కవిత్వానికీ, కదనరంగానికీ మధ్య ఒక కవి !
(మహాకవి, ప్రజాకవి, గోరఖ్ పాండే స్మృతిలో)
“హమ్ భరత్ ప్రసాద్, చమార్, అస్పృశ్య్…”
ఉత్తర భారతదేశంలోని మౌ ప్రాంతంలో దేవరియా నుండి మరింత లోలోతుల్లో, విశాలమైన పచ్చిక బయళ్ళ మధ్య, అనూహ్యమైన వింత మలుపుల్లోకి దారితీసిన మారుమూల గ్రామంలో పరిచయం చేస్కునే పేరుకి ముందు కూడా కులం చెప్పి తనని తాను అస్పృశ్యుడిగా చెప్పుకున్న ఆ భరత్ ప్రసాద్ అనబడే పెద్దాయన మమ్మల్ని అడిగాడు,
‘‘ఎవరి కోసం వచ్చారు?’’
“దాదా, హమ్ లోగ్ పాండేజి కా ఘర్ దేఖ్ నే ఆయేతే…. (మేం పాండే గారి ఇల్లు వెతుక్కుం టూ వచ్చాం..”)
“కౌన్ పాండే బేటా…(ఏ పాండే బిడ్డా..?)’’
” గోరఖ్ పాండే..కవీ!”
అప్పటివరకూ కూర్చున్న దాదాపు ఏడుపదులు దాటిన ఆయన వెంటనే అటెన్షన్లోకి వచ్చేశాడు. కళ్ళల్లో ఆర్ద్రత నిండిన మెరుపు, గొంతులో చెమ్మతో కూడిన ప్రేమ. గోధుమ దుప్పటిలా పర్చుకున్న ‘పండిత్ కి ముండేరా” అనబడే ఆ పొలాల మధ్యనున్న గ్రామంలో ఆ పేరు మేం చెప్పగానే అతడన్న మొట్టమొదటి మాట,
“భగవాన్ హై బేటా…భగవాన్”
(దేవుడయ్యా…ఆయన దేవుడు!)
నా రెండు దశాబ్దాల కల. కవిత్వం అంటే ఏదో కెలకటం కాదనీ, పదాల్ని అదను చూసి పాలక వర్గంపై, అన్యాయం, ఆధిపత్యం, అసమానతలపై సంధించడమనీ, భాషను శోషి తుల పక్షం వహించేలా నిర్మించడమనీ, అసహాయుల ఆర్త నాదాలకి అక్షరాన్ని గొంతుగా మార్చడమని ప్రకటించిన మహాకవి, ఆలోచనాపరుడు, సామాజిక కార్యకర్త, ప్రజాతంత్ర తాత్వికుడు, సాంస్కృతికోద్యమశీలి “గోరఖ్ పాండే” జన్మభూమిని సందర్శించాలనేది. సుమారు డెబ్భై ఏళ్ళ క్రితం పుట్టి, బి. హెచ్. యు. మొదలు జె. ఎన్.యు. వరకూ విశ్వవిద్యాలయల ప్రగతి శీలతకి తిరుగులేని ప్రేరకుడిగా నిలిచి ముప్పై సంవత్సరాల క్రితం మరణించిన అద్వితీయ ప్రజాకవి గోరఖ్ పాండే జీవితం ఉల్కాపాతం!
సాంప్రదాయ బ్రాహ్మణాధిక్యతతో కుళ్ళిన ఆ భూస్వామ్య కుటుంబంలో ఆ రోజుల్లో ఎంతటి సనాతన ఆచారాలుండేవో ఊహించడానికి ఈనాటికీ తోకలు, పిలకలతో ఉన్న మనుషుల్ని చూస్తే చాలు. అలాంటి కుటుంబంలో పుట్టిన గోరఖ్ అసాధారణ స్థాయికి ఎదిగాడు. దళితబహుజన వాడలే అతడికి అక్షరాభ్యాసం చేశాయ్. శ్రమజీవుల కడగళ్ళు, కష్టాలే అతడికి దిక్సూచిని అందించాయ్. మాయమైపో వలసిన అద్భుతమైన అనేక వాడ పాటలకి ప్రాణంపోశాడు. మచ్చలా మిగిలిపోయిన కులతత్వాన్ని మనస్పూర్తిగా విసర్జించి మనిషిగా మారాడు. అణగారిన ప్రజల వైపు నిలవడమే జీవిత సారమని నమ్మి దానినే గొంతెత్తి నినదించాడు. మహామనిషై ప్రజాకవిగా పునర్జన్మించాడు!
ఏవత్ దేశంలోనే భోజ్పురి భాషలో ఏకైక ప్రజాకవి. అసామాన్య ఆలోచనాపరుడు. దుర్మార్గ పాలనని చీల్చి చెండాడినవాడు. పురుషాధిక్యత, బ్రాహ్మణాధిపత్యం, పెట్టుబడి దారీ విధానాలపై సూటైన పదాలతో, ఘాటైన పాదాలతో, ధాటిగా ఎక్కుపెట్టిన మేటి వ్యంగ్య కవిత్వం గోరఖ్ ది. ఒక్క యూపీ మాత్రమే కాదు, ఢిల్లీ, బిహార్, హర్యానా, ఎం.పి. చత్తీస్‌గఢ్, మహరాష్ట్ర, తెలంగాణ వరకూ హిందీ, భోజ్ పురి లో దేశంలో నలువైపులా ఉన్న విశ్వవిద్యా లయాల్లో ఎక్కడ ఉద్యమాలు ఎలుగెత్తినా, ఆ చెలరేగే నినాదాల్లో అతడి పేరే వినిపిస్తుంది. ఆధిపత్యానికి వ్యతిరేకంగా ప్రజాస్వామిక హక్కుల కోసం దేశంలో విద్యార్థి, రైతు, మహిళా, ఆదివాసీ ఉద్యమాలు ఎక్కడ ప్రవహించినా అక్కడ అతడి పేరే ధ్వనిస్తుంది. సంస్కారానికి మానవ రూపమిస్తే అచ్చం అతడిలా ఉంటుందంటారు. సాంస్కృతిక భిన్నత్వానికి అతడి జీవితమే ఒక తిరుగులేని ప్రతీకం టారు. ‘జన సాంస్కృతిక మంచ్’ వ్యవస్థా పకుడు. “జన సంస్కృతి” పత్రిక సంపాదకుల్లో ఒకడు. లోకపు కపటత్వానికి గుండె చెదిరి, స్వార్ధ ప్రయోజనాల నడుమ ఇమడలేక ఆత్మహత్య పేరిట దుర్మార్గమయిన సమాజం చేత హత్య కావించబడ్డ సున్నిత మనస్కుడు, హృదయమున్న మనిషి!
హృదయవైశాల్యం ఎలా ఉంటుందో తెలుసా? తన భాగం భూమినీ, ఆస్తినీ మొత్తం దళితుల కోసం పంచేసాడు. కుటుంబంలో ఇంకా ఉన్న పొలాన్ని కూడా పంచేయాలంటూ ఎప్పుడూ ఇంట్లో గొడవపడేవాడు. పెళ్ళైంది, భార్య పేరు నగీనా దేవి. ఆమెది పక్క గ్రామమే. ఆమె కూడా ఎప్పుడో చనిపోయిందట. పిల్లల్లేరు. ఊర్లోకొస్తే ఎప్పుడూ వాడలోనే ఉండే వాడట. అక్కడే తిండీ, నిద్ర, సర్వం. బహుశా, అందుకే ఆ గ్రామంలో ఎవరిని అడిగినా ఆయన ఇల్లెక్కడో చెప్పడమే కాదు, ఆయన జ్ఞాపకాల్ని కూడా ఆత్మీయంగా ఆనాటి పెద్దలు స్మరించుకున్నారు. గోరఖ్ పుట్టిన గ్రామంలో మట్టిని కూడా ఆయన అభిమానులు వచ్చి ప్రేమగా తీసుకువెళ్ళిన సంఘటనలు ఉన్నాయంటే, అది అందరికీ సాధ్యమయ్యేది కాదు. అసంఖ్యాక ప్రజల గుండెల్లో అన్నేళ్ళపాటు కొలువుండటం కంటే, ఒక కవికి, కార్యకర్తకీ కావాల్సింది ఏముంది. నాకు తెలిసీ అంతటి సార్ధకతకి అర్హుడయిన అతి కొద్దిమంది మహావ్యక్తుల్లో నిస్సందేహంగా గోరఖ్ పాండే ఒకడు!
అలాంటి మహోన్నత వ్యక్తి అడుగుజాడల్లో చేసే ఔద్వేగి కాన్వేషణలో భాగంగా, భారత స్వాతం త్ర్యోద్యమంలో రోమాంచిత ఘట్టమైన చౌరీచౌరా స్మృతుల్ని వంద సంవత్సరాలు పూర్తవుతున్న ఈ మహత్తర సమయంలో జ్ఞాపకం చేస్కోవడం సముచి తమనే నా భావం. జలియన్వాలాబాగ్ హత్యాకాండకి నిరసనగా, బ్రిటిష్ సామ్రాజ్య వాదానికి వ్యతిరేకంగా ఎగసిపడిన నిలువెత్తు క్రోధానికి తిరుగులేని నిదర్శనం చౌరీచౌరా. అలాంటి స్మృతి భవనంలో అందరు జాతీయ నాయకుల విగ్రహాలూ పెట్టి అంబేద్కర్ ది పెట్టకపోవడం దారుణం. అదే విషయం అక్కడి నిర్వాహకులకి చెప్పడంతో పాటు, రాసొచ్చాను. ఈ సరికే మతతత్వ శక్తుల చేతుల్లో నిర్వీర్యం ఐపోతున్న అటువంటి స్మృతి చిహ్నాలపై పెద్దగా నమ్మకమైతే లేదుకానీ, ఆ స్పూర్తిని రాబోయే తరాల్లో నుండి ఏ గుప్పెడు మందైనా కొద్దిగా గ్రహించకపోతారా అనే చిన్న ఆశ ఏదోమూల. నిష్ప్రయోజనమని తెలిసినా, నిరుత్సాహం దరిచేరనివ్వకుండా తన పని తాను చేస్కుని అతి చిన్న వయసులో అమరుడయిన గోరఖ్ ని తల్చుకుంటూ ముందుకు సాగిపోయాను!
గోరఖ్ సోదరుడు బలరాంపాండే, మేనల్లుడు విష్ణుపాండేల్ని కలిసాం. ఏదో కొంత సమాచారం, కొన్ని సంగతులు పంచుకున్నారు. కొంత మెటీరియల్ చూపించారు. ఈ సరికే నెట్లో చాలా వరకు ఉన్నాయవి. పేరుప్రఖ్యాతలకి దూరంగా కీర్తిప్రతిష్టలతో సంబంధం లేకుండా, తన సొంత భాషపై ప్రేమతో జనపదానికి జీవం పోస్తూ, పల్లె పదాల నుడికారంతో మనుషుల మధ్య ప్రేమ, మమకారాలకి ప్రాణం పోస్తూ, అతి సాధారణ ప్రజల భాషలో గోరఖ్ సృజించిన కవిత్వం, నిజానికది ఈ దేశపు భూమితో సంభాషిస్తూ, మట్టిని ముద్దాడుతూ, అణగారిన వర్గాలని కౌగిలించుకొని, సకల మానవ సంఘర్షణల సారాన్నీ అన్వేషించడం కోసం సాగిన అతడి జ్ఞాన వాహినికి ఒకానొక ప్రతిరూపం. అనితర సాధ్యమైన దార్శనికతతో ప్రజలతో ప్రత్యక్ష కార్యాచరణలో కలబోసుకున్న గోరఖ్ చేతనత్వం. ప్రజాపోరాటాల్లో భావాలు ఎంత బలమైన ఆయుధాలో గిడసబారిన చరిత్రకి మరొక్కసారి తేటతెల్లం చేసిన తాత్వికత్వం, వెరసి మొత్తంగా, గోరఖ్ కవిత్వం!
అమరులు భగత్ సింగ్, రాజ్ గురు, సుఖ్ దేవ్ ల సంస్మరణ సమయంలో మహాకవి గోరఖ్ పాండే స్మృతికి నివాళులు అర్పించడం నా వరకూ నాకు ఒక సంతృప్తిని ఇచ్చింది. ఉన్న ఒక్కరోజులో గోరఖ్ తో పాటూ, వంద సంవత్సరాలు పూర్తి చేసుకొన్న రోమాంచిత స్వాతంత్ర్యోద్యమం నాటి చౌరీచౌరా స్మృతుల్నీ, మత సామరస్య మానవతావాద ప్రవక్త సంత్ కబీర్ అంతిమ స్మృతుల్నీ దర్శింపజేసి, అంతకుమించి 300 మైళ్ళకి పైచిలుకు కష్టతరమైన ప్రయాణాన్ని తన బైక్ తో గ్రామసీమల దారుల్ని పలకరిస్తూ, ఆప్యాయత నిండిన భిన్న రుచుల్ని ఆస్వాదింపజేస్తూ, ఒక్కరోజులో చేసేలా, గొప్ప అనుభూతిని అందించడమే కాకుండా,బౌద్ధ, బహుజ నోద్యమశీలి, అధ్యయన కారుడూ ఆశిష్ , ప్రత్యామ్నాయ ప్రజాతంత్ర ఉద్యమ నాయకుడు అరవింద్జీ మొదలైన ప్రజా ఉద్యమ మిత్రులతో సమావేశం ఏర్పాటు చేసిన దళిత బహుజన ప్రజాతంత్ర ఉద్యమ మిత్రుడూ, సహచర కామ్రేడ్, ప్రస్తుతం అక్రమ కేసుల్ని ఎదుర్కొంటున్న సోదరుడు గౌతమ్ కి, హృదయం నిండా ప్రేమతో నా చాన్నాళ్ళ కలని నిజం చేసిన కాలానికి, కలానికి, కవిత్వానికి, కథనానికి, కదనరంగానికీ సంధానంగా నిలిచిన విశిష్టమైన ప్రజాకవి గోరఖ్ పాండే కి వినమ్రతతో కూడిన విప్లవాభినందనలతో ఈ చిరు నివాళి!
(ఏ మాత్రం హిందీతో పరిచయం ఉన్నా నెట్లో ఆయన కవిత్వం ఉంది చూడండి. ఏ కొంచెం జీవనార్ద్రత తొణికినా ఆయన పదబంధాల్లో పయనం చేసి రండి. అది కవిత్వం కాదు, యుద్ధం. సాక్షాత్తూ యుద్ధమే. ఎడతెగని ధిక్కార చైతన్య స్వరమే. గోరఖ్ పాండే ‘సమజ్దాంరో కా గీత్’ నాకు నచ్చిన కవిత్వం. అదికాక రెండు మూడు సంపుటాలు ప్రచురించ బడ్డాయ్. ‘అబ్ లోహా గరమ్ హో గయా’ మొదలుకొని ఆయన కవిత్వం తెలుగు చేయించడానికి నేను చేయని ప్రయత్నం లేదు. ఎంతమందికో జిరాక్స్ ప్రతులు తీసి పంపాను. మలయశ్రీ ఒకట్రెండు కవితలు తెలుగు కూడా చేసారు. ఎప్పటికైనా గోరఖ్ కవిత్వాన్ని సారంతో సహా తెలుగు చేయించి ప్రచురించాలనేది అభిలాష. గోరఖ్ పాండే, అవతార్ సింగ్ పాశ్, రమాశంకర్ యాదవ్ @ విద్రోహి వంటి కలం యోధుల కలాల్ని కనీసంగా అయినా కలలు కనే తరాలకు పరిచయం చేయగలనా అనే చిరకల స్పృహని చిరస్థాయిగ నిలుపుకోడం కోసం చేసే ప్రయత్నంలో భాగమే ఎందరో శ్రేయోభిలాషుల సహకారంతో చేసిన ఈ చిరు ప్రయాణం గురించిన కొన్ని ఫొటోలతో ఈ రైటప్.)
– గౌరవ్
(మార్చి 25, అమరుడు, పాత్రికేయ మహా యోధుడు, చింతనాశీలి గణేష్ శంకర్ విద్యార్థి వర్ధంతి స్మృతిలో…)