Thursday, November 21, 2024

చదువురాని అవివేకులు పాలకులైతే?

‘‘పుస్తకాల గది నుంచి వచ్చేవారే ఈ సమాజానికి అవసరం. పూజగది నుంచి వచ్చేవారు బహుశా పునర్జన్మలకు మాత్రమే అవసరమేమో’’

-ఆర్దర్ జాన్, అమెరికన్ సౌకియాట్రిస్ట్.

పుస్తకాల గురించి, పుస్తకాలు చదవడంలోని ఆనందం గురించి భారత రాజ్యాంగ నిర్మాత డా. బి. ఆర్. అంబేడ్కర్ ఇలా రాసుకున్నారు-పుస్తక ప్రేమికులకు అధ్యయన శీలురకు ఆయన మాటలు తప్పకుండా స్ఫూర్తినిస్తాయి – ‘‘నేను చదివిన పుస్తకంలోని తత్త్వాన్ని బయటకు తీస్తాను. అవసరం లేని భాగాన్ని వదిలేస్తాను. ‘జ్ఞానం అనేది శక్తి. ఆనంద సాధనం’-అన్న హైంజలైట్ అన్నమాటలు అక్షర సత్యం! పుస్తకం చదవడం మొటలు పెట్టగానే నాకు అనంతమైన సుఖానుభవం కలుగుతుంది. చదవడంలో నాకు కలిగే ఆనందం వర్ణింపనలవికానిది. నాకు బాధ కలిగించే విషయమేమంటే చాలామంది మనవాళ్ళు చదవరు. అధ్యయనం లేకుండా జ్ఞానం – జ్ఞానం లేకుండా శక్తీ రావు. ఎవరితోనైనా తలపడే ముందు మనం జ్ఞానంతో, శక్తియుక్తులతో సమర్థవంతంగా ఉండాలి. ప్రతి ఒక్కరూ చదివే అభిరుచిని పెంచుకోవాలి. నేను వెనిస్ నుండి బొంబాయికి ప్రయాణిస్తూ ఆరు రోజుల్లో ఎనిమిది వేల పేజీలు చదివాను.మరోసారి అరవై నాలుగు గంటపాటు ఒక పుస్తకాన్ని అది పూర్తయ్యే వరకూ చదివాను.

Also read: అంబేడ్కర్ : బౌద్ధ ప్రమాణాలు

పుస్తకాలు దీపాల వంటివి. అవి మనో మాలిన్యమనే చీకటిని తొలగిస్తాయి. నేను నా భార్యాబిడ్డల కంటే పుస్తకాలనే ఎక్కువగా ప్రేమిస్తాను. విద్యావికాసాలు పొందాలి. విద్యావికాసాల్ని ఇతరులకు అందించాలి. అంతర్గతంగా ఆందోళన పడాలి. మార్పుకోసం ఆందోళన చేయాలి. సంఘటిత పడాలి. సమైక్యంగా ముందుకు సాగాలి. ఒక దేవాలయ నిర్మాణం కంటే ఒక గ్రంథాలయ నిర్మాణం ఎన్నోలక్షల రెట్లు గొప్పది. దేవాలయం ముష్టివాళ్ళను సృష్టిస్తే గ్రంథాలయం దేశాన్ని మార్చే మహావీరుల్ని సృష్టిస్తుంది’’ అని అన్నారు డా. బి. ఆర్. అంబేడ్కర్. మానవీయ విలువల దృష్టికోణంతో అంబేడ్కర్ కృషిని బేరీజు వేస్తే అది ఇలా ఉంటుంది:

‘‘ఇన్సానోంకొ గులాం బనాకర్/హజారో బాదుషా బనే హై!

లేకిన్ గులామోంకొ ఇన్ సాన్ బనాకర్/సిర్ఫ్ ఏక్ హి బాద్ షా బనేహై-

ఓ హై డా. భీమ్ రావ్ రామ్ జీ అంబేడ్కర్!’’

