- వెకిలి రాతలకు, ట్రోలింగ్ కూ భవిష్యత్తు బలి
- అమెరికా యూనివర్శిటీలో ఎంఎస్ చేయవలసిన యువకుడు జైలుకి
పాకిస్తాన్ పైన క్రికెట్ మ్యాచ్ ఓడిపోయినందుకు భారత జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీనీ, అతడి భార్యనూ, తొమ్మిది మాసాల కుమార్తెనూ తూలనాడిన పరమనీచులలో ఒక హైదరాబాదీ ఐఐటీ పట్టభద్రుడు ఉన్నట్టు ముంబయ్ పోలీసులు చెబుతున్నారు. ట్రోలింగ్ లో ప్రావీణ్యం సంపాదించి తప్పుడు పోస్టింగ్ లు పెట్టడంలో అనుభవం సంపాదించిన 23 ఏళ్ళ కుర్రవాడు రాంగణేశ్ శ్రీనివాస్ ఆకుబత్తిని అనే ప్రబుద్ధుడు ఇటీవలి వరకూ బెంగళూరులో ఫుడ్ డెలివరీ యాప్ కోసం పని చేసేవాడనీ, ప్రస్తుతం నిరుద్యోగిగా ఉన్నాడనీ పోలీసులు సమాచారం. అమెరికాలో మాస్టర్స్ చేసేందుకు సిద్దం అవుతున్నట్టు తెలుస్తోంది. మంచి చదువు, భవిష్యత్తు కలిగిన ఈ యువకుడి మెదడులో ద్వేషం నింపుకోవడం, పిచ్చి ఆలోచనలూ, చెత్త పనులూ చేయడం అనే ఆరోపణలు నిజమైతే చాలా విచారించదగిన విషయం. విరాట్ కొహ్లీ చిన్నారి కూతురిని రేప్ చేస్తానంటూ ట్రోల్ చేసినందుకు అతడు ఇప్పుడు ముంబయ్ జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.
బుధవారంనాడు హైదరాబాద్ కు వచ్చిన ముంబయ్ పోలీసులు రాగణేశ్ ను అరెస్టు చేసి ముంబయ్ తీసుకొని వెళ్ళి అక్కడ జైలులో పెట్టారు. మరికొన్ని రోజుల్లో అమెరికా యూనివర్శిటీలో ఎంఎస్ చదివేందుకు విమానం ఎక్కవలసిన యువకుడు కథ ఈ విధంగా అడ్డం తిరుగుతుందనీ, నీచమైన దొంగపని చేసి దొరికిపోతాననీ ఊహించి ఉండడు. రాంగణేశ్ తండ్రి ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. గణేశ్ వెంట అతడి తండ్రి, ఆయన స్నేహితుడు కూడా ముంబయ్ వెళ్ళారు. ఎగువ మధ్య తరగతికి చెందిన ఈ కుటుంబ సభ్యులకు రాంగణేశ్ వెధవ పనులు చేస్తున్నట్టు, ట్రోల్ చేస్తున్నట్టు తెలియదు. అతడికి క్రికెట్ పిచ్చి ఉన్నదనీ, పాక్ చేతిలో ఇండియా ఓడిపోవడాన్ని జీర్ణించుకోలేకపోయాడనీ వారికి తెలుసు. తర్వాత న్యూజిలాండ్ చేతిలో కూడా ఇండియా ఓడిపోవడాన్ని భరించలేకపోయాడు. విరాట్ కోహ్లీ తన జట్టు సభ్యుడూ, బౌలర్ సమ్మీని వెనకేసుకొని రావడం కూడా కొంతమందికి నచ్చలేదు. మతం కారణంగా ఒకరిపైన దాడి చేయడం అమానవీయమంటూ కోహ్లీ మందలించాడు. సమ్మీ పట్ల సౌభ్రాతృత్వం ప్రదర్శిస్తాం. మేము మైదానంలో కష్టపడి క్రికెట్ ఆడేవాళ్ళమే కానీ సోషల్ మీడియాలో ట్రోల్ చేసే వెన్నెముక లేని వెధవలం కాదు’ అంటూ కోహ్లో వ్యాఖ్యానించాడు.
భారత జట్టు ఆటతీరు రాంగణేశ్ కు మనోవేదన కలిగించిందని తమకు తెలుసుననీ, కానీ తొమ్మిది మాసాల చిన్నారిని రేప్ చేస్తానని బెదిరిస్తూ ట్రోల్ చేస్తాడని అనుకోలేదనీ, అది పొరపాటును చేసి ఉంటాడనీ కుటుంబ సభ్యులు అంటున్నారు. రాంగణేశ్ కు ఐఐటీ-జీలో 2367 ర్యాంక్ వచ్చింది. అతడికి ఒక తమ్ముడు కూడా ఉన్నాడు.
తాను చేసి ట్వీట్ ఎప్పుడైతే ముంబయ్, దిల్లీ పోలీసులకు వెళ్ళిందో అప్పుడు తన ట్విట్టర్ హాండిల్ అడ్రసును మార్చి తాను పాకిస్తానీగా నటించాడు.