‘ఆలోచనలేని వ్యక్తితో చర్చించడం అంటే, చనిపోయిన మనిషి శరీరంలోకి ఔషధాన్ని ఇంజెక్ట్ చేయడం లాంటిది.’
–థామస్ పెయిన్ (1737-1809)
అమెరికన్ తత్త్వవేత్త, రాజకీయ సిద్ధాంతకర్త
దళితుల చేతిలో నీళ్ళు తాగడానికి నిరాకరించిన ఈ దేశంలోని పెద్దమనుషులు ఈ రోజు ఒక జంతువు మూత్రం సంతోషంగా తాగుతున్నారు. దేశం ఎంత ముందుకు పోతూ ఉందో, ఎంత వెలిగిపోతూ ఉందో ప్రపంచం గమనిస్తూనే ఉంది. గోమూత్రం అంత పవిత్రమైనదే అయితే, దేవుళ్ళ అభిషేకాలకు ఎందుకు వాడడం లేదూ? అని నేటి యువతరం ఒక ప్రశ్నను సంధిస్తోంది. సరస్వతి శిశుమందర్ ల పేరుతో ఆర్ఎస్సెస్ వారు లక్షలాది ఆదివాసీ బాలబాలికల పసి మనసుల్ని కలుషితం చేస్తున్నారు. జరగబోయే ప్రమాదాన్ని గ్రహించి జాగ్రత్తపడాల్సి ఉంది. అయినా విద్యాలయాలపై దాడులు, యూనివర్శిటీలై దాడులు వీరికి కొత్తకాదు. లోగడ నలంద, విక్రమశిల, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలను ధ్వంసం చేసింది వీరి పూర్వీకులేనన్నది గమనించాలి! ఇటీవల జెఎన్ యూపై దాడులు కూడా ఎవరు చేయించారో అందరికీ తెలిసిన విషయమే.
Also read: ఒక అద్భుతం!
నెల్సన్ మండేలా వ్యాఖ్య
ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న్ ఇలాంటి దాడుల్ని దృష్టిలో పెట్టుకుని దక్షిణ ఆఫ్రికా నల్లజాతి తొలి అధ్యక్షుడు, జాతి వివక్షపై జీవితాంతం పోరాడిన విప్లవ వీరుడు నెల్సన్ మండేలా ఇలా అన్నారు: ‘‘మన ప్రపంచం జాతి, మత, రంగు, లింగ భేదాలతో విభజింపబడి లేదు. కేవలం వివేకవంతులు-మూర్ఖులు అని రెండు రకాలుగా మాత్రమే విభజింపబడి ఉంది. మూర్ఖులే జాతి, మత, రంగు, లింగ భేదాలతో తమని తాము విభజించుకున్నారు.’’ ప్రపంచంలో సుమారు 192 దేశాలున్నాయి. అందులో 750 కోట్ల జనాభా ఉంది. వీరికి 4200 మతాలున్నాయి. అయితే ఇందులో ఏ ఒక్క మతమూ మనుషులంతా సమానులని చెప్పలేకపోయింది. పోనీ సమానులుగా ఉంచలేకపోయింది. దానికి కారణమేమిటీ? అని ఇకనైనా మనం ఆలోచించుకోవాలి కదా? మతం అణిచివేయబడ్డ జీవి నిట్టూర్పు. హృదయం లేని ప్రపంచంలో హృదయం లాంటిదది – స్ఫూర్తి లేని ప్రపంచంలో స్ఫూర్తిలాంటిదని కొందరు అభిప్రాయపడతారు. ఏది ఏమైనా ఒకరకంగా మతం ప్రజల పాలిట మత్తుమందు. అనందంగా ఉన్నామని భ్రమలు కల్పించే మతం రద్దు కావాలంటే నిజజీవితంలో నిజమైన ఆనందం సాధించబడాలి. ఆ నియమైన ‘ఆనందం’ సాధించబడాలంటే ఏం చేయాలోమార్క్సు-ఏంగెల్స్ చెప్పారు. ‘‘మత భావనలు బలంగా కొనసాగడానికి అదృష్టం, అతీతశక్తులు, దేవుళ్ళపై నమ్మకాలకు భౌతిక పునాది ఏమిటీ మనం అర్థం చేసుకోవాలి.. వాటిని రూపుమాపి, భావజాలపోరాటం కూడా జోడిస్తే…అప్పుడు మనిషికి మతం అవసరం తొలగిపోతుంది. మతం అంతరించిపోతుంది,’’ అన్నాడు మార్క్స్. ‘‘మతాన్ని తొలగించాలంటే మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి. సమాజంలోని దోపిడిని వ్యతిరేకించి పోరాడకుండా – దాని ప్రతిబింబమైన మతంపై పోరాడడం వలన ఉపయోగముండదు’’- అని చెప్పాడు ఏంగిల్స్.
Also read: చారిత్రాత్మక అవార్డు వాపసీకి అయిదేళ్ళు!
మనిషికి మతం అవసరం లేని పరిస్థితులు కల్పిస్తున్నామా?
ఆ మహానుభావుల అభిప్రాయాలు మనకు శిరోధార్యమే. కాని స్వాతంత్ర్యానంతరం ఈ దేశంలో యేం జరుగుతూ వస్తోందో మనకు తెలుసు. మనిషికి మతం అవసరం లేని పరిస్థితిని ప్రభుత్వాలు గాని, రాజకీయ పార్టీలు గాని, సామాన్య పౌరులుగానీ కల్పించే ప్రయత్నం చేస్తున్నాయా?/చేస్తున్నారా? ఒక సారి ఆలోచించండి! దేవుడు, దయ్యం, మతాల జోలికి పోకుండా ఇన్నేళ్ళూ వామపక్షాలు దోపిడిని నవ్యతిరేకిస్తూ పోరాటాలు చేస్తున్నాయి. అది సరిపోవడం లేదు కదా? ఏమైనా మంచి ఫలితాలు వచ్చాయా? ‘మతం సృష్టించిన పరిస్థితుల్ని తొలగించాలి’ – అని అన్నాడు ఏంగిల్స్. మరి ఈ దేశంలో వామపక్షాలు ఆ పని చేస్తూ వచ్చాయా? మతం సృష్టించిన పరిస్థితులు తొలగించాలంటే, తప్పకుండా జనంలో వైజ్ఞానిక స్పృహ పెంచడం అవసరం. ఆ దిశలో వామపక్షాలు ఎందుకు కృషి చేయడం లేదూ? ఎంత సేపూ పోరాటాలు, హక్కులు, ధర్నాల దగ్గరే గిరిగీసుకుని ఉన్నాయే? మతం/దేవుడు/మూఢనమ్మకాలు వంటి అంశాల్ని ఎందుకు వదిలేశారూ? ఇక్కడ వామపక్షాల గూర్చి మాట్లాడడమెందుకేం- చేస్తే, అంతో ఇంతో అవే చేయాలి! బూర్జువా రాజకీయ పార్టీలు ఇలాంటి విషయాలు పట్టించుకోవు. వారు నోట్లు పంచి ఓట్లు దండుకునే పనిలో తీరిక లేకుండా ఉంటారు. అధికారం చేజిక్కించుకోవడానికి దిగజారిన రాజకీయాలు చేస్తూ ఊపిరి సలపనంత బిజీగా ఉంటారు. వారితో ప్రజాచైతన్య కార్యక్రమాలు జరుగుతాయని ఊహించలేం.
Also read: నాటి దీపదానోత్సవమే నేటి దీపావళి!
వాగ్దానాలు నెరవేర్చలేని నిస్సహాయులు
బూర్జువా నాయకుల ప్రకటనలు – పనితీరు ఏవిధంగా ఉంటుందో అందరికీ తెలిసిందే. అయినా ఇక్కడ కొన్ని విషయాలు గుర్తు చేస్తున్నాను. 2019లో రామమందిరం కట్టలేకపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానన్నాడు సాక్షిమహరాజ్. రామమందిరం కట్టిందీ లేదు. ఆయన రాజకీయాలు వదిలి వెళ్లిందీ లేదు. 2018లోపు గంగానదిని శుభ్రం చేయించలేక పోతే జలసమాధి చేసుకుంటానన్నది – ఉమాభారతి. గంగానదిని శుభ్రం చేయించిందీ లేదు. ఆమె తనను తాను జలసమాధి చేసుకున్నదీ లేదు. వంద రోజుల్లో నల్లధనం వెలికి తీయలేకపోతే నన్ను ఉరితీయండి! అని అన్నాడు ఈ దేశ ప్రధాని. ఆ ప్రధాని పీఠమ్మీద ఇప్పటికీ 7-8 ఏళ్ళుగా కూర్చున్నా, ఆ పని చేలేక- నిస్సహాయుడిగా మిగిలిపోయాడు. పైగా ప్రతి బారతీయుడి అకౌంట్లో పదిహేను లక్షలు వేస్తానన్న ఆ పెద్దమనిషి నిజాయితీని – ఏమని పిలుద్దాం? బీజేపీ పాలిత రాష్ట్రాలలో హత్యలు/లైంగిక దాడులు/ కిడ్నాపులు/ దళితులపై దాడులు అత్యధిక సంఖ్యలో ఉన్నాయి. వాటికి బాధ్యులైనవారు, దేశ ప్రజలనుద్దేశించి వివరణలు ఇవ్వాలి కదా? మరి ఏమైందీ?