అంటే అర్థం-మనుషుల్ని బానిసలుగా చేసి – వేలమంది చక్రవర్తులయ్యారు. కానీ, బానిసల్ని మనుషులుగా చేసిన చక్రవర్తి ఒక ఒక్కడు – ఆయనే డా. బీమ్ రావ్ రామ్ జీ అండ్కర్. ఆయన విద్యార్హతలు  కూడా ఒక సారి గమనిద్దాం. ఫాసిస్టులకు అంబేడ్కర్ అంటే పడదు. కాలాలకు అతీతంగా అత్యున్నతమైన విద్యనార్జించిన ఆర్థికవేత్త అయ్యాడని ఉడుకుమోతుతనం! ఆయన విద్యార్హతలు ఏ కాలంలోనైనా ఆశ్చర్యం కలిగించేవే! 1917 పిహోచ్ డి. కొలంబియా యూనివర్సిటీ. 1921ఎమ్మెస్సి. లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్. 1922-30 సెప్టెంబర్, బారిస్టర్ ఎట్ లా, గ్రేట్ బ్రిటన్, లండన్. 1923 నవంబర్ డి.యస్సి-లండన్ స్కూల్ ఆఫ్ ఎకనమిక్స్. 1952. గౌవర డాక్టరేట్, ఎల్ఎల్.డి-కొలంబియా యూనివర్సిటీ.12 జనవరి 1953 డి.లిట్: గౌరవ డాక్టరేట్, ఉస్మానియా విశ్వవిద్యాలయం, హైదరాబాదు. రెండు మాస్టర్స్ డిగ్రీలు- నాలుగు డాక్టరేట్లు. ఇన్ని డిగ్రీలు ఇంత జ్ఞాన సంపదను సంపాదించిన భారతీయుడిగా గుర్తించి, న్యూయర్క్ కొలంబియా యూనివర్సిటీలో ఆయన విగ్రహం ప్రతిష్ఠించారు. అదీ ఎందుకూ? జ్ఞాన సంకేతంగా – సింబల్ ఆఫ్ నాలెడ్జ్ గా గౌరవించారు.

Also read: వాల్మీకి రామాయణంలో రాముడు దేవుడు కాదు

చదువుకు, విజ్ఞతకు. సమాజోద్ధరణకూ  అవినాభావ సంబంధం ఉంది. ప్రస్తుతం అధికారంలో ఉండి, మన దేశాన్ని ఫాసిస్ట్ ధోరణిలకి నెట్టేస్తున్న వారి విద్యార్హతలేమిటీ? వారి వివేకం ఎక్కడా? మత విద్వేషాలు రెచ్చగొట్టి మారణకాండలు సృష్టించడమే పనిగా పెట్టుకున్న వీరు, చరిత్ర హీనులుగా మిగలరా? ఆరో తరగతిలో బడినుండి పారిపోయినవాడిని వెతుక్కొచ్చి రాజ్యాధికారం కట్టబెడితే ఏమవుతుంది? పిచ్చోడి చేతిలో రాయి అవుతుంది! బ్రిటిష్ రాజనీతిజ్ఞుడు ఫ్రాన్సిస్ బేకన్ చెప్పిన ఈ మాట ఎంత గొప్పగా ఉందో ఆలోచించండి. ‘‘చదువు మనిషిని పూర్తిగా మానవుడిగా తీర్చిదిద్దుతుంది. చర్చ-సంసిద్ధ మానవుడిగా తీర్చిదిద్దుతుంది. రాత-ఖచ్చితమైన మానవుడిగా తీర్చిదిద్దుతుంది.’’ చదువుకున్న వివేకవంతులకే సోషలిజం విలువ తెలుస్తుంది. చదువు, సంస్కారం, మానవీయ విలువలపై గౌవరభావం లేని పాలకులు కేవలం జంగిల్ రాజ్యం స్థిరపరచి, ఆటవిక పాలననుందించగలరు. ప్రజల బతుకులుఅభద్రతలోకి తోసేయగలరు. సోషలిజం – సమాజంలో చాలా మార్పులు తెస్తుందనీ, ప్రజలందరికీ అవసరమైన ఆహారం, గృహవసతి అందిస్తుందని, మానవుల మధ్య వర్గవిభజనలుతొలగిస్తుందని, ఆర్థిక వ్యవస్థలో ప్రజాతంత్రయుతమైన ప్రణాళికను ప్రవేశపెడుతుందని, ప్రపంచశాంతి సమైక్యతల్ని నెలకొల్పుతుందని – ప్రసిద్ద సామాజిక ఆర్థికవేత్తలంతా చెపుతూనే ఉన్నారు. అయితే ఇవన్నీ ఊరికే రావని, క్రమంగా పెట్టబడిదారీ వ్యవస్థను కూకటివేళ్ళతో పెకిలించి పారేయాలని కూడా చెప్పారు. కానీ నేతి ప్రభుత్వపెద్దలు ఏం చేస్తున్నారూ? ప్రజా సంక్షేమం పట్టించుకోకుండా కార్పొరేట్ల దగ్గర పాలేర్లలా పడి ఉన్నారు.

