నేను కవిని
సృష్టి కర్తను
సంయగ్దర్శిని
రవి కాంచనివి కూడా చూసి
నచ్చేటట్లు రాసి
మార్గదర్శనం చేయగలను
ధర్మ మార్గాన నడిపించగలను
సత్య శోధన చేయించగలను.
నేడు కళ్లు మూసుకున్నాను
కమ్మటి కలలు కంటున్నాను
భావుకతలో మునక లేస్తున్నాను
మబ్బుల్లో తేలుతున్నాను
వెన్నెల, కోయిల పాటలు,
సెలయేళ్ళు, వసంతం,
లేత చిగుళ్లు, కూనిరాగాలు
కనిపిస్తాయి మూసిన కళ్ళకు
మంచిదే.
కళ్లు తెరిస్తే గుడిముందు బిచ్చగత్తె
గుడి లోపల చాలామంది బిక్షగాళ్లు
గుడిని పేల్ఛే ప్రయత్నంలో కుర్రాళ్లు
వాళ్ల వెనుక కుహనా మేధావులు
మరీ వెనకగా విదేశీ ఏజంట్లు
వారు కల్లలతో కలిగిస్తున్న విధ్వంసం
అన్నీ చూడాల్సివస్తుంది
నా కెందుకీగొడవ.
స్వతంత్ర దినం, రాజ్యాంగ దినం
జండాకో సెల్యూట్ కొట్టేసి
మేరా భారత్ మహాన్
అని అరిచేసి
జనగనమణ పాడెస్తే
అయిపోతుందిగా
చాలదంటే
ఓ దేశభక్తి గీతం రాసేద్దాం
పద్మశ్రీ ఇచ్ఛేస్తారేమో.
Also read: నేనెవరు?
Also read: స్వచ్ఛభారత్
Also read: అమ్మ – నాన్న
Also read: తెలుగు
Also read: త్రిలింగ దేశంలో హత్య