వోలెటి దివాకర్
రాజమహేంద్రవరం, ఏప్రిల్6: అకాల వర్షాల వలన నష్టపోయిన రైతులను, కౌలు రైతులను తక్షణం ప్రభుత్వం ఆదుకోవాలని టీడీపీ అధినేత చంద్రబాబు డిమాండ్ చేశారు. ఇందుకోసం 72గంటల సమయం ఇస్తున్నామని ప్రభుత్వానికి ఆయన అల్టిమేటం ఇచ్చారు. గోదావరి జిల్లాల్లో పర్యటిస్తూ, పంట నష్టాలను తెలుసుకుంటున్న చంద్రబాబు బుధవారం సాయంత్రం రాజమండ్రి చేరుకొని గాదాలమ్మ నగర్ లోని బీవీఆర్ ఫంక్షన్ హాలులో బస చేసారు. పార్టీ నేతలతో సమీక్ష అనంతరం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రానున్న మూడు రోజుల్లో ధాన్యం కొనుగోలు పూర్తి చేయాలని, రైతులకు ఎంత నష్టపరిహారం చెల్లిస్తారో ప్రభుత్వం స్పష్టమైన జీవో ఇవ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ నెల 9 నుంచి టిడిపి నిరసన కార్యక్రమాలు చేస్తామని, 13న జరిగే నిరసన కార్యక్రమంలో తా ను పాల్గొంటానని ఆయన చెప్పారు. పంటల బీమా పథకం కింద ఇన్స్యురెన్స్ చెల్లించడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని ఆయన ధ్వజమెత్తారు. ఇందుకు పూర్తి బాధ్యత ప్రభుత్వమే వహించాలని ఆయన డిమాండ్ చేశారు. అకాల వర్షాలు కురవడంతో సగం పంట కోతలు కోయగా, కొంత కళ్లాల్లో ఉందని, కొంత మిల్లులకు చేరిందని, ఇంకా కోయాల్సింది సగం దాకా ఉందని, కోయాల్సిన పంట మునిగిందని ఆయన వివరిస్తూ, రైతులకు భరోసా కల్పించేలా ముఖ్యమంత్రి గానీ, మంత్రులు గానీ, అధికారులు గానీ రైతుల దగ్గరకు రాకపోవడం శోచనీయమని చంద్రబాబు విమర్శించారు.
1996నవంబర్ లో తుపాన్ వస్తే, రాజమండ్రిలోనే సెక్రటేరియట్ పెట్టి, ఎప్పటికప్పుడు సమీక్షించి జీవోలు ఇచ్చామని, అలాగే హుద్ హుద్ తుపాన్, తిత్లి తుపాన్ వచ్చినపుడు జీవోలు ఇచ్చి రైతులను ఆదుకున్నామని చంద్రబాబు గుర్తుచేస్తూ, సదరు జీవోలను చదివి విన్పించారు. ఇలా జీవోలు ఇవ్వడం ద్వారా పారదర్శకత వచ్చిందని, రైతుల్లో భరోసా కల్పించామని ఆయన చెబుతూ అలాంటి భరోసా జగన్ సర్కార్ కల్పించాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఏసీ రూముల్లో కూర్చుంటే పరిస్థితి తెలీదని, క్షేత్రస్థాయిలోకి వచ్చి చూస్తే వాస్తవం తెలుస్తుందని ఆయన అన్నారు. తడిసిపోయి కొంత, నూకలు ఉండడం వలన కొంత తీసేసి మిగిలిన సొమ్ము చెల్లించడం వలన రైతులు చాలా నష్టపోతున్నారని ఆయన అన్నారు. బస్తాకు 1530రూపాయలు ఇవ్వాల్సి ఉంటె, సగానికి సగం కోత విధించి ఇస్తే రైతుల పరిస్థితి ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. వరి పంటతో పాటు వాణిజ్య పంటలు కూడా దెబ్బతిన్నాయని, రైతులకు, కౌలు రైతులకు ఈమేరకు నష్టపరిహారం ఇస్తారో తక్షణం జీవో ఇవ్వాలని అయన డిమాండ్ చేసారు. నష్టపోయిన రైతులకు ఏవిధంగా న్యాయం చేస్తారో 72గంటల్లోకి ప్రభుత్వం స్పష్టం చేయాలని చంద్రబాబు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో 9వ తేదీన తహసీల్దార్ కార్యాలయాల దగ్గర, 11న కలెక్టరేట్ ల దగ్గర నిరసన తెలుపుతామని, అప్పటికీ స్పందించకపోతే, 13వ తేదీన పెద్దఎత్తున నిరసన చేపడతామని, ఈ ఆందోళనలో తాను పాల్గొంటానని చంద్రబాబు ప్రకటించారు.
ఇక మెత్తగా ఉండను… అందరికీ వడ్డీతో సహా చెల్లిస్తా
రాజమండ్రిలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవాని కుటుంబాన్ని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరామర్శించారు. భవాని కుటుంబం..ఒక రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబం అని, ఒక వెనకబడిన కుటుంబం అని చంద్రబాబు చెప్పారు. ఎన్నో ఏళ్ల నుండి నీతిగా వ్యాపారం చేసుకుంటున్నారని, ఒక్క ఫిర్యాదు కూడా లేదని, ఒక్క కస్టమర్ కూడా ఫిర్యాదు చేయలేదని చంద్రబాబు అన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మాజీ ఎమ్మెల్సీ అప్పారావును అరెస్ట్ చేస్తామని బెదిరించారనీ, 8 సంవత్సరాల చిన్న పిల్లాడిని కూడా బెదిరించారనీ చంద్రబాబు ఆరోపించారు. తనకు ములాఖాత్ ఇచ్చినందుకు ఏకంగా జైల్ సూపరింటెండెంట్ నే బదిలీ చేశారని చంద్రబాబు ధ్వజమెత్తారు. అప్పారావు కుటుంబానికి ప్రజలు అండగా ఉన్నారన్న చంద్రబాబు.. అప్పారావు కుటుంబం ఏ తప్పు చేసిందని ప్రశ్నించారు.
వెనకబడిన వర్గాలను అణిచివేయడం దుర్మార్గం అన్నారు. వెంటనే పార్టీ మారాలని ఆ కుటుంబంపై ఒత్తిడి తీసుకొచ్చారని మండిపడ్డారు. అప్పారావు కుటుంబానికి టీడీపీ అండగా ఉంటుందని చంద్రబాబు హామీ ఇచ్చారు. మహానాడు కార్యక్రమాన్ని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఇకపై నేను మెత్తగా ఉండను. ఎవరు తప్పు చేశారో వారందరికీ వడ్డీతో సహా చెల్లిస్తానని పరోక్షంగా వైసీపీ నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన చంద్రబాబు.. నీతి నిజాయితీ ఉన్న అధికారులకు తప్పకుండా న్యాయం చేస్తానన్నారు.
రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్లిన చంద్రబాబు.. ములాఖత్‌పై టీడీపీ నేతలు ఆదిరెడ్డి అప్పారావు, వాసులను పరామర్శించారు. చంద్రబాబుతో పాటు టీడీపీ నేతలు అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి ఉన్నారు. ఇది ముమ్మాటికీ రాజకీయ కక్ష సాధింపు చర్యే అని ఆరోపించారు.