ఇలాంటి పరిస్థితిని గమనించి కాబోలు మావో జెడుంగ్ ఒ  మాట చెప్పారు-‘‘అధ్యయనం లేకుండా ఒక పరిష్కారం కనుగొనాలనుకునేవారు లేక ఒక ఆలోచనకు రావాలనుకునేవారు కేవలం తెలివి తక్కువ దద్దమ్మలు మినహా మరేమీ కాదు. అలా చేస్తే సరైన పరిష్కారం లభించడం కానీ, మంచి ఆలోచనకు రావడం కానీ జరగదన్న విషయం తెలుసుకోవాలి!’’ తమ మూర్ఖపు ప్రకటనలతో జనాన్ని వెనక్కి నడిపించాలని ప్రయత్నిస్తున్న నేటి మన ఆలోచన లేని పాలకులకు అధ్యయనం-ఆలోచన వంటి మాటలు అర్థాలు తెలుస్తాయా? అదేమిటో మనదేశంలోనే చిత్రవిచిత్రమైన సంఘటనలు జరుగుతుంటాయి. పదో తరగతిలో ఫెయిల్ అయిన క్రికెటర్ సచిన్ ‘భారతరత్న’ అయ్యాడు. పెట్రోల్ బంక్ లో పని చేసిన అంబానీ కోట్లకోట్లు అధిపతి అయ్యాడు. రైల్వే స్టేషన్ లో చాయ్ అమ్ముకున్నానన్నవాడు దేశానికి ప్రధాని అయ్యాడు. కానీ, చూడండి- క్లాసుకు రానివ్వకపోతే, క్లాసు బయటే కూర్చుని చదువుకున్న దళిత బాలకుడు భీమ్ రావ్ అంబేడ్కర్ ఈ దేశపు శిల్పి అయ్యాడని అంటే – ఒప్పుకోరు ఎందుకూ? దేశానికి రాజ్యాంగాన్ని సమకూర్చి, దేశానికో అందమైన ఆకృతి నిచ్చాడంటే పట్టించుకోరెందుకూ? ప్రపంచంలోనే జ్ఞానానికి ప్రతీక – SYMBOL OF KNOWLEDGE అయ్యాడని గర్వంగా చెప్పుకోరెందుకూ? న్యాయార్క్-కొలంబియా విశ్వవిద్యాలయంలోనే ఆయన స్మృతి చిహ్నం జ్ఞానప్రతీకగా ఉంది కదా?

Also read: నాస్తికోద్యమ విప్లవ వీరుడు-పెరియార్

దేశాన్ని హిందూ దేశంగా మార్చడం కాదు గానీ, వారి పాలనలో ఉన్న ఒక రాష్ట్రంలో ఒక చిన్న ఊరిని పూర్తి హిందూ గ్రామంగామార్చి చూపించమనండి చూద్దాం! చంద్రుడి మీద నీరులేదని అంటే ఏం చేస్తారూ? భూమి నుంచి అక్కడికి గోమూత్రం తీసుకుపోతారా? ఒకాయన చంద్రుణ్ణి ‘హిందూ దేశ్’ గా ప్రకటించాలన్నాడు. మరో ఆ  ఫలానా పార్టీ ఎంపి అయితే మతిభ్రమించినట్టు మాట్లాడాడు. చంద్రుణ్ణి భారత్ జయించిందనీ – మళ్ళీ ఆ ఫలానా పార్టీనే అధికారంలోకి తీసుకొస్తే…తాము చంద్రుడి మీద ఒక్కొక్కరికి మూడు ఎకరాలు పంచిపెడతామని ప్రకటించాడు. కోతలు కోయడమే ఆ ఫలానా పార్టీ పాలసీ అయినప్పుడు ఇక దానికి హద్దులెందుకూ? అని అనుకుని ఉంటారు. ఒకడు మనుషులను పశువుల కంటే హీనంగా చూస్తాడు. విద్వేషాలు రెచ్చగొడతాడు. తన ఉత్తర ప్రదేశ్ రాష్ట్రాన్ని ‘జంగిల్ రాజ్’గా మారుస్తారు. మరొకడు ఆవు మూత్రం సీసాల్లో నింపి, అందంగా ప్యాక్ చేసి, లీటర్ రూ.120 నుండి రూ.1040 వరకు అమ్ముకుంటాడు. వాడో నకిలీ మెల్లకన్ను బాబా. ఇలాంటి వారంతా దేశంలో గొప్ప తాత్త్వికవేత్తలంటు! వీళ్ళ గూర్చి విశ్వవిద్యాలయాల్లో విద్యార్థులు పాఠాలు చదువుకోవాలంట! దేశం ఎటుపోతున్నది? ఎవరు రక్షిస్తారీ దేశాన్ని? దేశ ప్రజలు ఆలోచించరా? మేలుకోరా? కర్తవ్యోన్ముఖులు కారా? 2015లో ఎన్డీటీవీకి ఇచ్చిన టర్వ్యూలో స్వయంగా లాల్ కృష్ణ అడ్వాణీ ఇలా చెప్పారు: ‘‘నలభై యేళ్ళ క్రితం ఇందిరాగాంధీ పరిపాలనలో విధించిన ఎమర్జెన్సీ వదిలేయండి. అది కేవలం కొన్ని నెలలు మాత్రమే. ఇప్పుడు మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశం ఎమర్జెన్సీలోనే ఉంది. ఏళ్ళకేళ్ళు గడిచినా అనధికార-అప్రకటిత ఎమర్జెన్సీ నడుస్తోంది!’’-

