శ్రీనివాస్ కొండపల్లి
బాలు పాటలు వింటూ పెరిగిన నాకు జీవితంలో అడుగడుగునా ఆయన పాటతో విడదీయలేని, విడదీయరాని అనుబంధం ఏర్పడింది. పొద్దు పొడవక ముందే లేచి డాబా మీదకెళ్లి అప్పుడే ఉదయిస్తున్న బాల భానుడిని చూడగానే బాలుడి స్వరం తూరుపు సిందూరపు మందారపు వన్నెలలో ఉదయ రాగం హృదయగానం అంటూ మరల మరల ప్రతీరోజూ ఆ మధుర సుధాగానమే నా చెవుల్లో మారు మోగేది.
బావి దగ్గర నీళ్లు తోడుకొని స్నానం చేస్తుంటే జిల్లు జిల్లు మన్నాయి నీళ్లు చలి చలి అంటోంది ఒళ్లు అని బాలు పాటతో మెలికలు తిరిగిపోయేవాడిని.
నుదుటన బొట్టు పెట్టుకొని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే బ్రహ్మ మురారి సురార్చిత లింగం అంటూ బాలు గళమే నా చెవుల్లో వినిపించేది.
అక్కడ్నుంచి పొలానికి వెళ్లగానే మన జన్మభూమి బంగారు భూమి పాడి పంటలతో పసుపు రాశులతో అంటూ బాలు పాటలే పాడుకుంటూ అంతటి శ్రమలో సేదతీరేవాడిని.
ఇంటికి వచ్చి భోజనం ముందు కూర్చుంటే పపపప పప్పు దప్పళం అన్నం.. నెయ్యి.. వేడి వేడి అన్నం మీద కమ్మని పప్పు కాచిన నెయ్యి అంటూ బాలు పాటే నన్ను ఊరించేది.
మధ్యాహ్నమయ్యేసరికి ఆకాశంలో మబ్బులు పట్టేస్తే చినుకు చినుకు అందెలతో అంటూ ఆయన పాటే నా ఎదలో సవ్వడి చేసేది.
సాయం సంధ్యవేళయినా, పిండార బోసిన వెన్నెల కురిసే రాత్రి వేళయినా డాబా మీద వెల్లకిలా పడుకొని మామా చందమామా నా కథ వినవయ్యా అంటూ బాలు పాటతోనే ఆ వెన్నెల రేడుతో ఊసులు చెప్పుకునే వాడిని.
పూలు గుసగుసలాడుతాయని
గాలి ఈలలు వేస్తుందని
మనసు రివ్వున ఎగురుతుందని,
వయసు సవ్వడి చేస్తుందని
ఆ నింగే దిగి వచ్చి నేలను తాకుతుందని
బాలు పాట విన్నాకే నాకు తెలిసింది.
విందులైనా, వినోదాలైనా పండగలైనా, పబ్బాలైనా బాలు పాటతోనే మా ఇంటికి సంక్రాంతి వస్తుంది. సరదాలు తెస్తుంది.
ప్రేమైనా, పెళ్లయినా తాళికట్టు శుభవేళ మెడలో కళ్యాణ మాల ఆహాహా ఓహోహో అని పాడుకోవాల్సిందే.
మనసులో దిగులు మేఘాలు కమ్మేసినా బాలు పాటే నేనున్నాని నీకేం కాదని అని ఊరడించేది.
తెలుగు వారింట వెలుగు నీవు
‘పాడుతా తీయగా’ కార్యక్రమం మొదలయ్యాక బాలు పాటే కాదు మాట కూడా ఎంత శక్తిమంతమైనదో నాకు తెలిసింది. పిల్లలకి ఒక పెద్దన్నయ్యలా సంగీత స్వరాలు నేర్పుతూ ఉంటే మీరే మీరే మాస్టారూ మా దేవుడు మీరే మాస్టారూ అని నాలో నేనే పాడుకుడేవాడిని. తెలుగు భాష గురించి, పదాల పట్టు విరుపులు గురించి, సాహిత్యంలో సొగసులు గురించి బాలు చెబుతూ ఉంటే తేనె కన్నా తీయనిది తెలుగు భాష అంటూ నాలో నేనే మురిసిపోయేవాడిని. ఈ తరం చిన్నారులు పట్టులంగాలు కట్టుకుని, నడుంకి వడ్డాణాలు పెట్టుకొని గొంతెత్తి మన పద్యాలు పాడుతూఉంటే వారి గళంగళంలోనూ బాలూ తెలుగుదనమై పల్లవించారు. వారి పాటలకు పల్లవిలా మారారు. సంగీత, సాహిత్య సమలంకృతంగా నిలిచారు.
బాలూ…
తెలుగు తోటలోకి సిరిమల్లెలా వచ్చి
విరిజల్లులు కురిపించి నీ పాటలనే ఎన్నెల్ని తెచ్చి
మా అందరి ఎద మీటి వెళ్లిపోయావా ?
ఎక్కడికి వెళ్లగలవయ్యా… ఓ పాటసారి
నీ పలుకే పాటై మా బ్రతుకైన వేళ …..
రాగాలనంతాలు, నీ పాట కోటి రూపాలు
మా ప్రాణదీపమై ఎప్పటికీ మా గుండెల్లో వెలుగుతూనే ఉంటావు…
లవ్యూ ఫరెవర్