Sunday, December 22, 2024

కీలకమైన కాంగ్రెస్ కార్యవర్గం భేటీ

  • పంజాబ్ కాంగ్రెస్ లో చల్లారని వేడి
  • ఛత్తీస్ గఢ్ లో ఎగుస్తున్న మంటలు
  • రాజస్థాన్ లో గెహ్లాత్, సచిన్ మధ్య నిశ్శబ్ద యుద్ధం
  • కాయకల్ప చికిత్స తప్ప మరో మార్గం లేదు

ఎట్టకేలకు ఈ నెల 16వ తేదీనాడు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీ డబ్ల్యూ సీ ) సమావేశం జరగనుంది. సంస్థాగత ఎన్నికలు, పలు రాష్ట్రాల్లో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలు, వివిధ రాష్ట్రాల్లో పార్టీ ఎదుర్కొంటున్న అంతర్గతమైన కుమ్ములాటలు మొదలైనవాటిపై చర్చ ప్రధాన ఎజెండాగా చెప్పుకుంటున్నారు. అదే సమయంలో, అధ్యక్షుడి ఎంపికపై నిర్ణయం తీసుకొనే అవకాశాలు ఉన్నాయా తెలియాల్సివుంది.   పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా కొంతకాలం నుంచి సోనియాగాంధీయే వ్యవహరిస్తున్నారు. కొత్త అధ్యక్షుడుని ఎంపిక చేయాలనే మాటలు పార్టీలో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీకి పార్టీ పగ్గాలు అప్పగించాలని ఎక్కువమంది కోరుకుంటున్నారు. కొందరు నేతలు మాత్రం స్పష్టమైన వైఖరిని చూపించడం లేదు. కనీసం ఇప్పటికైనా అధ్యక్షుడి ఎంపిక జరుగుతుందా? అని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

Also read: శరన్నవరాత్రులు

గులాంనబీ ఆజాద్ సూచన

జీ -23గా పిలువబడే గ్రూప్ సభ్యులు ఎప్పటి నుంచో పార్టీ ప్రక్షాళనపై విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. సీడబ్ల్యూసీ భేటీ నిర్వహించమని, ఆ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ ఇటీవలే అధిష్ఠానానికి ఉత్తరం కూడా రాశారు. మరో సీనియర్ నేత కపిల్ సిబల్ పార్టీ తీరుపై గట్టిగానే మాట్లాడుతున్నారు. శశిథరూర్ వంటివారు కూడా కపిల్ సిబల్ మాటలకు వత్తాసు పలుకుతున్నారు. తాజాగా పంజాబ్ లో ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ మార్పు,సిద్ధూ వీర విహారం మొదలైన ఘటనలు పార్టీలోని పలువురు నేతలకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించాయి. కొందరు సీనియర్ నేతలు పార్టీని వీడుతున్నా, అధిష్టానం చూస్తూ ఉండడం  వారికి అసహనాన్ని కలిగించింది. రాజస్థాన్, ఛత్తిస్ గడ్ లోనూ పరిస్థితులు దిగజారుతున్నాయి. దేశంలో పార్టీ అధికారాన్ని కోల్పోయి ఏడేళ్లు దాటిపోయింది. 2014 కంటే 2019ఎన్నికల్లో ఘోర పరాజాయాన్ని మూట కట్టుకుంది. ఈ ఏడేళ్ళలో ఏ మాత్రం పురోగతి లేకపోగా, వరుసగా అన్ని రాష్ట్రాల్లోనూ అధికారాన్ని కోల్పోతూ, అత్యంత అధోగతికి దిగజారింది. నరేంద్రమోదీ – బిజెపి ప్రభంజనానికి తోడు కాంగ్రెస్ స్వయంకృత అపరాధాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మన్మోహన్ సింగ్ పదేళ్ల పాలనలో, ముఖ్యంగా ద్వితీయార్ధంలో అవినీతి, అసమర్ధత రాజ్యమేలాయి. వ్యక్తిగతంగా మన్మోహన్ సింగ్ కు నిజాయితీపరుడని పేరున్నా, చుట్టూ పెరిగిపోయిన దుష్ట సంస్కృతిని కట్టడి చెయ్యడంలో ఆయన ఘోరంగా వైఫల్యం చెందారు. పీవీ నరసింహారావు ప్రధానమంత్రి పీఠం నుంచి దిగిపోయిన తర్వాత, పార్టీ మొత్తంగా సోనియాగాంధీ చేతుల్లోకి వెళ్లిపోయింది. అనుయాయులంతా విచ్చలవిడిగా ప్రవర్తించారు. పీవీ తర్వాత ప్రణబ్ ముఖర్జీని ప్రధానమంత్రిగా ఎంపిక చేసివుండివుంటే, మరీ అంతటి దారుణంగా పార్టీ సంస్కృతి, పాలనా స్థితి దిగజారి వుండేది కాదని కొందరు రాజనీతిశాస్త్ర నిపుణులు చేసే వ్యాఖ్యలను పూర్తిగా కొట్టిపారేయలేము.

Also read: రక్తసిక్తమైన రైతు ఉద్యమం

ఎటు చూస్తే అటు గందరగోళం

కొన్నాళ్ళుగా పార్టీలో చోటుచేసుకుంటున్న పరిణామాలను చూస్తూవుంటే తీవ్ర గందరగోళం కనిపిస్తోంది. దానిని ప్రక్షాళన అనాలా? అస్పష్టత అనాలా అర్ధం కావడంలేదని దేశ రాజకీయాలు బాగా ఎరిగిన సీనియర్ జర్నలిస్టులు సైతం వ్యాఖ్యానిస్తున్నారు. 2022లో చాలా రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్నాయి. 2024లో వచ్చే సార్వత్రిక ఎన్నికల పోరుకు ముందుగా, అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చూపించుకోవాల్సిన అవసరం పార్టీకి ఎంతైనా ఉంది. ఆ జయపాజయాలు పార్టీ భవిష్యత్ ను చాలా మేరకు నిర్ణయిస్తాయని చెప్పవచ్చు. పార్టీకి కొత్తరక్తాన్ని ఎక్కించే క్రమంలో, ఉన్న నీరు పోకుండా చూసుకోవాలి. ఇప్పటికే చాలామంది నాయకులు, క్యాడర్ పార్టీ భవిష్యత్ పట్ల నైతిక బలాన్ని కోల్పోయారు. ప్రస్తుతం కేవలం పంజాబ్, ఛత్తీస్ గడ్, రాజస్థాన్ మూడు రాష్ట్రాల్లో మాత్రమే పార్టీ అధికారంలో ఉంది. పంజాబ్ లో అత్యంత శక్తివంతమైన కెప్టెన్ అమరీందర్ సింగ్ సొంత పార్టీ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. బిజెపి పెద్దల మద్దతును కూడా కూడగట్టుకొని కాంగ్రెస్ ను ముప్పుతిప్పలు పెట్టడానికి ఆయన సిద్ధమవుతున్నారు. అక్కడ ఆమ్ ఆద్మీ రెండవ బలమైన పార్టీగా వేళ్లూనుకొనివుంది. కాంగ్రెస్ లో వచ్చిన సంక్షోభం వల్ల ఆ పార్టీ అధికారాన్ని తన్నుకుపోయే ప్రమాదం ఉందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. రాజస్థాన్ లో ఉపముఖ్యమంత్రి సచిన్ పైలెట్, ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఏ సమయంలోనైనా విస్ఫోటనం జరిగే అవకాశం ఉంది.

Also read: వక్రబుద్ధి చైనా

ఛత్తీస్ గఢ్ లో కుమ్ములాట

ఛత్తీస్ గడ్ లో వివాదం మరో రూపంలో ఉంది. ప్రస్తుత ముఖ్యమంత్రి భూపేష్ భగెల్ – టీ ఎస్ దేవ్ ముఖ్యమంత్రి పదవీ కాలాన్ని చెరో రెండున్నర సంవత్సరాలు పంచుకోనేలా మొదట్లోనే ఒప్పందం చేసుకున్నారు.ఇప్పుడు భూపేష్ ఆ నిబంధనకు ఒప్పుకోవడం లేదు. ఈ అంశంపై అక్కడ పెద్ద రచ్చ జరుగుతోంది. కొందరు ఎమ్మెల్యేలు ఈమధ్య దిల్లీ కూడా వెళ్లి పార్టీ పెద్దలను కలిసి వచ్చారు. ఆ అగ్ని ఇంకా చల్లారలేదు.ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. కేవలం పీకే చేరడం వల్ల పార్టీలో అద్భుతాలు జరిగిపోవు. దేశవ్యాప్తంగా, క్షేత్రస్థాయి నుంచి పార్టీలో ప్రక్షాళన జరగాలి. పార్టీ భవిష్యత్తుపై అశాభావం కలిగించాలి. అధిష్టానం పట్ల విశ్వాసం కుదరాలి. అంతర్గత కుమ్ములాటలకు ముగింపు పలకాలి. వేరే పార్టీలకు వెళ్లే వలసలను ఆపగలగాలి. నరేంద్రమోదీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ నిలవగలడనే నమ్మకాన్ని దేశ ప్రజల్లో కలిగించాలి. ముందుగా అతని నాయకత్వ పటిమపై అందరికీ విశ్వాసం కుదరాలి. రాహుల్ గాంధీ చంచల స్వభావాన్ని వీడాలి  ఇవ్వేమీ జరగకుండా కాంగ్రెస్ ఎదగలేదు. ఇలాగే సాగితే మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. ఈ 16న జరిగే సీ డబ్ల్యూ సీ సమావేశం ఏ మేరకు ఫలవంతం కానుందో చూద్దాం.

Also read: ‘మా’ ఎన్నికలలో బాహాబాహీ

Maa Sarma
Maa Sarma
సీనియర్ జర్నలిస్ట్ , కాలమిస్ట్

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles