Tuesday, January 21, 2025

జరిగింది హైదరాబాద్ విమోచన అయినా సరే విలీనమనే అనాలి!

డెబ్బయ్ అయిదేళ్ళ కిందట తెలంగాణలో జరిగింది విమోచనా, విలీనమా అనే అంశంపైన తర్జనభర్జనలు జరుగుతున్నాయి. ఇన్ని సంవత్సరాలూ ఈ వివాదాన్ని పట్టించుకోని బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ లు ఇప్పుడు హడావిడి చేస్తున్నాయి. ఈ వేడివేడి  చర్చకు బీజం వేసింది బీజేపీ. 17 సెప్టెంబర్ 1948న జరిగింది విమోచనమేనని బీజేపీ మొదటి నుంచీ  వాదిస్తూ వచ్చింది. కానీ ఇంతకాలం పట్టుపట్టలేదు. ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి కనుకా, తనకు విజయావకాశాలు ఉన్నాయని బీజేపీ ఊహిస్తున్నది కనుకా పాదయాత్రలూ, బహిరంగసభలూ జోరుగా జరుగుతున్నాయి. కేంద్ర హోంమంత్రి, ఇతర మంత్రులు, జాతీయ నాయకులు వచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ ను నిజాం రాజకీయ వారసుడంటూ నిందించడం, ఒవైసీని కేసీఆర్ ఒడిలో కూర్చోబెట్టుకొని ముద్దు చేస్తున్నారని విమర్శించడం ముమ్మరమైనాయి. అందులో భాగంగానే రేపు 17వ తేదీన విమోచన దినం వజ్రోత్సవం సందర్భంగా పెద్ద బహిరంగ సభ నిర్వహించి, అందులో దేశీయాంగమంత్రి అమిత్ షా ప్రసంగించి వెళ్ళాలని సంకల్పం. వజ్రోత్సవాలను సంవత్సరం పొడుగునా చేస్తారట.

‘ఆజాదీ కా అమృతోత్సవ్’ పేరుతో కేంద్ర ప్రభుత్వం, బీజేపీ చేసిన హంగామా ప్రభావం తెలంగాణ ప్రజలపైన పడకుండా అంతకంటే ఎక్కువ హంగామాగా స్వాంతంత్ర్య వజ్రోత్సవ సంరంభాన్ని పదిరోజులు నిర్వహించిన కేసీఆర్  ఈ సారి కూడా విమోచనోత్సవానికి ప్రతిగా 75 ఏళ్ళ క్రితం జరిగింది విలీనమే కానీ విమోచన కాదని చెబుతూ జాతీయ సమైక్య ఉత్సవాలు మూడు రోజులపాటు నిర్వహించాలని నిర్ణయించారు. అటు బీజేపీ కేంద్రంలో, ఇటు టీఆర్ఎస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నాయి కనుక ప్రచారార్భటికీ, పత్రికాప్రకటనలకూ, బహిరంగ సభలకూ కొదవ ఉండదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఎనిమిదేళ్ళుగా అధికారంలో లేని కాంగ్రెస్ తనదైన రీతిలో సంచలనాత్మక ప్రకటనలు చేస్తున్నది. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే తెలంగాణతల్లి విగ్రహాన్నీ మార్చేవేస్తామనీ, తెలంగాణ జాతీయ గీతాన్ని మార్చివేసి ‘జయ జయహే…’ అనే పాటను పెట్టుకుంటామనీ, తెలంగాణకు జెండా కూడా నిర్ణయిస్తామనీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రకటించారు. వర్తమానం గురించీ, భవిష్యత్తు గురించీ ఏమైనా మాట్లాడుకోవచ్చు. గతాన్ని అన్వయించడంలోనే రాజకీయం, కాపట్యం, మతతత్త్వం, అరాచకత్వం, బాధ్యతారాహిత్యం దాగి ఉన్నాయి.

భారత స్వాతంత్ర్యం

బ్రిటిష్ పార్లమెంటు 18 జులై 1947నాడు ‘ఇండియా ఇండిపెండెంట్ యాక్ట్’ ను ఆమోదించింది. నాటి బ్రిటీష్ ప్రధాని అట్లీ. దానికి నెల పదిహేను రోజుల మందుగానే భారత్ కు స్వాతంత్ర్యం ఇవ్వాలని బ్రిటన్ నిర్ణయించినట్టు 03 జూన్ 1947న నాటి వైస్రాయ్ మౌంట్ బాటన్ వెల్లడించారు. నిజాం రాజు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్  నాటి దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ ఎదుట హైదరాబాద్ లో లొంగిపోయిన మాట ఎవ్వరూ కాదనలేని వాస్తవం. 550 పైచిలుకు సంస్థానాలు భారత దేశంలో విలీనమైనప్పటికీ వివాదాలలో ఉన్న కశ్మీర్, జునాగఢ్, హైదరాబాద్ సంస్థానాలలో ఒక రాజు లొంగిపోయిన సందర్భం ఇదే. కశ్మీర్ లో అత్యధికులు ముస్లింలు, హిందూ రాజు హరిసింగ్ పాలనలో ఉన్నారు.

కశ్మీర్ రాజా హరిసింగ్

హరిసింగ్ కి సొంత ఆలోచనలు ఉన్నప్పటికీ పాకిస్తాన్ సైన్యం గిరిజనుల వేషాలలో కశ్మీర్ పైన దండయాత్ర చేసినప్పుడు విధిలేక ఇండియాతో విలీనానికి ఒప్పందం చేసుకున్నారు. భారత సైన్యం వెళ్ళి శ్రీనగర్ విమానాశ్రయాన్ని కాపాడి, పాకిస్తాన్ సైన్యాన్ని అడ్డుకునే లోగా సగం కశ్మీర్ పాకిస్తాన్ హస్తగతం అయింది. దాన్ని ఆజాద్ కశ్మీర్ అని పాకిస్తానీయులు పిలుచుకుంటున్నారు. మనం పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అంటాం. జునాగఢ్ చాలా చిన్న రాజ్యం. ప్రస్తుతం గుజరాత్ లో సౌరాష్ట్రా ప్రాంతంలో ఉండేది. దాని నవాబ్ ముహమ్మద్ మహబత్ ఖాన్ జీ –III. నిజాం లాగానే పూర్వీకుల నుంచి వారసత్వంగా వచ్చిన రాజ్యం. ముస్లిం రాజు అయితే ఎనభైశాతం మంది ప్రజలు హిందువులు. స్వాతంత్ర్యం వచ్చినప్పుడు మొత్తం 565 సంస్థానాలలో అటు పాకిస్తాన్ లోనో, ఇటు ఇండియాలోనో విలీనం కావడానికి అవకాశం ఉంది. స్వతంత్ర దేశాలుగా కూడా ఉండే అవకాశం ఉంది. హైదరాబాద్ నవాబు స్వతంత్ర దేశంగా ఉండాలని కోరుకున్నాడు. కశ్మీర్ రాజుకు కూడా అటువంటి ఆలోచనే ఉన్నది కానీ పరిస్థితులు ముసురుకు రావడంతో ఇండియాతో విలీనానికి సిద్ధపడ్డారు. జునాగఢ్ నవాబు పాకిస్తాన్ తో విలీనం కావాలని ముందుగానే నిర్ణయించుకున్నాడు. లార్డ్ మౌంట్ బాటన్ సలహాను తోసిరాజని 15 ఆగస్టు 1947లో పాకిస్తాన్ లో విలీనం చేశాడు. పాకిస్తాన్ ఏర్పడిన మరుసటి రోజే ఈ నిర్ణయం. పాకిస్తాన్ తో జునాగఢ్ కు భూమార్గం లేదు. సముద్రమార్గం మాత్రం ఉంది. ప్రజలు వ్యతిరేకించారు. బాబరియావాడ్ పాలకుడు జునాగఢ్ నుంచి విడిపోయి భారత్ లో విలీనం కావాలని కోరారు. మంగ్రోల్ షేక్ ఊగిసలాటలో సతమతమైనాడు.బాబరియావాడ్, మంగ్రోల్ పైన జునాగఢ్ నవాబు పెత్తనం చెల్లదంటూ జవహర్ లాల్ నెహ్రూ స్పష్టం చేశారు. జునాగఢ్ ను విలీనం చేసుకునేందుకు మహమ్మదలీ జిన్నా నెలరోజులు ఎదురు చూశారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉన్న ప్రాంతాలు పాకిస్తాన్ గా ఏర్పడాలని వాదించిన జిన్నా హిందువులు అత్యధికంగా ఉన్న జునాగఢ్ ను 15 సెప్టెంబర్ 1947న విలీనం చేసుకోవడాన్ని భారత ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకించింది. కతియావాడ్ సంస్థానంతో పాటు జునాగఢ్ కూడా ఇండియాలో విలీనం అవుతుందనే నమ్మకం కలిగించే విధంగా జునాగఢ్ నవాబు, అతడి సలహాదారులూ నటించారు. వాస్తవంలో పాకిస్తాన్ నాయకులతో అంటకాగుతున్నారు. సింధ్ నుంచి ముస్లింలీగ్ పార్టీ నాయకులు జునాగఢ్ పాలకవర్గంలో చేరి తిష్ఠవేశారు. జునాగఢ్ చుట్టూరా భారతదేశం ఉంది. ఒక వైపు మాత్రం అరేబియా మహాసముద్రం ఉంది. పాకిస్తాన్ తో విలీనం కావాలని నిర్ణయించడంతో ఇండియాతో వ్యాపారం నిలిచిపోయింది. ఆహారధాన్యాల కొరత ఏర్పడింది. తిండికి లేక జనం అలమటించాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నవాబ్ ప్రాణభయంతో కుటుంబంతో సహా కరాచీకి పలాయనం చిత్తగించాడు. ఆయన అనుచరులు కొందరు కలిసి పాలన కొనసాగించారు. సర్ నవాజ్ భుట్టో సింధ్ నుంచి వచ్చి జునాగఢ్ పాలకుడిగా పగ్గాలు చేపట్టారు. ఖాన్ బహద్దూర్ షా నవాజ్ భుట్టో పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు జుల్ఫికర్ అలీ భుట్టో (జనరల్ జియా ఉరితీసిన పాకిస్తాన్ అధ్యక్షుడు) తండ్రి, బహిరంగసభలో హత్య చేయబడిన బేనజీర్ భుట్టో తాత. పాకిస్తాన్ ని ఆనుకొని ఉన్న ప్రాంతాలే దానితో విలీనం కావాలని మొదట మౌంట్ బాటన్ వాదించారు. తర్వాత రాజ్యాంగపరంగా అటువంటి నిబంధన ఏదీ లేదనీ, సంస్థానాలు ఏ నిర్ణయం తీసుకున్నా రాజ్యాంగ ఉల్లంఘన కాజాలదనీ అన్నారు. ఏ దేశంలో చేరాలో నిర్ణయించవలసింది నవాబు కాదనీ, ఆ సంస్థానం ప్రజలనీ వల్లభాయ్ పటేల్, భారత ప్రధాని నెహ్రూ వాదించారు. పాకిస్తాన్ తో విలీనం కావాలన్ని జునాగఢ్ నవాబు నిర్ణయాన్ని ఇండియా ఆమోదించబోదని నెహ్రూ స్పష్టం చేశారు.

