Tuesday, January 21, 2025

‘ఫుడ్ ప్రాసెసింగ్’ తో తొలి ‘హైబ్రిడ్’ రాష్ట్రంగా ఏ. పి.  

జాన్ సన్ చోరగుడి

విజయవాడలో రెండున్నర ఏళ్ళక్రితం సెప్టెంబర్ 21-22న జరిగిన ‘ఏ.పి. వాణిజ్య ఉత్సవ్ -2021’ వేదికను చూసినప్పుడే భవిష్యత్తు స్పష్టమయింది. ఇది మునుపు చూసిన ‘పెట్టుబడుల సదస్సు’ వంటిది కాదని, దీని లక్ష్యం అంతకంటే విస్తృతమైనదని అప్పుడే అర్ధమయింది. జగన్ మోహన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి ప్రాంతీయ పార్టీ పెట్టిన తర్వాత- భారత ప్రభుత్వం చేసిన రాష్ట్రవిభజన, రాజకీయంగానే కాదు, ‘ఏరియా స్పెసిఫిక్’ దృష్టితో అభివృద్ధి ప్రణాళికల రూపకల్పనను అనివార్యం చేసింది.

వాణిజ్య ఉత్సవ్ సభలో ప్రసంగిస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి

ఆ దిశలో మనవద్ద పడిన మరొక ముందడుగు, ముఖ్యమంత్రి హోదాలో జగన్ మోహన్ రెడ్డి 2023 జులై 24న ఆరు ఆహారశుద్ధి పరిశ్రమలకు ప్రారంభం, ఐదింటికి భూమిపూజ చేయడం. ప్రతిపక్ష నాయకుడిగా తొలి ఐదేళ్ళ మధ్యలో ‘అసెంబ్లీ’ నుంచి బయటకువచ్చి, చేసిన పాదయాత్ర వల్ల- ఉత్తరాంధ్ర, కోస్తాంధ్ర, రాయలసీమల స్థానిక అవసరాలకు తగ్గట్టుగా తన ప్రభుత్వంలో అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడానికి అది అన్నివిధాల ఆయనకు అమిరింది. అందుకే, 2019 ఎన్నికల్లో కేవలం నాలుగు పేజీల ‘మ్యానిఫెస్టో’తో ప్రజల్లోకి రావడం సాధ్యమయింది.

Also read: ఉద్రిక్తతల్లో ‘ఆమె’ లక్ష్యం కావడం అనాగరికం!

అయితే,  అందుకు ఆయన తన ‘టీమ్’ తో చేసిన ‘హోమ్ వర్క్’ ఎటువంటిదో, ఇప్పుడు అర్ధమవుతున్నది. ఇప్పటివరకు ‘పాలసీ మేకర్స్’ లేదా అత్యున్నత స్థాయి పరిపాలన వర్గాల్లో పరిమిత స్థాయిలో అమలయిన ‘కన్వర్ జెన్స్’ (కలుపుకు పోయే) విధానాన్ని, విస్తృత స్థాయిలో అమలు చేయడానికి జగన్ సిద్దమయ్యారు. కానీ ఇక్కడ రెండు కీలకమైన అంశాలు వున్నాయి. మొదటిది ఇది- ఇంకా కుదురుకుంటున్న దశలోనే ఉన్న విభజిత ఏ.పి.కి తొలి దశాబ్ది. రెండు- ప్రభుత్వాధినేతగా జగన్ కిది తొలి అనుభవం.

అయినా ‘లీడర్’ గా జగన్ తొలి దశాబ్దిలోనే దీన్ని- ‘హైబ్రీడ్ గ్రోత్ మోడల్’ చేయడానికి తీసుకున్నది సాహసోపేతమైన ‘లైన్.’ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నికయిన ప్రభుత్వ విధానాల్ని ‘బ్యురోక్రసీ’ కార్యరూపం ఇవ్వడమనేది తెలిసిందే. అయితే, అందులో ఏదైనా, ‘తొలి ప్రయోగం’ ఉన్నప్పుడు, అధికారులు కూడా ‘కెరియర్’ పరంగా తమని తాము ‘ప్రూవ్’ చేసుకోవడానికి, దాన్ని సవాలుగా స్వీకరిస్తారు.

అప్పటి పరిశ్రమలు,వ్యవసాయ శాఖల మంత్రులు

 గడచిన పాతికేళ్ళుగా ‘మార్కెట్ ఎకానమీ’ లో ‘ఇ-గవర్నెస్’ ఆఫీస్ విధానంలో పనిచేస్తున్న అధికారులకు ‘కన్వర్ జెన్స్’ గురించి ఇప్పటికే సాకల్యంగా తెలుసు. అందుకే, వారు విజయవాడ ‘వాణిజ్య ఉత్సవ్’ వేదికపైన వున్న ‘పరిశ్రమల’ పక్కన ‘వ్యవసాయాన్ని’ అవలీలగా కూర్చోబెట్టి, రెండింటినీ కలిపి- ‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖగా   ఒకటి చేయగలిగారు! వాళ్ళు చేయడం అంటే సరే; కానీ ఇలా చేయవచ్చు అని సి.ఎం. జగన్ మోహన్ రెడ్డి వద్ద వాళ్ళు చెప్పడం, అందుకు ఆయన ‘గ్రీన్ సిగ్నల్’ ఇవ్వడం  ఇక్కడ కీలకమైన అంశం.

Also read: ఆ సంస్కారం మనకు అలవడినప్పుడు…

ఎందుకంటే, ఒక కొత్త ప్రభుత్వ శాఖను ఇక్కడ ప్రారంభించడం, అదీ ఐదేళ్ల క్రితం కన్నుతెరిచిన కొత్త రాష్ట్రంలో… ‘కరోనా’ కాలంలో అన్నప్పుడు, దీన్ని ముందుకు నడిపించిన ఒకే ఒక్క అంశం- దిగువస్థాయి కుటుంబాలకు ఆర్ధిక స్వావలంబన కల్పించడం. ఇక్కడే- గతంలో వై.ఎస్.ఆర్. బహిరంగ సభల్లో అంటుండే- “సాగుబడితో పాటు, ఒక గొర్రె, లేదా ఒక బఱ్ఱె, లేదా నాలుగు కోళ్లు ఉంటే- చిన్నసన్నకారు రైతుల  ఆర్థికత పెరుగుతుంది” అన్నమాట మనం గుర్తుచేసుకోవాలి. అప్పట్లో నాన్న అంటుండే పాత నమూనాను, ఆయన కొడుకు ఎంత ‘హైబ్రిడ్’ స్థాయికి తీసుకువెళ్లాడో ఈ సందర్భంగా మనం చూడవచ్చు. 

చిహ్నాలతో వ్యవసాయ స్థిర ఉత్పత్తిని సూచించే చిత్రం

నిజానికి ఈ ‘కన్వర్ జెన్స్’ అభివృద్ధి విధానం మరీ కొత్తదేమీ కాదు. రాష్ట్ర విభజనకు పదేళ్ళ ముందు- ‘వరల్డ్ ఎకనమిక్ ఫోరం’ అధ్యక్షుడు లావూస్ శ్వాబ్ 10 ఫిబ్రవరి 2004 న హైదరాబాద్ వచ్చినప్పుడు, అభివృద్ధి చెందుతున్న దేశాలు ప్రస్తుత ఆర్ధికస్థితి నుంచి తదుపరి దశకు కాకుండా,  రెండుమూడు దశలు అవతలకు దూకే- ‘లీఫ్ ఫ్రాగ్’ అభివృద్ధి విధానాన్ని శ్వాబ్ సూచించాడు.

Also read: నీలం అడుగుజాడలు ఇంకా కొనసాగుతున్నాయి…

కానీ, అప్పటికి ‘విజన్-2020’ అంటూ ‘షో కేసింగ్’ తో కాలక్షేపంచేసే నాయకత్వాల్లో ఇవేవీ కార్యాచరణ వైపుగా కదలలేదు. మళ్ళీ ‘సెంటర్ ఫర్ స్ట్రాటజిక్ అండ్ ఇంటర్నేషనల్ స్టడీస్’ డైరక్టర్ ఎరోల్ ఒబెక్, ప్రొఫెసర్ విలియం ఏ. కార్టర్ 2020 ఏప్రెల్ 10న రాసిన పరిశోధనా వ్యాసం- ‘ది నీడ్ ఫర్ లీఫ్ ఫ్రాగ్ స్ట్రాటజీ’లో- “This process would  eventually narrow the income gap and delivering new wealth for their citizens” అని ఆ విధానాన్ని ప్రశంసించారు.

టమాటాల ప్రదర్శన

‘లీఫ్ ఫ్రాగ్’ నమూనా అమలుకు పరిపాలనా వ్యవస్థలో వేర్వేరు శాఖల మధ్య ‘కన్వర్ జెన్స్’ అనేది తొలిమెట్టు. ఈ నేపధ్యంలో మనవంటి వ్యవసాయ ప్రధాన రాష్ట్రంలో- ఆహార పంటలు, వాణిజ్య పంటలు, పాడి, మత్స్యసంపద, ‘మీట్ అండ్ పౌల్ట్రీ’, పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలను ‘పరిశ్రమలు-వాణిజ్యం’ రంగంతో అనుసంధానం చేయాలనేది, రాష్ట్ర ప్రభుత్వ వ్యూహం. అందుకోసం కొత్తగా 2021 ఆగస్టులో మన రాష్ట్ర ప్రభుత్వం‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖను ఏర్పాటుచేసింది.

Also read: వానపాముల కదలికలు, వారి ఉక్కపోతకు కారణం!

‘ఫుడ్ ప్రాసెసింగ్’ శాఖ వ్యవసాయ అనుబంధ రంగాలకు- ‘స్పోక్స్ అండ్ హబ్’ తరహాలో ఇకముందు ‘వాణిజ్య’ వసతి కల్పించనుంది. అయితే, దీని ముందస్తు సిద్డబాటు కోసం 2020 జూన్ 6న రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలితో సి.ఎం. జరిపిన సమావేశం కీలకమైనది. చేపలు, రొయ్యల్లో ‘యాంటి బయోటిక్స్’ ‘హెవీ మెటల్స్’ లేకుండా తనిఖీకి 2021 జులైలో 14 ‘ఆక్వా ల్యాబ్స్’ ఏర్పాటు ఈ దిశలో మరో ముందడుగు.

క్షేత్ర స్థాయిలో ఈ మొత్తం- ‘నెట్ వర్క్’ అమలు కోసం పెట్టినవే (‘ఆర్.బి.కే’) రైతు భరోసా కేంద్రాలు. అయినా- ‘పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖలు ఉండగా ‘వాలంటీర్’ వ్యవస్థ ఎందుకు?’ అన్నవాళ్ళు రేపు ఇక్కడ- ‘వ్యవసాయ శాఖ ఉండగా ‘ఆర్బీకే’లు ఎందుకు?’ అనరనే హామీ లేదు. అటువంటి నిరక్ష్యరాస్య రాజకీయాలు సాగుతున్న చోట, ఇటువంటి నూతన చొరవల మంచి చెడులు గురించి ఆశించడం మన అత్యాశ అవుతుంది.

Also read: రాష్ట్రవిభజన రహస్యం వెల్లడించిన విశాఖ వేదిక!

(రచయిత అభివృద్ధి-సామాజిక అంశాల వ్యాఖ్యాత)

Johnson Choragudi
Johnson Choragudi
సామాజిక - అభివృద్ధి అంశాల వ్యాఖ్యాత

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

3,390FansLike
162FollowersFollow
2,460SubscribersSubscribe
- Advertisement -spot_img

Latest Articles