Sunday, December 22, 2024

అమెరికా ఎన్నికలపై ఇండియన్ అమెరికన్స్ ప్రభావం ఎంత?

  • అమెరికాలో 40 లక్షల మంది భారత సంతతివారు
  • 18 లక్షల మంది ఓటర్లు
  • విద్య, ఆదాయంలో అధికులు
  • విరాళాలు ఇవ్వడంలో అగ్రగణ్యులు
  • సంఖ్య తక్కువైనా ప్రాధాన్యం ఎక్కువ

కె. రామచంద్రమూర్తి

అమెరికా ఎన్నికలలో అమెరికాలో స్థిరబడిన భారతీయుల (ఇండియన్ అమెరికన్స్) ప్రభావం ఏమిటి? ఇండియన్ అమెరికన్స్ ను అటు డెమాక్రాటిక్ పార్టీ, ఇటు రిపబ్లికన్ పార్టీ అంతగా దువ్వుతున్నాయి ఎందుకని? ఈ విషయంపైన దిల్లీలోని దక్షిణాసియా విదేశీ విలేఖరుల క్లబ్ ప్రఖ్యాత జర్నలిస్టు ఎస్ వెంకట్ నారాయణ్ అధ్యక్షతన ఒక వెబినార్ ను ఇటీవల నిర్వహించింది. క్లబ్ కార్యదర్శి మునీష్ గుప్తా చర్చను సమన్వయించారు. ఈ వెబినార్ లో చాలా ఆసక్తికరమైన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. అమెరికా ఎన్నికలను అర్థం చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. వెబినార్ లోని ముఖ్యాంశాలు ఇక్కడ పొందుపరుస్తున్నాం.

అంతర్జాతీయ డాక్యుమెంటరీ నిర్మాత, ప్రయోక్త, బోస్టన్ నివాసి ప్రియాసామంత్ మాట్లాడుతూ, అమెరికాకు భారతీయులు రావడం 1900ల ప్రారంభంలో మొదలయిందనీ, ముందుగా లేబరర్లుగా కూలిపనికోసం వచ్చారనీ, 1960ల నుంచి వైద్యులూ, ఇతర వృత్తిపనివారూ వచ్చిచేరారనీ, అమెరికాలో ఇమిగ్రేషన్ చట్టాలను సడలించడంతో ఎక్కువమంది భారతీయులు అమెరికా వెళ్ళి స్థిరపడినారనీ చెప్పారు. 1990లలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ విస్తరించడంతో అమెరికా వెళ్ళి స్థిరపడిన భారతీయుల సంఖ్య బాగా పెరిగిందనీ, 2020లో అమెరికన్ ఇండియన్ల సంఖ్య 40 లక్షలపై మాటేననీ, వారిలో 18 లక్షల మంది ఓటర్లనీ తెలిపారు. అమెరికన్ ఇండియన్లు బాగా చదువుకున్నవారూ, సంపన్నులూ అని చెప్పారు. మెక్సికన్ల తర్వాత అమెరికాలో నివసిస్తున్న ఇతర దేశాలవారి జాబితాలో ఇండియన్లే రెండో స్థానంలో ఉన్నారని కూడా ఆమె వెల్లడించారు. కోవిద్ పాజిటీవ్ నిర్ధారణ అయిన ప్రెసిడెంట్ ట్రంప్, ఆయన భార్య మెలానియా సత్వరం కోలుకోవాలనే ఆకాంక్షను ప్రియ వెలిబుచ్చారు.  

డెమాక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష పదవికి కమలా హారిస్ నామినేషన్ వేయడం చరిత్రాత్మకం. భారత సంతతికి చెందిన ఒక వ్యక్తి అమెరికాలో ఉన్నత పదవికి పోటీపడటం అపూర్వం. అందుకే ఇండియన్ అమెరికన్స్ పట్ల అమెరికాలో ఆసక్తి పెరిగింది. ప్రతినిధుల సభ, సెనేట్ ఎన్నికలలో కూడా అమెరికన్ ఇండియన్స్ సమధికోత్సాహంతో పాల్గొంటున్నారు.

