Tuesday, November 5, 2024

కమ్మవారంతా కలిస్తే….?

వోలేటి దివాకర్

టిడిపి అధినేత నారా చంద్రబాబునాయుడు అరెస్టు తరువాత నందమూరి బాలకృష్ణ స్టైల్లో ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని కమ్మ సామాజిక వర్గం వారంతా తమ బ్రీడు వేరు…తమ బ్లడ్ వేరు అన్నట్లుగా ప్రచారం చేసుకుంటున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణా ఎన్నికల్లో ఈ పరిణామం స్పష్టంగా కనిపిస్తోంది. చంద్రబాబు అరెస్టును సరైన రీతిలో ఖండించలేదని, చంద్రబాబు అరెస్టుకు నిరసనగా హైదరాబాద్ లోని ఓఆర్ఆర్, హైటెక్ సిటీ, మెట్రో రైళ్లలో నిరసనలకు తెలంగాణాలోని బిఆర్ఎస్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో పాటు చంద్రబాబు అరెస్టు వ్యవహారాన్ని ఆంధ్రాలో చూసుకోవాలని ముఖ్యమంత్రి కెసిఆర్ తనయుడు కెటిఆర్ వ్యాఖ్యానించడం కమ్మ సామాజిక వర్గీయుల కోపానికి కారణమైంది. దీంతో ఏకతాటి పైకి వచ్చిన కమ్మలంతా ఈ ఎన్నికల్లో బిఆర్ఎస్ ను ఓడించాలని  కంకణం కట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు తీవ్రంగా వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీని ఈ ఎన్నికల్లో గెలిపించాలని వారంతా ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు. హైదరాబాద్ లో సమావేశమై కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు ఆర్థిక మద్దతు ఇచ్చేందుకు వారంతా సిద్ధమయ్యారు. బిఆర్ఎస్ నుంచి పోటీ చేస్తున్న కమ్మ సామాజిక వర్గీయులకు కూడా ఏ విధంగానూ మద్దతు ఇవ్వరాదని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు. ఆసామాజిక వర్గానికి చెందిన మీడియా సంస్థలు కూడా పరోక్షంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం గమనార్హం. తెలంగాణా పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చంద్రబాబునాయుడు ప్రియ శిష్యుడు కావడం కూడా ఇందుకు ఒక కారణం కావచ్చు. ఈపరిణామాలు తెలంగాణా ఎన్నికల్లో ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో డిసెంబర్ 3వ తేదీన తేలిపోనుంది.

మేమంతా ఒక్కటే అంటే…

మేమంతా ఒకటే అంటే మిగతావారంతా వేరనే అర్థం ధ్వనిస్తుంది. ఇది ఇతర కులాలకు కమ్మ సామాజిక వర్గీయులు ఒకరకంగా మార్గదర్శకంగా నిలిచినట్టే. ఆర్థిక క్రమశిక్షణ, కష్టపడే తత్వం, అంతర్గత ఐక్యత, వ్యాపారాల నిర్వహణ కౌశలం, సౌమ్యత, వ్యసనాలకు దూరంగా ఉండటం వంటి లక్షణాలతో ఇప్పటికే కమ్మవారు ఇతర కూలాలకు మార్గదర్శకంగా ఉన్నారు. అందువల్లే ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అన్ని రంగాల్లో రెడ్ల కన్నా ముందుకు దూసుకుని వచ్చారు.

అయితే కమ్మ సామాజిక వర్గీయుల మేమంతా ఒక్కటీ అన్న కట్టుబాటు వల్ల ఇతర సామాజిక వర్గాలు వారికి దూరమయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ప్రభావం ఎన్నికల్లో కనిపిస్తే నష్టపోయేది జనాభా పరంగా  మైనార్టీలో ఉన్న జనాభావారే. ఇప్పటికే కూకట్ పల్లి వంటి ప్రాంతాల్లో కుల ప్రభావం తీవ్రంగా ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు. కమ్మవారంతా ఒకవైపు, మిగిలిన వర్గాలన్నీ ఒకవైపు నిలిచారని చెబుతున్నారు. తెలంగాణాలో కమ్మ సామాజిక వర్గీయులు మొత్తం మీద ఒక్కశాతానికి మించరు. వీరిలో ఎక్కువగా సెటిలర్లే. హైదరాబాద్ లోని కూకట్ పల్లి వంటి ఒకటి, రెండు నియోజకవర్గాలతో పాటు, నల్గొండ, నిజామాబాద్ జిల్లాలో కమ్మ సామాజిక వర్గీయులు ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. రెడ్లు ఎలాగూ కాంగ్రెస్ వైపే ఉన్నా.. కమ్మవారి కట్టుబాబును ఆదర్శంగా తీసుకుని, తెలంగాణాలో బలంగా ఉన్న వెలమలు, మున్నూరు కాపులు, ఇతర బీసీ వర్గాలు, ఎస్సీ కులాలు కూడా బిఆర్ఎస్  బీజేపీవైపు నిలిస్తే అంతిమంగా నష్టపోయేది కాంగ్రెస్ పార్టీయే. తెలంగాణా ఉద్యమ సమయంలో వచ్చినట్లు స్థానిక, స్థానికేతర అంశం మళ్లీ తెరపైకి వస్తే ఫలితాలు బిఆర్ఎస్ కు అనుకూలంగా మారే అవ కాశాలు ఉన్నాయి. అదే జరిగితే కెసిఆర్, కెటిఆర్ తెలంగాణాలోని కమ్మ వారిని లక్ష్యంగా చేసుకునే ప్రమాదం ఉంటుంది.

మిగిలిన సామాజికవర్గాలతో పోల్చితే మైనారిటీలే…

తెలంగాణాలో కన్నా ఆంధ్రాలో కమ్మ సామాజిక వర్గీయులు సంఖ్యాపరంగా ఎక్కువగా ఉన్నారు. అయినా మిగిలిన వర్గాలతో పోలిస్తే మైనార్టీలే. మరో ఆరునెలల్లో ఆంధ్రా ఎన్నికలు రానున్నాయి. ఎపిలో అధికార వై ఎస్సార్ సిపి ఓడిపోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను గద్దె దింపాలని, టిడిపి తిరిగి అధికారంలోకి రావాలని వారు కోరుకుంటున్నారు. ఇదే లక్ష్యంతో కాపు సామాజిక వర్గీయులు ఎక్కువగా అభిమానించే జన సేన పార్టీతో ఇప్పటికే పొత్తు పెట్టుకున్నారు. తెలంగాణా తరహాలో ఎపిలో కూడా కుల కట్టుబాటును ప్రదర్శిస్తే మాత్రం కమ్మవారికి మళ్లీ ఇబ్బందులు తప్పకపోవచ్చు. ఈ కట్టుబాటు విధానం ఇతర  ఇతర కులాలన్నీ ఏకమయ్యేందుకు పరోక్షంగా వైఎస్సార్ సిపికి విజయానికి దోహదం చేసే అవకాశాలు ఉంటాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. తెలంగాణాలో కమ్మ వారు అనుసరించిన విధానాన్ని ఆంధ్రాలో కూడా అమలు చేస్తే జగన్ నెత్తిన పాలుపోసినట్టేనని ఒక సీనియర్ జర్నలిస్టు విశ్లేషించారు.

Voleti Diwakar
Voleti Diwakar
వోలేటి దివాకర్ ఆంధ్రభూమి దినపత్రికలో రాజమహేంద్రవరం కేంద్రంలో రెండు దశాబ్దాలకు పైగా పని చేశారు. అంతకు ముందు స్థానిక దినపత్రికలో పని చేశారు. గోదావరి పుష్కరాలు సహా అనేక రాజకీయ, సాంస్కృతిక, సామాజిక ఘట్టాలపై వార్తారచన చేశారు. ప్రస్తుతం ఆన్ లైన్ పత్రికలకు వార్తలూ, వ్యాఖ్యలూ రాస్తున్నారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles