- మా మొర ఆలకించలేదని వర్ల కినుక
- వాలంటీర్ల హక్కులను కాపాడాలని వైసీపీ విజ్ఞప్తి
ఎన్నికల నిర్వహణపై ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సంఘం దారుణంగా వ్యవహరిస్తోందని టీడీపీ నేత వర్ల రామయ్య మండిపడ్డారు. రాజకీయ పార్టీల నేతలతో ఎస్ఈసీ అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి నేతల అభిప్రాయాలను తెలుసుకునేందుకు ఎస్ఈసీ నిమ్మగడ్డ సమావేశాలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ సమావేశంలో టీడీపీ చేసిన సూచనలను నిమ్మగడ్డ పట్టించుకోలేదని వర్ల రామయ్య విమర్శించారు. పంచాయతీ ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలపట్ల ప్రభుత్వం దౌర్జన్యం, దాడులు చేసిందని ఈ ఘటనలపై వివరించేందుకు ప్రయత్నించగా తమ వాదన వినేందుకు ఎస్ఈసీ విముఖత చూపారని వర్ల రామయ్య అన్నారు. ఎన్నికల్లో జరిగిన అక్రమాలపై చర్యలు తీసుకోవాలని కోరాం. ఇప్పటి వరకు ఏమైనా చర్యలు తీసుకున్నారా అని తెలుసుకునే ప్రయత్నం చేసినా ఎసీఈసీ నుంచి సమాధానం రాలేదని వాపోయారు. ప్రధాన ప్రతిపక్షమైన తమకు మాట్లేడేందుకు కేవలం 5 నిమిషాలే సమయం ఇచ్చారని ఈమాత్రందానికి సమావేశాలు ఎందుకని వర్ల అన్నారు. ఎస్ఈసీ చిత్తశుద్ధితో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని ఈ సందర్భంగా వర్ల రామయ్య కోరారు.
Also Read: చంద్రబాబు చిత్తూరు పర్యటన ఉద్రిక్తం
వాలంటీర్ల హక్కులను ఎస్ఈసీ కాపాడాలి:
మరోవైపు ఎస్ఈసీ వ్యవహారశైలిపట్ల అధికార వైసీపీ కూడా అసహనం వ్యక్తం చేస్తోంది. వాలంటీర్ల హక్కులను కాలరాసే విధంగా ఎస్‌ఈసీ వ్యవహరిస్తున్నారని భేటీ అనంతరం వైసీపీ అధికార ప్రతినిధి నారాయణమూర్తి అన్నారు. గ్రామ వాలంటీర్లు మొబైల్ ఫోన్లను డిపాజిట్ చేయాలన్న ఎస్ఈసీ ఆదేశాలపై తీవ్ర అభ్యంతరం తెలిపామన్నారు. ఎన్నికల నిర్వహణ నేపథ్యంలో వాలంటీర్ల హక్కులకు భంగం కలిగించకుండా వ్యవహరించాలని ఎస్ఈసీకి సూచించామని నారాయణమూర్తి అన్నారు. వాలంటీర్ల మొబైల్ ఫోన్లు డిపాజిట్ చేసుకోవద్దని, ప్రభుత్వ సంక్షేమ పథకాలకు వాలంటీర్లు వారధిగా పనిచేస్తున్నారని, పోలింగ్ సమయంలో వాలంటీర్ల ఫోన్లను డిపాజిట్ చేసుకుంటామనే రీతిలో ఎస్‌ఈసీ నిమ్మగడ్డ చెప్పారని తెలిపారు. వైసీపీ అభ్యర్థులపై టీడీపీ దాడులకు ప్రయత్నిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఎస్‌ఈసీని కోరామని తెలిపారు.
Also Read: మున్సిపల్ పోరుకు ఎస్ఈసీ సన్నాహాలు