యూఎస్-ఇండియా సెక్యూరిటీ కౌన్సిల్ అధ్యక్షుడు రమేష్ కపూర్ తన ప్రసంగం ప్రారంభిస్తూనే ‘నా అభిప్రాయం ప్రకారం బిడేన్, కమలాహారిస్ లు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ఎన్నికవుతారని చెప్పారు. ‘1986 నుంచి జరుగుతూ వచ్చిన అన్ని ఎన్నికలలో డెమాక్రాటిక్ పార్టీ తరఫున నేను చురుకుగా పాల్గొన్నాను. ఎన్నికలను పరిశీలించడం నాకు ఇష్టం. నా సమయంలో 60-70 శాతం ఇందుకు వెచ్చిస్తాను. మిగిలిన 30 శాతం మాత్రమే నా వ్యాపార నిమిత్తం వినియోగిస్తాను. నా భార్య పూర్తి కాలం వ్యాపారవ్యవహారాలు పర్యవేక్షిస్తుంది. 2016 ఎన్నకల ముందే నేను ట్రంప్ అధ్యక్షుడుగా ఎన్నికవుతాడని చెప్పాను. ట్రంప్ ఈ సారి ఓడినా ఓటమిని అంగీకరించరనీ, అధికారాన్ని వదులుకోరనీ కొందరు చెబుతున్న మాటలకు అర్థం లేదు. అమెరికా రాజకీయాలు తెలియనివారే ఆ విధంగా మాట్లాడుతారు’ అని వ్యాఖ్యానించారు.

భైడెన్ ఎన్నికైతే బెటర్

భైడెన్ అధ్యక్షుడిగా ఎన్నికైతే అమెరికా-భారత్ సంబంధాలు మరింత గట్టిపడతాయి. సివిల్ న్యూక్లియర్ ఒప్పందాన్ని సెనేట్ చేత ఆమోదింపజేయడంలో బైడెన్ ప్రముఖమైన పాత్ర పోషించారు. డెమాక్రాట్లు అంగీకరించకపోతే ఆ ఒప్పందం కుదిరేది కాదు. అంతే కాదు, 1975లో పోఖ్రాన్ లో ఇండియా మొట్టమొదటిపారి అణుపాటవ పరీక్ష నిర్వహించినప్పుడు ఇండియాపైన ఆంక్షలు విధించాలని అమెరికాలో చాలామంది రాజకీయ నాయకులు ప్రభుత్వంపైన ఒత్తిడి తెచ్చారు. అప్పుడు విదేశీవ్యవహారాల కమిటీ సభ్యుడిగా ఉండిన బైడెన్ ఆంక్షలను గట్టిగా వ్యతిరేకించారు. నాడు అమెరికా అధ్యక్షుడు జిమ్మీ కార్టర్. కార్టర్ ఒకే ఒక ఓటు తేడాతో సెనేట్  లో గెలిచారు.  ఈ ఒక్క ఓటు బైడెన్ దే.  పోఖ్రాన్-2 జరిగే నాటికి ఇండియన్ అమెరికన్స్  ప్రభావం బాగా పెరిగింది. ఆంక్షల ప్రసక్తే రాలేదు. సీఏఏ (సిటిజెన్స్ అమెండ్ మెంట్స్ యాక్ట్ నూ, కశ్మీర్ లో భారత్ విధానాన్నీ బైడెన్ వ్యతిరేకించాడంటూ చాలామంది భారతీయులు కినుక వహించారు. ఇది చాలా చిన్న విషయం. పౌరహక్కులకూ, మానవహక్కులకూ డెమాక్రాటిక్ పార్టీ ఎప్పటికీ ప్రాధాన్యం ఇస్తుందనే విషయం అర్థం చేసుకోవాలి. చిన్నచిన్న విషయాలను పట్టించుకోకుండా  మనం పెద్ద చిత్రాన్ని చూడాలి. ఇప్పుడున్నట్టు ఫోటోలూ, పెద్ద సభలూ ఉండకపోవచ్చు. కానీ ఇండియాతో సంబంధాలు మాత్రం బైడెన్ హయాంలో పెరుగుతాయి. అమెరికా అభివృద్ధికి ఇండియా కీలకం అంటూ బైడెన్ అన్న విషయం గమనించాలి.

డెమాక్రాట్లకు లక్ష్యం తో పాటు మార్గం కూడా ముఖ్యం

దక్షిణ కొరియా, ఇజ్రేల్ లాగానే ఇండియా కూడా అమెరికాకి రక్షణ వ్యవహారాలలో ముఖ్యమైన భాగస్వామి కాబోతున్నది. రిపబ్లికన్స్ కూ, డెమాక్రాట్స్ కూ ముఖ్యమైన భేదం ఉంది. రిపబ్లికన్ లకు లక్ష్యం సాధించడం ప్రధానం. ఎట్లా సాధించామన్నది ముఖ్యం కాదు. డెమాక్రాట్లకు లక్ష్యం, దాన్ని సాధించే మార్గం కూడా ప్రధానమే – గాంధీ, భగవద్గీత చెప్పిన విధంగా.

తెల్ల ఓటర్ల శాతం తగ్గుతోంది

యూఎస్-ఇండియా స్ట్రాటజిక్ ఫోరం (వాషింగ్టన్) సీఈవో ముఖేష్ అధీ మాట్లాడుతూ, అమెరికాలో ఈ రోజున  మొత్తం 24 కోట్ల ఓటర్లు ఉన్నారని చెప్పారు. 2000ల సంవత్సరంలో అమెరికా ఓటర్లలో 76 శాతం మంది తెల్లవారూ, ఏడు శాతం మంది ఇస్సియన్లూ, 12 శాతం మంది నల్లవారూ ఉంటే ఆసియా సంతతి ఓటర్లు రెండు శాతం ఉండేవారు. 2018 నాటికి తెల్ల ఓటర్ల శాతం 67కి పడిపోయింది. ఇస్పియన్లు 13 శాతానికి పెరిగారు. ఆఫ్రికన్లు (నల్లవారు) 13 శాతానికీ, ఆసియాసంతతి ఓటర్లు నాలుగు శాతానికీ పెరిగారు.

సంపన్నులే ఓట్లు ఎక్కువగా వేస్తారు

అమెరికాలో 2016లో జరిగిన ఎన్నికలలో మొత్తం ఓటర్లలో 55.5 శాతంమంది మాత్రమే ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాలీనా పదివేల డాలర్లకంటే తక్కువ ఆదాయం ఉన్న ఓటర్లలో 41 శాతం మంది మాత్రమే ఓటు చేశారు. సాలీనా ఆదాయం 150 వేల డాలర్లకు మించి ఉన్నవారిలో 78 శాతం మంది ఓటు చేశారు. చదువూ, ఆదాయం అధికంగా ఉన్న ఓటర్లలో అధిక శాతం మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ వర్గంలోకి అమెరికన్ ఇండియన్లు వస్తారు.

ఇండియన్ అమెరికన్స్  ఓటర్లలో 48 శాతం మంది డెమాక్రాటిక్ పార్టీ ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. 42 శాతం మంది రిపబ్లికన్లుగా నమోదైనారు. 30 శాతం మంది స్వతంత్రులుగా నమోదు చేసుకున్నారు. 2016 నాటి ఎన్నికలలో 85 శాతం మంది అమెరికన్ ఇండియన్లు డెమాక్రాటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ కు ఓటు చేశారు. 15శాతం మాత్రమే డొనాల్డ ట్రంప్ కు వేశారు. ఈ సారి ఎన్నికలలో తాజా సర్వే ఫలితాల ప్రకారం 66 శాతం మంది బైడెన్ కూ, 28 శాతం మంది ట్రంప్ కూ ఓటు చేసే అవకాశం ఉంది.  ఇండియన్ అమెరికన్లలో మొదటి తరం ఓటర్లకూ, రెండో తరం ఓటర్లకూ అంతరం ఉంది. మొదటి తరం ఓటర్లు భారత్-అమెరికా సంబంధాలు ఎట్లా ఉన్నాయో చూస్తారు. ఇమిగ్రేషన్ లా గురించి ఆలోచిస్తారు. భద్రత గురించి  కూడా పరిశీలిస్తారు. అమెరికాలో పుట్టిపెరిగిన రెండో తరం ఓటర్లకు ఈ విషయాలు పట్టవు. వారు కేవసం స్థానిక సమస్యలపైనే స్పందించి ఓట్లు వేస్తారు. వారికి భారత్ ప్రయోజనాలు ముఖ్యం కాదు.

ఓట్లతో పాటు నోట్లు కూడా

ఓట్లు వేయడమే కాకుండా నోట్లు ఇవ్వడంలో కూడా ఇండియన్ అమెరికన్స్ ముందుంటారు. పోయిన ఎన్నికలలో ఇండియన్ అమెరికన్స్ సంపన్నులలో మొదటి మూడు వందల మంది ఇచ్చిన విరాళాల మొత్తం 350 లక్షల డాలర్లు. ఈ రోజు పరిస్థితి చూసినట్లయితే డెమాక్రాటిక్ పార్టీ అభ్యర్థి బైడెన్ గెలుస్తాడనే అనిపిస్తున్నది. కానీ వచ్చే ఇరవై, ముప్పయ్ రోజుల్లో ఏమైనా జరగవచ్చు. చెప్పలేం.

మయాంక్ ఛాయ అనే జర్నలిస్టు ఇండియన్ అమెరికన్స్ ఎట్లా ఓటు వేయబోతున్నారనే అంశంపైన సర్వే ఫలితాలతో ఏకీభవించలేదు. కమలాహారిస్ భారతీయులు ఊహించినంత అనుకూలంగా ఉండకపోవచ్చునంటూ వ్యాఖ్యానించారు.

ఎస్ క్యూబ్ ఎడిటోరియల్ డైరెక్టర్ పూర్ణిమాశర్మ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ ముఖేష్ అధీ, 24 కోట్ల మంది ఓటర్లలో 1.8 కోట్లు ఉన్న ఇండియన్ అమెరికన్ల ప్రభావం ఎన్నికలపైన అంతగా ఉండబోదనీ, కాకపోతే ఎన్నికలలో ప్రచారం చేయడంలోనూ, నిధుల సమీకరణలోనూ, నిధులు ఇవ్వడంలోనూ ఇండియన్ అమెరికన్స్ ముందుంటారు కాబట్టి వారికి ఎన్నికల సమయంలో ప్రాధాన్యం లభిస్తుందని అన్నారు.

కశ్మీర్, సీఏఏపై బైడన్ వ్యాఖ్యలు

బైడెన్ మానవహక్కుల గురించి పట్టించుకుంటారన్న మాట వాస్తవమే కానీ ప్రెసిడెంట్ బుష్ రెండో టరమ్ లోనే కదా ఇండియా-అమెరికా సంబంధాలు అనూహ్యంగా బలపడింది అని ప్యానెల్ సభ్యుడు మనీష్ చంద్ గుర్తు చేశారు. మనీష్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ ముఖేష్ అఘీ, రిపబ్లికన్ అయినా డెమాక్రాటిక్ అయినా ఎవరి హయాంలో వాణిజ్య సంబంధాలూ, రక్షణ సంబంధాలు పెరుగుతాయన్నది ముఖ్యం. ఇండియా చాలా ముఖ్యమైన భాగస్వామి అంటూ బైడెన్ ఇప్పటికే ప్రకటించారు. ఆరోగ్యం, ఇమిగ్రేషన్, తదితర సంబంధాల విషయంలో బైడెన్ సుముఖంగా ఉంటారు. విదేశాంగ విధానం విషయంలో మాత్రం ట్రంప్ ఇప్పటికే భారత్ కు ఒక ముఖ్యమైన భూమికను నిర్దేశించారు. లఢాఖ్ లో చైనా దురాక్రమణ చేస్తున్న సందర్భంలో ట్రంప్ భారత్ కు బేషరతుగా మద్దతు పలికారు. భారత్-అమెరికా సంబంధాలు అమెరికా-చైనా సంబంధాలపైన ఆధారపడి ఉంటాయి. ప్రస్తుతానికి చైనాతో అమెరికా సంబంధాలు బాగా లేవు. అవి క్రమంగా క్షీణిస్తాయే కానీ మెరుగు కాజాలవు. అందువల్ల భారత్ తో వ్యూహాత్మకమైన సంబంధాలు పెట్టుకోవాలని అమెరికా ఆశిస్తున్నది.

అమెరికా ప్రభుత్వంపై ఇండియన్ అమెరికన్స్ ప్రభావం ఏదీ?

హెచ్ 1 బీ వీసాల విషయంలో, సీఏఏ, కశ్మీర్ విషయంలో అమెరికా ప్రభుత్వంపైన ఇండియన్ అమెరికన్స్ ప్రభావం ఎందుకు చూపలేకపోయారంటూ సూర్య జీడిగుంట అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ రమేష్ కపూర్, అమెరికా రాజకీయ నేతలతో ఉద్యోగాలను ఔట్ సోర్స్ చేయడం సమంజసమే అనే మాట మాట్లాడించలేమని చెప్పారు. భారత దేశం వేయి సంవత్సరాలు మొఘల్ చక్రవర్తుల పాలనలో ఉన్న సంగతీ, రెండు వందల ఏళ్ళు బ్రిటిష్ పాలనలో ఉన్న సంగతీ గుర్తు చేస్తూ, అమెరికా రాజకీయ నాయకులతో ఇండియా గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడలేమని, సమయం, సందర్భం చూసుకొని మాట్లాడాలనీ  అన్నారు. కమలాహారిస్ కూడా సమయం వచ్చినప్పుడు మాత్రమే భారత్ కు అనుకూలంగా మాట్లాడగలదనీ, అన్ని విషయాలలో భారత్ ను వెనకేసుకొని రాబోరనీ చెప్పారు. సీఏఏ గురించి మాట్లాడుతూ, జనాభాలో 14 శాతం ఉన్న ముస్లింలను పట్టించుకోకుండా కేవలం హిందువుల ప్రయోజనాల గురించే పాకులాడిన పక్షంలో బైడెన్ వంటి డెమాక్రాట్లు సమర్థించరనీ, కశ్మీర్ విషయంలో కూడా అదే వర్తిస్తుందనీ రమేష్ స్పష్టం చేశారు. బైడెన్ హుందాగా, స్థిరంగా భారత్ పక్షాన నిలబడతాడని ముఖేష్ అఘీ అన్నారు. భారత వ్యవసాయ రంగాన్ని అమెరికా కంపెనీలకు చేరువ చేయడం, మరిన్ని వాణిజ్య ఒప్పందాలు కుదుర్చుకోవడం ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు మెరుగు అవుతాయనీ అన్నారు.

జయశంకర్ వ్యాఖ్యపై చర్చ

ఇండియా ప్రాముఖ్యం బాగా పెరిగిందనీ, నవంబర్ ఎన్నికలలో ట్రంప్ గెలిచినా, బైడెన్ గెలిచినా ఒకటేననీ, ఇద్దరిలో ఎవరు గెలిచినా ఇండియాతో సత్సంబంధాలు కొనసాగుతాయనీ భారత విదేశాంగమంత్రి జయశంకర్ అనడంపైన వ్యాఖ్యానిస్తూ, విదేశాంగమంత్రి చెప్పింది నిజమేనని మనీష్ గుప్తా అన్నారు.

లోగడ బైడెన్ ముంబయ్ సందర్శించినప్పుడు భారత్-అమెరికా మధ్య వాణిజ్యం 500 బిలియన్ల స్థాయికి పెరగాలనే అభిలాషను వెలిబుచ్చారు. ఇప్పటికీ ఇండియాతో వ్యాపారం చేస్తున్న దేశాలలో అమెరికాదే అగ్రస్ఠానమనీ, ప్రస్తుతం 150 బిలియన్ డాలర్ల వాణిజ్యం రెండు దేశాల మధ్య సాగుతున్నదనీ, ఇది మరింత పెరుగుతుందనీ విదేశీ విలేఖరుల క్లబ్ అధ్యక్షుడు ఎస్ వెంకట్ నారాయణ్ వ్యాఖ్యానించారు. ట్రంప్ కూ, బైడెన్ కు తేడా ఉన్నదనీ, ట్రంప్ అమెరికన్ ప్రెసిడెంట్ లాగా కాకుండా ఫక్తు వ్యాపారిలాగా ఉంటారనీ, బైడెన్ అందుకు భిన్నంగా హుందాగా, అమెరికా అధ్యక్షుడిలాగా దర్పం ఉట్టిపడే విధంగా ఉంటారనీ అన్నారు. ఇప్పటికే రిపబ్లికన్ అధ్యక్ష, ఉపాధ్యక్ష అభ్యర్థులకూ, డెమాక్రాట్ అభ్యర్థులకూ మధ్య డెమాక్రాట్లకు అనుకూలంగా పది శాతం వ్యత్యాసం ఉన్నదనీ, ఇటీవల జరిగిన మొదటి డిబేట్ లో ట్రంప్ దారుణంగా విఫలమైనారనీ వెంకట్ నారాయణ్ అన్నారు. ఈ సారి బైడెన్, కమలాహారిస్ గెలుపొందడమే కాకుండా 2024లో కమలాహారిస్ కు అధ్యక్ష పదవికి పోటీ చేసే అవకాశం వస్తుందని కూడా వెంకట్ నారాయణ్ నమ్మకంగా చెప్పారు.

చైనా ప్రస్తావనే ఎందుకు?

అమెరికా ఎన్నికలలో అభ్యర్థులూ, ప్రజలూ చైనా గురించి మాట్లాడతారు కానీ ఇండియా గురించి ఎందుకు మాట్లాడరో చెప్పగలరా అంటూ మునీష్ గుప్తా ప్రశ్నించారు. ఇండియా గురించి మాట్లాడకపోయినా బాధ లేదనీ, చైనా గురించి కోపంగా, శత్రుభావంతో మాట్లాడతారనీ, ఉద్యోగాలు కొల్లగొట్టిందనీ, సాంకేతిక పరిజ్ఞానాన్ని దొంగిలించిందనీ చైనాను తిట్టుకుంటారనీ ముఖేష్ అధీ అన్నారు. చైనాతో అమెరికా శత్రుత్వం పెరిగే కొద్దీ అమెరికాకు ఇండియా దగ్గర అవుతుందనీ, ఇప్పటికే రెండు దేశాల మధ్యా 40 సంయుక్త సంఘాలు పని చేస్తున్నాయనీ, వీటి సంఖ్య పెరుగుతుందనీ ముఖేష్ చెప్పారు. సాంకేతికరంగంలోనే కాకుండా ఆరోగ్యం,తదితర రంగాలలో కూడా రెండు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతాయనీ ప్రియా సామంత్ అన్నారు.

 ‘బైడెన్ టీంలో 50 మంది ఇండియన్ అమెరికన్స్’

ధన్యవాదాలు చెబుతూ వెంకట్ నారాయణ్, ఒబామా అధ్యక్షుడిగా ఉన్న రోజులలో ఆయన బృందంలో నలభై మంది ఇండియన్ అమెరికన్స్ ఉండేవారనీ, ఈ సారి బైడెన్ టీం లో యాభై మంది ఇండియన్ అమెరికన్స్ ఉండాలని కోరుకుంటున్నాననీ అన్నారు. అక్కడ సగటు ఇండియన్ అమెరికన్ ఆదాయం సగటు తెల్ల అమెరికన్ ఆదాయానికి రెట్టింపు ఉంటుందనీ, ఏటా రెండు లక్షల మంది భారత విద్యార్థులు అమెరికా వెళ్ళి ఆరు బిలియన్ డాలర్లు ఖర్చు చేసి చదువుకుంటారనీ, పది లక్షల మంది భారత టూరిస్టులు అమెరికా ప్రతి సంవత్సరం వెడతారనీ, అమెరికాలో భారతీయుల ఆధిక్యానికి తిరుగులేదనీ, ఐక్యరాజ్య సమితికి వెళ్ళి చూసినా అక్కడ భారతీయులే కనిపిస్తారనీ వెంకట్ నారాయణ్ అన్నారు. నవంబర్  3న జరిగే ఎన్నికలలో బైడెన్, కమలాహారిస్ లు గెలుపొందితే అది అమెరికాకూ, భారత్ కూ, ప్రపంచానికీ, భూగోళంపైన నివసిస్తున్న ప్రతి ఒక్కరికీ మంచిదని చెబుతూ విజ్ఞానదాయకంగా, ఆసక్తికరంగా జరిగిన చర్చను ముగించారు.

(అక్టోబర్ 3, అమెరికా ఎన్నికలకు సరిగ్గా ఒక నెలరోజుల ముందు, అమెరికా ఎన్నికలపైన  దక్షిణాసియా విదేశీ విలేఖరుల క్లబ్ (ఎఫ్ సీసీ సౌత్ ఏసియా) నిర్వహించిన వెబినార్ (గోష్ఠి) లో వెల్లడైన అభిప్రాయాలపై నివేదిక.)

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles