన్న అన్ని  వ్యవస్థలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేయడంపై ఐ.జే.యు. తీవ్ర నిరసన వ్యక్తం చేసింది.

శశిథరూర్  నేతృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ చేసిన  సిఫార్సు మేరకు వెంటనే  మీడియా కౌన్సిల్ ఏర్పాటు చేయాలని ఐ.జే.యు. డిమాండ్ చేసింది. మీడియా విశ్వసనీయత ప్రశ్నార్థకం అవుతున్న ప్రస్తుత తరుణంలో,  మీడియా కౌన్సిల్ ఏర్పాటు అత్యంత అవసరమని  ఐజేయూ అభిప్రాయపడింది. మీడియా సిబ్బందిపై పెరిగిపోతున్న దాడులను ఐ.జే.యు. ఒక తీర్మానంలో ఖండించింది. జమ్మూ కాశ్మీర్ పాత్రికేయులపై  నిర్బంధకాండను  ఖండిస్తూ సమావేశం  మరో తీర్మానాన్ని ఆమోదించింది. కేంద్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్ట్ చట్టాన్ని   రద్దుచేయడంతో ,ఇప్పటికే  జర్నలిస్టులకు  అరకొరగా మిగిలిన  ఉద్యోగభద్రత , వేతనభద్రత పూర్తిగా  ప్రశ్నార్థకం అయ్యాయని ,కాంట్రాక్ట్ విధానమే చట్టబద్దం అయ్యిందని  ఐ.జే.యు. విమర్శించింది.

ప్రెస్ కౌన్సిల్ ను నీరు కార్చడాన్ని , అందులో జర్నలిస్ట్ యూనియన్ల ప్రాతినిధ్యం లేకుండా చేయడాన్ని ఐజేయు తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రెస్ కౌన్సిల్ కు వెంటనే  చైర్మన్ ను నియమించాలని , కౌన్సిల్ లో   జాతీయ పాత్రికేయ సంఘాల ప్రాతినిధ్యాన్ని  పునరుద్ధరించాలని కోరింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో అక్రెడిటేషన్ నియమాలని  ఏకపక్షంగా మార్చడాన్ని ఐజేయు ఖండించింది.

కరోనా సందర్భంగా రైల్వే ప్రయాణాల్లో పలు రాయితీలను రద్దు చేసిన రైల్వేశాఖ  వాటిని ఇటీవల పునరుద్ధరించిన  సందర్భంగా జర్నలిస్టుల ప్రయాణ రాయితీ సదుపాయాన్ని పునరుద్ధరించకపోవడాన్ని  ఐజేయూ తప్పు బట్టింది. రైల్వేలో జర్నలిస్టుల ప్రయాణరాయితీని  వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేసింది. జర్నలిస్టుల  సమస్యల పరిష్కారం కోసం దేశవ్యాప్తంగా పోరాటం చేపట్టాలని కార్యవర్గసమావేశం  నిర్ణయించింది. రెండురోజుల కార్యవర్గ సమావేశంలో ఐ.జే.యు. సెక్రెటరీ జనరల్ బల్విందర్ సింగ్ జమ్మూ , పూర్వాధ్యక్షుడు  ఎస్.ఎన్. సిన్హా , ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ జాతీయ మీడియా ,అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు  దేవులపల్లి అమర్ , జాతీయఉపాధ్యక్షుడు అంబటి ఆంజనేయులు, జాతీయ కార్యదర్శి వై.నరేందర్ రెడ్డి , వి.బి.రాజన్ ,(కేరళ) డి.ఎస్.ఆర్.సుభాష్ ,(తమిళనాడు)  అమర్ మోహన్ (బీహార్) బంత్ సింగ్ బ్రార్ (హర్యానా)   కోశాధికారి ప్రేమ్ నాథ్ భార్గవ్ (న్యూఢిల్లీ)  స్క్రైబ్స్ న్యూస్ పత్రిక సంపాదకుడు ఆలపాటి సురేష్ కుమార్ , రమేష్ శంకర్ పాండే ,(యూపీ)  గిరీష్ పంత్ ( ఉత్తరాఖండ్ ) డి.సోమసుందర్ ( ఆంధ్ర ప్రదేశ్) నగునూరి శేఖర్, కే.విరాహత్ అలీ, దాసరి కృష్ణారెడ్డి, కె.రాంనారాయణ (తెలంగాణ), జి.శ్రీనివాస్ (మహారాష్ట్ర), మత్తి మహారాజ్ ( పాండిచ్చేరి ) తదితరులు మాట్లాడారు.

ఐజేయు పదవ ప్లీనరీ సమావేశాలను అక్టోబర్ లో  తమిళనాడులో నిర్వహించాలని సమావేశం  నిర్ణయించింది. అంతకు ముందే రాష్ట్రాల మహాసభలను పూర్తి చేయాలని ,  సభ్యత్వాలను  కోటా మొత్తాన్ని కేంద్రానికి  చెల్లించాలని కార్యవర్గం రాష్ట్ర సంఘాలను  ఆదేశించింది.

ఐజేయు జాతీయఅధ్యక్షుడు , సెక్రెటరీ జనరల్ ,జాతీయకౌన్సిల్  సభ్యుల ఎన్నికల నిర్వహణకు సెంట్రల్ రిటర్నింగ్ అధికారిగా  ఎం.ఏ.మాజిద్ ను సమావేశం నియమించింది.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles