Wednesday, December 25, 2024

న్యాయవ్యవస్థను బలోపేతం చేస్తా: కొత్త సీజేఐ జస్టిస్ చంద్రచూడ్

తక్కిన ప్రజాస్వామ్య వ్యవస్థలన్నీ డీలాపడిపోయిన దశలో న్యాయవ్యవ్థపైనే అందరూ ఆశలు పెట్టుకున్న సందర్భంలో బుధవారంనాడు జస్టిస్ చంద్రచూడ్ 50వ భారత ప్రధాన న్యాయమూర్తిగా రాష్ట్రపతి ముర్ము చేతుల మీదుగా ప్రమాణస్వీకారం చేశారు. తండ్రి కూర్చున్న సింహాసనంపైనే తనయుడూ కూర్చోవడం రాజరికంలో పరిపాటి కానీ న్యాయవ్యవస్థలో అరుదైన సందర్భం. తండ్రిపైన కంటే కొడుకుపైన జాతి భవిష్యత్తు అధికంగా ఆధారపడి ఉంది. ప్రపంచంలోని అత్యుత్తమ విద్యాసంస్థలలో విద్యాభ్యాసం చేసిన జస్టిస్ చంద్రచూడ్ దిల్లీ విశ్వవిద్యాలయంలోనూ, అమెరికాలోని హార్వర్డ్ లా స్కూలులోనూ న్యాయశాస్త్రం అభ్యసించారు. ఇటీవలికాలంలో ప్రధాన న్యాయమూర్తులుగా వ్యవహరించినవారందరికంటే ఎక్కువ కాలం సర్వోన్న పదవిలో ఉండబోతున్నారు. రెండేళ్ళకు పైగానే పదవీకాలం ఉంటుంది. గత పదేళ్ళలో ప్రధాన న్యాయమూర్తులుగా ప్రమాణం చేసినవారందరిలోకీ పిన్నవయస్కుడు. 2024 నవంబర్ వరకూ పదవిలో ఉంటారు.

కొలీజియం గురించి కేంద్రన్యాయశాఖ మంత్రి కిరణ్ రిజుజూ నానావిధమైన వ్యాఖ్యలు చేస్తున్న తరుణంలో జస్టిస్ చంద్రచూడ్ పదవీ బాధ్యతలు స్వీకరించారు. దేశాన్ని న్యాయస్థానాలు నడిపించాలా లేక ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలు నిడిపించాలా అంటూ మంత్రి ప్రశ్నిస్తున్నారు. ‘నిబంధనలను న్యాయస్థానాలే నిర్దేశిస్తే, ఎక్కడ రోడ్లు నిర్మించాలో, ఎక్కడ ఏ పని చేయాలో కోర్టులే నిర్ణయిస్తే, ఉద్యోగుల నియమావళిని సైతం న్యాయమూర్తులే ఖరారు చేస్తే …ఇక ప్రభుత్వాలు ఏం చేయాలి?’ అని న్యాయశాఖ మంత్రి అడుగుతున్నారు. మంత్రి విమర్శలను సద్విమర్శలుగా స్వీకరించాలని తోటి న్యాయమూర్తులకు జస్టిస్ చంద్రచూడ్ సలహా ఇచ్చారు.

భారత ప్రధాన న్యాయమూర్తి ఫలానా సమస్యలు పరిష్కరించాలనీ, ఫలానా కేసులు వినాలనీ సాధారణ ప్రజలు సైతం ఆశిస్తారు. ప్రభుత్వం ఆశిస్తున్న విషయాలు కొన్ని ఉంటాయి. న్యాయవ్యవస్థలో భాగస్వాములైన తోటి న్యాయమూర్తులూ, న్యాయవాదులూ మరికొన్ని విషయాలు కోరుకుంటారు. వీరందరి ఊహాపోహల మధ్య ప్రధాన న్యాయమూర్తి పని చేయడం అంటే కత్తిమీద సాము చేయడమే.

న్యాయమూర్తులు న్యాయమూర్తులను నియమించడం అన్నది ఆశ్రితపక్షపాతానికీ, బంధుప్రీతికీ దారితీస్తున్నదని మంత్రి రిజుజూ వ్యాఖ్యానించారు.  ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తొలి మంత్రి రిజుజూ కాదు. ఆయనకంటే ముందు ఆ పదవిని నిర్వహించినవారు సైతం అటువంటి వ్యాఖ్యానాలే చేశారు. కొలీజియం వ్యవస్థను తప్పించి ప్రభుత్వ ఆధ్వర్యంలో న్యాయమూర్తుల నియామకానికి ఒక వ్యవస్థను రూపొందించే ప్రయత్నం జరిగింది. కానీ న్యాయవ్యవస్థదే పైచేయి అయింది. ఒకటి, రెండు సందర్భాలలో కొలీజియం సిఫార్సు చేసిన న్యాయమూర్తులను నియమించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకున్నది. జస్టిస్ రమణ హయాంలో అత్యధిక సంఖ్యలో న్యాయమూర్తుల నియామకాలు జరిగిపోయాయి. మహిళా న్యాయమూర్తులను నియమించే ప్రయత్నం జరిగింది. ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉండటం, చిత్తుశుద్ధి, సత్యనిష్ఠ కలిగినవారు ఎంపిక కావడం, సమాజంలోని అన్ని వర్గాలకూ ప్రాతినిధ్యం కల్పించి అందరినీ కలుపుకొని పోయే దిశగా నియామకాలు ఉండటం అవసరం.

అందివస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని పుణికిపుచ్చుకోవడం, విద్యార్హతలను పెంపొందించుకునే ప్రయత్నాలు చేయడం కూడా అవసరం. ఒక సారి న్యాయమూర్తిగా హైకోర్టులో ప్రవేశించిన అనంతరం తాము ఇక నేర్చుకోలసింది ఏమీ లేదని ధోరణి కనిపిస్తున్నది. పరిశోధన చేస్తున్నవారు కానీ ఉన్నత విద్యను అభ్యసించేవారు కానీ న్యాయమూర్తులలో తక్కువ. సమాజాన్ని అధ్యయనం చేయాలనే తాపత్రయం కొందరిలోనే కనిపిస్తున్నది. అదే విధంగా న్యాయమూర్తులకు శిక్షణ గరిపేందుకు జాతీయ జుడీషియల్ అకాడెమీ భోపాల్ లో నెలకొల్పారు. రాష్ట్రాలలో సైతం శిక్షణ కేంద్రాలు ఉన్నాయి. వాటిని ఇంకా సృజనాత్మకంగా దిద్దితీర్చవలసిన అవసరం ఉన్నది. న్యాయవాదులకు కూడా శిక్షణ ఇచ్చే వ్యవస్థను నిర్మించవలసిన అగత్యం ఉన్నది.

ప్రధాన న్యాయమూర్తిగా ఉదయ్ ఉమేష్ లలిత్ మంగళవారంనాడు పదవీ విరమణ చేశారు. అతి తక్కువ కాలం (74 రోజులు) పదవిలో ఉన్నప్పటికీ రాజ్యంగ ధర్మాసనాలు నెలకొల్పడంలోనూ, కొన్ని జటిలమైన విషయాలలో నిర్ణయాలు తీసుకోవడంలోనూ జస్టిస్ లలిత్ చొరవ తీసుకున్నారు. అయిదుగురు న్యాయమూర్తులతో కూడిన నాలుగు రాజ్యాంగ ధర్మాసనాలు ఏర్పాటు చేశారు. న్యాయమూర్తులలో అధిక సంఖ్యాకులకు బాధ్యతలు అప్పగించారు. ఆయన హుందాగా వ్యవహరించారు. చివరి తీర్పులో కూడా అగ్రవర్ణాల పేదలకు ఉద్యోగాలలో,నియామకాలలో రిజర్వేషన్లు ఉండాలా, వద్దా అనే అంశంలోకూడా వద్దనే అభిప్రాయాన్ని (మైనారిటీ అభిప్రాయం) వెలిబుచ్చారు. కేసులు ఎప్పుడు దాఖలైనాయనే దానితో నిమిత్తం లేకుండా కేసుల ప్రాధాన్యం ప్రకారం కేసుల విచారణకు చేపట్టాలనే పద్ధతికి జస్టిస్ లలిత్ శ్రీకారం చుట్టారు.  ఈ సత్సంప్రదాయాలను కొనసాగిస్తూ వాటిని మరో స్థాయికి ఉన్నతీకరించవలసిన బాధ్యత జస్టిస్ చంద్రచూడ్ పైన  ఉన్నది. ఆ విధంగా చేస్తారనే సాధారణ ప్రజలు కూడా విశ్వసిస్తున్నారు.

కొన్ని అంశాలు జస్టిస్ లలిత్ హాయంలోనూ, జస్టిస్ రమణ హయాంలోనూ చర్చకు రాలేదు. అంతకు మందు ప్రదాన న్యాయమూర్తుల కాలంలో కూడా రాలేదు. ప్రధానంగా కశ్మీర్ రాష్ట్ర ప్రతిపత్తిని రద్దు చేసేందుకు రాజ్యాంగ అధికరణ 370ని రద్దు చేయడాన్ని వ్యతిరేకి స్తూదాఖలైన పిటిషన్లను విచారణకు పెట్టకపోవడం, కశ్మీర్ పౌరులు మాయమైపోతే వారి ఆచూకీ తెలుసుకోవాలని కోరుతూ దాఖలైన హెబియస్ కార్పస్ పిటిషన్లను పట్టించుకోకపోవడం, పెగాసస్ సాఫ్ట్ వేర్ కు (మైబైల్ లో అమర్చి సంభాషణలను రికార్డు చేసే గూఢచర్యం) సంబంధించిన వివాదాన్ని కప్పిపెట్టడం, విచారణకు రాకుండా చేయడం, ఉపా (అన్ లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్)కింద అరెస్టులు చేసి, అన్యాయంగా జైలులో పెట్టినవారిపట్ల నిర్దయగా వ్యవహరించడం న్యాయవ్యవస్థపైన పౌరులకు ఉన్న కొన్ని ఫిర్యాదులు. ఒక్కమాటలో చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అంశాల జోలికి వెళ్ళకుండా ప్రధాన న్యాయమూర్తులు కాలక్షేపం చేస్తున్నారన్నది ప్రధాన విమర్శ. వీటి విషయంలో జస్టస్ చంద్రచూడ్ ఏమి చేస్తారోనని ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారు. ఇది ఆయన నిజాయితీకీ, నిర్భీతికీ, సత్యనిష్ఠకీ పరీక్ష.

న్యాయవ్యవస్థలో సంస్కరణలు నిరవధికంగా జరుగుతూ ఉంటాయి. వాటిని కొనసాగించడంతో పాటు తన పదవీ కాలంలో అనేక ఉత్కృష్టమైన, సంక్లిష్టమైన వివాదాలను పరిష్కరించవలసి ఉంటుంది. కొలీజియంకు ప్రత్యామ్నాయ వ్యవస్థను నిర్మిస్తామంటూ న్యాయశాఖమంత్రి రిజుజూ పదేపదే బెదిరిస్తున్నారు. ఆయన విమర్శలను ఎదుర్కొంటూ, కొలీజియం వ్యవస్థ పారదర్శకతనూ, విశ్వసనీయతనూ పెంపొందిస్తూ, వివిధ రకాల వివాదాలలో తన చేతికి మట్టి అంటకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళడం అన్నది జస్టిస్ చంద్రచూడ్ ఎదుట ఉన్న బాధ్యత. జస్టిస్ లలిత్ ఆధ్వర్యంలో కొలీజియం ఏకాభ్రియానికి రావడంలో విఫలమైన కారణంగా కొత్త న్యాయమూర్తుల నియామకం జరగలేదు. ఈ వివాదంలో జస్టిస్ చంద్రచూడ్ కూడా బాధ్యులు.

ఇకపైన కొత్త వివాదాలు సృష్టించకుండా, పాత వివాదాలను పరిష్కరించుకుంటూ ముందుకు పోవలసి ఉంది. న్యాయమూర్తుల ఖాళీలను పూరించడం మొదటి కర్తవ్యం. సర్వోన్నత న్యాయస్థానంలో ఏడుగురు న్యాయమూర్తులను నియమించవలసి ఉండగా, హైకోర్టులలో 335 న్యాయమూర్తులను నియమించాలి.  న్యాయమూర్తిగా జస్టిస్ చంద్రచూడ్ మంచి పేరుప్రతిష్ఠలు సంపాదించారు. ధర్మంగా, క్షమాగుణంతో, న్యాయబద్ధంగా నిర్ణయాలు తీసుకుంటారనీ, సాధారణంగా వినపడని గొంతుకలను వింటారనీ, పేదల పట్లా, బడుగు వర్గాల పట్లా దయతో ఉంటారనీ పేరు ఉన్నది.  ఎన్నికలు సమీపిస్తున్న కారణంగా అధికారపార్టీకీ, ప్రతిపక్షాలకీ నడుమ స్ఫర్థలూ, కోర్టు కేసులూ పెచ్చరిల్లుతాయి. వాటిని సమదృష్టితో, ధర్మంగా, న్యాయంగా పరిగణించడమే కాకుండా ఆ విధంగా పరిగణించినట్టు ప్రజలకు అర్థం కావడం ప్రధానం.

చీఫ్ జస్టిస్ తన న్యాయపరమైన బాధ్యతలను పక్కనపెట్టి వేరే విషయాలలో తలదూర్చడం సరికాదని తాను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉండగా కూడా చెప్పానని జస్టిస్ చంద్రచూడ్ బొంబాయి ఇండియన్ ఎక్స్ ప్రెస్ (9 నవంబర్ 2022 సంచిక) కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అన్నారు. ప్రధాన న్యాయమూర్తిగా పరిపాలన సంబంధమైన బాధ్యతలు మిక్కుటంగా ఉంటాయని కూడా ఆయన చెప్పారు. న్యాయవ్యవస్థను సరళతరం చేయడం, పారదర్శకంగా నిర్వహించడం, సాధారణ పౌరులకు అందుబాటులోకి తేవడం తన విధ్యుక్త ధర్మమని జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. సాధారణ పౌరులకు న్యాయవ్యవస్థ పట్ల అపారమైన విశ్వాసం ఉన్నదనీ, ఆ నమ్మకాన్ని వమ్ము చేయరాదనీ అనుకుంటున్నట్టు ఆయన చెప్పారు. మహిళలకూ, వెనుకబడినవర్గాలకూ, మారుమూలన ఉన్న రాష్ట్రాలకూ ప్రాతినిధ్యం పెంచడానికి  ప్రయత్నిస్తానని అన్నారు. న్యాయవ్యవస్థ రాజ్యం చేతిలో ఒక బలమైన ఆయుధమనీ, దేశంలో న్యాయపాలన నిర్వహణకు అత్యంత సమర్థంగా పని చేయవలసిన సాధనమనీ జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. కొలీజియం వ్యవస్థను పెంపొందించాల్సిన అవసరం ఉన్నదని కూడా జస్టిస్ చంద్రచూడ్ వ్యాఖ్యానించారు. మంత్రి రిజుజూ విమర్శల గురించి ప్రశ్నించగా, విమర్శలను దృష్టిలో పెట్టుకొని విమర్శలకు తావు లేకుండా పని చేయడం ఒక్కటే దీనికి సమాధానమని వ్యాఖ్యానించారు. న్యాయమూర్తుల నియామకం గురించి మంత్రి రిజుజూ చేసిన విమర్శలతో పాటు సాధారణ ప్రజలలో వినిపించే సందేహాలకు కూడా సమాధానాలు చెప్పే విధంగా న్యాయమూర్తులు వ్యవహరించాలని అన్నారు.

సోషల్ మీడియా మొత్తం ప్రపంచవ్యవస్థను మార్చివేసిందనీ, న్యాయమూర్తులు చెప్పే ప్రతి మాటనూ, చేసే ప్రతినిర్ణయాన్నీ అందరికంటే ముందుగా సోషల్ మీడియానే ప్రజలకు అందజేస్తుందనీ, కొన్ని సందర్భాలలో ఉన్నదున్నట్టు సవ్యంగానే ప్రసారం అవుతుందనీ, కొన్ని సందర్భాలలో తప్పులతడకగా, అపసవ్యంగా ప్రసరణ జరుగుతుందనీ వ్యాఖ్యానించారు.

తండ్రి జస్టిస్ చంద్రచూడ్ ఏడీఎం జబల్ పూర్ (జీవించే హక్కును హరించడం, 1976) కేసులో ఇచ్చిన తీర్పును సర్వత్రా నిరసించారు. పుట్టుస్వామి కేసులో ఏడీఎం జబల్ పూర్ కేసులో తండ్రి ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తనయుడు జస్టిస్ చంద్రచూడ్ విభిన్నమైన తీర్పు ఇవ్వడం విశేషం. ఇది దేశవ్యాప్తంగా చర్చనీయాంశం అయింది. ఈ విషయంపైన ప్రశ్నించగా, ‘‘ప్రతి న్యాయమూర్తి తనకు ఎదురైన సన్నివేశంలో, పరిస్థితులలో, రాజ్యాంగాన్ని అవగాహన చేసుకున్న పరిధిలో తీర్పులు ఇస్తుంటారు. మా  తండ్రిగారు అనేక తీర్పులు ఇచ్చారు. అప్పుడు ఆయన మనస్సుకి ఏది న్యాయమని తోస్తే ఆ తీర్పు ఇచ్చారు. రాజ్యాంగం కూడా స్థిరంగా ఉండదు. కాలానికి అనుగుణంగా మార్పు చెందుతూ ఉంటుంది. న్యాయమూర్తులు సైతం అంతే’’ అని సమాధానం ఇచ్చారు.

చూడాలి. జస్టిస్ చంద్రచూడ్ హయాంలో సర్వోన్నత న్యాయస్థానం ఏ విధంగా వ్యవహరిస్తుందో, న్యాయవ్యవస్థ దిశానిర్దేశం ఏ విధంగా జరుగుతుందో ప్రజలు జాగ్రత్తగా గమనిస్తారు.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles