- కాలనీలలో ఆహ్లాదం కోసం పార్కులు
- లైబ్రరీలు, అంగన్ వాడీ కేంద్రాల ఏర్పాటు
- అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
వైఎస్సార్ జగనన్న కాలనీలు ఆదర్శంగా ఉండాలే తప్ప, ఎట్టి పరిస్థితుల్లోనూ మురికివాడలుగా మారకూడదని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు. పేదలకు ఇళ్ల నిర్మాణంపై తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం సీఎం సమీక్ష నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లోని జగన్ సర్కార్ పేదల గృహనిర్మాణ పథకంపై దృష్టిపెట్టింది. వైయస్సార్ జగనన్న కాలనీల్లో వేగంగా ఇళ్ళ నిర్మాణాలు, కాలనీల్లో కల్పించనున్న మౌలిక సదుపాయాలపై అధికారులతో విస్తృతంగా చర్చించారు. పేదల కాలనీల్లో మౌలిక సదుపాయాలపై సీఎం జగన్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. కాలనీలు అందరికీ ఆదర్శంగా ఉండాలని కాలనీల బ్యూటిఫికేషన్ పై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అన్నారు.
సబ్సిడీపై సిమెంటు, స్టీల్ :
ఇళ్ల నిర్మాణానికి సంబంధించి సకాలంలో నిధులు విడుదలయ్యేలా కార్యాచరణ తయారు వేసుకోవాలని సీఎం సూచించారు. ఏయే సమయాల్లో ఎంత నిధులు విడుదల చేయాలన్న దానిపై ప్రణాళిక సిద్ధం చేయాలని తద్వారా పేదలకు ఇళ్ల నిర్మాణాలు శరవేగంగా ముందుకు సాగుతాయని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి మూడు ఆప్షన్లలో ఏదో ఒకదాన్ని ఇప్పటికి 83 శాతం లబ్ధిదారులు ఎంపిక చేసుకున్నారని అధికారులు సీఎంకు వివరించారు. మిగతా వారి నుంచి కూడా వెంటనే ఆప్షన్లు స్వీకరించాలని సీఎం ఆదేశించారు. ఏ ఆప్షన్ ఎంచుకున్నా, లబ్ధిదారులకు సబ్సిడీపై సిమెంటు, స్టీల్ అందించాలని ఆదేశించారు. బయటి మార్కెట్లో కన్నా తక్కువ ధరకే లభిస్తున్నందున ఆ అవకాశం అందరికీ ఇవ్వాలని తెలిపారు.
Also Read: ఏపీ సీఎం వైఎస్ జగన్ కు అరుదైన ఘనత
మౌలిక సదుపాయాలు, బ్యూటిఫికేషన్ :
జగనన్న కాలనీలలో నిర్మించే ఇళ్లనూ జియోట్యాగింగ్ చేస్తున్నామని అధికారులు సీఎంకు తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి ఎక్కడా నిధుల కొరత లేకుండా చూడాలని, వీలైనంత త్వరగా ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. జగనన్న కాలనీల్లో ప్రజలకు ఉన్నత జీవన ప్రమాణాలు అందాలని, అక్కడి జనాభాకు తగినట్టుగా రోడ్లు, అండర్‌గ్రౌండ్ డ్రైనేజీ, ఇతర మౌలిక సదుపాయాలు ఉండాలని సీఎం అన్నారు. ఒకసారి అన్ని లే అవుట్లను పరిశీలించి సకల సౌకర్యాలు ఉండేలా చూడాలన్నారు. కొత్తగా నిర్మాణం కానున్న కాలనీల్లో ప్రతి 2 వేల జనాభాకు అంగన్‌వాడీ కేంద్రం, ప్రతి 5 వేల ఇళ్లకు లైబ్రరీ అందుబాటులో ఉండాలని, పచ్చదనంతో పాటు పార్కులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు.
Also Read: జగన్ తో ఉక్కు పరిరక్షణ సంఘం నేతల భేటీ
ఆహ్లాదం, ఆరోగ్యం కోసం మొక్కల పెంపకం:
పట్టణాలు, నగరాల్లో మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం ద్వారా ఏర్పాటు కానున్న కాలనీల్లో కూడా మౌలిక సదుపాయాలు ఎలా ఉండాలన్న దానిపై సీఎం సమీక్షించారు. కాలనీల డిజైన్లను సీఎం పరిశీలించారు. రోడ్ల నిర్మాణం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాలు తదితరాలపై అధికారులకు సూచనలు చేశారు. కాలనీల్లో ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని అందించే చెట్లను నాటాలని, మంచి వృక్షజాతులను ఎంచుకోవాలని సూచించారు. కాలనీలు నిర్మాణ దశలో ఉన్నపుడే చెట్లు నాటాలని సీఎం ఆదేశించారు.