పుస్తక పరిచయం
“సత్యమేవ ప్రవక్ష్యామి
సత్యం ధ్యాయామి సర్వదా
నహి సత్యాత్ పరం వాక్యం
శ్రోతుమిచ్ఛామి కేనచిత్ !”
(సత్యమునే చెప్పెదను. సదా సత్యమునే ఆలోచించెదను. సత్యము కాని వాక్యమును వినుటకు కూడా ఇష్టపడను.)
“సత్యార్ధం జనసౌఖ్యార్ధం
చాగ్నిమార్గే పదం మమ
సాహసమప్యజేయం సాత్
నిందాస్తుత్యోర్ద్వయోస్సమః”
(సత్యము కొరకు, జనసంక్షేమము కొరకు నిప్పుల దారిలో నా పాదముంచాను. నా సాహసము అజేయమైనది. నిందాస్తుతులు రెండూ నాకు సమానమే)
Also read: ఒకే వ్యక్తి – అనేక జీవితాలు! రాహుల్ సాంకృత్యాయన్ ! !(వ్యాస సంకలనం)
సరైన కాలమానం లేకుండా అసమానతలను వ్యవస్థీకృతం చేసేందుకు రచించబడ్డ భగవద్గీతకు ప్రత్యామ్నాయంగా సరిగ్గా 35 ఏళ్ళ క్రితం మనిషి కోసం చరిత్రలో మనిషే కేంద్రంగా “సత్యాన్వేషులకు, ధర్మ జిజ్ఞాసువులకు, సాదరపూర్వకముగా” అంకితం ఇస్తూ, ప్రవచించిన వంద శ్లోకాల “మానవగీత” లోని ప్రతిజ్ఞా విభాగః లోని ప్రారంభ పద్యాలివి. ధర్మ, అర్ద, కామ, మోక్షాల్ని భౌతికవాద దృక్పథంతో సంస్కృత భాషలో విశ్లేషించిన మొట్టమొదటి అపురూప ప్రయత్నం ఇది. అందుకే,
“వేదాంత భావ రాహిత్యం
సత్యమార్గాను వర్తనం
ఏతత్ జ్ఞాన మితిప్రోక్తం
అజ్ఞానం యత్తదన్యదా “
(మతాసక్తి లేకుండుట, సత్య ధర్మములపై విశ్వాసముంచుటయే జ్ఞానము అనబడును. దానికి భిన్నమైనది అజ్ఞానము.)
Also read: ఉద్వేగభరితమైన రచన – లేడీ డాక్టర్స్!
అని ధైర్యంగా ప్రకటించగలిగారు. ఫలశ్రుతిగా,
“గ్రంధోదయం నవాగీతా
యత్ర పాఠః ప్రవర్తతే
తత్ర సర్వాహి ధర్మాశ్చ
మాయా ముక్తిశ్చ తత్రవై”
(ఈ నూతన గీతా పాఠ ప్రవచనము ఎచ్చట జరుగుచుండునో అచ్చట సకల ధర్మములు ఉండును. మాయావిముక్తి కలుగును.)
అంటారు. సుమారు నూట యాభై గ్రంథాలు రచించి సంస్కృత ఆంధ్రాంగ్ల సాహిత్యాలలోనే కాక హిందీ మొదలు ద్రావిడ భాషలు అన్నింటినీ ఔపోసన పట్టి, పత్రికలు, సంస్థలు స్థాపించి, వేలు పెట్టని ప్రక్రియ లేకుండా నాలుగు దశాబ్దాల పైచిలుకు తెలంగాణ కరీంనగర్ కేంద్రంగా అసాధారణ సాహితీ కృషి చేస్తున్న పెద్దలు డా. మలయశ్రీ రచించిన అద్భుతమైన రచనిది. దీని ప్రభావంతోనే మలయశ్రీ మనుమడు విక్రమాదిత్య ఆరవ తరగతి చదూతున్నప్పుడే ‘దేవుడెక్కడ’ అనే రచన చేయగా, ‘బాలవాక్కు’ పేరిట దానిని ముద్రించడం జరిగింది. నాకు తెలిసీ తెలుగులో మొట్టమొదటి బాల హేతువాద పొత్తం ఇదే!
బహుశా అందుకే ప్రముఖ అంబేద్కరిస్టు మేధావీ, తాత్వికుడు కత్తి పద్మారావు గారు ఈ పుస్తకానికి “మనుస్మృతికి ప్రత్యామ్నాయ గీతమే ఈ మానవగీత” పేరిట మలయశ్రీ కి లేఖ రాస్తూ, ” మీరు రాసిన మానవగీత చదివాక నాస్తికోద్యమంలో ఇంతటి మహత్తర కావ్యం చార్వాక దర్శనం తర్వాత ఇదే అనిపిస్తుంది,” అంటూ, “మీరు సంస్కృతంలో విద్వాంసులు, పండితులు, కవులు, మనుస్మృతికి ప్రత్యామ్నాయం రూపొందించగలిగిన ధీశాలి, మానవతావాది, హేతువాది, నాస్తిక తాత్వికులు” అంటారు!
Also read: సమసమాజమే సోమసుందర్ స్వప్నం!
ఇక మరొక అద్వితీయ రచన “సత్య సూక్తం” (నాస్తికత్వం అంటే ఏమిటి? అది ఎందుకు?) సరిగ్గా పాతికేళ్ళ క్రితం 1997 లో వచ్చిన చిన్న రచన ఇది. పండిత సూత్రం, పురుష సూక్తం, స్త్రీ సూక్తం, బాల సూక్తం, జన సూక్తం, మానవ సూక్తం, ధర్మ సూక్తం విభాగాలలో దేవుళ్ళనీ, మతాలనీ ఉతికారేసిన రచన ఇది. ఈ రోజు నాస్తిక, హేతువాద, భౌతికవాద, మానవవాద, ఇంకా సైన్సు ఉద్యమ సంస్థలు ఓన్ చేసుకుని ప్రచారం చేయవలసిన గొప్ప చిన్ని పుస్తకం ఇది!
ప్రముఖ పురాతత్వ పరిశోధకులూ, చరిత్ర కారులు, రచయిత, న్యాయవాది, ‘A Source Book in Indian Materialism’ రాసిన కీ. శే. ఠాకూర్ రాజా రాంసింగ్ గారి ప్రేరణతో ఆయనకే అంకితం ఇవ్వబడిన చిన్న వచన గేయ కావ్యం, “అత్రి మతం” విలువైన రచన. ముగ్గురు దైవాల్నీ అంగీకరించనివాడు ‘అత్రి ముని’. ‘అనసూయ’ ఆయన భార్య. అసూయ లేనిదని అర్ధం. దత్తాత్రేయుడు అంటే ఈ మూడు మతాల్లోనూ విశ్వాసం లేని వ్యక్తి (అత్రి) నుండి బహుమతిగా వచ్చినవాడు అని అర్థం!
త్రిమతాలకు అతీతమైన అత్రి మతాన్ని గురించి బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సహా మనిషి పక్షం వాదించి, అసమానతల్ని ధిక్కరించి సమానత కోసం , తమ నూతన సిద్ధాంతం కోసం నిలిచిన అనసూయ గురించి, అన్నింటికంటే ముఖ్యంగా ఈ రోజు ఏ సనాతన ధర్మానికి వ్యతిరేకంగా తన ఆవిర్భావం జరిగిందో, అందులోనే తనని భాగం చేసి దేశంలోని అనేక ప్రాంతాల్లో వ్యాపారం చేస్తున్న దత్తాత్రేయ స్వరూపం గురించి తెలుగులో భౌతికవాద దృక్పథంతో చేసిన మొట్టమొదటి రచన అత్రి మతం!
