అమిత్ షా వ్యాఖ్యే దీనికి సాక్ష్యం
(అడుసుమిల్లి జయప్రకాశ్)
ఎలెక్టోరల్ బాండ్ల వివరాలు వెల్లడి కావడంతో ఒక విషయం సుస్పష్టంగా తెలిసివచ్చింది. అదేమిటంటే, కొన్ని వాణిజ్య సంస్థలు తమకు నచ్చిన పార్టీలకు పెద్ద మొత్తంలో నగదును బాండ్ల రూపంలో అందజేశాయని. అలా ఇవ్వడానికి కారణం మాత్రం తెలియరాలేదు. దీని వెనుక ఏదైనా ఇచ్చి పుచ్చుకునే(క్విడ్ ప్రో కో) ఉద్దేశం ఉందా? బహుశా ఇది ఎప్పటికీ వెల్లడి కాదు కూడా. పన్నుల ఎగవేత, మనీ లాండరింగ్, ఎఫ్.సి.ఆర్.ఏ. నిబంధనల ఉల్లంఘన వంటి అంశాలలో ప్రభుత్వాలు తమకు రక్షణ కవచంగా నిలుస్తాయని, కేసులు, విచారణ లేకుండా తప్పించుకోవచ్చని ఆలోచన ఆయా సంస్థలకు ఉండవచ్చు. కేరళ, కర్ణాటక, తమిళ నాడు, పశ్చిమ బెంగాల్ వంటి రాష్ట్రాలలో లాటరీలు నిర్వహిస్తున్న సంస్థలు కూడా పార్టీలకు ఎలెక్టోరల్ బాండ్ల రూపంలో నగదును సమకూర్చాయి. ఇలాంటి సంస్థలు తమకు వచ్చిన లాభాలను కానీ, ఈక్విటీని గాని వెల్లడించవు. అనేక సంస్థలు తమకు వచ్చిన లాభాలకు మించి పది నుంచి వంద శాతం వరకూ నగదును బాండ్ల రూపంలో చెల్లించాయి. తమకు వచ్చిన లాభాలను నకిలీ కంపెనీల పేరుతో రాజకీయ పార్టీలకు చేర్చాయి. ప్రస్తుత భారత రాజకీయం ఎలా మారిపోయిందో బాండ్ల వివరాల వెల్లడి ద్వారా తెలుస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వ హయాంలో కొన్ని దర్యాప్తు సంస్థల చర్యలతో కేవలం కొన్ని వందల కోట్ల లాభాలను గడించిన ఒక ప్రముఖ సంస్థ అత్యధికంగా 1 , 368 కోట్ల రూపాయల ఎలెక్టోరల్ బాండ్లను కొనుగోలుచేయడం ఆశ్చర్యం కలిగించక మానదు. ఆ సంస్థ ఆస్తులు, ఆ సంస్థ కొన్న బాండ్ల మొత్తాన్ని సుప్రీం కోర్టు ఎత్తి చూపింది. ఇలా కొనుగోలు చేయడం వెనుక పార్టీలు, ఆయా సంస్థల మధ్య క్విడ్ ప్రో కోను, సంబంధాలను వెల్లడిస్తోంది. పవర్ సెక్టార్ లో ఉన్న అనేక సంస్థలు బాండ్లను ఎడాపెడా కొనుగోలు చేశాయి. మైనింగ్, సోలార్ పవర్, విండ్ పవర్ ట్రాన్స్మిషన్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, హైడ్రో పవర్ కంపెనీలు 3600 కోట్ల రూపాయల బాండ్లను కొనుగోలు చేశాయి. నష్టాలను చూపించిన సంస్థలు కూడా బాండ్లను కొన్నాయి. ఇది డొనేషనా లేక మరేదైనానా?
ఇప్పుడు ఒక్కసారి ఇరవై ఏళ్ల క్రితం ఏమైందో చూద్దాం. ఏపీలో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొంటున్న క్విడ్ ప్రో కో ఆరోపణలు కూడా ఇలాంటివేనా? అనేక పెద్ద సంస్థలు ఆయన కంపెనీలలో పెద్ద మొత్తాలలో పెట్టుబడులు అప్పట్లో పెట్టాయి. వీటి గురించే ప్రతిపక్షాలు క్విడ్ ప్రో కో అంటూ గగ్గోలు పెట్టాయి.
ఈ క్రమంలో కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా అన్న మాటలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఎలెక్టోరల్ బాండ్ల స్కీం సమస్య పరిష్కారానికి ఒక ప్రారంభం అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఇండియా టుడే నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఎలెక్టోరల్ బాండ్స్ బ్లాక్ మనీని నిర్మూలించడానికి ఉపకరిస్తాయని, ఈ అంశంపై ఎవరితోనైనా, ఏ వేదికపైనైనా చర్చకు సిద్ధమని షా ప్రకటించారు. కేంద్ర వైఖరి ఇదే అయితే, మనం జగన్ మోహన్ రెడ్డిని వెనకేసుకు రావాల్సిందే. 2012 లో ఆయనపై క్విడ్ ప్రో కో కేసులు బనాయించి, 16 నెలల పాటు జైలులో ఉంచిన సంగతి తెలిసిందే. ఆర్ధిక అవకతవకలకు పాల్పడ్డారంటూ ఆయనపై సి.బి.ఐ. అనేక కేసులు నమోదు చేసింది. జగన్ క్విడ్ ప్రో కో కు పాల్పడ్డారనేదే ఈ కేసుల అన్నిటి లక్ష్యమూ.
భారత రాజకీయాలలో నల్ల ధనాన్ని అంతరింపజేయడానికే ఎలెక్టోరల్ బాండ్స్ అన్న అమిత్ షా వ్యాఖ్యను జగన్ మోహన్ రెడ్డి కేసులతో పోల్చి చూస్తే ఆయన పదహారు నెలల పాటు జైలులో ఎందుకు ఉన్నారన్న ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. జగన్ పై పెట్టిన కేసులన్నీ అప్పటి వై.ఎస్. రాజశేఖరరెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు అనుగుణంగానే బనాయించారని స్పష్టమవుతోంది. వైస్ హయాంలో పనిచేసిన అనేక మంది మంత్రులు సైతం సి.బి.ఐ. విచారణను ఎదుర్కొన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుంటే ఎలెక్టోరల్ బాండ్స్ వ్యవహారాన్ని నిశితంగా విచారించాల్సిందే. లేదా అమిత్ షా వ్యాఖ్య నిజమైతే జగన్ కూడా తప్పు చేసినట్టు కాదు.