రామాయణమ్ – 150
‘‘మహారాజా, వాడెవడో భయంకర రూపముతో ఉన్న వానరుడు అశోకవనమును ధ్వంసము చేసి అడ్డు వచ్చిన వారిని అరచేతితోనే చావమోది చంపేశాడు. వాడు అంతకు మునుపు సీతాదేవి తో మాటలాడినాడు ప్రభూ. వానికి నీవు భయంకరమైన దండన విధింపుము’’ రాక్షస స్త్రీల మాటలు వినగానే రావణుడి నేత్రాంచలములనుండి, మంటతో కూడిన దీపముల నుండి వేడివేడి నూనె బిందువులు కారినట్లు, కన్నీటిబిందువులు రాలెను.
Also read: విధ్వంసమైన అశోకవనం, భీతిల్లిన రాక్షసగణం
మండుచున్న అగ్నిహోత్రము వలే ఎర్రనైన కన్నులు మరింత పెద్దవి చేసి ‘ధూర్తవానరుని పట్టుకొనుడు’ అనుచు ఎనభైవేల మంది శూరులైన కింకరులను ఆజ్ఞాపించెను.
ప్రభువాజ్ఞ అయిన వెంటనే వివిధ ఆయుధములతో వారు హనుమంతుని పైకి యుద్ధమునకు బయల్వెడలిరి. మిడుతలదండు అగ్నివైపు దూకినట్లుగా వారంతా ఆ మహాబలుడి మీదకు దూసుకుంటూ పోసాగిరి. వారిని చూడగనే సమరోత్సాహముతో తోకను నేలపై విసరికొట్టి దేహము ఇంకా పెద్దది చేసి లంకా నగరము ప్రతిధ్వనించునట్లుగా జబ్బలు చరచి నిలబడెను.
ఆ ధ్వనికి చెట్లమీది పక్షులు టపటపరాలి క్రింద పడిపోయినవి. ‘శ్రీరామ చంద్రునకు జయము’ అంటూ హనుమంతుడు జయఘోషలు చేయసాగెను.
Also read: అశోకవన విధ్వసం ప్రారంభించిన హనుమ
….
జయఘోషలు, రణన్నినాదాలు లంకా నగరమంతా ప్రతిధ్వనిస్తున్నాయి.
‘‘అతిబలుడైన రామునకు జయము మహాబలుడైన రామానుజునకు జయము
జయము జయము జయము. రామ సఖుడైన సుగ్రీవునకు జయము.
అవలీలగా కార్యములు చక్కబెట్టు కోసలాధీశుడు రామునిదాసుడను నేను.
Also read: సీతమ్మను ఓదార్చిన హనుమ
మారుతాత్మజుడను నేను. అరిమర్దనుడను నేను. హనుమంతుడను నేను. వేనవేలు రావణులు వచ్చినా తరులూడబీకి గిరులు పెకలించి కుమ్మరించెదను. వారినెల్ల మట్టి కరిపించెదను. తల్లి జానకీదేవికి వందనమొనర్చి కార్యములెల్ల సాధించి రక్కసిమూకలు చూచుచుండగనేరాముని వద్దకు తిరిగి వెళ్ళెదను’’ అని సింహనాదాలు చేస్తూ జబ్బలు చరుస్తూ ‘ఎవడొస్తాడో రండిరా’ అంటూ సమరోత్సాహాన్ని ప్రకటించాడు మారుతి….
Also read: రాముని ససైన్యముగా తోడ్కొని రమ్ము, హనుమకు సీతమ్మ పురమాయింపు
వూటుకూరు జానకిరామారావు