Also read: మనుషులు – వస్తువులు – సంస్కృతి
ఇక మహాకవి అశ్వఘోషుడి ‘వజ్రసూచి’ సంగతి సరేసరి. ఆధునిక కాలంలో కార్ల్ మార్క్స్ ‘కమ్యూనిస్టు మ్యానిఫెస్టో’ కీ, బాబాసాహెబ్ అంబేద్కర్ ‘కులనిర్మూలన’ కీ ఎంతటి ప్రాముఖ్యత ఉందో, ప్రాచీన కాలంలో అంతటి ప్రాధాన్యత కలిగి బ్రాహ్మణాధి పత్యాన్ని , కుల అసమానతలనూ బలంగా సశాస్త్రీయంగా తునాతునకలు చేసి ఖండించిన అజేయ గ్రంథం మహా బౌద్ధ పండితుడైన మహాకవి అశ్వఘోషుని వజ్రసూచి అని విజ్ఞుల అభిప్రాయం. మిళింద ప్రచురణల ద్వారా పాతికేళ్ళ క్రితం దీనిని తెలుగు లోకి గొప్పగా అనువదించినది కూడా డా. మలయశ్రీ గారే!
అమూల్యమైన ఈ నాలుగు రచనలే కాకుండా యాభై ఏళ్ళ క్రితం ప్రచురించిన ‘సజీవ సత్యాల’ నే నూటపది జీవన సూక్తుల్ని ఒక్క దరికి చేర్చి కూర్చిన పొత్తాన్ని కూడా 140 వ పుస్తకమైన ఈ రచనా సంపుటిలో చేర్చడం జరిగింది. దాదాపు వంద పుటలు గల వెలకట్టలేని ఈ పుస్తకానికి వంద రూపాయలు నామమాత్రపు వెల పెట్టారు. తెలుగు రాష్ట్రాలలో భావోద్యమకారుల పేరుతో దశాబ్దాలుగా కృషిచేస్తున్న వారికి అవార్డులు ఇస్తూ తన పరిమితుల్లో కృషి చేస్తున్న మలయశ్రీ గారి భావాలతో ఎవరికైనా కొన్ని భిన్నాభిప్రాయాలు ఉండవచ్చును కానీ ఆచరణాత్మక సామాజిక వైద్యులు డా. భానుప్రసాద్ గారి కుటుంబానికి అంకితం ఇవ్వబడిన ఈ పుస్తకం, తెలుగులో ప్రతి భావోద్యమ ఆలోచనాశీలి కచ్చితంగా చదివి తీరవలసిన విలువైన రచనల సంపుటం అని నా అభిప్రాయం. ఆసక్తి ఉన్న వారి కోసం డాక్టర్ మలయశ్రీ గారి కాంటాక్ట్ వివరాలు ఇస్తున్నాను. సంప్రదించవచ్చు!
డా. మలయశ్రీ , నవ్య సాహిత్య పరిషత్
రేకుర్తి, కరీంనగర్ , తెలంగాణ – 505451
సెల్ – 9866546220
(పదేళ్ళకి పైబడిన మా స్నేహంలో ప్రతి రచన చివరా ‘సెలవిప్పటికి, స్నేహమెప్పటికీ’ అనే టేగ్ లైన్ డా. మలయశ్రీ గారి రచనకి ఓ బండగుర్తు. అనేక అరుదైన రచనల్ని చేతులు కాల్చుకుని కూడా ప్రచురించిన వైజ్ఞానికవాది. తెలంగాణ ప్రాంతం నుంచి ‘భౌతికవాది’ పత్రికను ఎన్నో ఏళ్ళు నిబద్దతగా నడిపిన బౌద్ధాభిమాని, బుద్దిజీవి ఆయన. ఎన్నాళ్ళుగానో అనుకుంటున్నప్పటికీ మానవగీతతో సహా మలయశ్రీ గారి నాకు నచ్చిన రచనల పై ఇన్నాళ్ళకిలా ఓ చిన్న రైటప్.)
Also read: అంతరాత్మ పెట్టిన కన్నీళ్ళు అంబేద్కర్ అనుభవాలు!
– గౌరవ్
1 – 113/7, ఆదిత్య భవన్, వేమననగర్