పాలడుగు రాము
హైదరాబాద్ నగరాన్ని వర్షం వీడటంలేదు. వారం రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు నగర జీవనం అస్తవ్యస్థమయింది. ఇంకా తేరుకోక ముందే మళ్లీ తన ప్రతాపం చూపిస్తున్నాడు వరుణదేవుడు. తాజాగా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం కురవడంతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. ట్రాఫిక్ జాం కావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నగరంలో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురుసే అవకాశం ఉందన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో జీహెచ్ఎంసీ అప్రమత్తమయింది. ఇప్పటికే కురిసిన భారీ వర్షాల కారణంగా నగరంలో పదుల సంఖ్యలో కాలనీలు జల దిగ్భందంలోనే ఉన్నాయి. మరోసారి వర్షం పడితే పరిస్థితి ఏంటని నగర వాసులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముంపుకు గురయిన ప్రాంతాల్లోని ప్రజలను యుద్ధప్రాతిపదికన కమ్యునిటీ హాళ్లకు తరలిస్తున్నారు.
10 కోట్ల సాయం ప్రకటించిన తమిళనాడు … పళనిస్వామికి కేసీఆర్ కృతజ్ఞతలు
తెలంగాణ వ్యాప్తంగా గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు భారీగా ఆస్తి నష్టంతో పాటు, పలు చోట్ల ప్రాణ నష్టం కూడా సంభవించింది. నగర జీవనం అస్తవ్యస్తమయింది. ఇప్పటికీ పదుల సంఖ్యలో కాలనీలు జల దిగ్భంధంలోనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామి.. తెలంగాణకు 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించారు. ఈ కష్ట సమయంలో తెలంగాణ ప్రజలకు తమిళనాడు ప్రభుత్వం మద్దతుగా ఉంటుందని అన్నారు. వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రాష్ట్రానికి 10 కోట్ల రూపాయల ఆర్థిక సాయం ప్రకటించిన తమిళనాడు ముఖ్యమంత్రి పళనిస్వామికి తెలంగాణ సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
దెబ్బతిన్నఇళ్లకు ప్రభుత్వ సాయం
భాగ్యనగరంలో భారీ వర్షాలు, వరదలకు నష్టపోయిన ప్రజలకు తెలంగాణ ప్రభుత్వం ఆర్థిక సాయం ప్రకటించింది. వరద నీటికి దెబ్బతిన్నకుటుంబాలకు ఇంటికి 10 వేలు చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం ప్రకటించింది. వరదల తాకిడితో ఇళ్లు పూర్తిగా కూలిపోయిన వారికి లక్ష రూపాయలు, పాక్షికంగా దెబ్బతిన్న ఇళ్లకు 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు తెలిపారు. పేదలకు సాయం అందించేందుకు పురపాలక శాఖకు 550 కోట్లు సత్వరం విడుదల చేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. నగర పరిథిలోని హైదరాబాద్ రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాల కలెక్టర్లు వారి బృందాలను వెంటనే రంగంలోకి దించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్ ను ఆదేశించారు. దెబ్బతిన్న రోడ్లు, ఇతర మౌలిక వసతులకు యుద్ధప్రాతిపదికన మరమ్మతులు చేపట్టి మళ్లీ పరిస్థితులను సాధారణ స్థితికి తీసుకురావాలని అధికారులకు ఆదేశాలను జారీ చేశారు.