- మొత్తం 31 అసెంబ్లీ, 3 లోక్ సభ స్థానాలకు కోవిద్ కారణంగా ఉపఎన్నికలు వాయిదా
- ఒక్క పశ్చిమబెంగాల్ మినహాయింపు, అక్కడ 3 అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు
తెలంగాణ రాష్ట్రంలోని హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా పడింది. ఈ రోజు ఎన్నికల కమిషన్ విడుదల చేసిన ప్రకటనలో తెలంగాణ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాలలో 31 అసెంబ్లీ స్థానాలకూ, మూడు లోక్ సభ స్థానాలకూ జరగవలసిన ఉపఎన్నికలను కోవిద్ కారణంగా వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. ఆయా రాష్ట్రాల ప్రధానకార్యదర్శుల నివేదికలను పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్నికల కమిషన్ తెలియజేసింది. అంటే, తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కూడా హుజూరాబాద్ ఉపఎన్నిక వాయిదా వేయాలనే కోరినట్టు అర్థం చేసుకోవాలి. ఒకే ఒక మినహాయింపు పశ్చిమబెంగాల్. అక్కడి రాష్ట్ర ప్రభుత్వం ఉపఎన్నికలు జరపాలను గట్టిగా కోరింది.
మంత్రి ఈటల రాజేంద్ర రాజీనామా కారణంగా మహబూబాబాద్ ఉపఎన్నిక అవసరమైంది. ఈ ఎన్నికలకోసం టీఆర్ఎస్ మహాప్రచారం చాలా వారాలుగా చేస్తోంది. ఆర్థిక మంత్రి హరీష్ రావు అక్కడే మకాం ఉంటున్నారు. వేలకోట్ల ఖర్చు కాగల దళితబంధు పథకాన్ని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు (కేసీఆర్) తలకెత్తుకున్నారు. ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాన్ని హుజూరాబాద్ నుంచే అమలు చేస్తామని చెప్పారు. ఇందుకోసం రెండువేల కోట్లు రూపాయలు విడుదల కూడా చేశారు. ఇంత హడావుడి చేస్తూనే కోవిడ్ కారణంగా ఉపఎన్నిక వాయిదా వేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఎన్నికల సంఘానికి నివేదిక పంపడం విశేషం.
మమత కోసం బెంగాల్ లో ఉపఎన్నిక
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి భారత ఎన్నికల కమిషన్ ఆశాభంగం కలిగించలేదు. పశ్చిమబెంగాల్ లోని భబానీపూర్ అసెంబ్లీ స్థానానికి సెప్టెంబర్ 30వ తేదీన ఉపఎన్నిక జరుగుతుందని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓట్ల లెక్కింపు అక్టోబర్ 3న జరుగుతుందని ఎన్నికల కమిషన్ శనివారం జారీ చేసిన నోటిఫికేషన్ లో ప్రకటించింది. పశ్చిమబెంగాల్ లోనే సమ్షేర్ గంజ్, జంగీపూర్ అసెంబ్లీ స్థానాలకు కూడా అదే రోజు ఉపఎన్నికలు జరుగుతాయి. మమతా బెనర్జీ భభానీపూర్ నుంచి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే, మహారాష్ట్ర, తెలంగాణ, కొన్ని ఈశాన్య రాష్ట్రాలలో మొత్తం 31 స్థానాలకు జరగవలసిన ఉపఎన్నికలను కోవిద్ వ్యాప్తి కారణంగా వాయిదా వేశారు.
రాజ్యాంగ అవసరాన్నీ, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి చేసిన ప్రత్యేక అభ్యర్థనను పురస్కరించుకొని (ఏసీ – 159) భబానీపూర్ నియోజకవర్గంలో ఉపఎన్నికల జరపాలని నిర్ణయించామని ఎన్నికల కమిషన్ ప్రకటించింది. కోవిద్-19 కు సంబంధించి అవసరమైన సకల జాగ్రత్త చర్యలూ తీసుకుంటామని అత్యున్నత ఎన్నికల సంఘం తెలియజేసింది. వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి నివేదికలు అందిన మీదట 31 అసెంబ్లీ స్థానాలకూ, మూడు లోక్ సభ స్థానాలకు ఉపఎన్నికలు జరపరాదని ప్రస్తుతానికి నిర్ణయించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది.
ఈ ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారసమయంలో కోవిద్ కేసులు విపరీతంగా పెరిగాయి. అటువంటి సమయంలో ఎన్నికలు నిర్వహించినందుకు ఎన్నికల సంఘం విమర్శలకు గురి అయ్యింది. అప్పుడు రోజుకు 20 వేల కేసులు నమోదయ్యేవి. ఇప్పుడు గత వారం రోజుల సగటు 640 కేసులకు మించి లేదు. ‘ప్రధాని ఎప్పుడు ఆదేశిస్తే అప్పుడు ఉపఎన్నికలను ఎన్నికల కమిషన్ నిర్వహిస్తుంది,’’అంటూ జూన్ లో మమతా బెనర్జీ నిష్టూరంగా, వ్యంగ్యంగా మాట్లాడారు. కోవిద్ మహమ్మారి నియంత్రణలోనే ఉన్నదనీ, ఉపఎన్నికలు జరిపించాలనీ పశ్చిమబెంగాల్ ప్రభుత్వం ఎన్నికల సంఘాన్ని కోరింది. ‘‘ఎందుకు తొందరపడుతున్నారు?’’ అంటూ బీజేపీ పశ్చిమబెంగాల్ శాఖ అధ్యక్షుడు దిలీప్ ఘోష్ ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు జవాబు కష్టమైనది కాదు. పోయిన అసెంబ్లీ ఎన్నికలలో నందిగ్రాం నుంచి మమతా బెనర్జీ ఓడిపోయిన కారణంగా ఆమె ముఖ్యమంత్రి పదవిలో కొనసాగాలంటే అసెంబ్లీకి ఉపఎన్నిక జరగడం, ఆమె గెలుపొందడం అవసరం. ఆ ఎన్నికలలో మమతా నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ కు ఘనవిజయం లభించినప్పటికీ మమతా బెనర్జీ స్వయంగా పోటీ చేసిన నందిగ్రాంలో స్వల్ప తేడాతో ఓడిపోయారు. మామూలుగా ప్రతి ఎన్నికలలో పోటీ చేసే భబానీపూర్ లో మరొకరిని నిలబెట్టి తాను మాత్రం నందిగ్రాంకు పరిమితమైనారు. రెండుచోట్లా పోటీ చేసి ఉంటే సమస్య ఉండేది కాదు. భబానీపూర్ లో టీఎంసీ అభ్యర్థి గెలుపొందారు. ఒక్క సీటులో పోటీకి పరిమితం కావడం వల్ల ఉపఎన్నికలకోసం ఎదురు చూడవలసిన పరిస్థితి ఏర్పడింది.