Also read: శాస్త్రీయ అవగాహన పెంచిన కొడవటిగంటి వ్యాసాలు
బ్యాంకులను దోచుకున్న వ్యాపారవేత్తలు
దేశంలో పన్ను చెల్లింపుదారుల డబ్బును వివిధ బ్యాంకుల్లోంచి దోచుకుని పారిపోయిన భారతీయ వ్యాపారవేత్తలు ముఖ్యంగా ఇరవై ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరూ ముస్లింలు లేరు, దళితుల్లేరు, బహుజనుల్లేరు. పోనీ నక్సలైట్లో, అర్బన్ నక్సల్సో ఉన్నారా అంటే వాళ్ళు కూడా లేరు. కేవలం గుజరాత్ కు చెందినవారే ఉన్నారు. వారంతా కలిసి దోచుకున్నది పదిలక్షలు కాదు. పది లక్షల కోట్లు ‘మాత్రమే’! మరి ఈ దేశ కాపలాదారు ఏమయ్యాడూ? ఇంకా చాయ్ అమ్ముకుంటూనే దేశాలు పట్టుకొని తిరుగుతున్నాడా? లేక దేశీయ సంస్థల్ని ప్రయివేటు వారికి అమ్ముకుంటూ దేశమంతా తిరుగుతున్నాడా? పెంచిన గడ్డానికో మాస్క్ తగిలించుకుని, ఎలక్షన్ ర్యాలీలు తీస్తూ, కుంభమేళాలు జరిపిస్తూ కరోనా వ్యాప్తిలో తలమునకలై ఉన్నాడా?ఏం చేస్తున్నట్టూ? ప్రతి ఎకౌంట్ లో పదిహేను లక్షలు వేయడం తర్వాతి మాట. ముందు సగటు మనిషి ఎకౌంట్లో మూడునాలుగు వేలు కూడా లేకుండా చేయడానికి పథకాలు రచిస్తున్నాడా? మిగతా పాలకులు ఏమయ్యారూ? వ్యవస్థలు ఏమయ్యాయీ? దేశం చుట్టూ ఉన్న మూడు సముద్రాల్లో ఈ దేశాన్ని ఏ సముద్రంలో ముంచబోతున్నారూ?
Also read: ఇన్సాన్ కి ఔలాద్ హై ఇన్సాన్ బనేగా!
దేశాన్ని ముంచిన వ్యాపారవేత్తల పేర్లు : 1. విజయ మాల్యా 2. మెహుల్ చోక్సీ 3. నీరవ్ మోదీ 4. నిషన్ మోదీ 5. పుష్పేష్ బైద్య 6. ఆశిష్ 7.సన్నీ కల్రా 8. ఆర్తి కల్రా. 9. సుంజయ్ కల్రా 10. వర్షాకల్రా 11 సుధీర్ కల్రా 12. జతన్ మెహతా 13. ఉమేష్ పరిఖ్ 14.కమలేశ్ పరిఖ్ 15.నీలేశ్ పరిఖ్ 16. వినయ్ మిట్టల్ 17. ఏకలవ్యా గార్గ్ 18. చేతన్ లాల్ 19. నితిన్ లాల్ 20. దీప్తి బెన్ చేతన్ 21. సవియా సేఠ్ 22. రాజీవ్ గోయెల్ 23. అల్కా గోయల్ 24. లలిత్ మోదీ 25. రితేష్ జైన్ 26. హితేశ్ పటేల్ 27. మయూరీ బెన్ 28. ఆశిష్ భాయ్ – పారిపోయే దొంగల్ని చౌకీదార్ నిలదీయ లేదంటే, పట్టుకోలేదంటే, విజిలేసి, నలుగుర్ని కేకేసి గోలగోల చేయలేదంటే ఏమిటి అర్థం? చౌకీదార్ దొంగలతో లలూచీపట్డాడని కదా అర్థం? ఇక్కడ ఒక్క చౌకీదారంటే చౌకీదారనే కాదు. ఆ స్థానంలో ఉన్న వ్యవస్థలు/ప్రభుత్వాధినేతలు అందరికందరూ దోషులే నన్నది ఈ దేశ ప్రజల తీర్పు. అయితే దానికి కారణం చౌకీదార్ – అతని టీం మాత్రమే కాదు. అనాలోచితంగానో, డబ్బుకు ఆశపడో అనర్హులను/అసమర్థులను ఎన్నుకున్న తప్పు ఎవరిదీ? ఈ దేశ మూర్ఖ ప్రజలది కాదా? ఎవరికి వారు ఆలోచించాలి!
Also read: దళితుల రక్షణకోసం అవార్డు వాపసీ
ప్రజలు చేస్తున్న దుర్మార్గం
ఈ దేశ ప్రజలు చేస్తున్న దుర్మార్గమైన పని ఏమిటంటే చదువు లేని అవివేకుల్ని పలుమార్లు గెలిపిస్తారు. తీవ్రవాద ఆరోపణలున్నవారినీ గెలిపిస్తారు. ఇళ్ళలో దూరి దౌర్జన్యాలు చేసే గూండాలను గెలిపిస్తారు. అసెంబ్లీలో కూర్చుని నీలిచిత్రాలు చూసే హీనుణ్ణీ గెలిపిస్తారు. ఇక రేపిస్టులనైతే చాలా ఘనంగా గెలిపిస్తారు. ఇలాంటి పనికి మాలిన వాళ్ళని గెలిపించి – పైగా లబోదిబోమంటుంటారు. ‘‘అయ్యో! నాయకులు మమ్మల్ని పట్టించుకోవడం లేదని..ఏడుస్తూ పెడబొబ్బలు పెడతారు. అవన్నీ అవసరమా? విద్యావంతులకు, వివేకవంతులకు –సమర్థులకు, నీతినిజాయితీ, నిబద్దతా గల యువతీయువకులకు దేశంలో కొదవ లేదు. దేశాన్ని కాపాడుకోవడానికి వీళ్ళంతా బయటికి రావాలి. ధైర్యంగా ప్రస్తత పరిస్థితుల్ని ఎదుర్కోవాలి! జనం వారికి అండగా నిలబడి గెలిపించాలి. దేశం బాగుపడాలంటే అదొక్కటే మార్గం.
Also read: బహుజన చక్రవర్తి అశోకుడు ఎందుకు ‘గ్రేట్’?
అయినా తరతరాలుగా మెదళ్ళలో కులమతాల, వర్గవర్ణాల, లింగ రంగు భేదాల మకిలి పేరుకుపోయి ఉంటే – వివేకం, సమానత్వం ఎలా సాధ్యం? సైన్సు గాడ్జెట్లు వాడుతున్నాం కదా? ఇక ఆధునికులమై పోయినట్టే అని అనుకుంటే అది బుద్ధితక్కువే అవుతుంది. పైగా ప్రతి పనికిమాలిన వాడూ మనోభావాల గూర్చి మాట్లాడడం ఫ్యాషనైపోయింది. ఏదో ఇతరులెవ్వరికీ మనోభావాలు ఉండవన్నట్లు- అందువల్ల కొంచెం ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించి – హేతుబద్ధంగా ఆలోచించడం ప్రారంభిస్తే, వైజ్ఞానికి స్పృహ అంటే ఏమిటో తెలుస్తుంది. అది తెలిసినవారిని మనోభావాలు బాధించవు. ప్రతి విషయాన్నీ మనోబలంతో విశ్లేషించుకోగలిగే స్థోమత వస్తుంది. స్థాయి పెరుగుతుంది.
Also read: ‘విశ్వాసవ్యవస్థ’లోంచి-ఆత్మవిశ్వాసంలోకి….