జనాగడ్ నవాబ్ మహబత్ ఖాన్

జునాగఢ్ లో ప్లెబిసైట్

జునాగఢ్ లో ప్లెబిసైట్ (జనవాక్యసేకరణ) జరుపుదామని సర్దార్ పటేల్ జిన్నాకు ప్రతిపాదించాడు. ఈ లోగా జునాగఢ్ లో అశాంతి ప్రబలింది. నవాబ్ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సౌరాష్ట్రా, జునాగఢ్ కు చెందిన పాతిక, ముప్పయ్ వేలమంది ప్రజలు బొంబాయిలో ప్రదర్శనలు జరిపారు. జునాగఢ్ ను విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. సమల్దాస్ గాంధీ వెలుపల ప్రభుత్వం (గవర్నమెంట్ ఇన్ ఎక్సైల్) ఆర్జీ హుకూమత్ (తాత్కాలిక ప్రభుత్వం) పేరుతో ఏర్పాటు చేశారు. జునాగఢ్ లోని మూడు ప్రిన్సిపాలిటీలను ఆక్రమించుకొని భారత్ లో విలీనం చేయాలని సైన్యానికి సర్దార్ పటేల్ ఆదేశాలు ఇచ్చారు. డిసెంబర్ 1947లో జునాగఢ్ లో 20 ఫిబ్రవరి 1948న ప్లెబిసైట్ నిర్వహించారు. ఇందుకు పాకిస్తాన్ అనుమతి కావాలనీ, ఐక్యరాజ్య సమితి పర్యవేక్షణలో జరగాలని బ్రిటిష్ ప్రభుత్వం వాదించింది. నెహ్రూ అవి ఏవీ అక్కరలేదని తాను ప్లెబిసైన్ జరిపించారు.  ఇండియాలో విలీనం చేయాలని 99.85 శాతం మంది ఓటు చేశారు. జునాగఢ్ ను స్వాధీనం చేసుకొని పాకిస్తాన్ ప్రధాని లియాకత్ అలీఖాన్ కు టెలిగ్రాం పంపించాడు. పాకిస్తాన్ అనుమతి లేకుండా ఎట్లా స్వాధీనం చేసుకుంటారంటూ లియాకత్ అలీ ప్రశ్నించారు. మొత్తంమీదికి జునాగఢ్ కు నవాబ్ పాలన నుంచి విమోచన కలిగించినట్టేనని భావించాలి. 01జూన్ 1948లో సమాల్ దాస్ గాంధీ, దయాశంకర్ దవే, పుష్పాబెన్ మెహతాలతో త్రిసభ్య పాలక సంఘాన్ని నియమించారు. జునాగఢ్ సంస్థానంలోని ఏడు నియోజకవర్గాలలోనూ ఎన్నికలు జరిపారు. అన్ని నియోజకవర్గాలలో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ లేకుండా గెలుపొందారు. జునాగఢ్ భారత్ లో విలీనం కావాలని అందరూ తీర్మానించారు.  1949 జనవరినాటికి జునాగఢ్ భారత్ లో విలీనం ప్రక్రియ పూర్తయింది. జునాగఢ్ కు సంబంధించిన వివాదం ఇప్పటికీ భద్రతామండలిలో ఉంది. జునాగఢ్ ప్రాంతాన్ని పాకిస్తాన్ లో భాగంగానే పాకిస్తాన్ మ్యాప్ లు చూపిస్తాయి.

చారిత్రక తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం

హైదరాబాద్ సంస్థానం దేశంలోకెల్లా అతిపెద్దది. నిజాంనవాబు దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యంత ఐశ్వర్యవంతుడు. అత్యంత లోభి. అంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ చిరిగిపోయినా షర్వాణీలను తానే కుట్టుకొని తొడుక్కునేవాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఉన్న ఔరంగాబాద్, బీడ్, నాందేడ్, పర్బని, ఉస్మానాబాద్ ప్రాంతాలూ, కర్ణాటకలో ఉన్న రాయచూర్, బీదర్, గుల్బర్గా ప్రాంతాలూ, తెలంగాణ మొత్తం కలిపి 83 వేల చదరపు మైళ్ళ విస్తీర్ణం హైదరాబాద్ సంస్థానంలో ఉండేది. 1724లో మొఘల్ సామ్రాజ్యం నుంచి  స్వాతంత్ర్య ప్రకటించుకున్న ఖమ్రుద్దీన్ తొలి అసఫ్ జాహీ రాజు కాగా సర్దార్ పటేల్ కు 17 సెప్టెంబర్ 1948నాడు లొంగిపోయిన చివరి నిజాం ఉస్మాన్ అలీఖాన్. భారత స్వాతంత్ర్య సిద్ధి సమయానికి హైదరాబాద్ రాష్ట్రంలో నిజాంకు వ్యతిరేకంగానూ, నిజాం తొత్తులైన భూస్వాములకు వ్యతిరేకంగానూ కమ్యూనిస్టులు రైతాంగసాయుధపోరాటాన్ని సాగిస్తున్నారు.

Women And Armed Revolution: The Telangana Peoples' Struggle (1946-51)
తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మహిళలు

నిజాం పాలనలో రాటు దేలిన జాగీర్దార్లూ, దేశ్ ముఖ్ లూ, దేశ్ పాండేలూ పటేల్, పట్వారీల సహకారంతో సాగిస్తున్న దోపిడీకీ, అణచివేతకూ, దుర్మార్గాలకూ వ్యతిరేకంగాప్రారంభమైన రైతాంగ సాయుధ పోరాటం సాగుతుండగానే రజాకార్లు రంగప్రవేశం చేశారు. దొరల తరఫున పోరాడి గడీలను రక్షించేందుకు అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ పట్టభద్రుడు ఖాసి రజ్వీ నాయకత్వంలో రజాకార్లు రంగంలోకి దిగారు. తుది ఘట్టంలో యూనియన్ సైన్యాలు వచ్చాయి. అటు యూనియన్ సైన్యాన్నీ, ఇటు సాయుధరైతాంగాన్నీ ఎదుర్కొనడానికి రజాకార్లు సిద్ధమైనారు. సుమారు నాలుగువేల మంది రైతు యోధులు నేలకొరిగారు. దొడ్డి కొమరయ్య, చాకలి ఐలమ్మ, షోయబుల్లా ఖాన్, షేక్ బందగీ వంటి అమరుల త్యాగాలు ఈ పోరాటంలో ఉన్నాయి. రావినారయణ రెడ్డి, బద్దం ఎల్లారెడ్డి, ఒట్టికోట అళ్వార్ స్వామి, దేవులపల్లి వెంకటేశ్వరరావు, మక్దూం మొహియునుద్దీన్, రాజ్ బహద్దూర్ గౌర్,  పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, మాకినేని బసవపున్నయ్య వంటి నాయకులు ఈ పోరాటంలో ఉన్నారు. భూమికోసం, భుక్తికోసం, మాతృభూమి దాస్యశృంఖలాలు తెంచడంకోసం, కామాంధుల అత్యారాలను నిరోధించడంకోసం జరిగిన పోరాటం ఇది. నిజాం వ్యతిరేకత ప్రబలింది. దిగజారిన ఆర్థక పరిస్థితుల వల్ల, కరువుకాటకాలతో అలమటించిన పేద రైతులు బలైనారు. ఈ పోరాటంలో ముస్లిం యోధులు కూడా పాల్గొన్నారు. అది నిజాం వ్యతిరేకపోరాటం అవును. కానీ ముస్లిం వ్యతిరేకపోరాటం కాదు. లౌకికవాదాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించే కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిందీ పోరాటం. గడీలను కూల్చడానికి ఉద్దేశించిన పోరాటమే కానీ మతం పేరుతో మనిషికీ, మనిషికీ మధ్య గోడలు కట్టడానికి చేసిన పోరాటం కాదు.  దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య సమరం సాగిస్తున్న కాంగ్రెస్ హైదరాబాద్ ప్రజలనూ ఆకర్షించింది. 1938లో  హైదరాబాద్ కాంగ్రెస్ కార్యాలయం ప్రారంభించారు. తెలంగాణ ప్రజలలో స్వతంత్రేచ్ఛనూ, పోరాటస్ఫూర్తినీ రగిలించిన  ఆంధ్రమహాసభ కాంగ్రెస్ తో విలీనమైంది. రామానందతీర్థ నాయకత్వంలో కాంగ్రెస్ వలంటీర్లు నిజాం, రాజాకార్ వ్యతిరేక పోరాటం సాగిస్తున్నారు. కమ్యూనిస్టులకు సైతం వ్యతిరేకంగా పోరాడారు. కుటుంబాలను ఆంధ్ర ప్రాంతాలకు తరలించి ప్రాణాలకు తెగించి పోరాడిన కాంగ్రెస్ నాయకులున్నారు.  అటువంటి రహస్యోద్యమం నిర్వహించినవారిలో మాజీ ప్రధాని పీవీ నరసింహారావు ఒకరు. నాటి ఉద్యమ అనుభవాన్ని కథగా ప్రచురించారాయన. బ్రిటిష్ ప్రభుత్వం స్వాతంత్ర్యం ఇచ్చినా నిజాం మాత్రం స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు ఇవ్వలేదు. నిర్బంధం ఎక్కువ చేశాడు. కదిలితే మెదిలితే అరెస్టులు చేయించాడు. అయినా సరే, 15 ఆగస్టు 1947నాడు హైదరాబాద్ లో భారత పతాకాన్ని ఆవిష్కరించారు.

ఖాసిం రజ్వీ

స్వతంత్ర రాజ్యం నిజాం లక్ష్యం

నిజాం స్వతంత్ర రాజ్యంగా హైదరాబాద్ ను తనఏలుబడిలో కొనసాగించాలని తపించారు. జిన్నాతో సంబంధాలు పెట్టుకున్నారు. బ్రిటన్ రాజకీయ నాయకులతో సంపర్కం పెట్టుకున్నారు. వీరికి బ్రిటిష్ కన్సర్వేటివ్ పార్టీ మద్దతు ఉంది. స్వతంత్రంగా ఉండాలని ఏ సంస్థానమైనా కోరుకుంటే ఆ సంస్థానానికి సంపూర్ణ మద్దతు ఇవ్వాలని మాజీ ప్రధాని చర్చిల్ గట్టిగా చెప్పారు. రజాకార్లకోసం, నిజాం సైన్యం కోసం యూరప్ లో ఆయుధాలు కొనుగోలు చేశారు. రెండో ప్రపంచ యుద్ధంలోఓడిపోయిన నాజీలు విడిచిపెట్టిపోయిన 301 తుపాకులను వేల సంఖ్యలో యూరోపియన్ దేశాల నుంచి కొనుగోలు చేశాడు. లొంగిపోవాలనీ, భారత్ లో విలీనం కావాలనీ నెహ్రూ, పటేల్ ఎన్ని విజ్ఞప్తులు చేసినా నిజాం పెడచెవిన పెట్టారు. ఐక్యరాజ్యసమితి భద్రతాసమితిలో తన వాదన వినిపించేందుకు సన్నాహాలు చేసుకున్నాడు. పాకిస్తాన్ లో విలీనం కావాలని జిన్నా చేసిన ప్రతిపాదనను తిరస్కరించాడు. స్వంతంత్రంగా ఉండేందుకు తోడ్పడమని కోరాడు. అటు పాకిస్తాన్ లో కానీ ఇటు ఇండియాలో  కానీ విలీనమయ్యే ప్రసక్తి లేదనీ, మూడో ఆప్షన్ ను వినియోగించుకొని స్వతంత్రదేశంగా ఉండాలని కోరుకుంటున్నానని నిజాం మౌంట్ బాటన్ కు లేఖ రాశాడు. దిల్లీ నుంచి ఒత్తిడి పెరిగిన కారణంగా యథాతథ స్థితి (స్టాండ్ స్టిల్)ఒప్పందాన్ని నిజాంరాజు 29 సెప్టెంబర్ 1947లో కుదుర్చుకున్నాడు. భారత ప్రభుత్వం ఏజెంట్ జనరల్ గా కెఎం మున్షీని నియమించింది. నిజాంను భారత్ లో విలీనానికి ఒప్పించే బాధ్యత నెహ్రూ, పటేల్, వీపీ మీనన్ లు మున్షీపైన పెట్టారు. నిజాం ప్రధాని లాయక్ అలీ ఖాన్ తో మౌంట్ బాటన్ చర్చలు జరిపారు. ప్రసిద్ధ బ్రిటిష్ లాయర్ వాల్టర్ మాంక్టన్ సహాయసహకారాలు లాయక్ అలీకి ఉన్నాయి. మాంక్టన్ బ్రిటిష్ కన్సర్వేటివ్ నాయకుడు సామ్యూల్ హొరే తో సంపర్కంలో ఉన్నారు. హైదరాబాద్ కి విడిగా కామన్వెల్త్ లో సభ్యత్వం ఇప్పించడానికి ప్రయత్నాలు జరిగాయి. భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతూనే నిజాం ముప్పయ్ లక్షల రూపాయల విలువ గల ఆయుధాలను జెకోస్లోవేకియా నుంచి కొనుగోలు చేయడానికి బేరం ఖరారు చేశారని మున్షీ తన పుస్తకంలో రాశారు. మరోపక్క పోర్చుగీస్ ప్రభుత్వంతో మాంక్టన్ మాట్లాడారు. గోవా-హైదరాబాద్ రైల్వే లైను వేసుకుంటే సముద్రానికి దారి దొరుకుతుందనీ, ఇందుకు గోవా ప్రభుత్వం అంగీకారాన్ని  సంపాదిస్తాననీ మాంక్టన్ నిజాంకు చెప్పారు.

బలవంతంగా హైదరాబాద్ ని ఇండియాలో విలీనం చేసుకుంటే మతకలహాలు చేలరేగుతాయని నిజాం మున్షీని హెచ్చరించారు. అప్పటికే అయిదు వందలకు పైగా సంస్థానాలు భారత్ లో విలీనమైనాయి. అన్ని సంస్థానాలతో ఒకే రకమైన స్టాండ్ స్టిల్ అగ్రిమెంటు కుదుర్చుకోవాలనీ, ఒకే రకమైన విలీన పత్రంపైన (ఎక్సెషన్ అగ్రిమెంట్) సంతకం పెట్టించుకోవాలనే విధాన నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకున్నది. హైదరాబాద్ ప్రభుత్వంతో అందుకు భిన్నమైన షరతులకు ఒప్పుకుంటూ సంతకాలు చేసే అవకాశం లేదని దేశీయాంగ మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. నిజాం ససేమిరా అన్నాడరు. చర్చలు జరుపుతారు కానీ ఎంతకీ తెగనివ్వడు. బలప్రయోగం చేయక తప్పేటట్టు లేదని జవహర్ లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ నిర్ణయించుకున్నారు. ముందు ‘ఆపరేషన్ క్యాటర్ పిల్లర్’ ను 1948 జూన్ లో అమలు చేద్దామనుకున్నారు. సైన్యాధికారులు మరికొద్ది మాసాలు ఆగితే బాగుంటుందని సలహా ఇచ్చారు. సర్వసైన్యాధికారి బ్రిటీష్ యోధుడు. ‘ఇప్పుడు కశ్మీర్ లో పీకలలోతువరకూ దిగుతున్నాము. మళ్ళీ హైదరాబాద్ లో మరో ఫ్రంట్ తెరవడం క్షేమదాయకం కాద’ని ఆయన హితవు చెప్పాడు. నిజాం దగ్గర ఆయుధాలు ఉన్నాయనీ, సైనికులు ఉన్నారనీ, వారికి తోడు రజాకార్లు ఉన్నారనీ, అపారమైన సంపద ఉన్నదనీ, నిజాంను ఓడించడం అంత సులభం కాదని దిల్లీలో సైనికాధికారుల అభిప్రాయం. నిజాం అధీనంలో 17 వేల మంది సైనికులు ఉన్నారు.  పదివేలమంది వలంటీర్లు ఉన్నారు. వీరు కాకుండా రజాకార్లు ఉన్నారు. మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ నుంచి ముస్లిం పోరాటవీరులు హైదరాబాద్ చేరుకున్నారు. 1929లో మొత్తం ముస్లింలతోనే కూడిన సైనిక సంస్థ మజ్లీస్ – ఇత్తెహాదుల్ – ముస్లీమీన్ ను నెలకొల్పాడు. బెల్జియం నుంచీ, నెదర్లాండ్ నుంచి జర్మన్ సైన్యం వదిలిపెట్టిన ఆయుధాలు నిజాం ప్రభుత్వం ద్వారా తెప్పించుకున్నారు.

పరిస్థితుల అదుపు తప్పేటట్టు ఉన్నాయని భావించిన భారత ప్రభుత్వం మరో తాత్కాలిక ఒప్పందం నిజాంతో కుదుర్చుకోవడానికి అంగీకరించింది. విలీన ఒప్పందంలోని కొన్ని అంశాలూ, యథాతథ స్థితి కొనసాగించే ఒప్పందంలోని కొన్ని అంశాలూ కలిపి ఈ కొత్త ఒప్పందం తయారు చేసుకున్నారు. ఒప్పందం ముసాయిదా దిల్లీకీ, హైదరాబాద్ కూ మధ్య నాలుగు సార్లు తిరిగింది.  నిజాం ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ మూడురోజులు సమావేశం జరిపింది. చివరకు ఒప్పందంపైన సంతకాలు చేయాలని నిజాం సర్కార్ అంగీకరించింది.  

రజాకార్ల మోహరింపు

అక్టోబర్ 27 ఉదయం ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ అధ్యక్షుడు చాటారీ నవాబ్, నవాబ్ అలీయావర్ జంగ్, సర్ వాల్టర్ మాంక్టన్ ఇళ్ళ వద్ద పాతిక, ముప్పయ్ వేలమంది ఎంఐఎం అనుచరులు గుమికూడారు. ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యులు దిల్లీ వెళ్ళరాదనీ, ఒప్పందంపైన సంతకాలు చేయరాదనీ వారి పట్టుదల. ఇక్కడే నిజాం ద్వైదీభావం బట్టబయలు అయింది. దిల్లీ వెళ్ళకుండా తన ప్రతినిధులను భౌతికంగా అడ్డుకున్న ఖాసిరజ్వీని సమాలోచనలకు పిలిచాడు. అక్కడికే ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ సభ్యులనూ పిలిచాడు. ఖాసిం రజ్వీ వచ్చి ఒప్పందం గిప్పందం జాన్తానై అన్నాడు. తనకు స్వాతంత్ర్యం కావాలంటూ నిజాం పంపిన పత్రంపైన ఇండియా సంతకం చేయాలనీ, ఇప్పుడు చర్చించిన ఒప్పందంపైన సంతకాలు జరిపే ప్రసక్తి లేదనీ ఖాసిం రజ్వీ స్పష్టం చేశాడు. కొద్దిరోజుల కిందటే అక్టోబర్ 23న కశ్మీర్ లో పాకిస్తాన్ సైన్యం ప్రవేశించిన తర్వాత భారత సైన్యాన్ని విమానాలలో అత్యవసరంగా కశ్మీర్ కు పంపించారు. కశ్మీర్ వ్యవహారంలో తలమునకలై ఉన్న భారత ప్రభుత్వం నిజాంతో గొడవ పెట్టుకోదని రజ్వీ అంచనా. అదే సంగతి సభలో చెప్పాడు. నిజాంకు ఖాసిం రజ్వీ చెప్పే మాటలు నచ్చినప్పటికీ అతడి భయాలు అతడికి ఉన్నాయి.

మేజర్ జనరల్ జయంతో నాథ్ చౌధురి

ఇది భరించలేని ఛటారీ నవాబ్ నిజాం ఎగ్జిక్యూటీవ్ కౌన్సిల్ అధ్యక్ష పదవి నుంచి వైదొలిగారు. రజ్వీ సూచన మేరకు మీర్ లాయిక్ అలీని ఆ స్థానంతో నియమించారు. లాయిక్ అలీ పాకిస్తాన్ కు ఐక్యరాజ్య సమితిలో ప్రాతినిధ్య బృందానికి నాయకుడిగా ఉండేవారు. సంప్రతింపుల సంఘాన్ని కూడా మార్చారు. నవాబ్ మొయిన్ నవాజ్ జంగ్ నూ, పింగళి వెంకటరామరెడ్డినీ కొనసాగిస్తూనే అందులో మూడో సభ్యుడిగా ఎంఐఎంకి చెందిన అతివాది అబ్దుర్ రహీంను చేర్చారు. నిజాం సలహా మండలిలో మార్పుల కారణంగా నిజాం వైఖరి పూర్తిగా మారిపోయింది. ఈ సారి చర్చలు విఫలమయ్యే పక్షంలో పాకిస్తాన్ తో విలీన ఒప్పందంపైన సంతకం పెడతానంటూ బెదిరిస్తూ దిల్లీకి నిజాం లేఖ రాశారు. నిజాం ప్రతి రోజూ పాకిస్తాన్ తో సంపర్కంలోనే ఉన్నారు. పాకిస్తాన్ ఆడమన్న విధంగా ఆడుతున్నారు. ఎట్టకేలకు నిజాం దిల్లీ ప్రతిపాదించిన ఒప్పందాలపైన సంతకాలు చేశారు. చిట్టచివరికి దక్షిణాదిలో శాంతి సమకూరిందని నెహ్రూ తేలికగా ఊపిరి తీసుకున్నారు. నిజాం వైఖరిని మార్చడానికి అవసరమైన వ్యవధి దొరికిందని మౌంట్ బాటన్ అన్నారు. విలీనం ఒప్పందంపై సంతకం చేయడానికి నిజాంని ఒప్పించగలననే విశ్వాసాన్ని మౌంట్ బాటన్ వెలిబుచ్చారు. కానీ సర్దార్ పటేల్ కు మాత్రం మొదటి నుంచీ నిజాం వైఖరిపైన అనుమానాలు ఉన్నాయి. అతడు కొరకరాని కొయ్యగానే ఉన్నాడని తీర్మానించుకున్నారు.

భారత్ విలీనం తప్పించి హైదరాబాద్ కు కామన్వెల్త్ లో సభ్యత్వం ఇప్పించగలిగే యూరోపియన్ ను ఎవరినైనా హైదరాబాద్ ప్రధానిగా నియమించాలని నిజాం ఆలోచించాడు. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు మోసుకొని బీదర్, వరంగల్లు లోని మామనూరు విమానాశ్రయాలకి విమానాలు తిరుగుతున్నట్టు వేగుల సమాచారం వల్లభాయ్ పటేల్ కు అందింది. కరాచీలో ఒక పబ్లిక్ రిలేషన్స్ అధికారిని నిజాం నియమించారు. భారత ప్రభుత్వానికి తెలియకుండా ఇరవై కోట్ల రూపాయల రుణం పాకిస్తాన్ కు నిజాం ఇచ్చారు.

ఈ లోగా రజాకార్ల దురాగతాలు పెరిగాయి. హిందువులను రెచ్చగొట్టే విధంగా ఉపన్యాసాలు ఇస్తూ  రజ్వీ విజృంభించాడు. పొరుగున ఉన్న బొంబాయి, మద్రాసు రాష్ట్రాలు కేంద్రానికి రజ్వీ నాయకత్వంలోని రజాకార్ల కార్యకలాపాలపైన, సరిహద్దు గ్రామాలపైన వారు చేసే దాడుల గురించి ఫిర్యాదు చేశాయి. జల్నా, పర్బణి, నాందేడ్, ఔరంగాబాద్ జిల్లాలలో దాడులు ఎక్కువైనాయి. హిందువులు పక్కరాష్ట్రాలకు వెళ్లి తలదాచుకునే పరిస్థితులు ఏర్పడ్డాయి.

మౌంట్ బాటన్ 21 జూన్ 1948న పదవీ విరమణ చేసి ఇంగ్లండ్ కు శాశ్వతంగా వెళ్ళిపోయారు. ఎంత రెచ్చగొట్టినా భారత ప్రభుత్వం హైదరాబాద్ కు సైన్యాన్ని పంపించే సాహసం చేయబోదని హైదరాబాద్ లో నిజాం ప్రభుత్వం భావించేది. ఆగస్టు మూడోవారంలో నిజాం ప్రధాని లాయక్ అలీ భారత ప్రభుత్వానికి లేఖ రాశారు. స్టాండ్ స్టిల్ అగ్రిమెంటుకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం వ్యవహరిస్తున్నదని ఫిర్యాదు చేశారు. ఈ విషయమే ప్రస్తావిస్తూ ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శికి కూడా లాయక్ అలీ ఉత్తరం రాశారు.

వ్యవహారం శ్రుతిమించి రాగాన పడుతోందని గ్రహించిన సర్దార్ పటేల్ జవహర్ లాల్ నెహ్రూతో సమాలోచన చేశారు.  సైన్యాన్ని పంపాలని నిర్ణయించుకున్నారు. ‘(We have no choice but to send troops to Hyderabad) హైదరాబాద్ కు సైనికులను పంపక తప్పడం లేదు’ అని నెహ్రూ బ్రిటిష్ విలేఖరులకు చెప్పారు.

ఆపరేషన్ పోలో, నిజాం లొంగుబాటు

హైదరాబాద్ పైన తీసుకున్న చర్యకు పోలీసు చర్య అని పిలిచారు. దానికి సంకేతనామం ‘ఆపరేషన్ పోలో’ అని అన్నారు. సెప్టెబర్ 13న మేజర్ జనరల్ జె.ఎన్. చౌధురి నాయకత్వంలో షోలాపూర్-హైదరాబాద్ మార్గంలో ఒక దళం, బెజవాడ-హైదరాబాద్ మార్గంలో మేజర్ అధిర్ రుద్రా నాయకత్వంలో మరో దళం తరలివచ్చాయి. మొదటి రెండురోజులూ నిజాం సైన్యం, రజాకార్లు కొంత ప్రతిఘటించారు. తర్వాత లొంగిపోయారు. 17వ తేదీనాడు హైదరాబాద్ సైన్యం భారత సైన్యానికి  పూర్తిగా లొంగిపోయింది. నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ దేశీయాంగమంత్రి సర్దార్ పటేల్ ఎదుట లొంగిపోయారు. హైదరాబాద్ సంస్థానం కథ  ముగిసింది. రజ్వీ, లియాఖత్ అలీ, తదితరులు అరెస్టయినారు. ఖాసిం రజ్వీ పాకిస్తాన్ కు వెళ్ళారు. అక్కడ అనామకుడిగా మరణించారు.

వీపీ మీనన్ కు అందిన నివేదికల ప్రకారం భారత సైనికుల తరఫున మృతుల సంఖ్య చాలా తక్కువ ఉంది. రజాకార్లకు క్రమశిక్షణ లేకపోవడం వల్ల, వారు వృత్తిరీత్యా సైనికులు కాకపోవడం వల్ల ఎక్కువ మందిని కోల్పోయారు. సుమారు 800 మంది దాకా రజాకార్లూ, నిజాం సైనికులూ మృతి చెంది ఉంటారు.

మత కలహాలు లేవు

సెప్టెంబర్ 18న మేజర్ జనరల్ చౌధురిని హైదరాబాద్ గవర్నర్ గా నియమించారు. తాను లోగడ ఇచ్చిన ఫిర్యాదును ఉపసంహరించుకుంటూ నిజాం ఐక్యరాజ్య సమితికి కేబుల్ పంపించారు. తర్వాత కొంతకాలానికి హైదరాబాద్ రాష్ట్రం భారత్ లో విలీనమైంది. 1952లో జరిగిన సార్వత్రిక ఎన్నికలలో హైదరాబాద్ రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపొందింది. బూరుగుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా ప్రథమ ప్రభుత్వం ఏర్పడింది. 1956లో ఆంధ్ర రాష్ట్రం విలీనమై భాషాప్రయుక్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడినప్పుడ కన్నడ ప్రాంతాలను మైసూరు రాష్ట్రంలోనూ, మరాఠీ మాట్లాడే ప్రాంతాలను బొంబాయి రాష్ట్రంలోనూ కలిపారు. తెలంగాణలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలూ, ఆంధ్రరాష్ట్రం కలిసి ఆంధ్రప్రదేశ్ అవతరించింది. నీలం సంజీవరెడ్డి తొలి ముఖ్యమంత్రి అయినారు. చివరి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి. 2014లో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగింది. తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రిగా కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదవీ బాధ్యతలు స్వీకరించి ఇప్పటికీ కొనసాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ లో 2014లో నారాచంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చారు. 2019 ఎన్నికలలో వైఎస్ఆర్ సీపీ గెలిచింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నారు. తెలుగువారు రెండు రాష్ట్రాలతోనూ ముస్లిం సోదరులతో కలిసి శాంతియుతంగా సహజీవనం చేస్తున్నారు. వాస్తవానికి 1983లో ఎన్ టి రామారావు అధికారంలోకి వచ్చిన రోజు నుంచీ హైదరాబాద్ లో మతకలహాలు జరగలేదు. తర్వాత ఒక పర్యాయం మతకలహాలు జరిగాయి. అంతే. అది కూడా మూడు దశాబ్దాల కిందట. అనంతరం శాంతిసుస్థిరతలతో హైదరాబాద్ దేదీప్యమానంగా వెలుగుతోంది. దినదినాభివృద్ది చెందుతోంది.

సైన్యాన్ని పంపి, కొంతమందిని చంపి హైదరాబాద్ ను నిజాంరాజు కబంధ హస్తాల నుంచి విముక్తి చేశారు కనుక అది విమోచనమే అనడంలో సందేహం లేదు. కానీ అప్పుడు నెహ్రూ, సర్దార్ పటేల్ సైతం పోలీసు చర్యను విమోచన పోరాటంగా అభివర్ణించలేదు. విలీనమనే అన్నారు. విమోచన అనే మాట ఒక్కసారి కూడా ఎక్కడా ప్రయోగించలేదు.

గతాన్ని తవ్వుకోవడం అనర్థదాయకం

నెహ్రూ నియమించిన పండిట్ సుందరలాల్ కమిటీ రిపోర్టులో పేర్కొన్న అంశాలు హిందూ-ముస్లిం గొడవలకు దారి తీస్తాయని భావించిన పటేల్ ఆ నివేదికను రహస్యంగా ఉంచారు. జనరల్ చౌధురి నాయకత్వంలో సైన్యం హైదరాబాద్ తరలి వస్తున్న సందర్భంలో మార్గమధ్యంలో ఔరంగాబాద్ వంటి పట్టణాలలో కొన్ని వేలమంది ముస్లింలను చంపివేసినట్టు ఆ నివేదికలో ఉంది. తమను హింసించారంటూ హిందువులు చూపించిన ముస్లింలను సైనికులు కాల్చి చంపివేశారని నివేదించింది కమిటీ. గతంగతః. ఆ వివరాలు మళ్లీమళ్లీ చెప్పుకోవడం వల్ల ప్రయోజనం లేదు. హిందువులపైన ఖాసిం రజ్వీ నాయకత్వంలో రజాకార్లు చేసిన అత్యాచారలను గురించి కానీ, సైన్యం దాడులలో మరణించిన ముస్లింల గురించి కానీ తలచుకోవడం వల్ల ప్రయోజనం లేదు. దేశవిభజన సందర్భంలో జరిగిన ఘోరకలిని పదేపదే స్మరించుకోవడం వల్ల ఏమి ఒరుగుతుంది? నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశవిభజన సమయంలో జరిగిన హత్యాకాండను గుర్తు చేసుకోవడానికి ఒక సంస్మరణ దినం ఏర్పాటు చేశారు. అదే విధంగా ప్రస్తుతానికి ప్రశాంతంగా ఉన్న హైదరాబాద్ నగరంలో విమోచనదినం పేరుతో రజాకార్ల దురాగతాలను గుర్తు చేయడం వల్ల ఏ పాపం ఎరుగని ఈ తరం ముస్లిం సోదరుల పట్ల విద్వేషాన్ని రెచ్చగొట్టడం మినహా మరో ప్రయోజనం ఏమీ ఉండదు. రాజకీయాలకోసం, ఓట్ల కోసం ప్రజల మధ్య విద్వేషాగ్నిని రగల్చడం క్షంతవ్యం కాదు. తెలంగాణ రాష్ట్ర సమితిపైనా, కాంగ్రెస్ పైనా రాజకీయ పోరాటం చేయడానికి బీజేపీకి అనేక అంశాలు ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ లోనో, ఉత్తరాఖండ్ లోనో ప్రయోగించిన అస్త్రాలు ఇక్కడ పని చేయవు. మతతత్త్వాన్ని రెచ్చగొట్టడం అంటే ప్రశాంతంగా సాగుతున్న హైదరాబాద్ పౌరుల జీవితాలలో మంటలు రగిలించడమే. కేసీఆర్ పైనా, రేవంత్ రెడ్డిపైనా ఇష్టం వచ్చిన రీతిలో రాజకీయ పోరాటాలు చేయండి. ప్రజలకు ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ విమోచన పేరుతో కేసీఆర్ ని నిజాం వారసుడనో, అసదుద్దీన్ ఒవైసీని ‘ఖాసిం రజ్వీకా ఔలాద్’ అనో పిలిచి సామరస్య వాతావరణాన్ని చెడగొట్టవద్దు. రాజకీయం ప్రజలకు వీలైతే మేలు చేయాలి. కానీ హాని మాత్రం చేయకూడదు. గతాన్ని విస్మరించాలి. మానిన గాయాలను తిరిగి రేపకూడదు. సమైక్యతకోసమే అన్ని రాజకీయ పక్షాలూ పాటుపడాలి. సహజీవనం అనివార్యం. ఈ హితవు హిందువులకూ, ముస్లిలకూ అందరికీ వర్తిస్తుంది. అందుకనే, జరిగింది హైదరాబాద్ విమోచనైనా సరే దాన్ని విలీనం అనే అనాలి.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles