* 8వ ర్యాంకులో రోహిత్ శర్మ
* 30 ర్యాంకులు మెరుగుపడిన అక్షర్
ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్ లో భారత జట్టుతో పాటు ఆటగాళ్ల జోరు సైతం కొనసాగుతోంది. చెన్నై అంచె రెండోటెస్టు, అహ్మదాబాద్ వేదికగా రెండురోజుల్లోనే ముగిసిన మూడోటెస్టు విజయాలతో భారత క్రికెటర్లు ర్యాంకింగ్స్ లో అనూహ్యంగా పుంజుకొన్నారు.
Also Read : ఐపీఎల్ వేదికల్లో హైదరాబాద్ పేరు మాయం
టెస్టు క్రికెట్లో 400 వికెట్లు మైలురాయి చేరడంతో పాటు…అహ్మదాబాద్ టెస్టులో 7 వికెట్లు పడగొట్టడం ద్వారా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ బౌలర్ల ర్యాంకింగ్స్ 3వ స్థానంలో నిలిచాడు. అహ్మదాబాద్ టెస్టులో రాణించడం ద్వారా అశ్విన్ తన ర్యాంక్ ను ఏకంగా మూడుస్థానాల మేర మెరుగుపరచుకోగలిగాడు. రెండో ర్యాంక్ లో కొనసాగుతున్న నీల్ వాగ్నర్ కంటే అశ్విన్ కేవలం రెండు పాయింట్లతో మాత్రమే వెనుకబడి ఉన్నాడు.
38వ ర్యాంకులో అక్షర్ పటేల్
నరేంద్రమోడీ స్టేడియం వేదికగా ముగిసిన డే-నైట్ టెస్టు మ్యాచ్ లో 11 వికెట్లు పడగొట్టడం ద్వారా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన భారత లెఫ్టామ్ స్పిన్నర్ అక్షర్ పటేల్..30 స్థానాల మేర తన ర్యాంకును మెరుగుపరచుకొని 38వ ర్యాంకులో నిలిచాడు. చెన్నై అంచె రెండోమ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన అక్షర్ పటేల్ కేవలం రెండు టెస్టుల్లోనే 22 వికెట్లు సాధించడం ద్వారా ఈ ఘనతను సొంతం చేసుకొన్నాడు.
Also Read : మోడీ స్టేడియం పిచ్ పై విమర్శల వెల్లువ
టాప్ -10లో ముగ్గురు భారత ఆటగాళ్లు
ఐసీసీ టెస్టు బ్యాటింగ్ ర్యాంకింగ్స్ మొదటి 10 స్థానాలలో తొలిసారిగా ముగ్గురు భారత క్రికెటర్లు చోటు సంపాదించారు. ప్రస్తుత నాలుగుమ్యాచ్ ల సిరీస్ లో నిలకడగా రాణించడం ద్వారా ఓపెనర్ రోహిత్ శర్మ తన కెరియర్ లోనే అత్య్తుత్తమంగా 8వ ర్యాంకులో నిలిచాడు.
భారత కెప్టెన్ విరాట్ కొహ్లీ, వన్ డౌన్ చతేశ్వర్ పూజార ఇప్పటికే టాప్ -10 ర్యాంకుల్లో కొనసాగుతున్నారు. బ్యాటింగ్, బౌలింగ్ ర్యాంకింగ్స్ లో కివీ కెప్టెన్ కేన్ విలియమ్స్ సన్, కంగారూ బౌలర్ పాట్ కమిన్స్ అగ్రస్థానంలో నిలిచారు.
Also Read : రెండురోజుల ఓటమిపై ఇంగ్లండ్ మాజీల ఆక్రోశం