My Confession
————————–
By Leo Tolstoy
నా సంజాయిషీ
———————-లియో టాల్స్టాయ్
తెలుగు అనువాదం
సి. బి. చంద్ర మోహన్
బి. సత్యవతీ దేవి
Chapter – 2
—————-
మనసును తాకే, స్ఫూర్తివంతమైన యవ్వనములో గడిపిన నా జీవిత చరిత్ర ఏదో ఒక రోజు నేను వివరిస్తాను. చాలామందికి ఈ రకమైన అనుభవం ఉండి ఉంటుందని నేను అనుకుంటాను. నేను మనస్ఫూర్తిగా — మంచివాడుగా ఉండాలని కోరుకున్నాను. కానీ నేనప్పుడు యువకుడిని; భావోద్వేగ భరితుడిగా ఉన్నాను. ఆ మంచితనం కోరుకున్న కాలంలో నేను పూర్తిగా ఒంటరి వాణ్ణి! నైతికంగా మంచివాడిగా ఉండాలనే నా నిష్కపటమైన కోరిక వెలిబుచ్చడానికి ప్రయత్నించినప్పుడల్లా — నేను తిరస్కారానికి, అవహేళనకు గురయ్యాను. కానీ నీచమైన అభిరుచులకు లొంగిపోయిన వెంటనే ప్రోత్సహించేవారు. వాంఛ, అధికార వ్యామోహం, లోభం, కామం, అహంకారం , పగ — ఈ దుర్గుణాలన్నీ గౌరవింపబడేవి.
ఆ నీచాభిరుచులకు లొంగిపోతూ — నేను పెద్దవారిలో ఒకడిగా తయారయ్యాను. వాళ్లు నన్ను ఆమోదించారని భావించాను. నేను ఒక వివాహితతో సంబంధం కలిగి ఉండాలని — నా ఆంటీ ( ఎవరైతే పవిత్రురాలో, ఎవరితోనైతే నేను జీవించానో) — నాకు ఎప్పుడూ చెప్పేది. అది ఆవిడ తీవ్రమైన అభిలాషగా పేర్కొనేది.
ఆమె నాకు ఇంకో ఆనందం కూడా కావాలని కోరుకునేది. అదేమిటంటే — నేను కమాండర్ సహాయకుడిని ( aid –de–camp) కావాలని, వీలైతే చక్రవర్తికి కమాండర్ సహాయకుడిని అవ్వాలనీ, ఒక పెద్ద ధనికురాలిని పెళ్లి చేసుకోవాలని, ఎంతోమంది సేవకులను కలిగి ఉండాలని — ఆమె కోరుకునేది. ఆ కోరిక ఆమెకు చాలా సంతోషాన్ని ఇచ్చేది!
భయము, అసహ్యము, వ్యాకులత లేకుండా నేను ఆ రోజుల్ని తలుచుకోలేను. యుద్ధరంగంలో నేను మనుషుల్ని చంపాను. మనుషుల్ని చంపటానికి ద్వంద్వయుద్ధంలో వారికి సవాళ్లు విసిరాను. జూదం ఆడాను. కూలీల శ్రమశక్తిని మింగేసాను. వారికి శిక్షలు విధించేవాడిని. అనైతికంగా, మోసపూరితంగా జీవించాను. అబద్ధాలు ఆడటం, దోపిడీ, దొంగతనం ,వ్యభిచారం ( అన్ని రకాల) తాగుబోతుతనం, హింస, హత్య — ఇలా నేను చేయని నేరం లేదు. ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజలు నా ప్రవర్తనను మెచ్చుకునేవారు. నా సమకాలికులు నన్ను నీతిమంతుడు గానే భావించేవారు.
అలా నేను 10 ఏళ్లు జీవితం గడిపాను.
ఆ కాలంలో నేను గర్వం, అత్యాశ మరియు అహంకారంతో రచన సాగించడం మొదలుపెట్టాను. నా జీవితంలో చేసినట్లే రచనల్లో కూడా చేశాను. పేరు ప్రఖ్యాతులు, డబ్బులు (నేను వాటి కోసమే రాసేవాణ్ణి) సంపాదించడం కోసం మంచిని దాచేసి చెడుని బహిర్గతం చేయడం అనేది ఒక ఆవశ్యకత అయిపోయింది. నేను అదే పని చేశాను. నా జీవితానికి ఒక అర్థం ఇచ్చిన మంచితనం పట్ల పట్టుదలతో కూడిన నా కృషిని — కుట్రతో (ఉదాసీనత పేరుతోను ఇంకా పరిహాస ధోరణి తోనూ) నా రచనల్లో ఎన్నిసార్లు దాచి పెట్టానో లెక్కలేదు! నేను దీనిలో విజయం సాధించి, మెప్పుకోలు కూడా పొందాను.
నా 26వ ఏట, యుద్ధం తర్వాత, నేను పీటర్స్ బర్గ్ పట్టణానికి వచ్చేసాను. అక్కడ రచయితలను కలిశాను. వారు నన్ను వారిలో ఒకరిగా కలుపుకొని పొగడ్తలతో ముంచెత్తారు. చుట్టూతా పరిశీలించి అభిప్రాయాలు ఏర్పరచుకునే టైము నాకు నేను ఇచ్చుకోలేదు. నా పరిచయంలోకి వచ్చిన రచయితల సమూహం నుండి జీవితం మీద అభిప్రాయాలు ఏర్పరుచుకున్నాను. జీవితం మెరుగు పరుచుకోవడానికి అంతకుముందు నేను పడిన ప్రయాసలన్నిటినీ ఈ అభిప్రాయాలు తుడిచివేశాయి. భ్రష్టమైన నా జీవితాన్ని సమర్ధించే సిద్ధాంతాన్ని ఒకదాన్ని వారు నాకు సమకూర్చారు.
జీవితం పట్ల నా సహ రచయితల అభిప్రాయాలు ఇట్లా ఉన్నాయి : ‘జీవితం సాధారణంగా అభివృద్ధి చెందుతూనే ఉంటుంది. ఈ అభివృద్ధి క్రమంలో మనది ( ఆలోచన పరులది) చాలా ముఖ్యమైన పాత్ర. ఆలోచన పరులలో కూడా మనలాంటి కవులు, కళాకారులం గొప్ప ప్రభావం చూపుతాం. మానవాళికి బోధించడమే మన వృత్తి. ఒక చిన్న ప్రశ్న వేసుకుంటే మనకు తెలుస్తుంది; నాకేమీ తెలుసును? నేను ఏమి బోధించగలను? పై జీవిత సిద్ధాంతంలో ఇది బాగా వివరించబడింది. తెలియనవసరం లేదు. కళాకారుడు, కవి తెలియకుండానే సహజ బోధకులు. నేను అద్భుతమైన కవిగా, కళాకారునిగా పరిగణించబడ్డాను.’ అందుచేత పై సిద్ధాంతాన్ని నేను సహజంగానే స్వీకరించాను. కవిని, కళాకారుణ్ణి అయిన నేను నాకే అర్థం కాని విషయం గురించి రచన చేశాను. బోధించాను కూడా! దీనికి నాకు డబ్బులు కూడా ఇచ్చారు. నేను అద్భుతమైన భోజనము, బస, మహిళా సాంగత్యము, మంచి సొసైటీ–ఇవన్నీ పొందాను. కీర్తి గడించాను. వీటి మూలంగా నేను బోధించింది చాలా బాగుందని అర్థమైంది.
కవిత్వం అర్దంలోనూ, జీవన పురోగతి దృష్ట్యానూ చూస్తే ఈ విశ్వాసమే ఒక మతం అవుతుంది. నేను దానికి ఒకానొక పూజారిని. దానికి పూజారిగా ఉండడం సంతోషకరమైంది, లాభదాయకమైనది. దాని చెల్లుబాటిని సందేహించకుండా గణనీయమైన కాలం నేను ఆ విశ్వాసంలో జీవించాను. కానీ, ఈ జీవితంలో — రెండవ మరీ ముఖ్యంగా మూడవ సంవత్సరంలో –నేను ఈ మతంలోని దోషరహిత గుణాన్ని సందేహించడం మొదలుపెట్టాను. దాన్ని పరీక్షించసాగాను. ఈ మతం పూజారులు ఒకరికొకరు అనుగుణంగా లేరని గుర్తించడం మొదలు పెట్టిన దగ్గర నా సందేహానికి మొట్టమొదటి కారణమైంది. కొందరన్నారు –” మనమే అత్యుత్తమమైన, ప్రయోజనకరమైన బోధకులం. మనం ఏది అవసరమో దాన్నే బోధిస్తాం. మిగిలిన వారు తప్పు బోధిస్తున్నారు.” మరికొందరు ” లేదు. మేమే నిజమైన బోధకులం. మీరు తప్పుగా బోధిస్తున్నారు.” అన్నారు. వారందరూ ఒకరితో ఒకరు వివాదపడ్డారు. గొడవపడ్డారు. వంచన చేసుకున్నారు. మోసం చేసుకున్నారు. మాలో కొందరైతే — ఎవరు ఒప్పు ఎవరు తప్పు అని పట్టించుకోనే లేదు. మా ఈ తగాదాల ద్వారా — వారి దురాశా లక్ష్యాలు సాధించుకోవడంలో
మునిగిపోయారు. మా మత విశ్వాసాల వ్యవస్థ యొక్క చెల్లుబాటును సందేహించడానికి పైదంతా నన్ను నిబద్ధుడిని చేసింది.
రచయితల వ్యవస్థలోని సత్యాన్ని సందేహించడం మొదలుపెట్టిన తర్వాత — నేను దాని పూజారులను ఇంకా శ్రద్ధగా గమనించడం మొదలుపెట్టాను. ఆ రచయితల మతంలోని పూజారులు దాదాపు అందరూ అవినీతిపరులే — అని గ్రహించాను. వారు విలువ లేని మరియు చెడు స్వభావం కలవారే! వారు — నేను ఇంతకుముందు జీవించిన చెదిరిపోయిన నా మిలిటరీ జీవితంలో కలుసుకున్న వారి కంటే కూడా — తక్కువ స్థాయి కలవారు.
పవిత్రులైన వారిలాగా లేదా పవిత్రత అంటే తెలియని వారిలాగా — వారు ఆత్మవిశ్వాసము మరియు ఆత్మ సంతృప్తి కలవారు. వారు నాపై తిరుగుబాటు చేశారు. నాపై నేనే తిరుగుబాటు చేసుకున్నాను. విశ్వాసం అనేది మోసపూరితమైనది అని గ్రహించాను. ఒక విచిత్రమైన విషయం ఏమిటంటే — నేనీ మోసపూరిత విశ్వాసాన్ని అర్థం చేసుకుని తిరస్కరించాను గాని ఈ ప్రజలు నాకు ఇచ్చిన హోదాను తిరస్కరించలేదు. ( వారు నాకు ఇచ్చిన హోదా — కళాకారుడు, కవి, బోధకుడు అని ) నేను ఒక కవిని, కళాకారుడిని; నేను బోధించే విషయం నాకే అవగాహన లేకపోయినా అందరికీ బోధించేవాడిని. దానికి అనుగుణంగానే నేను ప్రవర్తించాను. వారితో నాకున్న సాన్నిహిత్యం నుండి నేను ఒక చెడు గుణాన్ని కూడా అలవర్చుకున్నాను : అదేమిటంటే — అసాధారణంగా పెరిగిన నా గర్వమూ, పిచ్చి ధీమాతో, ‘ ఏది ఏమిటో తెలియకపోయినా ప్రజలకు బోధించడం నా వృత్తి ‘ అని అనుకోవడం.
ఆ రోజులు గుర్తు చేసుకోవడమూ, అప్పటి నా మానసిక స్థితి, వారి మానసిక స్థితి ( ఇప్పుడు అలాంటివారు వేలకొద్దీ ఉన్నారు) చూసుకుంటే, అది విచారకరంగా, భయానకంగా, హాస్యాస్పదంగా ఉంది. సరిగ్గా ఒక పిచ్చాసుపత్రిలో ఒకరు పొందే అనుభవాల భావన కలుగుతుంది.
అప్పుడు మేమందరము ( రచయితలు, కళాకారులు) ఒక విషయం నమ్మాము. అదేమిటంటే — ‘ వీలైనంత త్వరగా వీలైనన్ని రచనలు చేయాలి. వాటి గురించి మాట్లాడాలి. అవి అచ్చు వేయాలి. మానవ కోటి బాగు కోసం ఇది చాలా ఆవశ్యకం ‘ అని. మాలో వేలాదిమంది ఒకరినొకరు నిందించుకోసాగాము. ఒకరిపై ఒకరు వ్యతిరేక భావనలు వెలిబుచ్చు కున్నాము. అదంతా వ్రాయబడింది. అచ్చు కూడా అయింది. జీవితంలో మంచి అంటే ఏమిటి? చెడు ఏమిటి? అనే అతి సాధారణమైన ప్రశ్నలకు కూడా మాకు సమాధానం తెలియదు అనే విషయం గ్రహించకుండా, ఒకరి మాట ఒకరు వినకుండా, అందరమూ ఒకేసారి మాట్లాడసాగాము. ఒక్కోసారి ( ఎదుటివారు మనకు మద్దతు ఇచ్చి పొగుడుతారనే ఉద్దేశంతో) మిగిలిన వారికి ముందే మద్దతు ఇవ్వడం, వారిని పొగడటం చేసేవాళ్లం. ఒక్కోసారి పిచ్చాసుపత్రిలో లాగా ఒకరిపై ఒకరు కోపగించుకునేవాళ్ళం.
వేలాదిమంది శ్రామికులు రాత్రింబవళ్లు వారి శ్రమనంతా ధారపోసి , లక్షలాది మాటలు కూర్పు చేసి, అచ్చు వేస్తే — ఆ పుస్తకాలు రష్యా అంతా పంచబడేవి. మేము ఇంకా బోధిస్తూనే ఉన్నాం. అయినా గాని ‘ కావలసినంత ‘ బోధించడానికి సమయం సరిపోయేది కాదు. మా బోధనలపై ప్రజలు పూర్తి ధ్యాస పెట్టడం లేదని మాకు కోపం ఉండేది. ఇది అప్పుడు మహా విచిత్రంగా ఉండేది. కానీ ఇప్పుడు అర్థం అవుతోంది. వీలైనంత ధనము, కీర్తి సంపాదించాలనేదే మా నిజమైన అంతర్గత ఆందోళన. వాటికోసం పుస్తకాలు, పేపర్లు రాయడం కంటే మేము ఇంకేమీ చేయలేం. అందుకనే అదే చేసేవాళ్ళం. ఇటువంటి పనికిమాలిన పనిచేసి — ‘ మేము చాలా ముఖ్యమైన వాళ్ళం ‘ — అని మాకు మేము భరోసా ఇచ్చు కొనడానికి, మా కార్యకలాపాలు సమర్ధించుకుంటానికీ మాకు ఒక సిద్ధాంతం అవసరమైంది! అందుకని మాలోమాకు ఒక సిద్ధాంతం రూపొందించబడింది. “ఉనికిలో ఉన్నదంతా సమంజసమే. అది పురోగమిస్తూ ఉంటుంది. అది సంస్కృతి మీద ఆధారపడి పురోగమిస్తూ ఉంటుంది. పుస్తకాలు న్యూస్ పేపర్ల సర్కులేషన్ ( పంపిణీ ) ని బట్టి సంస్కృతిని కొలత వేస్తాం. పుస్తకాలు వార్తాపత్రికలు రాస్తాం కాబట్టి మాకు ధనం, కీర్తీ రెండూ దక్కుతాయి. అందుచేత మనుషుల్లో మేమే మానవాళికి గొప్ప ప్రయోజన కారులము, ఉన్నతులమూ కూడా!” మేమంతా ఏకాభిప్రాయంతో ఉంటే, ఈ సిద్ధాంతం చాలా బాగుండి ఉండేది. మా ఆలోచనలు పరస్పర విరుద్ధంగా ఉంటున్నాయి. మేము వాటిని పట్టించుకోలేదు. ప్రజలు మాకు సంపద ఇచ్చారు. పక్కన ఉన్నవారు మమ్మల్ని మెచ్చుకున్నారు. దానితో మేము ఇదంతా న్యాయమే అనుకున్నాం.
మేము పిచ్చాసుపత్రిలో ఉన్నట్టు నాకు ఇప్పుడు తేటతెల్లమైంది. ఇంతకుముందు అయితే నేను ఈ విషయాన్ని కొంచెమే అనుమానించాను. అందరు పిచ్చి వాళ్ళ లాగానే — ”నేను తప్ప అందరూ పిచ్చివాళ్లు” అనేవాణ్ణి.
Also read: నా సంజాయిషీ
(ఇంకా ఉంది)