భారత తొలి ప్రధాని పండిట్ జవహర్ లాల్ నెహ్రూ మీది అక్కసుతో నెహ్రూ జన్మస్థలమైన అలహాబాదుపేరు మార్చి ప్రయాగ్ రాజ్ అన్నారు. ఢిల్లీలోని నెహ్రూ మ్యూజియం పేరు మార్చి పి.యం. మ్యూజియం అన్నారు. అందులో ఉన్నవన్నీ నెహ్రూ వస్తువులే. ఇతర ప్రధానుల జ్ఞాపక చిహ్నాలేవీ లేవు. ఈ  పేర్లు మార్చే రోగం ఈ ప్రభుత్వానికి ఎందుకు పట్టిందో తెలియదు. వీరు పెట్టిన పేర్లు చిరకాలం ఉంటాయా? వీరు అధికారంలోంచి దిగిపోగానే, వీరు పెట్టిన పేర్లు కూడా ‘హుష్ కాకి’ అయిపోవా? సమకాలీన రాజకీయ పరిస్థితులు చూసి సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ఇలా వ్యాఖ్యానించారు – ‘‘మోదీ కాకపోతే ఇంకెవరూ? అని అడుగుతారు. అయిదేళ్ళలో ఆయన ఏం చేశారో చూడండి. ఐదు కోట్ల ఉద్యోగాలు  గాలికెగిరిపోయాయి. రైతులు సంక్షోభంలో కూరుకుపోయారు. న్యాయవ్యవస్థ, ఎన్నికల సంఘం, కాగ్, లోక్ పాల్, సీబీఐ, ఎన్ఐఏ, మీడియా అన్నింటినీ వశపరుచుకున్నారు. మూకదాడులు, ద్వేషపూరిత అబద్ధపు ప్రకటనలు ప్రధాన వార్తాస్రవంతిలో, సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేస్తున్నారు. వీరికే గనక ఈ దేశ ప్రజలు మరోసారి అవకాశమిస్తే ఇక అంతే – నాగరికత అంతరించినట్టే!’’ మనమెంత ప్రమాదకరమైన వాతావరణంలో ఉన్నామన్నది ఇలాంటి వివేకవంతుల మాట్లల్లోంచి గ్రహించుకోవాలి! అందుకే సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డి.వై. చంద్రచూడ్ దేశ ప్రజల్ని ఉద్దేశించి హెచ్చరికలు చేస్తూ తన మద్దతు కూడా తెలిపారు- ‘‘మాకు సాధ్యమెనంత వరకు మేం, బారత రాజ్యాంగాన్ని సంరక్షించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ, మాకు ప్రజల అండదండలు కూడా చాలా అవసరం. ప్రజలు పెద్ద ఎత్తున వీధుల్లోకి రావాలి. వారి హక్కుల కోసం వారు ఈ  నిరంకుశ ప్రభుత్వాన్ని నిలదీయాలి. ఇది ప్రజల హక్కులు హరిస్తోంది. భయాందోళనలకు గురి చేస్తోంది. అయినా, ప్రజలు తగ్గకూడదు. భయపడకూడదు. ధైర్యంగా ముందుకు రావాలి. ప్రభుత్వాన్ని వివరణలు అడగాలి. లెక్కలు తేల్చమనాలి. ప్రభుత్వాలెప్పుడ ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిందే! ధైర్యంగా ఉండండి! నేను మీతోనే ఉన్నాను!!’’ అని అన్నారు.

Also read: దేశాన్నిఅబద్ధాల ప్రచార కేంద్రంగా మార్చకండి!

(రచయిత సుప్రసిద్ధ సాహితీవేత్త, విశ్రాంత బయాలజీ ప్రాఫెసర్)

Dr. Devaraju Maharaju
Dr. Devaraju Maharaju
సుప్రసిద్ధ సాహితీవేత్త, జీవశాస్త్రవేత్త

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles