- అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల
- ఫలితం నవంబర్ 2 తేదీన
- పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే
- మూడు లోక్ సభ, 30 అసెంబ్లీ స్థానాలకూ ఉపఎన్నికలు
హుజూరాబాద్ అసెంబ్లీ ఉపఎన్నిక పోలింగ్ వచ్చేనెల 30వ తేదీన జరుగుతుంది. హుజురాబాద్ అసెంబ్లీ ఉపఎన్నికలకు షెడ్యూల్ ను కేంద్ర ఎన్నికల సంఘం మంగళవారంనాడు విడుదల చేసింది. అక్టోబర్ 1న నోటిఫికేషన్ విడుదల చేస్తారు. నామినేషన్ దాఖలుకు చివరి తేదీ అక్టోబర్ 8. అక్టోబర్ 11న నామినేషన్ల పరిశీలన. నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 13. అక్టోబర్ 30వ తేదీన ఎన్నికల పోలింగ్. నవంబర్ 2వ తేదీ ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన.
లోగడ పశ్చిమబెంగాల్, ఒడిశాలలో ఉపఎన్నికలకు తేదీలు ప్రకటించినప్పుడు హుజూరాబాద్ కూ, మరి 25 అసెంబ్లీ స్థానాలకూ, మూడు లోక్ సభ స్థానాలకూ ఎన్నికలు ప్రకటించలేదు. అప్పుడు వివిధ రాష్ట్రాల ప్రధాన కార్యదర్శుల నుంచి నివేదికలు తెప్పించుకున్నామనీ, కోవిద్ కారణంగా ఇప్పుడే ఎన్నికలు వద్దని ప్రధాన కార్యదర్శులు నివేదించిన తర్వాత ఆయా రాష్ట్రాలలో ఎన్నికలను వాయిదా వేశామనీ ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈ లోగా కరోనా ఉద్ధృతి తెలంగాణలో తగ్గిపోవడంతో ఈ ఉపఎన్నిక జరపాలను ఎన్నికల సంఘం నిర్ణయించింది.
దాదర్ నగర్ హవేలీ, ఖాండ్వా, మండి లోక్ సభ స్థానాలకూ, దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలకు జరిగే ఉపఎన్నికలలో పోలింగ్ అక్టోబర్ 30 వ తేదీన జరుగుతుంది. ఓట్ల లెక్కింపు, ఫలితాల ప్రకటన నవంబర్ 2వ తేదీన జరుగుతాయి. కరోనా మహమ్మారి, వరదలు, పండుగలను దృష్టిలో పెట్టుకొని ఈ షెడ్యూల్ ని నిర్ణయించినట్టు ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉపఎన్నికలు జరిగే అన్ని ప్రాంతాలలో ఎన్నికల నియమావళి వెంటనే అమలులోకి వచ్చింది.
హుజూరాబాద్ ఎన్నికను ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఆర్థికమంత్రి హరీష్ రావు కొన్ని వారాలుగా హుజూరాబాద్ ఎన్నికల ప్రచారంలోనే నిరవధికంగా కొనసాగుతున్నారు. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేంద్రకూడా అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇంతవరకూ అభ్యర్థిని ప్రకటించలేదు. టీఆర్ఎస్ ఒక విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాసయాదవ్ ను పోటీలో దించింది. అతను కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పోటీ ప్రధానంగా టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే ఉంటుంది.